ఎడిట్ పేజీ

ఇంగ్లీషు కావాలి.. తెలుగూ కావాలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని పాలకులు అన్నప్పుడల్లా విమర్శలు, ప్రతి విమర్శలు వినవస్తూనే ఉన్నాయి. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగుకేదో నష్టం జరుగుతుందని, తెలుగు భా ష ‘మృతభాష’ అవుతుందని, అదో దేశద్రోహం, జాతి ద్రోహమన్నంత స్థాయిలో కొంతమంది విమర్శిస్తున్నారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు, సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు, ప్రభుత్వాలకు విజ్ఞప్తులూ చేస్తున్నారు, భాషోద్యమాలూ చేస్తున్నారు. ఇలా చేసే వాళ్ళంతా ముఖ్యంగా అగ్రకులాలకు చెందిన వారేనన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందులో ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలను నడిపించే వాళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బాగా చదువుకున్న విద్యావంతులు కూడా. వీళ్లు తమ పిల్లలనెవరినీ తెలుగు మాధ్యమ పాఠశాలల్లో చదివించడం లేదు. కాని ప్రభుత్వ పాఠశాలలకెళ్ళే గ్రామీణ విద్యార్థులకు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలకు ఇంగ్లీషు మీడియం వద్దని మాత్రం ఘంటాపథంగా చెబుతుంటారు. ఇంగ్లీషుకు ప్రాధాన్యం ఇస్తే తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలాదిమంది విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో అభ్యసిస్తే తప్పులేదు. కాని ప్రభుత్వ బడుల్లోని పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే తెలుగు మృతభాష అవుతుందా? అన్న ప్రశ్నకు వీరెవరూ సమాధానం చెప్పరు. తమ పిల్లల విషయంలో ఇలాంటి నియమాలు ఏ మాత్రం పాటించకుండా కొందరు, అతి కొద్దిమంది తెలుగు మాధ్యమ పాఠశాలలకు పంపుతున్నా అవగాహన లేక కొందరు భాషోద్యమాలను నడుపుతున్నారు.
తెలుగు సమాజంలో నడుస్తున్న భాషోద్యమాలకు దిశా-దశా ఏవీ ఉండటం లేదు. ‘తెలుగును బతికించుకోవాలి.. బతికించుకోవాలి..’అని ఊదరగొట్టడం తప్ప ఎలా బతికించుకోవాలనే దాని మీద స్పష్టత అసలే లేదు. వీళ్ళది ఇంగ్లీషు వ్యతిరేక తీవ్రవాదం. ఇక ‘ఇంగ్లీషు మాధ్యమం, ఇంగ్లీషు భాష మాత్రమే ఉంటే చాలు’ అనే వారిది మరో రకం తీవ్రవాదం. అది మాతృభాషల వ్యతిరేక తీవ్రవాదం. వీళ్ళకు దళిత బహుజనులు పైకి రావాలంటే ఇంగ్లీషు మీడియం చదువులు వస్తే చాలన్న భావముంది. బలహీన కులాలు, వర్గాలు పైకి రావాలంటే ఇంగ్లీషు మీడియం చదువులు వస్తే చాలన్న భావముంది. బలహీన వర్గాలు పైకి రావాలంటే వాళ్ళ అభివృద్ధిని కోరే, ఆచరించే ప్రభుత్వాలు కావాలి. కాని కేవలం ఇంగ్లీషు మీడియంలో చదివితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో అర్థం కాని విషయం. వీళ్ళు బొడ్డూడని పసి వయస్సు నుంచి పిల్లలు తల్లిభాషకు దూరంగా ఇంగ్లీషు మీడియంలోనే చదివి తీరాలని వాదిస్తారు. తెలుగు ఒక్క అక్షరం ముక్క కూడా రాకుండా ‘కెజి టు పిజి వరకు’ ఇంగ్లీషు మాధ్యమంలో చదవాలన్నది వీరి ఉద్దేశం. తెలుగు మృతభాషగా నశించిపోయినా సరేకాని ఇంగ్లీషు కావాలన్నది వీరి వాదన. అలా చేయని ప్రభుత్వాలను అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలుగా, ఇది తప్పనే వాళ్ళను అభివృద్ధి నిరోధక దళిత బహుజన వ్యతిరేకులుగా చిత్రించడం తెలుగు సమాజంలో మామూలయిపోయింది. ఈ రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు, రాతలు-ప్రతిరాతలు, ఫేస్‌బుక్కులకెక్కడం, పరస్పర నిందలు, ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి.
