మెయన్ ఫీచర్

న్యాయ విలంబనం...బ్రిటిష్ వారసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీస్తుశకం 1980వ దశకంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన పునరావాసపు చట్టం గురించి ఇప్పుడందరూ మరచిపోయారు. ఈ చట్టం అమలు జరుగలేదు. రద్దుకూడ కాలేదు. ఈ విచిత్ర స్థితి న్యాయవిలంబన ప్రక్రియకు ఒక ఉదాహరణ మాత్రమే...న్యాయ విలంబనకు మంత్రివర్గం-కార్వనిర్వాహకశాఖ-ఎగ్జిక్యూటివ్-వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి మాత్రమే కారణం కాదన్న వాస్తవానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. న్యాయ విలంబన ప్రక్రియ విస్తరించడం పట్ల ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి తీర్థసింగ్ ఠాకుర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్వేగ నయనాలనుంచి నీరు ఉబికి వచ్చింది. ఉన్నత ప్రధాన న్యా యమూర్తులు, ముఖ్యమంత్రులు మాత్రమే కాక ప్రధాని నరేంద్ర మోదీ తదితర కేంద్ర మంత్రులు కూడ ఆ ఉబికి వచ్చిన కన్నీటిని తిలకించారు. సమావేశంలో ఉపస్థితులై ఉండిన వారందరూ ఎంతోకొంత విషాదానుభూతికి గురై ఉండవచ్చు. దేశ ప్రజలందరికీ న్యాయ భద్రతకు ప్రతీక అయిన సుప్రీంకోర్టు అధిపతి ఇలా బేలతనానికి గురికావడం బహుశా చారిత్రక పునరావృత్తి. మహాభారత యుద్ధం నాటి అర్జున విషాదయోగం వంటిది. అప్పుడు యదుకుల కృష్ణుడు ఆ పాండవ మధ్యముడికి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తికి ధైర్యం చెప్పాడు. కొంత తేడా ఉంది. ప్రధా న న్యాయమూర్తి ఆరోపణాస్త్రాలను సంధించింది ప్రధానంగా నరేంద్రమోదీ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం మీద...అందువల్ల న్యాయ వ్యవస్థకూ, కార్యనిర్వాహక వ్యవస్థకూ మధ్య నడచిపోతున్న వివాదంలో ఠాకూర్, మోదీ పరస్పరం ప్రత్యర్థులు.. అదీ తేడా. ఏళ్ల తరబడి, దశాబ్దుల తరబడి తగినంతమంది న్యాయమూర్తులను నియమించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యానికి ప్రతిక్రియాత్మక పరాకాష్ఠ ‘సుప్రీం’ న్యాయాధిపతి కళ్లలో గంగావతరణం...కానీ న్యాయ ప్రక్రియలో జరిగిన, జరుగుతున్న అలస్యానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం ఒక్కటే కారణం కాదన్నది నిరాకరింపజాలని నిజం..
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం క్రీస్తుశకం 1982-83వ సంవత్సరంలో రూపొందించిన పునరావాసపు చట్టం ప్రకారం పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రజలు అధీన రేఖ-ఎల్‌ఓసి-ను దాటి వచ్చి జమ్మూ కశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకొనడానకి వీలు కలిగింది. భూమిని పాకిస్తాన్‌కు వదలివేసి జనాన్ని తరలించుకొని రావడానకి వీలు కల్పించే పరాజయ ప్రవృత్తికి ప్రతీక అయిన ఈ బిల్లును సుప్రీంకోర్టు దాదాపు పద్ధెనిమిది ఏళ్లు పరిశీలించింది. ఆ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బిల్లును రాష్టప్రతికి తిప్పి పంపింది. ఈ జాప్యానికి ఇలాం టి అలస్యానికి న్యాయమూర్తులు తగినంతమంది లేకపోవడం కారణం కాదు. మరేది కారణం? అయోధ్య రామ జన్మభూమి మందిర వివాదం దశాబ్దుల తరబడి హైకోర్టులో అపరిష్కృతంగా ఎందుకు కొనసాగింది? హైకోర్టు తీర్పు చెప్పిన తరువాత ఐదేళ్లు గడిచిపోయినప్పటికీ సుప్రీకోర్టు ఈ సమస్యను పరిష్కరించలేదు. బంగ్లాదేశ్ నుంచి చొరబడిన అక్రమ ప్రవేశకులను పసికట్టి పట్టి తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించే ప్రక్రియ దశాబ్దుల తరబడి కూలబడింది. ఇందుకు ప్రధాన కారణం 1983లో తయారైన ‘న్యాయమండలుల ద్వారా అక్రమ ప్రవేశకుల నిర్ధారణ’-ఐఎమ్‌డిటి-చట్టం. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అవకాశ వాదానికి ఈ చట్టం నిదర్శనం. కానీ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి సైతం సుప్రీంకోర్టుకు అనేక ఏళ్లు పట్టింది. 2006లో చట్టాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ చట్టాన్ని రూపొందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యామ్నాయ చట్టం ఇంతవరకు రూపొందలే దు. రాజకీయవేత్తలు ఇలా ఆదేశాన్ని నిర లక్ష్యం చేయడం ఆశ్చర్యకరం కాదు...కానీ సుప్రీంకోర్టు పదేశ్లుగా ఎందుకని తదుపరి ఆదేశాలను జారీ చేయలేదు? దాదాపు మూడుకోట్ల మంది విదేశీయులు దేశంలో ప్రధానంగా బెంగాల్‌లోను,అస్సాంలోను తిష్ఠవేసి ఉండడానకి పాలనా విలంబనం మాత్రమే కాదు, న్యాయవలంబనం కూడాకారణం కాదా??
