మెయన్ ఫీచర్

వైఫై కాదు-ఉచితంగా మంచినీరివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరప్పా, మొహంజోదారోలలో చక్కటి ప్రణాళికలతో పట్టణ నిర్మాణాలు జరిగాయని, తాగునీటి సౌకర్యాలతో పాటు, మురుగునీటి కాలువల వ్యవస్థ అభివృద్ధికరంగా ఉండిందని చరిత్రలో చదుకున్నాం. ఇది క్రీస్తుపూర్వం నాటి ప్రగతి చిహ్నం. దాదాపు ఐదువేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పారిశ్రామిక విప్లవంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. చిటికెలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాం. భూమికి అటువైపు, ఇటువైపు ఉన్నవారు ఎదురెదురుగా కూర్చొని సంభాషించుకుంటున్నారు. భౌతిక సంబంధాలు లేకున్నా మనసులు పెనవేసుకుపోతున్న యుగం లో విహరిస్తున్నాం. అయినా ఏవో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. కనీస అవసరాలు కరువైపోతున్నాయి. ప్ర కృతి జనితాలు కనుమరుగైపోతున్నాయి. మానవ సంబం ధాలను సెల్‌ఫోన్ అనుసంధానం చేస్తున్నది.
రెండు సంవత్సరాల నుంచి దేశంలోని సగం రాష్ట్రాల్లో వర్షాభావ స్థితి. 13 రాష్ట్రాల్లో జలవనరులు అడుగంటడం కాదు-ఆవిరైపోయాయి. ఇది అనుకోని భూకంపం కాదు, సునామీ కాదు, ప్రకృతి విపత్తు అంతకన్నా కాదు. వర్షాలు పడనప్పుడు నీటి కొరత ఏర్పడుతుందనేది చారిత్రక అనుభవం. మండు వేసవి, పెరుగతున్న సూర్యతాపం నీటి కొరతనే కలిగించదు-ప్రాణాలు హరిస్తుంది. వానలకు, చలికి వచ్చే జనాలకు వడదెబ్బ ఆశ్చర్యకరం కాదు. అన్నమో రామచంద్రా కాదు-తన్నీరు, తన్నీరు అంటూ జనాలు కన్నీరు పెడుతున్న పరిస్థితి. అయినా-అదే నిర్లక్ష్య వైఖరి. ముందస్తు చర్యలు మృగ్యం.
ప్రకృతి బడిలో వుండే గ్రామీణ, గిరిజన ఆవాసాలు దశాబ్దాల తరబడి నీటి కొరతను ఎందుకు ఎదుర్కొంటాయో, సమాధానం దొరకదు. జలవనరులకు దగ్గర నివాసముండే వీరి సహజ జలవనరులు ఎక్కడికి తరలిపోతున్నాయో మనకు పట్టదు. పట్టణాల దాహార్తి పేరును తరిలించబడ్డ ఈ నీరు పట్టణవాసులకు దక్కుతున్నదా అంటే-దక్కే వారికి దక్కగా, దక్కనివారు గుక్కెడు నీళ్లకై ఎదురు చూడటమే. అయినా వందశాతం ఆక్సీరిచ్ అంటూ, ఆరోగ్యానికే తలకట్టు అంటూ లక్షలాది రూపాయల్ని ప్రకటనలకే గుమ్మరించే ప్రపంచ కుబేర కంపెనీలైన కినే్లకు, బిస్లరీకి, ఆక్వాకు, గ్రామాలకు గ్రామాలనే నీటి కొరతతో పాటు కాలుష్యానికి గురి చేస్తున్న కోకా కోలా ప్లాంట్లకు ఏకాలంలో నీటి కొరత ఉండదు. కిల్లీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల దాకా సాచెట్లలో నీరు-బాటిల్స్‌లో నీరు! గంగోత్రి, యమునోత్రి, కావేరి, గోదావరి, కృష్ణ, నర్మద- ఒకటేమిటి ప్రతి ఇంటికి డబ్బులతో నీరు పారుతూనే ఉంది. అయినా నీటి కొరత తీరడంలేదు.
