మెయిన్ ఫీచర్

మనం తీయలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసపెట్టి సంధిస్తున్న బయోపిక్‌లను చూసి -ఇలాంటి సినిమాలు తీయాలంటే బాలీవుడ్‌కే సాధ్యమన్న నమ్మకానికి వచ్చేస్తున్నాం. దేశభక్తి స్ఫూర్తి ప్రదాతలను తెరకెక్కించటంలో బాలీవుడ్‌ను మించిన వాళ్లు లేరన్న భ్రమల్లో ఉండిపోతున్నాం. నిజానికి -బయోపిక్‌ను తెరకెక్కించటంలో టాలీవుడ్ తక్కువేమీ తినలేదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించటంలోనూ టాలీవుడ్ బలం తక్కువేమీ కాదు. బయోపిక్‌ల కాలానికి ముందే- పురాణాలు, ఇతిహాసాల్లోని కొన్ని ముఖ్య పాత్రలను తీసుకుని వాటిపై అధ్యయనం చేసి -జీవిత చరిత్రను చూస్తున్నంత బలంగా తెరకెక్కించిన అనుభవం మనవాళ్లకుంది. ప్రతి చిత్రంలోనూ ఒక పాటరూపంలోనో, ప్రధాన సన్నివేశ రూపకంగానో -దేశభక్తికి ప్రేరణగా నిలిచే సన్నివేశాలను, నేతలనూ తెలుగు సినిమా చూపిస్తూనే వచ్చింది.
రామాయణ, భారత, భాగవతాల్లోని -ప్రధాన పాత్రలకు రూపాన్నిస్తూ ఈ కాలంలోనే జరిగిన కథలంత బలంగా మనకు అందించిన దర్శక మహానుభావులు టాలీవుడ్‌లో లెక్కలేనంత మంది.
స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత, -సామాజికాంశాలపై సినిమా పూర్తిస్థాయి దృష్టి పెట్టిన తరువాతా బయోపిక్‌ల్లాంటి కథలను మన దర్శకులు ఎన్నో అందించారు. నిజానికి బాలీవుడ్ బయోపిక్‌లకు మార్గదర్శి దక్షిణాది సినిమాలు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలేనని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. కాకపోతే -మనదైన స్టయిల్‌ని మనం పదిలపర్చుకుని పదును పెట్టుకోవడంలో కచ్చితంగా దారి తప్పేశాం. అయితే, తెలిసిన విద్యను తేలిగ్గా తీసేయడం ఎందుకన్నట్టు -అడపాదడపా వస్తున్న బయోపిక్‌లు తప్ప తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదన్నది వాస్తవం. అలనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తరువాతి తరాలకు అందించే ఉద్దేశంతో, స్వాతంత్రోద్యమ సంఘటనలు, ఉద్యమానికి తమవంతు పాత్ర పోషించి ప్రాణాలర్పించిన వీరుల కథలతోనూ టాలీవుడ్‌లో చిత్రాలు రావాల్సిన సమయమిది.
**
స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దేశభక్తులు మనందరికి మార్గదర్శకులే. వీరులేనిదే చరిత్ర లేదు. చరిత్రను సృష్టించడానికి తమ జీవితాలనే చరిత్రగా మార్చుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం వున్న వారి జీవితాలను తెలుసుకోవాల్సిన అవసరం తరతరాలకూ ఉంది. ఆ మహానుభావుల త్యాగనిరతిని తెలుసుకోవడం దేశ పౌరులుగా మన విద్యుక్త ధర్మం కూడా. సినిమాపరంగా తెలుగు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన అనేక విషయాలను చిత్రీకరించారు. తెలుగు సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే స్వాతంత్య్ర పోరాటం ఉధ్రుతస్థాయిలో ఉంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక అనేక చిత్రాల్లో ఆయా సంఘటనలకు సంబంధించిన విశేషాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడక్కడ కొన్ని చిత్రాల్లో చూపిస్తూ వచ్చారు. అప్పటి ఆ చిత్రాలే ఇప్పటి తరాలకూ కొద్దో గొప్పో దేశ స్వాతంత్య్ర విజయ పరిమళాలు వెదజల్లుతున్నాయి. కోడలు దిద్దిన కాపురం చిత్రంలో ‘నీ సంఘం నీ ధర్మం నువ్వు మరవొద్దు’ అంటూ వినిపించిన పాట ఇప్పటికీ దేశం కోసం మనమేం చేయాలో చెబుతుంది. ‘్భలే తాత మన బాపూజీ/ బాలల తాత బాపూజీ’, ‘గాందీ పుట్టిన దేశం/ రఘురాముడు ఏలిన రాజ్యం’, పాడవోయి భారతీయుడా/ ఆడి పాడవోయి విజయ గీతికా’, ‘జననీ జన్మభూమిశ్చ/ స్వర్గాదపీ గరీయసీ’ లాంటి పాటలు విన్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. ‘నాకూ స్వాతంత్రం వచ్చింది’, ‘గాంధిపుట్టిన దేశం’, ‘పాడవోయి భారతీయుడా’, ‘బొబ్బిలిపులి’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘రోజా’, ‘హేరామ్’, ‘్భరతీయుడు’, ‘ఖడ్గం’, ‘బంగారు పతకం’, ‘రేపటి పౌరులు’ -లాంటి చిత్రాలు దేశభక్తిని నింపే ప్రయత్నం చేసినవే. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర బయోపిక్స్ నిర్మాణం. ఈ బయోపిక్స్‌లో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రలను నిక్షిప్తం చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. తెలుగులో దేశభక్తుల బయోపిక్స్ చాలా అరుదుగా వచ్చాయి. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి, కొమురం భీమ్, అంబేద్కర్ లాంటి వేళ్లమీద లెక్కబెట్టే సినిమాలు మాత్రమే బయోపిక్స్ అయ్యాయి. దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం జీవితాలే త్యాగం చేసిన తెలుగు వీరులు ఎంతోమంది ఉన్నారు. వీరందరి చరిత్రలు బయోపిక్స్‌గా రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఇదే ప్రేరణగా గొప్ప స్వాతంత్య్రవీరుల గురించి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి చరిత్రలు తరువాతి తెలుగు తరాలకు ప్రేరణగా నిలుస్తాయి. పొట్టి శ్రీరాములు స్వరాష్ట్రం కోసం పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కథను బయోపిక్‌గా మలుచుకునే ప్రయత్నం జరగాలి. అలాగే గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పెదనందిపాడుకు చెందిన పర్వతనేని వీరయ్యచౌదరి గురించి చరిత్రను పరిశోధిస్తే సినిమా కథలకు తగినన్ని విషయాలు లభిస్తాయి. దాదాపు ఆరువేలమందితో ఆనాడే శాంతిసైన్యం ఏర్పాటు చేసి ఆంగ్లేయులపై పోరాడిన వీరుడాయన.
జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య చరిత్ర తక్కువేం కాదు. ఆయన జీవితంలో ఎన్నో అంశాలు వైవిధ్యంగా కన్పిస్తాయి. బ్రిటీష్‌వారు విధించిన పన్నులకు వ్యతిరేకంగా చీరాల పేరాల ఉద్యమంలో భాగమై ఊరికి దూరంగా గుడారాలు వేసుకుని నిరసన తెలిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కథనం ఉద్వేగాన్ని కలిగిస్తుంది. పోలీసు కాల్పుల్లో మృతిచెందిన కనె్నగంటి హనుమంతు, నిజాం సర్కార్ సేనలు కర్కశంగా నులిమేసిన దొడ్డి కొమురయ్య, తేళ్ల కృష్ణయ్య చౌదరి, సంఘం లక్ష్మీబాయి, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, సరోజిని నాయుడు, టంగుటూరి సూర్యకుమారి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి ఎందరో తెలుగు తేజాలు ఉన్నారు. వారందరి జీవిత చరిత్రల్లో అద్భుతమైన మలుపులున్నాయి. దేశభక్తికి ప్రేరణ కలిగించే ఘట్టాలు దాగివున్నాయి. వాళ్ల కథలు చదివినా, కథలుగా చూసినా -ఇదీ నా దేశమని రొమ్ము విరుచుకుని చెప్పాలనిపించే ఘట్టాలున్నాయి. ఈ తరానికి పెద్దగా తెలియని వాళ్ల కథలతో సినిమాను రక్తికట్టించలేమన్న వ్యాపార కోణాన్ని ఒకింత పక్కనపెట్టి, దేశం కోసమే బతికిన అలాంటి వాళ్ల కథల్లోని ముఖ్య ఘట్టాలను ఏరుకున్నా ప్రేక్షకులకు నచ్చేలా భావోద్వేగ బయోపిక్‌లను సృష్టించుకోవచ్చు.
**
నిజానికి బాలీవుడ్ ఈ పని ఎప్పుడో మొదలెట్టింది. బాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలే విజయపంథాలో నడుస్తున్నాయి. ఝాన్సీరాణి కథనంతో మన తెలుగు దర్శకుడు క్రిష్ కంగనా రౌనత్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందిరాగాంధీ చరిత్రపై ఓ ఎపిసోడ్‌లాంటి ఎమర్జెన్సీని ఇందు సర్కార్ పేరిట రూపొందించారు. వీర శివాజీ మరాఠా యోధుడైనా ఆయనపై చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ వెండితెరపై సంపూర్ణంగా ఆవిష్కృతం కాలేదు. ఎన్టీఆర్, కృష్ణలాంటి హీరోలు అప్పట్లో ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు కాని, అది పూర్తిస్థాయిగా నెరవేరలేదు. సుభాష్ చంద్రబోస్ పేరిట ఆ మధ్య ఓ చిత్రం వచ్చినా అదీ పూర్తిగా కల్పితం కావడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. రోజా, ఈనాడులాంటి దేశభక్తికి ప్రేరణనిచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతీయుడు చిత్రం స్వాతంత్య్ర పోరాటం తరువాత దేశంలో తలెత్తిన అవినీతి నేపథ్యంలో రూపొందినా, ఓ పూర్తిస్థాయి దేశభక్తుని కథనంతో ఉండి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది అజ్ఞాతవీరుల కథనాలు అప్పటి పత్రికలను పరిశోధిస్తే దొరుకుతాయి. తెలుగు సినిమాకు కావాల్సిన అద్భుతమైన ముడిసరుకు కథ దొరుకుతుంది. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ సాగుతోంది కనుక ఇదే ఉత్సాహంతో తెలుగులోనూ తెలుగువీరుల కథనాలు రావాలని, దేశభక్తి ఆయా చిత్రాల ద్వారా పెంపొందాలని కోరుకుందాం.

చిత్రాలు.. పింగళి వెంకయ్య *గాడిచర్ల హరిసర్వోత్తమరావు *కనె్నగంటి హనుమంతు *పొట్టి శ్రీరాములు *టంగుటూరి ప్రకాశం
*ఉయ్యాలవాడతో చిరు దేశ భక్తుల చిత్రాలకు ఊపునిస్తాడా...

-శేఖర్