మెయిన్ ఫీచర్

వీళ్లూ.. మన దర్శకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమకు ఓ స్థాయ కల్పించిన దర్శక ధీరులు ఎందరో. ప్రయోగాల నుంచి పయనం మొదలుపెట్టి సాహసాలను ఒడిసిపట్టి అద్భుతాలను సృష్టించేందుకు అహరహం కృషిచేశారు. ఎదురు దెబ్బలను ఓర్చుకుంటూ, ఎదుగుదలకు తపనపడుతూ -80 ఏళ్ల గమనంలో ఇదీ తెలుగు సినీ పరిశ్రమ అని చెప్పుకోగలిగే స్థాయకి తెచ్చారు. భక్తి, పురణాల కథల నుంచి మొదలైన సినిమా ప్రయాణం సాంఘిక, దేశభక్తి ప్రభోదాత్మక, చైతన్యవంతమైన చిత్రాల మీదుగా సైన్స్, ఫిక్షన్, హారర్, యాక్షన్.. ఇలా మన దర్శకులు టచ్ చేయని సన్నివేశం లేదు. ప్రణయాన్ని, ప్రళయాన్ని ఒకే సమయంలో అనుభవంలోకి తేగలిగే చిత్రాలనూ నిర్మించి నిరూపించుకున్న గొప్ప దర్శకులను ఎప్పటికీ మరువలేం. వాళ్ల అడుగుజాడలను అనుసరించకుండా ఉండలేం.
తెలుగు సినిమా మూకీ నుంచి టాకీకి మారిన తరువాత -సాంకేతిక నిపుణుల ప్రాధాన్యత పెరిగింది. సినిమా 24 శాఖలుగా విస్తరించిన తరువాత -వాటికి దర్శకుడు ‘కెప్టెన్’ అయ్యాడు. ఆరంభం నుంచీ అతనే ప్రధానమనే విషయం ప్రేక్షకులకూ విశదమైంది. దర్శకుని మేధస్సు, తెలివితేటలు, సమర్థతే చిత్ర విజయాలకు పునాదిగా మారింది. నిర్మాణానికి నిర్మాతే కీలకమైనా, అతని బాధ్యత మంచి దర్శకుణ్ని నిర్ణయించుకోవడానికే పరిమితమైంది. అలా చిత్ర రూపకల్పనలో దర్శకుడు అగ్రజుడు, సందేహం లేదు. 80 ఏళ్ల పరిశ్రమ గమనంలో -ఎందరో దర్శకులు పరిశ్రమ తలెత్తుకునే ప్రభావవంతమైన చిత్రాలను రూపొందించారు. సినిమాలు సుసంపన్నమై పరిశ్రమ సస్యశ్యామలమైంది.
**
టాకీల ప్రారంభంలో పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాలే వచ్చాయి. ఐదేళ్ళ అనుభవం తరువాత సాంఘిక చిత్రాలు మొలకెత్తడం మొదలెట్టాయి. తొలి టాకీ ‘్భక్తప్రహ్లాద’. చిత్ర దర్శకుడు హెచ్‌ఎం రెడ్డి. దర్శకద్రష్టగా ప్రసిద్ధుడై -1951లో ‘నిర్దోషి’ సాంఘిక చిత్రాన్ని తెచ్చారు. 1953లో జానపద చిత్రం ‘ప్రతిజ్ఞ’ ద్వారా కాంతారావు, రాజనాలను హీరో, విలన్‌గా పరిచయం చేశారు. చిత్తజల్లు పుల్లయ్య ‘సతీసావిత్రి’ (1933)తో దర్శకునిగా పరిచయమై ‘లవకుశ’ (1936)తో తొలి విజయం అందుకున్నారు. తర్వాత ‘పక్కింటి అమ్మాయి’ సాంఘిక చిత్రంతో గొప్ప దర్శకుడిగా ప్రఖ్యాతి అందుకుని, తిరిగి తన లవకుశ (1963) చిత్రానే్న తెలుగులో తొలి రంగుల చిత్రం చేశారు. ఎన్టీఆర్, అంజలీదేవిలతో నిర్మించిన సినిమా సాధించిన అఖండ విజయం -ఎనభై ఏళ్ళ చరిత్రలో మరే సినిమా మన మస్తిష్కాలనుంచి చెరిపేయలేకపోయింది. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో సినిమా థియేటర్ల నిర్మాణానికి పుల్లయ్య చేసిన కృషి మర్చిపోలేం. వీరికాలంలోనే ‘హరిశ్చంద్ర’ చిత్ర దర్శకునిగా పరిచయమైన పి పుల్లయ్య ‘వరవిక్రయం’తో సుప్రసిద్ధ నటి భానుమతిని పరిచయం చేశారు. 