గంగరాళ్ల లోతు నుంచి, చేదుకున్న నీళ్లు చేతికందకుండా పోయి, ప్రకృతి సంపద కొందరికే పరిమితమైనప్పుడు, నీరు మార్కెటు సరకుగా మారినప్పుడు, కొనేవాళ్లు ఉన్నప్పుడు, అమ్మేవాళ్లూ వుంటారుగా! అయినా మన పాఠ్య పుస్తకాల్లో గంగా, యమునా, సింధు, జీలం, బ్రహ్మపుత్రల్ని జీవనదులనే వల్లెవేస్తున్నాం. గోదావరి, కృష్ణా, కావేరి, నర్మద, మహానదులను భారత నాగరికతకు, సంస్కృతికి ప్రతీకలుగా కీర్తిస్తూనే ఉన్నాం. దేశవ్యాపితంగా ఈ నదులన్నింటికి 91 ప్రదేశాల్లో పెద్ద పెద్ద ప్రా జెక్టులున్నాయి. వీటి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 157 బిలియన్ల క్యూబిక్ మీటర్లు. 62 శాతం జలానికి ఆవాసమైన ఈ నీటి వనరుల్లో ఇప్పుడున్న నీరు కేవలం 37.92 బిలియన్ క్యూబిక్ మీటర్లే. అంటే 24 శాతమేనని స్వయాన సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపిందంటే మన పాలకుల నీటి నిర్వాక విధానం ఎట్లా ఉన్నదో తెలుస్తోంది. మిగతా 38 శాతం నీటి నిల్వలు, చెరువుల్లో, కుం టల్లో, నదీ గర్భాల్లో లభించే నీరు 96 బిలియన్ క్యూబిక్ మీటర్లే! ఇవన్నీ వర్షాధారమే. నిండితే నిండవచ్చు. లేదా ఎండిపోవచ్చు. ఇలా దేశవ్యాపితంగా 600కు పైగా గల జిల్లాల్లో 256 జిల్లాల్లో నీటి జాడలు లేకుండా పోయాయి.
ఇలా 33 కోట్ల మంది ప్రజలకు నీరు జీవన్మరణ సమస్యగా మారితే, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో 443 గ్రామీణ మండలాలలకు గాను 231 గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా ప్రభుత్వమే గుర్తించగా, మరో రెండువందల మండలాల్లో కూడా భూగర్భ జలం సరాసరి 14.7 మీటర్ల లోతుకి పడిపోయాయి. గత సంవత్సరమే సరాసరి 10.5 మీటర్ల లోతులో లభించిన నీరు ఈ సంవత్సరం మరింత లోతుకు కూరుకుపోయిందని, అసలు లభ్యం కూడా కాదని ప్రభుత్వం గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టకపోగా, మిషన్ భగీరథను పదే పదే ఉటంకించడం అసలు సమస్యను దాటవేయడమే అవుతుంది. నిజంగా ఇది విజయవంతమైతే 2017 చివరి నాటికి వచ్చే నీటికై ఎదురు చూస్తూ కూర్చోగలమా? గత రెండు కాలాల్లో వరుణుడు కరుణించని వైనం తెలిసినా ప్రభుత్వం, ప్రైవేట్ బోరు బావుల్ని స్వాధీనం చేసుకొని, నియంత్రణతో ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తే, ఇంత విపత్కర పరిస్థితి రాకపోగా నీటి సరఫరా సమంగా జరిగేది. రేషనింగ్ విధానంలో జరిగి వుంటే, భూగర్భ జలా లు ఇంత ఘోరంగా పడిపోయేవి కావు. దీనికి తోడు వాల్టా చట్టాన్ని అమలు చేసినా ఇంతగా నీటి కటకట ఏర్పడేది కాదు.
నీరు ఓ ప్రైవేటు కమోడిటీగా మారడం, ప్రభుత్వానికి పట్టక పోవడం, ఇలా నీటి కరువు ఏర్పడితేనే నీటి ట్యాంకర్ల కాంట్రాక్టు పేరున నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చనే అవినీతికర ఆలోచనే నీటి సమస్యను మరింతగా జఠిలం చేస్తున్నాయి. జనాన్ని కాదంటూ, ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు గ్యాలన్ల కొద్దీ నీటిని సరఫరా చేయడాన్ని మహారాష్ట్ర హైకోర్టు తప్పు పడితే గాని మన నీటి దుర్వినియోం తెలిసిరాలేదు. అయినా క్రికెట్ మ్యాచ్ బెంగళూరుకు తరలింది కాని రద్దు కాలేదు.
