మెయిన్ ఫీచర్

ఒక్కేసి పువ్వేసి చందమామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. గౌరమ్మగా
మహిళలంతా కొలిచే పూల పండుగ రానే వచ్చింది. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బహుళ భాద్రపద అమావాస్య నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ గడ్డమీద ప్రకృతిని పూలతో ఆరాధించే పండుగ బతుకమ్మ. తరతరాల నుంచి తెలంగాణ ప్రజల జీవితంలో మమేకమైంది. తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్ర పండుగ అయంది.
మహిళల్లో భక్తి నింపి, ఆటపాటలతో అలరించే దీనిని ‘బొద్దెమ్మ పండుగ’ అని కూడా పిలుస్తారు. యువతులు, ఇంటి ఆడపడుచులు, తాము కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని జరుపుకుంటారు. బతుకమ్మలను చేసి జగన్మాతను పూజించిన ఇంట అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. సామాజిక ఐక్యతకు బాట వేస్తూ.. ఊరిలోని మహిళలంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా ఆడతారు. పేద, ధనిక అనే భావన లేకుండా అందరూ కలిసి అందరం ఒక్కటేనన్న భావన కన్పిస్తుంది ఆరోగ్యం, ఆధ్యాత్మిక భావం కూడా దాగున్నదని పెద్దలు అంటారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలు తమ మనోభావాలను పాటల రూపంలో వెల్లడిస్తారు. పల్లె పాట ప్రతినోటా ప్రతిబింబిస్తుంది.

నవ వైవిధ్యాలు, నైవేద్యాలు

బతుకమ్మ వేడుకల్లో మొదటిరోజును ‘ఎంగిలిపూల’ బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను పేర్చి అమ్మవారికి నువ్వులు, నూకలను నైవేద్యంగా అర్పిస్తారు.
రెండో రోజు అటుకుల బతుకమ్మ- రెండోరోజు అటుకుల బతుకమ్మలో భాగంగా అమ్మవారికి చప్పిడి పప్పు, బెల్లం, అటుకులను జగన్మాతకు నైవేద్యంగా చేసి పెడతారు.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ- మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నిర్వహించి అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లం వంటకాలను ప్రసాదంగా చేసి పెడతారు.
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ- నాలుగో రోజు నానబెట్టిన బియ్యం బతుకమ్మగా పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యం నైవేద్యంగా ఇస్తారు.
అయిదోరోజు అట్ల బతుకమ్మ- ఐదో రోజు అట్ల బతుకమ్మగా ఉప్పుడు బియ్యం, అట్లను జననీ విశ్వమాతకు నైవేద్యంగా పెడతారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ- ఆరో రోజును అలిగిన బతుకమ్మగా నిర్వహిస్తారు. అమ్మవారు అలిగిందని ఆడపడచులు భావించి బతుకమ్మను పేర్చి ఆట ఆడతారు. ఎలాంటి నైవేద్యం పెట్టరు.
ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ:ఏడో రోజు వేపకాయల బతుకమ్మలో సకినాల పిండిని వేపకాయలుగా చేసి పెడతారు.
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ- ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మలో నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో ఫలహారం అమ్మవారికి నైవేద్యంగా ప్రదర్శిస్తారు.
సద్దుల బతుకమ్మ
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ- తొమ్మిదో రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మగా చేస్తారు. ఈ సందర్భంగా అయిదు రకాల నైవేద్యాలు, పెరుగన్నం, కొబ్బెర, నువ్వులు, పులిహోర, నిమ్మకాయలతో చేసిన వంటకాలను గోధుమ రొట్టెలు, బెల్లం కలిపి మలీజాగా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సద్దులు అంటేనే పిండి పదార్థాలతో బతుకమ్మకు సమర్పించే నైవేద్యం. పెసలు, మక్కలు, నువ్వులు మొదలైన వాటిని వేయించి పొడి చేసి దాంట్లో బెల్లంగానీ, చక్కెరగానీ కలిపి మంచి నెయ్యితో కలిపి ముద్దలుగా కడతారు. ఈ ముద్దలనే సద్దులు అంటారు. సద్దులు నైవేద్యంగా పెట్టడంవలన సద్దుల బతుకమ్మగా పిలుస్తారు.
బతుకమ్మ పండగ నేపథ్యం
గౌరీదేవి మహిషాసురుని వధించి, అలసిపోయి అశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు స్పృహ కోల్పోతుంది. ఆమె స్పృహ నుంచి కోలుకోవడానికి స్ర్తిలందరూ దేవిని బతుకమ్మ బతుకమ్మా అని పాటల రూపంలో వేడుకున్నారట. దశమిరోజు దేవి తేరుకుంటుందట. దేవి పునర్జీవించినందున ఆమెను బతుకమ్మగా కొలుస్తున్నారు. ఆమె స్పృహ కోల్పోయిన తొమ్మిది రోజులు ఆమెను స్మరిస్తూ పండుగ చేసుకోవడం ఆచారంగా వచ్చింది.
శ్రీలక్ష్మీయే బతుకమ్మగా జన్మించిన కథ
ధర్మాంగదుడనే రాజు చోళదేశాన్ని పాలించేవాడు. అతడి భార్య పేరు సత్యవతి. వారికి వందమంది కుమారులు కలిగినా పుత్రశోకం తప్పలేదు. వారిరువురూ లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. వారి కోరికను మన్నించి లక్ష్మీదేవి వారి కుమార్తెగా అమావాస్యనాడు జన్మించింది (అందుకే బతుకమ్మను) అమావాస్యనుంచే మొదలుపెడతారని చెబుతారు. ఆ శిశువును చూచి దేవతలు, మునిపుంగవులు చల్లగా బతుకమని దీవిస్తారు. అందుకే ఆమె బతుకమ్మ అయ్యింది. శ్రీమహావిష్ణువు చక్రాంగదుడనే పేరుతో రాజు వేషంలో వచ్చి బతుకమ్మను పెళ్లాడుతాడు. వారిద్దరూ సిరిసంపదలతో, సుఖాలతో వెలుగొందుతారు. శ్రీలక్ష్మీదేవి బతుకమ్మగా జన్మించి శాశ్వతమైన కీర్తిని పొందినందున ఆమెను దేవకన్యలు, మహిళలు పూజిస్తూ వస్తున్నారు. నాటినుంచి నేటివరకూ 9 రోజులపాటు బతుకమ్మను పండుగగా చేసుకుంటున్నారు. బతుకమ్మ అంటే మహాదుర్గ, మహాలక్ష్మి, మహా సరస్వతికి ప్రతిరూపం.
ఇంకొక కథనం ప్రకారం కాకతీయ వంశస్థురాలైన రుద్రమదేవి కాలంలో సామంతులు ఆమె సామ్రాజ్యంపై దండెత్తగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక దశలో శత్రువులు ఆమెను వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించగా ఒక స్ర్తి ఆమెకు అడ్డుగా నిలిచి, ఆమెను కాపాడి తన ప్రాణాలు కోల్పోయిందనీ, రాణిని బతికించినందున ఆమెను బతుకమ్మగా కొలుస్తూ, ఆమె పేరుమీదే ఈ పండుగ చేస్తూ ఉండవచ్చని చరిత్రకారుల భావన.

పూలన్నీ పూజకే..

బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ఈ కాలంలో చెరువుల్లో, అన్ని చోట్లా జలం సమృద్ధిగా ఉంటుంది. బతుకమ్మకు అలంకరించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా దేవుళ్లను పూలతో పూజిస్తాం. పుష్పాలతో అలంకరిస్తాం. కానీ ఆ పూలనే దేవతగా పూజించడం విలక్షణమన ఆనవాయితీ. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది. కేరళలో ఓనం ఎలాగో తెలంగాణలో బతుకమ్మ అలాగ. ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ వైశిష్ట్యానికి నిదర్శనం. పసుపుపచ్చ రంగులో తంగేడుపువ్వు శుభాలకు సూచిక. ఎర్రగా ఉండే గోరింట, ఎర్రకట్లపూలు ప్రేమానురాగాలకు చిహ్నం. తెలుపు రంగులో ఉండే గునుగుపూలు శాంతిని చాటి చెప్తాయి. ఆకుపచ్చగా ఉండే గుమ్మడి, దోస ఆకులు సస్యశ్యామలానికి నిదర్శనం. వీటికి తోడు సప్తవర్ణాల శోభను చేకూర్చడానికి బంతి, చామంతి, తామర, టేకు, ఎర్రకట్ల, తెల్ల, నల్లకట్ల పువ్వులు బతుకమ్మ అలంకారానికి వాడతారు.

బతుకమ్మను పేర్చడంలో కళారాధన

బతుకమ్మను పేర్చడం ఒక కళ. ఇందులో స్ర్తిల విశ్వాసం, సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం, కళాత్మక దృష్టి కన్పిస్తుంది. మొదట ఒక పళ్ళెంపై గుమ్మడి ఆకులను పరుస్తారు. వాటి క్రింద నూలు దారాలను ‘ప్లస్’ ఆకారంలో రెండు వరుసల్లో వేస్తారు. గోపులాకారంలో పేర్చిన బతుకమ్మ పూలు జారిపోకుండా ఈ దారాలను ఆధారంగా కడతారు. మొదటివరుసలో తంగేడుపూలు పెడతారు. తుంచిన పూల కాడలను, ఆకులను మధ్యలో వేస్తారు. సాధారణంగా ప్రతి రెండో వరుస గునుకు, తంగేడు పూలదే వుంటుంది. గునుగుపూలు తెలుపురంగులో వుండి పైన జుట్టు గులాబీ రంగులో వుంటాయి. ఒక వరుసలో తంగేడు, ఇంకొక వరుస గునుగు పూలను మూడు, నాలుగు వరుసలలో గోపులాకారంగా పేరుస్తారు. ఆ తర్వాత వరుసలలో బంతి, చామంతి, గనే్నరు తదితర పూలు పేరుస్తారు. పైన తమలపాకుపై శంఖం ఆకారంలో పసుపుముద్దను బెట్టి గొబ్బెమ్మగా పూజిస్తారు. పసుపు ముద్దకు కుంకుమ బొట్టు పెడతారు. అగరుబత్తులు ముట్టించి బతుకమ్మ చివరి అలంకరణ పూర్తిచేస్తారు.

గౌరమ్మ మెరిసే.. గంగమ్మ మురిసే

బతుకమ్మ ఆడే మహిళల సంఖ్య పెరుగుతూనే వుంది. పిల్లా పాపలూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. స్ర్తిలలో ఐకమత్యభావం కూడా కన్పిస్తుంది. ఈ పండుగలో. వర్షాలు వచ్చి ఆగిపోయేకాలం. చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆ నీటిని శుద్ధి చేయాల్సిన సమయం కూడా ఇదే. బతుకమ్మ పండుగలో వాడిన పువ్వులు, ఆకులు నీటిశుద్ధికి తోడ్పడుతాయి. ప్రకృతిని ప్రేమించి పూజిస్తే ఆరోగ్యంతోపాటు ఆనందం కూడా పొందవచ్చు. ఇతర పండుగలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపమే ఆమె. ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి, ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది.

-కె.రామ్మోహనరావు