మరి ఏ మీడియం చదువులు కావాలో నిర్ణయించేదెవరు? ప్రభుత్వాలే కదా! మరి ప్రభుత్వాలేం చేస్తున్నాయి? రెండు వాదాల్లోని సామంజస్యతను గుర్తిస్తున్నాయా? కనీసం ఆ వాదనలను వినడానికి బహిరంగ చర్చలైనా పెడుతున్నాయా? అంటే అదీ లేదు. ప్రభుత్వాలకు తెలుగు భాష నశించినా, ఇంగ్లీషు చదువులే కావాలో తెలుగు మాధ్యమ చదువులు కావాలో అనేదానిపై స్పష్టత లేదు. చదువుల పేరుమీద కూడా ఓట్లు ఎలా సంపాదించాలన్నదే ముఖ్యం. అందుకోసం తెలుగు అభిమానులు వీరి దగ్గరికెళితే తామే తెలుగు రక్షకులమన్నట్టు మాట్లాడుతారు. ఇంగ్లీషు మాధ్యమం కావాలని కోరితే మొత్తం ఇంగ్లీషుమయం చేస్తామంటారు. మరో దిక్కు ప్రైవేటు స్కూళ్ళను, కార్పొరేట్ చదువులను ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను తామే నిర్వీర్యం చేసి మూతలు పడేట్టు చేస్తారు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పాఠశాల విద్య పరిస్థితేంటో, ఈ వాదాలెందుకొస్తున్నాయో, నిజానికి తెలుగు మృత భాష కాకుండా, ఇంగ్లీషు కూడా బాగా చదువుకొని ఎలా అభివృద్ధి పథంలో నడువవచ్చో పరిశీలిద్దాం. స్వాతంత్య్రానంతర కాలంలో అందరికీ విద్య కావాలన్న విశాల దృక్పథంతో పాఠశాల స్థాయి విద్య వరకు తెలుగు మాధ్యమంలో, విశ్వవిద్యాలయ విద్య (ఉన్నత విద్య) ఇంగ్లీషు మాధ్యమంలో ఉండేది. దీంతో గ్రామీణులు, పేదలు, విద్యాగంధం లేని దళిత బహుజనులు కూడా చదువుకోగలిగారు. తమ తల్లి భాషలో విద్యాబోధన చేయడం వల్ల కానె్సప్ట్ బాగా అర్థం చేసుకోగలిగారు. నాలుగవ తరగతి ఇంగ్లీషు పూర్తి స్థాయిలో ఒక సబ్జెక్టుగా ఉండేది. పదకొండవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులూ, ఇంగ్లీషుతో పాటు బాగా వచ్చేవి. కాలేజీ చదువు ఏ మాధ్యమయినా కష్టముండేది కాదు. ఇలా హెచ్‌ఎస్‌సి వరకు చదివిన వారు కూడా ఇంగ్లీషులో, తెలుగులో అద్భుతంగా ఫైళ్ళు రాసేవారు. పై చదువులు ఇంగ్లీషులో చదువుకొని విదేశాలకెళ్ళారు. ఉన్నత స్థానాలకెదిగారు. పసి వయసులో తనకు తెలిసిన భాషలో అన్ని సబ్జెక్టులు చెప్పడం వల్ల సులభంగా అర్థమై చదువు సులభం అయింది. ఆ తర్వాతి కాలంలో ఉన్నత విద్య కూడా మాతృభాషలో ఉండాలని కాలేజీల్లోనూ తెలుగు మాధ్యమాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి కాలంలో విద్య క్రమక్రమంగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఈ ప్రైవేటు వాళ్ళంతా ఉన్నత కులాలకు చెందిన పెట్టుబడిదారులే. వీళ్ళు ఇంగ్లీషు మీడియంను పెంచి పోషించారు. ప్రపంచీకరణ ప్రవేశం తర్వాత ఈ పాఠశాలలలు వేల సంఖ్యలో పెరిగాయి.