ప్రాథమిక అవసరాలైన నీటికన్నా, సాంకేతిక విప్లవం, పరిజ్ఞానం అత్యవసరంగా మారిపోయింది. మతిపోయేలా బడా కంపెన్లీ మాయ జేస్తే, మన ప్రభుత్వాలు ‘మమ’ అనడం జరుగుతున్నది. అవసరం వున్నా, లేకు న్నా అందరి చేత సెల్‌ఫోన్లను, డ్యూయల్ ఫోన్లను, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను, ట్యాబ్లెట్లను కొనేలా చేయడం ఇదో అత్యవసర వస్తువుగా మన చేతిల్లోకి చేరిపోవడం జరిగిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం ఒకటే అయినా, రోజుకో మోడల్ మన మనసులను దోచుకుంటున్నాయి. జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ప్రభుత్వం తనవంతు కృషిచేస్తూనే ఉంది. పబ్లిక్ ప్రదేశాలలో తాగడానికి (కొనుక్కుంటే తప్ప) నీరు దొరకదు కాని, సెల్ చార్జింగ్ పాయిట్లు కావలసినన్ని ఉంటాయి. రైల్వే కంపార్ట్ మెంట్‌లో అడుగడుగునా ఉంటాయి. ఈ సౌకర్యం ఒకటే చాలదని ప్రభుత్వాలే వైఫైలు ఉచితంగా అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లతో పాటు, 29 పుష్పక బస్సుల్లో 161 ఏసీ బస్సుల్లో అందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వమైతే ఈ ఏడాది చివరినాటికి ఎంపిక చేసిన 100 రైల్వే స్టేషన్లతో పాటు, రాబోయే కాలంలో 400 స్టేషన్లలో ఈ ఉచిత సేవల్ని అందించబోతున్నది.
జిహ్వ రుచిని చంపుకోనైనా కొత్త స్మార్ట్ ఫోన్లను కొనే ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ భారతదేశమే. అందుకే గూగుల్ ఈ దేశ యువత బాగుకై ఉచిత సేవల్ని అందిస్తోంది. తెల్లవాళ్లు మనకు టీని అలవాటు చేసి మన సంప్రదాయ ఆహారాలకు దూరం చేసినట్టే, ఈ డిజిటల్ ప్రపంచం జనాల్ని పిచ్చివాళ్లను చేస్తున్నది. రోడ్డుపైన వున్నామో, చౌరాస్తాలో ఉన్నామో తెలియని మైకం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియక, పిచ్చివాళ్లని అనుకుంటే, మనమే పిచ్చివాళ్లం అవుతున్నాం. వీరికి నిన్న లేదు, నేడు లేదు. రేపు అంతకన్నా ఉండదు. ఉండేదల్లా ఓ అంతర్జాలమే.
ఈ బలహీనతల్నే ప్రభుత్వం సొమ్ము చేసుకుంటున్నది. ప్రాథమిక అవసరాలు ద్వితీయ అవసరాలుగా, ద్వితీయ, తృతీయ అవసరాలు అత్యవసర ప్రాథమిక అవసరాలుగా మారిపోయాయి. మనమేంటో, మనకే తెలియదు. మనను ఎవరు నియంత్రిస్తున్నారో, ఎందుకు నియంత్రిస్తున్నారో ఆలోచించే తీరికా లేదు. కోపతాపాలు, రాగద్వేషాలు, బంధాలు, అనుబంధాలు, బలహీనమై పోతున్నాయి. మనం నిల్చున్న నేలనే కాదు-నేలలోని మట్టి పొరల్ని, పొరల్లో దాగిన విలువల్ని గునపాలతో పొడుస్తుంటే, డైనమేట్లతో పేలుస్తుంటే, చేష్టలుడిగి చూస్తుంటే, ఒంటిమీద బట్టలు కూడా దేవతా వస్త్రాల్లా మారతాయేమో? అప్పుడునీరెందుకు? అత్తరును పులుముకుంటే సరి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162