1939లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రాన్ని 1960లో ఎన్టీఆర్, సావిత్రితో పునఃనిర్మించి రెండింతల విజయాన్ని అందుకున్నారు. అనేకానేక బ్యానర్లపై ఎన్నో వైవిధ్యమైన సాంఘిక చిత్రాలు రూపొందించి ఘన విజయాలు అందుకున్న చండశాసనుడు పుల్లయ్య. నటి కన్నాంబ భర్త కడారు నాగభూషణం ‘సుమతి’ (1962)తో దర్శకుడిగా పరిచయమై సొంత బ్యానర్‌పై ‘సతీ సావిత్రి’ ‘సౌదామిని’ సహా ‘పేద రైతు’ వంటి సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. పత్రికా సంపాదకుడైన గూడవల్లి రామబ్రహ్మం ఉన్నత ఆశయాలతో సాంఘిక దురాచారాలపై, రైతు సమస్యలపై చైతన్యవంతమైన సాంఘిక చిత్రాల నిర్మాణాలకు పూనుకొని తొలి చిత్రంగా ‘మాలపిల్ల’ (1938), తర్వాత రైతుబిడ్డ, ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ వంటి సాంఘికాంశాలతో చిత్రాలు నిర్మించారు. మాయాలోకం, పల్నాటి యుద్ధం నిర్మాణ సమయంలో అకాల మరణం పొందారు.
అప్పటికి కొత్తగా నిర్మించిన వాహిని స్టూడియో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న బిఎన్ రెడ్డి ‘గృహలక్ష్మి’ నిర్మాణం తర్వాత దర్శకుడిగా అవతారమెత్తి -ఆ చిత్ర హీరో చిత్తూరు నాగయ్యతో వందేమాతరం రూపొందించారు. సుమంగళి, దేవత, స్వర్గసీమ వంటి సంఘ సంస్కరణ ప్రబోధాత్మక చిత్రాలు, మల్లీశ్వరి వంటి చరిత్రాత్మక కళాఖండాలు నిర్మించారు. బంగారు పాప నుంచి బంగారు పంజరం వరకు అద్భుతమైన చిత్రాలతో అజరామరకీర్తి సంపాదించారు. వీరి చిత్రాలకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూచే కెవి రెడ్డి దర్శకుడిగా మారి భక్తపోతన, వేమన తర్వాత కమెడియన్ కస్తూరి శివరావు హీరోగా గుణసుందరి కథ, ఎన్టీఆర్‌ను జానపద హీరోగా పాతాళభైరవి, ఎన్టీఆర్‌ను తొలిసారి శ్రీకృష్ణునిగా మాయాబజార్, రేలంగి హీరోగా పెద్దమనుషులు వంటి సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించి సవ్యసాచి అనిపించుకున్నారు. స్క్రిప్ట్ దశలోనే సినిమా లెంగ్త్‌ని అడుగుల్లో చెప్పగల దిట్ట కెవి రెడ్డి. తెలుగు సినిమాకు పెద్ద బాలశిక్ష లాంటి ‘మాయాబజార్’ను సృష్టించింది, సృజించింది ఈయనే. ఈ సినిమాపై ఎందరో పిహెచ్‌డి చేశారు, చేస్తున్నారు కూడా. కెవి రెడ్డికి పౌరాణిక, జానపదాలపై మక్కువెక్కువ. చిత్రపు నారాయణ మూర్తికి పౌరాణికాలపై పట్టు ఎక్కువ. భక్తప్రహ్లాద చిత్ర కథ కూడా వారి సొంతమే. రెండుసార్లు దర్శకత్వం వహించి విజయాలు సాధించారు. భక్తశబరి చిత్రం ద్వారా శోభన్‌బాబును పరిచయం చేశారు. ఎల్‌వి ప్రసాద్ గృహప్రవేశం చిత్రానికి తొలిసారి దర్శకత్వంతో హీరోగానూ నటించారు. ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ను చిత్ర సీమకు పరిచయం చేసి షావుకారు చిత్రంలో హీరో చేసి ఆయనతోనే మిస్సమ్మ, సంసారం, పెళ్లిచేసి చూడు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటి భానుమతి భర్త పి రామకృష్ణ సొంత బ్యానర్ భరణిపై రత్నమాల, విప్రనారాయణ పౌరాణికాలతోపాటు శెభష్ రాజా, ఆత్మబంధువులాంటి హిట్ చిత్రాలూ నిర్మించారు.