పాఠశాల విద్య, ఉన్నత విద్య కూడా కార్పొరేటీకరణం చెందింది. వీళ్ళకు కావాల్సింది లాభాలు. కోట్ల సంపాదన. పాలకులు కూడా వీటిని ప్రోత్సహించడంతో ప్రభుత్వ విద్య అటకెక్కింది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్నవారు లేరు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఏ చిన్న ఉద్యోగి కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదు. క్రమక్రమంగా గ్రామీణ పేదలు కూడా అప్పుచేసైనా సరే ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివించసాగారు. ఉన్నవాళ్ళెలాగూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపరు. వీళ్ళంతా చదివేది ఇంగ్లీషు మీడియమే. మరీ పేదలు, మారుమూల పల్లెల వాళ్ళు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి వచ్చాయి. ఇంగ్లీషు మోజు ప్రభుత్వ విద్యావ్యవస్థను బలహీనపరిచింది. ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలను, ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రోత్సహించడంతో ప్రభుత్వమే తన పాఠశాలలకు చెక్ పెట్టినట్టయింది. ఈ దశలో గ్రామీణ పేదలకు కూడా ఇంగ్లీషు మాద్యమం కావాలన్న డిమాండ్, ఉన్నవారికి ఇంగ్లీషు ప్రైవేట్ చదువులు- లేనోళ్లకు ప్రభుత్వ తెలుగు మాధ్యమ చదువులా? అన్న వాదం బయలుదేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పరిస్థితి ఘోరంగా ఉండటం వల్లనే ఈ వాదం బయల్దేరింది. ఈ వాదం రావడానికి గల కారణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా పాలకులు ప్రభుత్వ పాఠశాలల్లో, మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాలను ప్రవేశపెడతామని, అదే తారక మంత్రమని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి బాగా పెరుగుతుందన్నది వట్టిమాట. పైగా అక్షరాస్యతా శాతం తగ్గే అవకాశముంది.
ఇంగ్లీషు మీడియం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో అక్షరాస్యత శాతం తగ్గిందన్నది వాస్తవం. కాని పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రభుత్వాలు ఇంగ్లీషు మాధ్యమాలను ప్రవేశపెట్టడమే కరెక్టు. ఎందుకంటే ప్రజల్లో, కుహనా మేధావుల్లో మాతృభాషలో చదవకుండా ఇంగ్లీషులో చదివితేనే నాణ్యమైన చదువులన్న భ్రమ ఉంది. ఇంగ్లీషు చదివితేనే ఉద్యోగాలు దొరుకుతాయన్న అపోహ ఉంది. కాని ఇంగ్లీషు బాగా రావాలన్నా, మరే సబ్జెక్టు బాగా రావాలన్నా పసితనంలో మాతృ భాషలకు అనుకూలంగా ‘జీన్స్’ ఉంటాయి కాబట్టి కనీసం పాఠశాల విద్య వరకు మాతృభాషలో చదువులు చెప్పడం మంచిదన్నది శాస్ర్తియమైంది. లాభాల కోసం స్థాపించి, అమానవీయ పోటీని పెంచి తాము కోట్లు గడిస్తూ పిల్లలను విపరీతమైన టెన్షన్‌కు గురిచేస్తున్న ప్రైవేటు విద్యను నిషేధించాలి, నిరుత్సాహపరచాలి. ఉంటే ప్రైవేటు పాఠశాలల్లోనూ పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. ప్రతి విద్యార్థికీ పాఠశాల విద్యవరకయినా నిర్బంధ ఉచిత విద్యనివ్వాలి. భాషోద్యమాలు చేస్తున్నవారు, మేధావులు ప్రైవేటు విద్య గురించి ఒక్క మాట మాట్లాడరు కాని ఇంగ్లీషు మాధ్యమం అసలే వద్దంటారు. ఇంగ్లీషు గురించి చెప్పేవారు కేవలం మాధ్యమం కావాలంటారు కాని గ్రామీణ పేదలకు నాణ్యమైన విద్య, ఉచిత నిర్బంధ విద్య కావాలని అడగరు. వాదోపవాదాలు, ధూషణలు, భూషణలు, ఆత్మస్తుతులు, పరనిందలు చేసుకుంటూనే ఉంటారు.
