మెయిన్ ఫీచర్

ఐదుగురి పోరాటం.. కోట్లమందికి ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం సంప్రదాయమైన ముమ్మారు ‘తలాక్’ విధానం ఇక చెల్లదు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది. అయితే ఈ అంశంపై ఎన్నో వివాదాలు, విమర్శలు, సమస్యలు, కష్టాలు ఎదురైనప్పటికీ అలుపెరగని పోరాటం చేసిన ఐదుగురు బాధిత ముస్లిం మహిళల పోరాటం వల్ల కోట్లాది మంది బాధితులకు న్యాయం దక్కినట్లయింది.
భవిష్యత్‌పై భరోసా ఏర్పడింది. నోటిమాటగా, ఏకపక్షంగా విడాకుల ఇచ్చే సంప్రదాయానికి వారి పోరాటం అడ్డుకట్ట వేసినట్లే. సుప్రీం సంచలన తీర్పునకు కారణమైన బాధిత ముస్లిం మహిళలు ఎవరు, వారి పోరాటం ఎలా సాగిందో తెలుసుకుందాం. వారితోపాటు ది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనే స్వస్ఛంద సంస్థ కూడా తలాక్ విధానంపై అత్యున్నత న్యాయస్థానంలో పోరాడింది. ఈ కేసులన్నింటిని కలపి ధర్మాసనం విచారణ జరిపి తీర్పు ఇచ్చింది.

సైరాబానొ

ముమ్మార్ తలాక్ బాధితురాలు. తలాక్, నిఖాహలాలా విధానాల్లో విడాకుల మంజూరు విధానంపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి మహిళ. ఉత్తరాఖండ్‌లోని ఉధంసింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్‌కు చెందిన సైరాబానొ అలహాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రిజ్వాన్ అహ్మద్‌ను 2002లో వివాహం చేసుకుంది. సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమెకు 14 ఏళ్ల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భర్త ‘తలక్‌నామా’ ఇవ్వడంతో ఆమె సుంప్రీంకోర్టును ఆశ్రయించింది. పిల్లలు కలగకుండా బలవంతంగా తన భర్త మాత్రలు వేసేవారని, అది తన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని ఆమె ఆరోపించింది. ఏకపక్షంగా, అకారణంగా తలాక్ ఇవ్వడం సరికాదని వాదించింది.
భర్తనుంచి విడాకులు పొందిన మహిళ మరొకరిని వివాహం చేసుకుని, కొంతకాలం తరువాత మళ్లీ మొదటి భర్తతో ఉండటానికి సంబంధించిన పొలిగమి, నిఖాహలాల విధానాలు రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆమె వాదించింది.

