మెయన్ ఫీచర్

మన నదులకు తిరిగి నడక నేర్పాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ నిర్మితాలైన గుళ్లు, గోపురాలు, కోటలు, భవంతులు.. చివరికి సమాధులను సైతం రక్షితప్రాంతాలుగా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో అడవులను అభయారణ్యాలంటూ- వాటిని రక్షించాలని సూచిక బోర్డుల్ని పెడుతున్నది. ఈ విధంగా గుర్తించబడిన కట్టడాలకు నిఘా, రక్షణ కల్పిస్తూ, వాటిని పరిరక్షించేందుకు నిధుల్ని కూడా కేటాయిస్తున్నది. నిజానికి ఈ కట్టడాలేవీ ప్రజల అవసరాల కోసం నిర్మించినవి కావు. ఓ వర్గ ప్రయోజనాలకై, రాచరిక పోకడల చిహ్నాలకై వారి అభిరుచి మేరకు ప్రజల శ్రమచే ఆయా కాలాల్లో నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలు నాటి రాచరికపు ఆనవాళ్లుగా వెలుగొందుతునే వున్నాయి. వీటికున్న చరిత్ర మనదేశంలో రమారమి వెయ్యి సంవత్సరాలు కూడా కాదు.
కానీ, మానవుడు పుట్టకముందే- పుట్టి మనుగడ సాగించక ముందే భూమి, తర్వాత నీరు (రెండు వాయువుల కలయిక) ఏర్పడిన క్రమంలో ఉష్ణోగ్రతలో మార్పులతో రుతువులు ఏర్పడడం, వర్షాలు కురియడంతో నదులు పుట్టుకకు కారణమైంది. దీంతోపాటే జీవ పదార్థం పరిణామం చెంది ఆధునిక మానవుడిని ఎదిగించింది. ఈ విధంగా ఏర్పడిన నదులతో మానవుడు నాగరికతను నేర్చుకున్నాడు. భూమి పుట్టుకను అంచనా వేయగలము కానీ ఓ నది కచ్చితంగా ఎప్పుడు జన్మించింది, ఏ ప్రాంతంలో జనించింది అనే విషయాలను అంచనా వేయడం కష్టం. భూమిలోపల, భూమిపైన జరిగే మార్పులతో నదుల పుట్టుక, గమనాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి!
సంచార జీవిగా వున్న ఆదిమానవుడు ఆహారపు వేటనుంచి, ఆహారపు ఉత్పత్తి వైపుదృష్టి సారించిన క్రమంలోనే స్థిర ఆవాసాలకు బీజాలు పడ్డాయి. ఈ ఆవాసాలన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. అలా వెలిసిన ఆవాసాలే నేటి మహానగరాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవే ఇపుడు మురికి కూపాలుగా, భయంకరమైన కలుషిత ప్రాంతాలుగా ఎదిగాయి. లండన్ కావచ్చు, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై, హైదరాబాద్ కావచ్చు! టిఎస్ ఇలియట్ మాటల్లో చెప్పాలంటే ప్రస్తుతం ఇవన్నీ సర్వ పాపాలకు నిలయాలుగా, పనికిరానివిగా మారిపోయాయి. ఈ విధంగా తన ఉనికిని కాపాడుకోవడానికై నదుల ఉనికికే మానవుడు ప్రమాదకారిగా మారాడు. వాటిని కలుషితం చేయడమే కాదు, ధ్వంసం చేసి స్వార్థానికి వాడుకుంటున్నాడు. తాను మాత్రమే నదులకు, ప్రకృతి సంపదకు కర్త,కర్మ,క్రియ అని భావిస్తూ దోచుకోవడం, కొల్లగొట్టడం, అనుభవించడం హక్కుగా భావిస్తూ సంకుచితంగా, స్వార్థబుద్ధితో ఆలోచిస్తున్నాడు. మానవుడికే కాకుండా మిగతా జీవులకు ఆలవాలంగా, ఆవాసం వుంటున్న ‘నది’ తెరమరుగు కాబోతున్నది. పుట్టిన స్థానం నుంచి సముద్రంలోకి కలిసే గమ్యస్థానం చేరుకోలేని నదుల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్నాయి.
