మెయిన్ ఫీచర్

దేశ సరిహద్దులు దాటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట కూసింత శాస్ర్తియ టచ్ ఇస్తూ- భావోద్వేగాల్ని మిళితం చేసి.. ప్రేమికుల హృదయ రవళి వినిపించాలంటే.. బొంబాయి వీధుల్ని దాటి- ఏ ఎతె్తైన మంచు శిఖరాల్లోకో.. పచ్చటి లోయ తీరాల్లోకో.. కాశ్మీరీ చల్లదనానికో తీసుకెళ్లేవి సినీ పక్షులు. కథంతా క్రిక్కిరిసిన వీధుల మధ్య.. జన సందోహాల మధ్య నడిచినా.. ఆ టెన్షన్ తట్టుకోటానికా అన్నట్టు ‘కాశ్మీరీ’ మంచుతెరల్తో కప్పేసి రిలీఫ్‌ని తెచ్చేవారు. కథ ఎక్కడ జరిగినా.. పాటల విషయానికి వచ్చేసరికి ఆ ‘టాస్క్’ నుంచి బయటపడేందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంచుకొన్న ప్రక్రియ అది. తెలుగువాళ్లకు అప్పట్లో అంత సౌకర్యం ఉండకపోవటం వల్ల కథ సెట్స్‌లో నడిచినా.. పాట పార్కుల్లో... ఏ మైసూర్ బృందావన్ గార్డెన్స్ వరకో వెళ్లి వచ్చేది. తెలుగు వాళ్లకి ‘మంచు’ చల్లదనం అక్కర్లేదని ఆనాడు తీర్మానించుకున్నారేమో?! ఏది ఏమైతేనేం- పాటలకే పరిమితమైన ఈ ‘తెర’లు దేశ సరిహద్దుల్ని దాటి.. భూ మండలాన్ని చుట్టి వచ్చే ప్రయత్నం చేశాయి మూడు దశాబ్దాల నుంచీ.

కథ ఏ ప్రాంతానికి చెందినదైనప్పటికీ.. విదేశాల్లో ఊపిరి పోసుకోవటం మొదలుపెట్టింది. ఎందుకూ అన్న దానికి కారణం? ఒకనాడు ‘్ఫరిన్’ అన్న మాట ఉచ్ఛరించటానిక్కూడా స్థాయి భేదాలు అడ్డు వచ్చేవి. కథాపరంగా కాకపోయినా.. పాటల్ని ఏ విదేశీ వీధుల్లోనో
చిత్రీకరించి.. అక్కడి వైభవోపేత జీవితాన్ని కళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేయటం ‘క్లాసిక్’ టచ్‌ని తెచ్చిపెట్టింది. అక్కడ ఫలానా ఫలానా అట. అదొక స్వర్గ్ధామం అట... లాంటి మాటల్తో అక్కడికి వెళ్లలేకపోయిన ‘అసంతృప్తి’ని ప్రేక్షకుడు తెరపై చూసి సంతృప్తిపడే అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేశాయి బాలీవుడ్ కథలు. అది కొన్నాళ్లు నడిచింది. ఏకంగా ‘వరల్డ్ టూర్’ లాంటి కథలూ బాలీవుడ్‌లోకి జొరబడి.. విదేశీ సంస్కృతిని
జనానికి పరిచయం చేసింది. ఈ ట్రెండ్ ఎంతవరకూ అంటే? భారతీయ సంస్కృతిని
ఆచార వ్యవహారాలను హైలైట్ చేస్తూ విదేశీ సంస్కృతిలోని
భేదాలను వెలువరించటం వరకే పరిమితమయ్యాయి.

ఇక బాలీవుడ్‌ని వదిలి టాలీవుడ్‌కి వద్దాం. కథ విదేశాల్లో కొద్దిగా నడవటం అన్నది బహుశా ‘ఆరాధన’ సినిమాతో మొదలై ఉండొచ్చు. విదేశాల్లో పై చదువుల నిమిత్తం వెళ్లిన హీరో.. ఆ తర్వాత గ్రుడ్డివాడై తిరిగిరావటం.. అన్నది కొద్దిగా విదేశీ టచ్‌ని కలిపినప్పటికీ.. సన్నివేశాలేవీ అక్కడికి వెళ్లకపోయినా.. వెళ్లాడన్న అనుభూతిని కలిగించి కొత్త సంస్కృతికి తెర తీశారు. అక్కడ్నుంచీ కేవలం విదేశాల నుంచీ హీరో రావటమో.. లేదా ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్లటం.. అరకొరగా చూపిస్తూ వచ్చారు.