దేశంలో కనీసం అరవైవేల మంది న్యాయమూర్తులు అవసరమట. దీనికి ప్రాతిపదిక 1987లో న్యాయవ్యవహారాల మండలి-లా కమిషన్- చేసిన సిఫార్సు.. ప్రతి పదిలక్షల మందికి యాబయి మంది న్యాయమూర్తులు అవసరమున్నదట. కానీ ముప్పయ్యేళ్ల తరువాత ప్రతి పదిలక్షల జనాభాకు కేవలం పదిహేను మంది న్యాయమూర్తులే ఉన్నారట. అందువల్ల మూడుకోట్లకు పైగా వివాదాలు వివిధ న్యాయస్థానాలలో అపరిష్కృతంగా ఉన్నాయన్నది భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పిన మాట. ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలలో కంటె జిల్లా స్థాయి కింది స్థాయి న్యాయస్థానాలలోనే న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉండడం వౌలికమైన సమస్య. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దుల క్రితమే పాలనా వికేంద్రీకరణ పేరుతో మండల వ్యవస్థ ఏర్పడింది. కానీ ప్రతి మండల కేంద్రంలోను న్యాయస్థానం ఎందుకని ఏర్పడలేదు? రాజ్యాంగపు 124వ అధికరణం మేరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచవలసిన బాధ్యత, పెంచగల అధికారం పార్లమెంటునకు మాత్రమే ఉన్నాయి. అందువల్ల దశాబ్దుల తరబడి సుప్రీంకోర్టులోను, హైకోర్టులోను తగినంత మంది న్యాయమూర్తుల నియామకం జరగకపోవడానికి, సంఖ్య పెరగకపోవడానికి బాధ్యత పార్లమెంటు, పార్లమెంట్‌ను నడిపిస్తున్న మంత్రివర్గానిదేనన్నది రాజ్యాంగం చెబుతున్న సాక్ష్యం. జిల్లా స్థాయిలోను, కింది స్థాయిలోను న్యాయమూర్తుల కొరత రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత. ‘లా కమిషన్’ సిఫార్సులను ముప్పయి ఏళ్లుగా అమలు జరుపని వారు రాజకీయవేత్తలు, ఈ ‘వేత్తలు’ నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదనడం అతార్కికం.