పశ్చిమ కనుమల్లో పుట్టిన కావేరీ నది కర్నాటక, తమిళనాడుల్లో 802 కి.మీ ప్రయాణించి రెండు రాష్ట్రాల వ్యవసాయానికి జీవనాధారానికి మారింది. ఈ నది గత సంవత్సరం వర్షాలు లేక అనేక ప్రాంతాల్లో ఎండిపోయి సముద్రానికి 170 కిమీ దూరానే్న ఆగిపోయింది. మనదేశంలో అత్యంత పొడవైన గంగానది జీవనదిగా పేరొందినా ఒకప్పటి ప్రాశస్త్యాన్ని కోల్పోతున్నది. గత ఏడాది ప్రయాగ వద్ద పూర్తిగా ఎండిపోయింది. క్షీణతకు గురవుతున్న నదుల్లో గంగానది ముందు వరసలో వుండడం గమనించాలి. అలాగే దక్షిణాది గంగగా పేరొందిన రెండో అతి పొడవైన గోదావరి గత సంవత్సరం జూన్ జూలైలో వరదలతో నిండింది. కానీ రెండు నెలల తర్వాత వచ్చిన కుంభమేళా సందర్భంగా నాసిక్‌లో నీరే లేకపోవడంతో పంపులతో నింపాల్సి వచ్చింది. ఇలా యమున, నర్మద, కృష్ణ, మహానది, తపతి తదితర నదులన్నీ గత స్మృతులుగానే మిగిలిపోతున్నాయి. నేడంతా శ్మశాన వైరాగ్యమే! ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో వృక్షాల నరికివేత, క్షీణత హిమాలయ రేంజిలో 78 శాతం (గంగా), మైదాన ప్రాంత నదుల్లో అత్యధికంగా 97 శాతం (కృష్ణా) నదులు ఎదుర్కొంటున్నాయి. నదుల్ని స్ర్తిలతో పోల్చి, పేర్లు పెట్టి (బ్రహ్మపుత్ర) తప్ప ఆరాధించే సంస్కృతి ఒక్క భారతదేశానికే పరిమితం కాగా, అత్యధికంగా నిరాదరణకు అపరిశుభ్రతకు, కలుషితాలకు గురవుతున్న నదులు కూడా మనవే! నమ్మకాల పేరున, కుంభమేళాల పేరున, పుష్కరాల పేరున, మొక్కుల పేరున నదుల్లో వదిలే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త, ఇతర రసాయనాలు అంతా ఇంతా కాదు. చివరికి నదిని ఆవాసంగా చేసుకుని నివాసం ఉండే జీవరాశులు చనిపోవడం, గట్టుకు చేరి మానవులచే చంపబడడం జరుగుతున్నది. ప్రపంచంలో అత్యంత పొడవైన నైలునది దక్షిణాఫ్రికాలోని ఏడు అరబ్ దేశాల గుండా పారుతోంది. జన్మ స్థానం నుంచి సముద్రంలో కలిసేదాకా ఏప్రాంతంలోనైనా దోసిళ్లతో నీరు కడుపారా తాగవచ్చు! మనలాగ ప్రపంచంలో వేరెవరూ నదులను ఆరాధించరు. కాని ప్రకృతి సంపదగా, రక్షిత ప్రాంతంగా ప్రేమిస్తారు. బాధ్యతతో మసలుకుంటారు.
ఈమధ్యన కొత్తగా నిర్మిస్తున్న ఏపి రాజధాని అమరావతి వద్ద కృష్ణానది పరిసర ప్రాంతాల ధ్వంసాన్ని కళ్లారా చూసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదా పొడవునా కనీసం 15 శాతం నీటి ప్రవాహంతో నదులు సజీవంగా వుండేలా చూడాలని వారు చేసిన హెచ్చరికలు మన నేతలకు ఇప్పుడన్నా చెవికెక్కితే బాగుంటుంది. రాజకీయ లబ్ధికోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి చేయాల్సిన దుర్మార్గాలన్నింటినీ చేసి పెట్టే రాజకీయ వ్యవస్థ మనది. ఇసుక మేటలు తప్ప ఒక్క అడుగు లోతు కూడా నదిని తవ్వకూడదన్న నిబంధనలు, ఆ ఇసుకను స్థానిక అవసరాలకే వాడాలి గానీ దూర ప్రాంతాలకు వ్యాపారం కోసం తరలించరాదన్న సూత్రీకరణను ప్రభుత్వాలే ఉల్లంఘిస్తున్నాయి. నేడు దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు ఇసుక మాఫియాగా అవతారమెత్తి రియల్ ఎస్టేట్ రంగాన్ని అత్యవసర అభివృద్ధిగా చూపుతూ నదుల గర్భంలోని ఇసుకతోపాటు పరివాహక ప్రాంతాల ఉపనదుల ఇసుకను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో సిరిసిల్ల దగ్గర నేరెళ్లలో ఇసుక మాఫియా దారుణం గురించి అందరికీ తెలిసిందే! పాలకులు ఆంధ్రావారా? తెలంగాణ వారా? అనేది కాదు-దోపిడీ, దౌర్జన్యం అందరిదీ ఒకటేనని గుర్తించాలి.