అసలు సినిమాకి ఈ విదేశీ మోజు దేనికి? అన్న ప్రశ్న వేసుకొంటే.. పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. అక్కడి వాతావరణం.. అక్కడి జనం.. దొరసానుల అర్ధనగ్న సోయగాలూ.. శీతల గాలులు.. అడుగడుగునా కనిపించే విదేశీ హొయలు - ఇక్కడికి కొత్త కావటం. దీనికే ‘వెరైటీ’ అని పేరు పెట్టి.. కథ విదేశాలకు వెళ్లటం ఆరంభించింది.
అప్పటివరకూ అడపాదడపా ‘విదేశీ’ సన్నివేశాల్తో కథ నడిచినప్పటికీ.. జంధ్యాల ‘పడమటి సంధ్యారాగం’ ఓ కొత్త సంస్కృతికి తెర తీసింది. ఫుల్‌లెంగ్త్ స్టోరీ విదేశీ వాతావరణంలో పట్టాలెక్కింది. ‘్భరతీయ సంస్కృతి’ గొప్పతనాన్ని చెప్పుకోటానికి ఆ చిత్రం దోహదం చేసింది. ఐతే- ఆ తర్వాత అదే పంథాలో వచ్చిన ‘విదేశీ’ నేపథ్య సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. ఓ విధంగా- విదేశాల్లో చిత్రీకరణ జరుపుకొంటే.. ఆ సినిమా జనానికి అంతగా వొంటబట్టదన్న అపవాదును పుణికిపుచ్చుకుంది. ఈ సెంటిమెంట్ కారణంగానే సినిమా సక్సెస్ కాదేమోనన్న అనుమానం దర్శక నిర్మాతల్లో కలగటంతో కొన్నాళ్లు వెనుకబడ్డాయి.
సినిమాకి రిచ్‌నెస్ కావాలంటే.. క్లాసిక్ టచ్ కావాలంటే.. కథ ఎక్కడో అక్కడ ‘విదేశీ’ మార్క్‌ని సంతరించుకోవాల్సిందేనని ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చింత్తర్వాత.. ‘సంతోషం’ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా... పారేసుకొన్న ఆత్మీయానుబంధాలను వెలికితీసే ప్రయత్నం చేసింది విదేశీ టచ్‌తో. ఆక్కడ్నుంచీ సినీ కథలు మళ్లీ విదేశాలకు వెళ్లటం రావటం జరుగుతోంది.
విదేశీ వీధుల్ని ఏ ఒక్క పాటకో.. మరికొన్ని సన్నివేశాలకో.. నేపథ్యం వాడుకోవటం దేనికి? ఏకంగా స్వదేశీ విదేశాల్లో కథ నడిస్తే కథాగమనానికి వచ్చిన నష్టం ఏమిటి? అని ఆలోచించిన కథకుడికి ఆ ‘సూత్రం’ కచ్చితంగా దొరికినట్టయింది. కొన్నాళ్ల క్రితం వరకూ విదేశీ నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయటంలో మాత్రమే తలమునకలైన సినిమా.. ఆ వాతావరణాన్ని ప్రత్యేకించి పేర్కొనాల్సిన అవసరం లేకపోయింది. హాలీవుడ్ సినిమాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుండటంతో.. ఆ సంస్కృతిని తెలపాల్సింది లేదు. కాబట్టి.. కథనే అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మళ్లిస్తే అదో వెరైటీగా మారుతుందన్న ఆలోచన వచ్చింది. ఇకనేం? కావల్సినంత మెలోడ్రామా దొరికింది.
ఒక్కసారిగా.. ‘నిన్ను కోరి’ సినిమా వద్దకు జంప్ చేద్దాం. కథా నేపథ్యం అంతా ‘్ఫరిన్’తో ముడిపడి.. కేవలం ‘్ఫ్లష్‌బ్యాక్’కి మాత్రమే విశాఖ బీచ్‌కి వస్తుంది. ఎక్కడైనా ‘ప్రేమ’ వీచికలు ఒక్కటే. కాకపోతే.. రిచ్‌నెస్ కోసమో.. ఎన్‌ఆర్‌ఐ అల్లుణ్ణి తెచ్చుకోవాలన్న పిల్ల తండ్రి కోరిక - ఇలా చిక్కుముడుల వల్ల ‘నిన్ను కోరి’ కానె్సప్ట్ రెండు నేపథ్యాల్ని ‘టచ్’ చేసింది. దీంతో యూత్ ఆ కథని ‘ఓన్’ చేసుకొంది.