తగినంతమంది న్యాయమూర్తులు లేకపోవడం మాత్రమేకాదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన నెత్తికెత్తిపోయిన చట్టాలు, విధానాలు, విచారణ ప్రక్రియల, దర్యాప్తు ప్రహసనాలు వేషభాషలు ఇవన్నీ కూడ న్యాయ విలంబనానికి దోహదం చేస్తున్నాయి. భారతీయ భాషలు న్యాయస్థానాల్లో ఇప్పటికీ పనికి రావడం లేదు. ఒకటి, రెండు రాష్ట్రాలలో మాత్రమే భారతీయ మాతృభాషలలో సమగ్ర న్యాయ ప్రక్రియ వికసించింది. తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని మిగిలిన రాష్ట్రాలలో ఇంగ్లీషు అధికారం కొనసాగుతోంది. అధికారానికి సంబంధించిన భాష అధికారిక భాష. అధికారం భారతీయులది అయినప్పుడు భారతీయ భాషలు ఎందుకని న్యాయస్థానాలలో అధికారిక భాషలు కావడం లేదు? ఓ పాతికేళ్ల క్రితమే ఫలనా ఉగాది నుంచి న్యాయస్థానాలలో తెలుగులోనే అన్నీ జరగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అలా ప్రకటించిన సంగతి ఇప్పుడు ఎవరికీ గుర్తు లేదు. మాడభూషి సుందరాచారి అనే ప్రముఖ న్యాయవాది దీన్ని విశ్వసించి ఆరోజుల్లో తెలుగులో వాదనను వినిపించడం ప్రారంభించాడు. ఆయన వాదం విన్న నెల్లూరు న్యాయస్థానంలోని ఒక న్యాయమూర్తి ‘‘ఇంగ్లీషులో చెప్పండి. నేను మళ్లీ అనువాదం చేసుకోవలసిన పని ఉండదు..’’ అని సలహా ఇచ్చాడట. జిల్లా స్థాయి, ఆ కింది స్థాయి న్యాయస్థానాలలో సగం సమయం మాతృభాషలనుండి ఆంగ్ల భాషలోకి అనువదించడానికి సరిపోతోంది! న్యాయ ప్రక్రియ నత్తనడకన నడవడానకి ఇంగ్లీషు దొరలు నెత్తికెత్తిన పద్ధతులు కారణమన్న దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
‘‘కోర్టులంటూ పెట్టి
పార్టీలు పుట్టించి
స్నేహభావము చంపినాడు
ద్రవ్య దాహము
కల్పించి నాడు...
చెడ్డ ఊహలు
కడుపెంచినాడు
మా ఆహారముల త్రుంచి
ఆహా అనిపించాడు...
మాకొద్దీ తెల్లదొరతనము!’’
ఆని స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రముఖ కవి గరిమెళ్ల సత్యనారాయణ బ్రిటిష్ వారి దుష్ట న్యాయ విధానాన్ని ఎండగట్టాడు. ఆ దుష్ట న్యాయవ్యవస్థ స్వాతం త్య్రం వచ్చిన తరువాత శిష్ట న్యాయ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మనదేశంలో అనాదిగా ఉండిన న్యాయ వ్యవస్థ ఆనవాళ్లు సైతం ఇప్పుడు లేవు. ప్రపంచంలో మొదటి రాజ్యాంగం, మొదటి చట్టాలు మనదేశంలోనే రూపొందాయన్న చరిత్రను కొన్ని విదేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి. కానీ స్వతంత్ర భారతంలో మనం నేర్చుకుంటున్న రాజ్యాంగ వికాస చరిత్ర ‘రౌలత్’ చట్టంతోను, కలకత్తాలో విలియం జోన్స్ న్యాయస్థానంలోను మొదలవుతోంది.
రాజ్యాంగానికి సవరణలు జరిగితేకానీ, ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలలో ఇంగ్లీ షు తప్ప మరో భాషను వాడటానికి వీల్లేదు. హైకోర్టులలోను, సుప్రీంకోర్టులలోను హిం దీని కూడ ఉపయోగించడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రయత్నం పదేళ్ల క్రితం బెడిసికొట్టింది. బ్రిటిష్ దురాక్రమణకు పూర్వం ఉచిత విద్య, ఉచిత న్యాయం మన దేశంలో లభించేవి. కొంటున్న విద్యలు నైతిక స్వభావాన్ని నిర్మూలించాయి. న్యాయ విక్రయానికి ఈ విద్యాక్రమం ప్రధాన ప్రాతిపదిక. ‘్ఫజులు’ పూర్తిగా ముట్టే వరకు, న్యాయవాదులే ఏదో ఒక సాకుతో వివాదాలను వాయిదా వేయిస్తున్నారు. అందరూ కాకపోవచ్చు, అధికాధిక న్యాయవాదులకు వాయిదాలు వేయించడమే పని. మరికొందరు ఫీజు తీసుకోరు, ఉచిత న్యాయసహాయం చేస్తున్నారు. ఖర్చులకు మాత్రమే వేల వేల రూపాయలు గుంజుతున్నారు. పసిద్ధ ఆంగ్ల రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ నవలల్లో తరచూ దర్శనమిచ్చే మాల్‌గుడి ‘వాయిదాల న్యాయవాది’ వాస్తవ వైచిత్రికి ప్రతిరూపం. ఇలాంటి వాయిదాలు న్యాయవాదులు కూడ న్యాయ విలంబనకు దోహదం చేయడం లేదా?
సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి కన్నీటికి కారణం న్యాయ విలంబనం మాత్రమే కారణం కాకపోవచ్చు. మంత్రివర్గం, న్యాయ వ్యవస్థలకు మధ్య జరుగుతున్న అధికార పరిధుల అతిక్రమణ ప్రహసనం అసలు సమస్య!

- హెబ్బార్ నాగేశ్వరరావు