నేటి రాజకీయాలు ఖనిజ సంపద చుట్టూ, అటవీ ప్రాంతాల చుట్టూ, నదుల చుట్టూ తిరుగుతున్నాయి. వీటిని కొల్లగొట్టే కాంట్రాక్టర్లకు రక్షణ కల్పించడానికే రాజకీయ పార్టీల నేతలు పాలకులుగా అవతారమెత్తుతున్నారు. గత 30 సంవత్సరాలుగా నర్మదా బచావో ఆందోళన చేస్తున్న మేధాపాట్కర్, ప్రజల్ని ముఖ్యంగా అశేష గిరిజన ఆవాస ప్రాంతాల్ని నీటముంచుతూ ప్రకృతి ధ్వంస రచనకు పూనుకుంటూ, ఇవే అభివృద్ధి నమూనాలంటూ వినిపిస్తున్న మాటలు అన్ని ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అన్వయిస్తాయి. అభిప్రాయ సేకరణ పేరున పోలీసుల్ని ముందు వరసలోపెట్టి ప్రాజెక్టులకు ప్రజలు సుముఖంగా వున్నారంటూ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడుతున్నారని దశాబ్దాల కాలంగా మేధావులు విమర్శిస్తునే వున్నారు. గత నెల 22న కాళేశ్వరం మెగా ప్రాజెక్టు నిర్మాణానికై నాలుగు జిల్లాల్లో సేకరించిన అభిప్రాయ సేకరణ ఈ తీరుగానే జరగడం తెలిసిందే! రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్‌ఐ) తయారుచేసిన నివేదిక ప్రభుత్వానికే అనుకూలం వుండడం గమనార్హం. పర్యావరణ, అటవీ జల వనరుల సంస్థల నిబంధనల మేరకు ప్రాజెక్టును చేపట్టవచ్చని చెప్పడంలోని దురుద్దేశం అర్థం చేసుకోవాలి. దేశంలో నిర్మించబడ్డ ఏ ప్రాజెక్టు ఈ నిబంధనల మేరకు నిర్మించలేదన్నది నగ్న సత్యం. 1527 గ్రామాల ఉనికికి ప్రమాదంగా మారనున్న ఈ ప్రాజెక్టుకు నర్మగర్భితంగా నివేదికల్ని రూపొందించి ప్రభుత్వాలకు ఉప్పందించడం ఓ రివాజుగా మారింది. ఓవైపు 46 వేలకు పైగా చెరువుల్ని కాకతీయ మిషన్ కింద పునర్జీవనం చేస్తున్నామంటూ, చెరువులు పూర్వస్థితికి చేరుకుంటే నీటి కొరత తీరుతుందని చెబుతూ మరోవైపుకాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తేవడంలోని ఆంతర్యం ఆలోచనాపరులే గుర్తించలేకపోవడం శోచనీయం. రమారమి 700 నుంచి 1500 మి.మీ వర్షపాతం గల దక్కన్ పీఠభూమిలో అలనాడు నైజాం ప్రభువులే ఈ చెరువుల్ని తవ్వించి జల భిక్షపెట్టారు. ఈ చెరువుల్లో సగానికి సగం కనుమరుగయ్యాయనేది వేరే విషయం!
