మెయన్ ఫీచర్

‘సీట్లు’ పెరగవు.. సర్దుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు నూతన రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై గత మూడేళ్లుగా సాగుతున్న చర్చలకు బిజెపి కేంద్ర నాయకత్వం తాజాగా ముగింపు నిచ్చింది. రాష్టప్రతి ఎన్నిక వరకు అందీ అందనట్లుగా స మాధానం చెప్పిన బిజెపి అధినాయకులు, పోలింగ్ ముగిశాక తాము నియోజకవర్గాల పెంపునకు వ్యతిరేకం అని తేల్చేశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో స్పష్టత కోసం ఏపి పునర్విభజన చట్టాన్ని పదే పదే వల్లెవేసిన తెలుగు రాష్ట్రాల నాయకులు- పార్లమెంట్‌లో ఆ బిల్లు పెట్టినపుడే క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దాన్ని కొంతమేరకైనా సవరించి ఉండేవారేమో! ఆ చట్టాన్ని రూపొందించిన అధికారులలో అలసత్వం ఎంతగా వుందో, చట్టంలో పొందుపరిచిన శాసన మండలి స్థానాల సంఖ్య, పోలవరం ముంపు మండలాలు, ఉద్యోగుల- ఆస్తుల పంపకాల విషయాన్ని బట్టి అర్థవౌతుంది. అటువంటి తప్పే నియోజకవర్గాల పెంపు విషయమై కూడా చేశారు.
రాజ్యాంగంలోని 170 (3) అధికరణం స్పష్టంగా- 2031 జనాభా గణన వరకు దేశంలో నిజయోజక వర్గాలను పెంచేందుకు వీల్లేదని చెబుతుండగా- పునర్విభజన చట్టంలోని రాజ్యాంగంలోని 170 అధికరణాన్ని అనుసరించి నియోజకవర్గాలను పెంచుకోవచ్చునని పేర్కొనడం, ఆ నిబంధనను సవరిస్తే తప్పితే పునర్విభజన సాధ్యం కాదని చెప్పటానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకు దొరికింది. పునర్విభజన చట్టాన్ని రూపొందించిన ‘అధికార మేధోగణం’ ఇటువంటి నిబంధనను చట్టంలో పెట్టుకున్నా ఏ అడ్డంకి ఉండేది కాదు. పునర్విభజన చట్టం నిబంధనలు ఎలా ఉన్నా నియోజకవర్గాల పెంపునకు అవేమీ అడ్డంకి కావు. భారత రాజ్యాంగంలోని అధికరణం 2 లేదా 3 క్రింద ఏర్పాటైన ఈ చట్టమైనా రాజ్యాంగంలోని మరే ఇతర అధికరణాలతో విభేదిస్తున్నప్పటికీ అటువంటి చట్టాలను అధికరణం 368 ప్రకారం సవరించాల్సిన అవసరం లేదని రాజ్యాంగంలోని 2 మరియు 3 అధికారణలే అంతిమమని అధికరణం 4 స్పష్టంగా పేర్కొంటున్నది. కనుక ఈ ప్రకారం చూసుకొన్న అధికారణం 3 ప్రకారం చేయబడిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అమలు చేయటంలో మరే ఇతర నిబంధనలు అడ్డంకి కావు.
రెండు రాష్ట్రాలలో రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపనున్న నియోజకవర్గాల పెంపు విషయంలో ప్రధానమంత్రి రాజకీయ నిర్ణయం తీసుకోవలసి వున్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఇరు రాష్ట్రాల సిఎంలకు చెప్పడంతో ఇన్నాళ్ళ దోబూచులాటకు ఒక ముగింపు వచ్చినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాటలను బట్టి తెలుస్తుంది. పార్లమెంటులో తెలుగు ఎంపీలు నియోజకవర్గాల పెంపుపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ జవాబిస్తూ- అధికరణం 170ను సవరించే ఉద్దేశం కేంద్రానికి లేదని, అలా సవరిస్తే వివిధ రాష్ట్రాల నుండి నియోజకవర్గాల పెంపుకోసం వచ్చే విజ్ఞుప్తులను పరిశీలించాల్సి వస్తుందని చెప్పారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేతలు నియోజకవర్గాల పెంపు త్వరలోనే జరుగుతుందని మభ్యపెడుతూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు పాలనాపరమైన అనుమతులు, పునర్విభజన కమిషన్ ఏర్పాటు, అనుబంధ సభ్యుల నియామకం, ప్రజాభిప్రాయసేకరణ, ముసాయిదా బిల్లు తయారీ, పార్లమెంట్ ఆమోదం- వీటన్నింటికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందనేది ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌లకు తెలియని విషయమేమీ కాదు.
