ఎడిట్ పేజీ

బయో కంపెనీలపై ఉక్కుపాదం భావ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయ శాఖకు, బయో కంపెనీలకు మధ్య నిరంతర పోరాటం జరుగుతూనే వుంది. పర్యావరణానికి హాని చేయని సురక్షితమైన సేంద్రియ, బయో ఉత్పత్తులను సేంద్రియ వ్యవసాయం కోసం, కర్షకుల సంక్షేమం కోసం బయో కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మాత్రం నిరంతరం బయో కంపెనీలను వేధిస్తున్నాయనే ఆరోపణలు కొంతకాలంగా వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయో కంపెనీలపై నిషేధాన్ని విధించింది. ఆంధ్ర ప్రభుత్వం అడుగడుగునా పగబట్టినట్లు తనిఖీలు చేయడం, ‘పీడీ యాక్ట్’కింద కేసులు పెడతామని బెదిరించడం, పురుగు మందుల వ్యాపారులను (డీలర్లు) బయో ఉత్పత్తులను అమ్మనీయకుండా చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం ఉల్లంఘించి రైతులకు బయో ఉత్పత్తులు విక్రయించకుండా సంబంధిత వ్యాపారులను వేధించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది. ఇంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా- ఒక్క బయో కంపెనీ కూడా పదిహేనేళ్ల నుండి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఈ పరిస్థితులు బయో కంపెనీల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఎందుకీ చర్యలు?
సాధారణంగా ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పదార్థాలతోనూ, వృక్ష జీవ సంబంధిత పదార్థాలతో బయో ఉత్పత్తులను తయారుచేస్తారు. రెండు దశాబ్దాలుగా బయో ఉత్పత్తుల వాడకం దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇందుకు కారణం ప్రభుత్వాలు పర్యావరణ హితాన్ని కాంక్షించడమే. అందువల్ల రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కొంత మేరకు బయో ఎరువుల వినియోగం పెరిగింది. బయో ఉత్పత్తులు కావాలని రైతులు అడిగి తీసుకునే స్థాయికి కంపెనీలు అభివృద్ధి చెందడం మరో కారణం. ఈ పరిణామం రసాయనిక ఎరువులు, పురుగు మందుల కంపెనీలకు కంటకంగా మారింది. ఈ పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ భారతదేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో కొన్ని దేశాలలలో పూర్తిగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను నిషేధించి, పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఈ కారణంగా రసాయనిక ఎరువులు, పురుగు ల మందుల కంపెనీలు పాలకులను, అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వత్తిడి తెస్తున్నాయి. దీని ఫలితంగానే రైతులకు మేలు చేద్దామనుకునే బయో కంపెనీలపై ఆంక్షలు, వేధింపులు తప్పడం లేదు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించి బయో కంపెనీలపై పెత్తనం చెలాయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సర్వోన్నత న్యాయస్థానం బయో కంపెనీలపై వ్యవసాయ శాఖకు ఏ విధమైన నియంత్రణ అధికారం లేదని గతంలోనే విస్పష్టమైన తీర్పునిచ్చింది. మళ్లీ 2008లో వ్యవసాయ శాఖ బయో ఉత్పత్తులను వ్యవసాయ క్షేత్రాలలో ఉపయోగించడం వల్ల నకిలీ ఉత్పత్తులను నియంత్రించే అధికారం తమకు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని అర్థించింది. ఇందులోని అంతరార్థాన్ని గ్రహించని న్యాయస్థానం వ్యవసాయ శాఖకు బయో ఉత్పత్తుల్లో రసాయనాలను నిర్థారించే పరీక్షలు నిర్వహించాలని, రసాయనాలున్నట్లు తేలితే సంబంధిత కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. బయో కంపెనీలు తమ తమ ఉత్పత్తులకు సంబంధించిన నమూనా (శాంపిల్స్)లను వ్యవసాయ శాఖకు అందజేసి, లిఖిత పూర్వకంగా రశీదును తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయ శాఖ అధికారులు బయో కంపెనీలపై తిరిగి పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడా బయో ఎరువులు, విత్తనాల అమ్మకాలు జరగకుండా యథాశక్తిన ప్రయత్నించారు.
వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో బయో ఉత్పత్తుల శాంపిల్స్ అందజేస్తే రశీదు ఇవ్వడానికి కనీసం ప్రతి బయో కంపెనీ పాతిక వేలనుండి లక్ష రూపాయల వరకు ముడుపుల రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ముడుపులు ఇవ్వని బయో యాజమాన్యాలను ఇప్పటికీ తిప్పుతూనే ఉన్నారు. ఇంత జరిగిన తరువాత కూడా అధికారులలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఉన్నత స్థాయిలో ముడుపుల వ్యవహారం ఉన్నందున- కింది స్థాయికి వచ్చేసరికి మాకేంటి? అన్న ధోరణిలో సిబ్బంది సైతం ఉన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బయో కంపెనీల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ అధికారులు ప్రతి పురుగుల మందు డీలర్ల నుండి, దుకాణాల నుండి బయో ఉత్పత్తులు సేకరించి, సంబంధిత కంపెనీలకు నోటీసులు పంపడం చేయాలి. కానీ తమ వద్దకు వచ్చిన బయో ఉత్పత్తుల ప్రతినిధులను బెదిరించడం, వారి నుండి భారీగా ముడుపులు ఆశించడం, అలా ఇవ్వని వారిని వేధించడం వీరికి పరిపాటి అయింది.
బయో కంపెనీలు వ్యాపారంలో ఒడిదుడుకులను తట్టుకోవడం, సంవత్సరమంతా డీలర్లకు, రైతులకు అప్పులు ఇచ్చి వసూలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయన్నది వాస్తవం. పాలకుల ఉదాసీనత, కొంతమంది అధికారుల అవినీతి కారణంగా బయో కంపెనీలు నష్టాల బారిన పడుతున్నాయి. ఈ కంపెనీల యజమానులు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నారు. పాత అప్పులు వసూలు చేసుకోలేక కొత్త వ్యాపారం చేయలేక ఆత్మహత్య సదృశంగా బయో ఉత్పత్తుల వ్యాపారులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల కంపెనీలకు మేలు చేయడం కోసం వారి వద్ద భారీగా ముడుపులు తీసుకుని బయో కంపెనీలను వేధించిన వ్యవసాయ అధికారులు- బయో కంపెనీల నుండి కూడా భారీగా ముడుపులు సంపాదించడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఆహారోత్పత్తులు అభివృద్ధి చెందుతున్నాయి. రసాయన పురుగుల మందులు, రసాయన ఎరువులతో పండించిన పంటల వలన మనం తినే ఆహారం పూర్తిగా విషతుల్యమై అనేక రోగాలు సోకుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో అధికారులు చెలగాటమాడుతున్నారని చెప్పక తప్పదు. మరోప్రక్క వ్యవసాయ శాస్తవ్రేత్తలు రసాయనిక ఎరువులను మితిమీరి వాడవద్దని చెవినిల్లు కట్టుకొని సర్కారుకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
బయో ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాలలు లేకపోయినప్పటికీ, వీటి వాడకం వల్ల ప్రయోజనం లేదని తెలుగు రాష్ట్రాల్లో అనధికారికంగా నిషేధం విధించడం దారుణం. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు పదివేల మంది ఉద్యోగులు, వందలాది మంది మార్కెటింగ్ సిబ్బంది బయో కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ శాఖ వేధింపుల వల్ల వీరంతా రోడ్డున పడే ప్రమాదం ముంచుకొస్తోంది. బయో ఉత్పత్తులు పంటలకు హానికరం అని ఏ పరిశోధనా కేంద్రం ఇంతవరకూ నిర్ధారించలేదు. వీటి వల్ల తాము నష్టపోయినట్లు రైతులు కూడా ఎవరికీ ఫిర్యాదులు చేయడం లేదు. రెండు దశాబ్దాలుగా బయో ఉత్పత్తుల వినియోగం పెరిగిందంటే రైతులకు వీటి పట్ల నమ్మకం ఉన్నట్లేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
వేదాలు, పురాణాల్లో చెప్పినట్లు సేంద్రియ ఎరువులు, క్రిమి సంహారక మందులను తయారుచేసి పంటలను పరిరక్షించుకోడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఇప్పటికీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయానికి బదులు భూసారాన్ని హరించే రసాయన ఎరువులు, మందులను వాడడం అంటే- మన ప్రాచీన సంస్కృతిని మనమే నాశనం చేసుకోవడం అవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనైనా బయో ఉత్పత్తులను ప్రోత్సహించి, పర్యావరణానికి మేలు చేయాలి. హానికారక రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను నియంత్రించాలి. ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలి. భూసారం పెంచేలా, వ్యవసాయోత్పత్తులు పెరిగేలా సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి.

-డా సి.వి.రత్నకుమార్