‘ప్రతిభా’ నిర్మాత ఘంటసాల బలరామయ్య ‘పార్వతీ పరిణయం’తో పౌరాణికాలను రూపొందించటమే కాదు, సీతారామ జననం ద్వారా ఏఎన్నార్‌ను హీరోగా వెండితెరకు పరిచయం చేశారు. బిఎ సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’తో దర్శక నిర్మాతగా -ఏఎన్నార్, ఎన్టీఆర్‌లతో నిర్మించి ఘన విజయం సాధించారు. తరువాత ఎన్నో సాంఘిక, పౌరాణిక చిత్రాలను అందించారు. పాత్రికేయుడు కమలాకర కామేశ్వరరావు ‘చంద్రహారం’తో దర్శకునిగా మారి ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలు అందించి ‘పౌరాణిక చిత్ర బ్రహ్మ’ పేరు సాధించారు. సాంఘికాలకు కొత్త అర్థం చెబుతూ ‘గుండమ్మ కథ’కు ప్రాణం పోసిన దర్శకుడు కెకె. తాతినేని ప్రకాశరావు అభ్యుదయ భావాలతో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పల్లెటూరు’. ఎన్టీఆర్ మొదటి సొంత సినిమా ‘పిచ్చి పుల్లయ్య’తోపాటు ఏఎన్నార్, ఎన్టీఆర్‌లతో తీసిన ‘చరణదాసి’, సాంఘిక చిత్రంలో ఎన్టీఆర్‌ను తొలిసారి శ్రీరాముడి వేషంలో చూపించారు. నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య ‘స్ర్తి సాహసం’ ద్వారా దర్శకునిగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించారు. శరత్ బెంగాలి నవల ‘దేవదాసు’ను కళాఖండంగా మలిచి తెలుగు సినీ చరిత్రలో కలికి తురాయిని చేశారు. అనార్కలి, సువర్ణ సుందరి, చిరంజీవులు వీరు రూపొందించినవే. సి పుల్లయ్య కుమారుడు, కన్నాంబ అల్లుడు సిఎస్ రావు శ్రీకృష్ణ తులాభారం మొదలు దాదాపు 40 సూపర్‌హిట్ చిత్రాలను సాంఘిక, పౌరాణిక, జానపద జోనర్లలో నిర్మించిన ఘనుడు. లవకుశ చిత్ర నిర్మాణంలో తండ్రి అకాల మరణంతో మిగిలిన సినిమాను పూర్తి చేశారు.
‘అమర సందేశం’తో దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ బ్యానర్‌లో ‘తోడికోడళ్ళు’ నుంచి ‘బంగారు కలలు’ వరకు 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అధిక శాతం సినిమాల్లో అక్కినేనే హీరో. కృష్ణ, రాంమోహన్ వంటి తొలి నూతన తారలతో తొలి సాంఘిక రంగుల హిట్ చిత్రాన్ని నిర్మించారు. వీరి పౌరాణిక చిత్రం ‘కృష్ణప్రేమ’లో నటుడు బాలయ్యను శ్రీకృష్ణుడిగా చూపించడం విశేషం! దర్శకులు ‘విక్టరి’ వి మధుసూదనరావు ‘సతీతులసి’తో దర్శకుడై, 60కి పైగా సాంఘిక, పౌరాణిక చిత్రాలను నిర్మించారు. సాహసోపేత నిర్ణయంతో ఎన్టీఆర్, సావిత్రిలను అన్నా చెల్లెళ్లుగా చూపించిన ‘రక్తసంబంధం’ అపూర్వ విజయం అందుకుంది. ఎన్టీఆర్, శోభన్‌బాబులతో ‘వీరాభిమన్యు’, ఏఎన్నాఆర్‌తో ‘్భక్తతుకారం’ వంటి చిత్రాలు అఖండ విజయం అందుకున్నాయి. జగపతి బ్యానర్‌పై ‘అన్నపూర్ణ’ నుంచి ‘అదృష్టవంతుడు’ వరకు అ, ఆలతో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించడం, అన్నపూర్ణ వినా అన్ని చిత్రాల్లో అక్కినేని హీరో కావడం విశేషం. కన్నడ చిత్ర రంగం నుంచి వచ్చిన బి విఠలాచార్య తెలుగులో వద్దంటే పెళ్లి, పెళ్లిమీద పెళ్లి వంటి సాంఘిక చిత్రాలతో ప్రయాణం మొదలై ‘కనకదుర్గ పూజామహిమ’ చిత్రంతో జానపద చిత్ర దర్శకునిగా మారి జానపద బ్రహ్మగా పేరు సాధించారు. కాంతారావు, ఎన్టీఆర్‌లతో ఎన్నో విజయవంతమైన జానపద చిత్రాలు నిర్మించి 70వ దశకంలో మరుగున పడ్డారు. అప్పటి సాంఘిక చిత్రాల హీరో నరసింహరాజును జానపద హీరోగా చేస్తూ ‘జగన్మోహిని’ తీసి తనేంటో నిరూపించుకున్నారు. మోహన్‌బాబు హీరోగా ‘వీరప్రతాప్’ నిర్మించింది విఠలాచార్యే. ‘గొప్పవారి గోత్రాలు’ చిత్ర హీరో కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడిగా మారి ‘దేవతలారా దీవించండి’ అనే అద్భుతాన్ని సృష్టించారు. తరువాత ఎన్నో సాంఘిక, జానపద చిత్రాలు నిర్మించారు. జి విశ్వనాథం, రామినీడు, కెఎస్ రెడ్డి, గిడుతూరి సూర్యం, కెవి నందనరావు లాంటివారు కాలానికి తగ్గ చిత్రాలు చేసి చూపించారు.

హీరోగా బిజీగా ఉన్నపుడే పౌరాణికాలపై మమకారంతో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతారామ కల్యాణం’. సంచలన విజయం ఇచ్చిన ఉత్సాహంతో ‘గులేబకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’ లాంటి వరుస విజయాలతో పరిశ్రమకు సత్తా చాటారు. మొదటి రెండు చిత్రాల్లో దర్శకుడిగా పేరు వేసుకోకపోయినా, పెద్దల సూచనలతో మూడవ చిత్రం నుండి పేరు వేసుకున్నారు. సొంత బ్యానర్‌లో ప్రయోగాలు, సాహసాలకు పునాధివేసి 18 పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు చేశారు. ‘దాన శీర శూర కర్ణ’, ‘శ్రీమద్విరాట పర్వం’ చిత్రాల్లో మూడు, ఐదు పాత్రలతో పాటు దర్శక నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించి పరిశ్రమకు మెసేజ్‌ని, ప్రేక్షకుల్ని
సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
చిత్రసీమలో నటీమణులూ దర్శకులై విజవంతమైన ప్రయోగాలు చేసిన వారిలో తొలివ్యక్తి -్భనుమతి. తొలి చిత్రం ‘చండీరాణి’ని ఏకకాలంలో మూడు భాషాల్లో వేగంగా నిర్మించి విడుదల చేయడం అప్పట్లో ఓ రికార్డ్. భరణి బ్యానర్‌పై ఎన్నో చిత్రాలు నిర్మించారు. తర్వాత ‘చిన్నారి పాపలు’ చిత్రాన్ని మహానటి సావిత్రి అంతా మహిళా సాంకేతిక నిపుణులతో నిర్మించి సాహసమే చేశారు. ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించిన జి.వరలక్ష్మి ‘మూగజీవులు’తోనే ఉత్తమ దర్శకురాలి అవార్డు సాధించారు. నటి విజయనిర్మల ‘మీనా’తో మొదలెట్టిన దర్శకత్వ ప్రయాణం 46 చిత్రాల వరకూ సాగించి గిన్నిస్ రికార్డ్‌కు ఎక్కారు. ప్రస్తుతం బి జయ, నందితారెడ్డి, నటి శ్రీప్రియ మహిళా దర్శకులుగా కొనసాగుతున్నారు.