ఎన్నికలకు ఇంకా ఇరవై మాసాల సమయం మిగిలి వుందని తెలిసినా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్నవారు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే చెబుతున్నారు. ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటో సామాన్యులకు సైతం తెలిసిందే. రాజకీయాలు నేడు లాభసాటిగా మారి, భారీ సంపాదనకు అవకాశం కల్పిస్తున్నందున వివిధ రంగాల్లోని వారు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేయగల వారిని రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాలు’గా భావిస్తున్నాయి. ఇటువంటి ఆర్థిక స్థోమత వున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పుష్కలంగా వున్నారు. వైసీపీలో ఆ పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నుండి ప్రతిపక్షంగానే ఉన్న జగన్మోహన్‌రెడ్డి అనుయాయులు గత ఎన్నికలోనే అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. పదికోట్ల రూపాయల ఆర్థిక స్థోమత కలిగిన అభ్యర్థులు ఆ పార్టీలో పట్టుమని పాతికమంది కూడా ఉండరు. ప్రజాదరణ ఉన్నా పైసలు లేకపోతే ప్రజాస్వామ్యంలో ఫలితం ఉండదన్నది జగద్విదితమే. సరిగ్గా అటువంటి వారినే చంద్రబాబు లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే 21మంది వైకాపా శాసనసభ్యులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. మొత్తంగా 50-60 మందిని వైసిపి నుండి చేర్చుకొని ప్రతిపక్షాన్ని పూర్తిగా బలహీనపరిచాలనేది తెదేపా ఆలోచన.
గత ఎన్నికల్లోలానే రానున్న ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి అనివార్యం. బిజెపితో పొత్తుపెట్టుకుంటే పాతిక స్థానాలు, జనసేన, కమ్యూనిస్టులను కలుపుకొంటే 40 స్థానాల వరకు వారికి ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ విధంగా వైసిపి నుండి చేరినవారు, పొత్తుల్లో కేటాయించాల్సిన స్థానాలు కలిస్తే సుమారు 80 నుండి 100 స్థానాల్లో తెలుగుదేశం కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ఇంతమందికి అవకాశం ఇవ్వాలంటే పార్టీలోని ఆశావహులను ఏదో ఒక నెపంతో తప్పించాల్సిన పరిస్థితి. దీంతో నియోజకవర్గాల సంఖ్యను పెంచడం తెదేపాకు అత్యవసరం. ‘సీట్లు పెరిగితే మీకు టిక్కెట్ గ్యారంటీ’ అని హామీ పొందిన నేతల నుండి ఇప్పటికే ఒత్తిడి మొదలైంది. సీట్ల పెంపు సాధ్యం కాదని తేలడంతో, తెదేపాలో పాత, కొత్త నేతలు ఆధిపత్యం కోసం బాహాబాహీకి దిగుతున్నారు.