ఈమధ్యన ప్రధాని మోదీ నదుల సంధానం అనే ప్రకృతి వ్యతిరేక సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. ఇలాంటి మెగా ప్రాజెక్టులు సుదీర్ఘకాలంలో పూర్తికావుకాబట్టి (సర్దార్ సరోవర్ 1980లో ప్రారంభమైనా నేటికీ పూర్తికాలేదు. మోదీ ప్రధానమంత్రి కాగానే దీని ఎత్తును మరో 17మీటర్లకు నిబంధనలకు వ్యతిరేకంగా పెంచారు.) వీటిని పూర్తి చేయాలనే నెపంతో పదే పదే ఎన్నికల్లో గెలవాలనేది వీరి ఆంతర్యం! నిజానికి నది ఏ పరివాహక ప్రాంతానికి చెందిందో ఆ ప్రాంతానికే హక్కుగా వుంటుంది. దాని నిర్మితం (కెమిస్ట్రీ) అలాగే వుంటుంది. అందుకు భిన్నంగా నదుల గమనాల్ని మారిస్తే జల ప్రళయాలు రావడం తథ్యం! గత ఏడాది ఉత్తరాఖండ్, కాశ్మీర్ విపత్తులే ఇందుకు చక్కని ఉదాహరణ!
నదులకు పరీవాహక ప్రాంతం, జీవావరణ, పర్యావరణ వ్యవస్థలుంటాయి. ఇవన్నీ ప్రకృతి జనితాలు, నదులకు ప్రాణాలు, ఆస్తిపాస్తులు. వీటిలో ఏ వ్యవస్థ దెబ్బతిన్నా, ధ్వంసమైనా నది ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం, ఆక్రమణ, అటవీ సంపద క్షీణత జరిగిపోయింది. దాదాపు అన్ని నదులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అవసరానికి మించిన నీటిని పలురకాలుగా వినియోగిస్తున్నారు. చివరికి మహానగరాల దాహార్తికి మహానదుల్నే మరలించాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కోవలోనిదే. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం తీవ్రంగా దెబ్బ తింటుంది. ఇప్పటికే కుంటుపడిన వ్యవసాయం మరింతగా దిగజారితే- విధిగా దిగుమతులను చేసుకుంటూ ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నదులను కాపాడుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారాలు లభించవు. ఇందుకై నదుల పరిరక్షణ ఉద్యమాలు రావాలి. చారిత్రక కట్టడాల్లాగానే నదులన్నీ, పరీవాహక ప్రాంతాలతో పాటు ప్రకృతి సంరక్షిత ప్రాంతాలను, కలుషిత నిషేధిత ప్రాంతాలను ప్రకటించాలి. మెగా ప్రాజెక్టుల నిర్మాణాలను తక్షణం ఆపివేయాలి. నిపుణుల సూచనల మేరకు బ్యారేజీల నిర్మాణం, నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణయించిన ఎత్తులోనే జరగాలి. ఈ నిర్మాణాలు కూడా నదికి ఇరువైపులా దాదాపు 5 కి.మీ పరిధిలో అటవీ సంపద, జీవ సంపద దెబ్బ తినకుండా చూడాలి. ఇప్పటికే ఆక్రమణలకు గురైన నదుల ఆవాస ప్రాంతాలను తిరిగి నదులకు హక్కుగా సంక్రమింపచేయాలి. పట్టణాల కాలుష్యాన్ని, నదుల్లోకి విడులవుతున్న వ్యర్థాలను, రసాయనాలను నియంత్రించి వడపోసిన తర్వాతనే వదలాలి. నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కొత్త నిర్మాణాలకు, ఆవాసాలకు, చివరికి వ్యవసాయానికి కూడా అనుమతి ఇవ్వరాదు. నది కేవలం మానవుడి హక్కు మాత్రమే కాదని, సకల జీవకోటి ప్రాణాధారమని గుర్తించాలి. చెట్లను విరివిగా పెంచి నేల కోతను అరికట్టి ఇసుక మేటలు వేయకుండా చూడాలి. పేరుకున్న ఇసుక మేటలను స్థానికంగానే వినియోగించేలా చూడాలి. అటవీ సంపద ధ్వంస రచనకై నదులపై ఇష్టం వచ్చినట్టుగా వంతెనలను నిర్మించరాదు. ప్రజల రాకపోకలు పడవలపై సాగేలా చూడాలి.
ముఖ్యంగా నదులు పూజనీయ స్థలాలనే నమ్మకాల్ని అతిగా ప్రచారం చేయకుండా, అవి రక్షిత ప్రాంతాలని, బాధ్యతతో వాటిని ప్రకృతి సంపదగా ఆరాధించాలని, ఎలాంటి క్రతువుల్ని చేయకూడదనే చైతన్యాన్ని ప్రజల్లో పెంచాలి. అప్పుడే నదులు మరో యుగానికి, మరికొన్ని తరాలకు వారసత్వంగా, జీవనాధారంగా వుంటాయి.
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162