70 దశకాల్లో దర్శకులకే వనె్నతెచ్చిన వ్యక్తి దాసరి నారాయణరావు. ‘తాతామనవడు’ నుంచి 151 చిత్రాలకు దర్శకత్వం వహించి ‘దర్శకరత్న’ అనిపించుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాలు అఖండ విజయాలై దర్శకుల విలువ, స్థాయి పెంచాయి. వరుసగా 11 చిత్రాలతో విజయాలు సాధించిన దర్శకుడు దాసరి. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, మేఘసందేశం, శివరంజని, స్వర్గం- నరకం లాంటి లెంజడరీ చిత్రాలు రూపొందించారు. వీరికంటే ముందే వచ్చిన కె విశ్వనాధ్ తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’తో విజయం, అవార్డు సాధించి వ్యాపారాత్మక చిత్రాలతో కళాత్మక ప్రభోదాత్మక, సంగీత, నృత్య ప్రధాన రసరమ్య చిత్రాలను అరవైకి పైగా నిర్మించి ‘కళాతపస్వి’ అయ్యి, దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తర్వాత కోవెలమూడి ప్రకాశరావు ‘మొదటి రాత్రి’ చిత్రంతో దర్శకులుగా మారి ‘ప్రేమ్‌నగర్’లాంటి అఖండ విజయాలతో ప్రసిద్ధి చెందారు. వీరి కుమారులు కె బాపయ్య, రాఘవేంద్రరావు, మురళీమోహనరావు, కెఎస్ ప్రకాష్ అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలు సాధించారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు ‘దర్శకేంద్రుడు’గా శతాధిక చిత్రాలు దాటి నేడు భక్తిరస చిత్రాల నిర్మాణాలతో ఆరితేరారు. ఇంకా కెఎస్‌ఆర్ దాస్ క్రైమ్, కౌబాయ్, యాక్షన్ చిత్రాలతో ప్రసిద్ధి సాధించి 60కి పైగా చిత్రాలను తెలుగు పరిశ్రమకు అందించారు. సింగీతం శ్రీనివాసరావు ‘నీతి నిజాయితీ’ (1972)తో మొదలుపెట్టి 20కిపైగా చిత్రాలు డైరెక్ట్ చేసి ‘ఆదిత్య 369’ లాంటి సైంటిఫిక్ చిత్రం, కమల్‌హాసన్‌తోతో ‘పుష్పక విమానం’ మూకీ సినిమా, ‘అమావాస్య చంద్రుడు’, ‘విచిత్ర సోదరులు’తో మరుగుజ్జు పాత్రల ప్రయోగాలు చేసి వినుతికెక్కారు. ఇంకా తాతినేని రామారావు, కోడి రామకృష్ణ, శ్రీనువైట్ల, వివి వినాయక్, బి గోపాల్, తేజ, బోయపాటి శ్రీనులాంటి యువతరం దర్శకులుగా నేడు రాణిస్తున్నారు.
ప్రస్తుతం రాజవౌళి నవతరంలో స్టూడెంట్ నెం.1 చిత్రం నుండి నేటి బాహుబలి రెండు భాగాల వరకు అపజయం ఎరుగక అన్ని విజయవంతమైన 11 చిత్రాల దర్శకుడుగా ప్రత్యేకత సాధించారు. బహుబలి చిత్రాలతో ప్రపంచస్థాయి కీర్తి సాధించారు.
ఆఖరున చెప్పుకోవలసింది బాపు గురించి. పాత్రికేయుడు, కార్టూనిస్టు అయిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) దర్శకుడిగా ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండా కేవలం అవగాహన, ఊహలతో, రేఖాచిత్రాల స్క్రిప్ట్‌తో ‘సాక్షి’ ఆఫ్ బీట్ చిత్రం నిర్మించి ప్రశంసలు పొంది, చిరకాల మిత్రుడు రమణతో, బాపు- రమణల కాంబినేషన్‌తో ఆఖరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ వరకు సాంఘిక, పౌరాణిక చిత్రాలు నిర్మించి ఎనలేని కీర్తిని ఆర్జించారు. ఇంకా ప్రస్తావించని అనేక దర్శకుల కృషితో తెలుగు సినీ పరిశ్రమ రత్నాలు, వజ్రాలను వెలికితీసి సువర్ణ్ధ్యాయాన్ని సృష్టిస్తుంది.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు పరిశ్రమ గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని వర్థమన, వచ్చేతరం దర్శకులు -ఈ కీర్తిని రెండింతలు చేసే సినిమాలు రూపొందిస్తారని ఆశిద్దాం.

చిత్రం.. తొలి తరం దర్శకుడు హెచ్‌ఎం రెడ్డి

-పివిఎస్ ప్రసాదరావు