పాఠశాల విద్య గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వాలు ఒక్కసారి ఫిన్లాండులో పాఠశాల విద్య ఎలా ఉందో అధ్యయనం చేస్తే బాగుంటుంది. అక్కడ మూడేళ్ళ వయసు నుంచే పసిమెదళ్ళను పరాయి భాషలో తినడం ఉండదు. చదువులో హింస ఉండదు. ఏడేళ్ళ వరకు హాయిగా ఆడుతూ పాడుతూ పెరుగుతారు. పాఠశాల విద్యంతా వాళ్ళ భాషలోనే ఉంటుంది. పనె్నండేండ్ల వరకు ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఉచిత నిర్బంధ విద్య, పోటీ ఉండదు. ప్రైవేటు మాట లేదు. అయినా వాళ్ళకు చదువు ముగిసేసరికి నాలుగు భాషలొస్తాయి. విద్యా విధానంలో, అక్షరాస్యతలో ఆ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇంకేం కావాలని మరి?
ఇంతకీ మనకు కావాల్సిందేంటి? ఎవరేమన్నా, ఔనన్నా, కాదన్నా ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, ఆధునిక సాంకేతిక పదజాలాన్ని, అన్ని విభాగాల పదజాలాన్ని తనది చేసుకొని తనను తాను ఆధునీకరించుకున్న ప్రపంచ భాష. ఒక్క మనకే కాదు, ప్రపంచ మంతటికీ ఇంగ్లీషు అవసరమే. అందుకోసం పాఠశాల విద్య ఆరంభమైన మొదటి తరగతి నుంచే ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా పూర్తిస్థాయిలో బోధించాలి. కనీసం పాఠశాల స్థాయి విద్యవరకయినా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరగాలి. దీనిని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింట్లో తప్పనిసరి చేయాలి.
పుట్టుకతోనే పరభాషా భారాన్ని పిల్లలపై మోపకూడదు. మాతృభాషలో ప్రావీణ్యం లేకుండా ఏ ఇతర భాషలో, సబ్జెక్టులలోనూ ప్రావీణ్యం సంపాదించడం సాధ్యం కాదు. ఇది సైన్సు, శాస్ర్తియం. ఇంగ్లీషు బాగా రావాలన్నా చిన్నతనంలో మాతృభాషలోనే చదువుకుంటూ ఇంగ్లీషు చదువుకోవాలి. ఉన్నత విద్య ఇంగ్లీషు మాధ్యమంలోనూ, తెలుగు మాధ్యమంలోనూ ఉంటే ఎవరికి ఇష్టమున్నది వాళ్ళెన్నుకుంటారు. అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషును అందరూ నేర్చుకుంటారు. దళిత బహుజనులు, పేదవర్గాల వారు తెలుగు, ఇంగ్లీషు నేర్చుకుంటారు. ఉన్నత విద్యతో విదేశాలకేగడం మాత్రమే కాదు.. ఈ దేశాన్నీ ఏలుతారు. ఏమంటారు?

-డాక్టర్ కాలువ మల్లయ్య సెల్: 98493 77578