ఇష్రాత్ జహాన్

ముస్లిం సంప్రదాయంలో ‘తలాక్’ విధానం ద్వారా వివాహబంధాన్ని తెంచేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. తలాక్‌కు రాజ్యాంగపరమైన విలువలేదని ఆమె పోరాడింది. దుబాయ్‌లో ఉండే భర్త ఫోన్‌లో మూడుసార్లు ‘తలాక్’ చెప్పి వివాహాన్ని రద్దు చేసుకోవడంతో నలుగురు పిల్లల తల్లయిన ఇష్రాత్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ (1937) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఆ చట్టం భంగం కలిగిస్తోందని ఆమె పిటిషన్‌లో పేర్కొంది.
అత్తవారి ఇంటి నుంచి తనను బలవంతంగా వెళ్లగొట్టేందుకు భర్త, అతడి తరపు బంధువులు పదేపదే ప్రయత్నించారన్నది ఆమె ఆరోపణ. తన నలుగురు పిల్లలను వారు బలవంతంగా తీసుకువెళ్లారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. వెస్ట్‌బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఇష్రాత్‌తో పదిహేనేళ్లు కాపురం చేసిన తరువాత భర్త దుబాయ్ నుంచి ఫోన్‌లో ముమ్మారు తలాక్ చెప్పి వదిలించేసుకోవడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరో మహిళను తన భర్త వివాహం చేసుకున్నాడని, తన పిల్లలను తిరిగి ఇవ్వాలని, తనకు భరణం ఇచ్చేలా చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. ‘నాకు న్యాయం కావాలి, ఈ విడాకులను నేను అంగీకరించను, కడదాకా పోరాటం చేస్తాను’ అంటూ సుంప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఫరాఫైజ్
సుప్రీంకోర్టులో న్యాయవాది. ముమ్మారు తలాక్‌పై పిటిషనర్లలో ఈమె ఒకరు. ‘తలాక్-ఇ-బిదత్’ (త్రిపుల్ తలాక్) ముస్లింల పవిత్ర గ్రంథమైన ‘ఖురాన్’లో విడాకులకు సంబంధించిన విధానంగా లేదని ఆమె వాదించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం మహిళలకు సమాన న్యాయం కోసం ఓ లాభాపేక్ష లేని సంస్థను ఫరా నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ రాష్టవ్రాది ముస్లిం మహిళ సంఘ్‌కు ఆమె గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ‘పవిత్ర ఖురాన్ ఓ సలహా కాదు. అనుసరించాల్సిన విషయం. వివాహానికి ఒక విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు విడాకుల కోసం తలాక్ చెప్పడం కాకుండా ఓ విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు’ అన్నది ఆమె వాదన. ముస్లిం మతపెద్దలు సొంతంగా, సమాంతర న్యాయవ్యవస్థను నడుపుతున్నారు. చిన్న, పెద్ద కోర్టుల తరహాలో వివాదాలు పరిష్కరిస్తున్నారు. చట్టబద్ధమైన న్యాయస్థానాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నది ఆమె ఆరోపణ. ‘షరియత్ చట్టం ముస్లిం మహిళలకు రక్షణ కల్పిస్తుంది. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచించిన త్రిపుల్ తలాక్ విధానం ఖురాన్‌లో లేనేలేదు. అసలు ఆ బోర్డుకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయపరమైన హక్కు కూడా లేదు. ముస్లింలను, భారత ప్రభుత్వాన్ని ఈ బోర్డు దశాబ్దాలుగా తప్పుదోవపట్టిస్తోంది‘ అని ఆమె ఆరోపణ.

గుల్షన్ పర్వీన్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన గుల్షన్ పర్వీన్ కూడా తలాక్ బాధితురాలే. 2013లో ఆమెకు వివాహం కాకా భర్త తలాక్‌నామా పంపడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పుట్టింట్లో ఉండగా భర్త పది రూపాయల స్టాంప్ పేపర్‌పై తలాక్‌నామా పంపగా ఆమె తిరస్కరించింది.
దాంతో అతడు రామ్‌పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశాడు. దీనిపై ఆమె పోరాడింది. భర్త తనను చాలాసార్లు ఐరన్‌రాడ్‌తో కొట్టి హింసించేవాడని ఆరోపించింది. ‘ఓ రోజు వచ్చి తలాక్ చెప్పడంతో నేను, నా రెండేళ్ల కొడుకు వీధినపడ్డాం, చెప్పడానికేముంది’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేసేది. చివరకు సుప్రీంకోర్టులో న్యాయం దక్కింది.

అఫ్రీన్ రెహ్మాన్
జైపూర్‌కు చెందిన 25 సంవత్సరాల అఫ్రీన్ రెహ్మాన్ స్పీడ్‌పోస్ట్ ద్వారా భర్త నుంచి తలాక్‌నామా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాట్రిమోనియల్ పోర్టల్ ద్వారా పెళ్లి కుదిరి 2014లో ఇండోర్‌కు చెందిన సయ్యద్ అష్షార్ అలి వర్సిను వివాహం చేసుకుంది. రెండుమూడు నెలల తరువాత మానసికంగా వేధిస్తూ భర్త కట్నం కోరేవాడని, చివరకు 2016 జనవరి 27న తలాక్‌నామా పంపాడని ఆమె ఫిర్యాదు చేసింది. అత్తింటివారు కూడా తనను కట్నం కోసం వేధించేవారని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా బోర్డును తాను వ్యతిరేకించనని, కాని, కాలంతోపాటు వారు కూడా మారాల్సి ఉందని ఆమె వాదించింది.

అతియా సబ్రి

2012లో వివాహమైన అతియాసబ్రికి భర్త చిన్న తెల్లకాగితంపై తలాక్‌నామా రాసి విడాకులు తీసుకున్నాడు. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా ఉన్నఫళాన వదిలేయడం సరికాదని, తన కుమార్తెను ఎలా పోషించుకుంటానని ఆమె ప్రశ్నించింది. ఈ జనవరిలో పిటిషన్ వేసింది. సైరాబానో కేసుతోపాటు ఇవన్నీ విచారణకు వచ్చాయి.

- రవళి