ఆ తర్వాత కొద్ది రోజులకు రిలీజైన ‘్ఫదా’ కూడా స్వదేశీ విదేశీ రూట్‌లో తిరుగుతూంటుంది. ఈ కథ ‘కనెక్ట్’ అవటానికి బోలెడన్ని కారణాలు. అక్కడి అబ్బాయి.. ఇక్కడి అమ్మాయిని ఇష్టపడటం.. ప్రేమించటం- కొన్ని సన్నివేశాల తర్వాత విరహం.. పెల్లుబికే ప్రేమ తాలూకు గాయాలూ.. వెరసి కచ్చితంగా ‘కనెక్ట్’ అయ్యే సీన్ ఇది. నేటి తరం సప్త సముద్రాలు దాటి.. ఎక్కడ డాలర్ల పంట పండిస్తున్నా.. పల్లె అమ్మాయి అంటే ఉన్న ఇష్టం అన్న కానె్సప్ట్ దీనికి కనెక్ట్ అయ్యేట్టు చేస్తుంది. పల్లె వాతావరణం మచ్చుకైనా ఎరగని వారికి.. పల్లె అందాలను, పిల్లతెమ్మెరల్ని పరిచయం చేస్తూ సాగిన ఈ కథ కాసేపు విదేశాల్లోనూ.. మరికాసేపు పల్లెటూళ్లోనూ సాగి.. దృశ్య కావ్యాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేసింది.
టోటల్‌గా.. ఇటీవల రిలీజైన ఈ రెండు సినిమాలు.. ‘విదేశాల్తో’ ప్రేక్షకులకున్న మోజునీ.. పల్లె నేపథ్యాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న ప్రేక్షకుడికి తీయటి కబురు చేర్చినట్టయింది. దీనికి కాస్త కమర్షియల్ మాట కలుపుదాం. ఇప్పుడు ఏ ప్రాంతం నుంచైనా.. విదేశాలకు వెళ్తున్న యువత సంఖ్య రాన్రాను పెరుగుతోంది. కనుక.. కథ రెండు పట్టాలపై నడిస్తే.. అంతకుమించిన బంపర్ ఆఫర్ మరొకటి ఉండదేమో?! తెలుగు గడ్డపై రిలీజైన రోజే.. విదేశీ మార్కెట్‌లోనూ తెలుగు సినిమా కనిపిస్తోంది. అక్కడి తెలుగువారిని కూడా ఆకట్టుకోవాలంటే.. ఇక్కడి ‘మాస్’ మసాలాతోపాటు.. అక్కడి ‘రిచ్’ టచ్ కూడా ఉండాలన్న తీవ్రాతి తీవ్రమైన ప్రక్రియను ఇటీవల చేపట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం వరకూ.. ఏ కాసిన్ని ‘విదేశీ’ నేపథ్య సన్నివేశాల్తో కాలం వెళ్లబుచ్చిన తెలుగు సినిమా.. ఏ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ముఠానో పరిచయం చేయటానికి మాత్రమే విదేశాల్ని వాడిన తెలుగు సినిమా.. ఫారిన్‌లో ఫ్లైట్ ఎక్కి.. సొంత గడ్డపై దిగి -పగ తీర్చుకోవాలనుకొనే తెలుగు సినిమా.. పాటలకో - ఫైట్‌లకో మాత్రమే విదేశీ వీధుల్ని వాడుకొన్న తెలుగు సినిమా - తన ట్రెండ్ మార్చుకొని.. మరిన్ని ఎన్‌ఆర్‌ఐ కథలకు తెర తీస్తుందేమో?!
ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తోందా? కమర్షియల్‌ని దృష్టిలో పెట్టుకొని కథ సాగుతోందా? కథకి రెండు వైపులా పదును ఉండేట్టు చూట్టానికి ఈ ‘విభిన్న’ నేపథ్యాల్ని ఎంచుకుంటోందా? కథ అనేది ఊహకీ, అనుభూతికీ అనుసంధానం. కథకి నేపథ్యం ఈ చిక్కుముడికి ఆధారం అవుతుంది. క్రైం కథ కావచ్చు. లవ్‌స్టోరీ కావచ్చు. సెంటిమెంట్ సెటిల్‌మెంట్ కావచ్చు. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు. కుటుంబ గాథ కావచ్చు. విభిన్న సంస్కృతుల మేలు కలయిక కథ కావచ్చు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ముఠా కథ కావచ్చు. వీటన్నింటిలో నవరసాలూ ఒలికించేందుకు ‘నేపథ్యం’ అవసరం. ఆ కథ ఆ దృష్టిలోనే ప్రేక్షకుడ్ని చేరుతుంది. కాబట్టి - కథకుడు ఈ కోణంలోంచి కథని చూట్టం మొదలెట్టాడు. ఇక నుంచీ.. కథలన్నీ - ఫారిన్ ట్రిప్ వేసుకొని రావచ్చు. లేదా అక్కడ్నుంచీ ఇక్కడికి రావచ్చు. ఈ ట్రెండ్‌నీ ఆస్వాదిద్దాం.

-బిఎనే్క