కానీ, తెలంగాణలో పరిస్థితి ఇంత తీవ్రంగా లేదు. దీనికి కారణం- గత ఎన్నికల్లో అభ్యర్థులకంటే కెసిఆర్ నాయకత్వ పటిమ, తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెరాస అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గాన్ని శాసించే స్థాయికి ఇంకా ఎదగలేదు. కెసిఆర్ ఎంతమందిని తప్పించినా, ఆయన పార్టీకి వచ్చే ప్రమాదేమీ లేదు. ఇతర పార్టీల నుండి చేర్చుకున్న 30-40 మంది నాయకుల సీట్ల సర్దుబాటు చేయడం కెసిఆర్‌కు పెద్ద ఇబ్బందేమీ కాదు. అదే పని చంద్రబాబు చేస్తే అవకాశం రాని నేతలంతా వైకాపా లేదా భాజపాలో చేరే అవకాశం ఉంది. ఇంకా రెండేళ్లు అధికారం మిగిలి వుండగానే అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్న నాయకులే దీనికి ఉదాహరణ. ఇక బిజెపి విషయానికొస్తే భారీ స్థాయిలో ఖర్చుపెట్టుకునేవారు, ఎన్నికల నిర్వహణ చేసుకోగలిగినవారు రెండు రాష్ట్రాలలో కలిపి బహుశా ఇరవై మందికి మించి ఉండరు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్, టిడిపిలు భారీగా ఖర్చుపెడతాయన్న ప్రచారం దెబ్బకు ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళే ఆందోళనకు గురౌతున్నారు. దీంతో సహజంగానే బిజెపి రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలనుండి వచ్చే నేతలమీదే దృష్టిపెట్టింది.
ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచితే బిజెపికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ విషయం తెలుసు గనుకనే తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు నియోజకవర్గాల పెంపు విషయమై విజ్ఞప్తులకు స్వస్తి పలకాలని భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. నియోజకవర్గాలు పెరిగితే టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలకు లాభం చేకూర్చి, తమకు నష్టం ఖాయమని భాజపాలోని సాధారణ కార్యకర్తలు కూడా భావిస్తున్నప్పటికీ వెంకయ్యమాత్రం నియోజకవర్గాల పెంపుకోసం ఢిల్లీ వచ్చేవారికి నాయకత్వం వహించి, పదే పదే అధికారులు, మంత్రులను తన నివాసానికి పిలిపించుకొని అధిష్ఠానంపై ఒత్తిడి తేవడం, అమిత్‌షా-మోదీలు సీట్లను పెంచేందుకు విముఖంగా ఉన్నారని తెలిసినా ఇరు రాష్ట్రాల నాయకులను వారి వద్దకు పంపడం, పార్లమంటులో ప్రశ్నలు వేయించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం సహజంగానే వారికి ఆగ్రహం తెప్పించింది.
వెంకయ్య అతి జోక్యం, ఆయన పట్ల పార్టీలో ఉన్న వ్యతిరేకత కూడా నియోజకవర్గాల పెంపు జరగకపోవడడానికి కారణం అని చెప్పక తప్పదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నియోజకవర్గాల పెంపు విషయాన్ని మొదటగా ప్రస్తావించింది, బిల్లులో పెట్టడానికి కృషి చేసింది ఆ పార్టీ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డినే. బహుశా ఆయన అప్పట్లో ఆ విధంగా ప్రయత్నించడానికి- నియోజకవర్గాలలోని ఓటర్ల సంఖ్యలో సమతుల్యత లేకపోవటం, ఇతర రాష్ట్రాలతో పోల్చినపుడు ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెద్దవిగా ఉండటం కారణమై ఉండవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టమన్న సంగతి ఆయనకి ఇపుడు బోధపడి ఉండవచ్చు. అదేకాక కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏడాది మునుపే ఈ బిల్లును వ్యితిరేకించాలని నిర్ణయించుకుంది. విభజన చట్టంలో పేర్కొన్న మిగతా హామీలను నెరవేర్చిన తరువాతే, పార్టీలకు ఉపయోగపడే పునర్విభజన అంశానికి మద్దతిస్తామని చెప్పటంతో కాంగ్రెస్ విధానం స్పష్టమైంది. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు కార్యరూపం దాల్చే అవకాశం లేదు. నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్నవారు ఆ సంగతిని పక్కనబెట్టి, ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది.

-షేక్ మస్తాన్