మెయన్ ఫీచర్

ఈ వైపరీత్యం ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకుతెలిసి రచయితలు సమాజాన్ని చైతన్యం చేయడానికే ఉంటారు. వారి లక్ష్యం, రచనలు ఆ దిశగానే సాగుతుంటాయి. కానీ కొందరిని విద్వేషిస్తూ, సమాజంలో చిచ్చు రేపేవారు రచయితలు అనిపించుకోరు. రచయితలకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం సరికాదు. చేతిలో పెన్ను ఉంది కదా అని ఏదంటే అది ఎవరిమీదంటే వారిపైన రాయడం రచయితల లక్షణం కాదు. రచయితలకు ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. వైశ్యులు స్వభావసిద్ధంగా ఎవరి జోలికీ వచ్చేవారు కాదు. వారిమీద రాయడం అనుచితం’-రాజకీయాలే తప్ప, పుస్తకాలు, రచనలను పట్టించుకునే తీరికలేని సీనియర్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్ము కోమటోళ్లు’ పుస్తకంపై సోమిరెడ్డి అభిప్రాయాలే, సగటు వ్యక్తి మనోగతంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
రచయితలే కాదు, ప్రతి ఒక్కరూ అప్‌డేట్ కావాలి. లేకపోతే సమాజం కిసుక్కున నవ్వుతుంది. కంచె ఐలయ్య కూడా అందుకు మినహాయింపేమీ కాదు. దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలందుకుంటున్న ఒక ప్రముఖుడు ఇప్పటికీ తన ప్రసంగంలో అనుయాయులు బదులు ‘అనుమాయులు’ అని అంటుంటారు. దానికి కారణం అప్పట్లో ఆయన చదివిన పుస్తకాల్లో వచ్చిన అచ్చుతప్పు! కాలం మారినా ఆయన మాత్రం ఆ పదం మార్చుకోలేకపోయారు. అదేవిధంగా పాతరాతి యుగాలు, స్వాతంత్య్రం సిద్ధించిన 30 ఏళ్ల తర్వాత వరకూ జరిగిన పరిణామాల నుంచి ఇంకా బయటకు రాకుండా, తన మేధస్సు-విజ్ఞానాన్ని అక్కడికే పరిమితం చేసుకుని, ఆలోచనావిధానం అక్కడే ఆగిపోయి, అదే ఇప్పటి సమాజానికీ, ఇప్పటి పరిస్థితులకూ అన్వయించుకునే ఐలయ్య వంటి మేధావుల గురించి, ఆయన రచనల గురించి ఎక్కువగా ఆలోచించి చర్చించుకోవడం సమాజం ఆరోగ్యానికి అంత మంచిది కాదేమో?!
నాగరికత ప్రారంభమైన నాటి రోజుల్లో తెగ, కులాలను బట్టి వృత్తులను విభజించిన వైనాన్ని బహుశా వయసుమీదపడిన ఐలయ్య మర్చిపోవడం ఆశ్చర్యమేమీ కాదు. ‘అంబేద్కర్ తర్వాత ఎవరూ పుట్టలేదనుకుంటారా? ఏయ్.. ఐలయ్య పుట్టిండ’ని తనను తాను అభినవ అంబేద్కర్‌గా అభివర్ణించుకున్న ఐలయ్య.. ‘నేను హిందువునెట్లయితా’నని రాసుకున్న తర్వాత కూడా, ఆయన మానాన ఆయనను వదిలేయకుండా, ఉచిత ప్రచారం కల్పించడం, దానిపై గొట్టాలు పెట్టి, చర్చకు పిలిచి దాన్ని సమాజం మీదకు వదలడం తప్పున్నర తప్పు!
అసలు తాను హిందువునే కాదన్న రచయిత.. హిందు ధర్మాలు, కులాలు, వర్ణాలు, అందులో వివక్ష ఎటుపోతే ఏమైపోతే ఆయనకెందుకన్న ప్రశ్న ఎవరికైనా రావడం సహజం. వైశ్యులను సామాజిక స్మగ్లర్లుగా అభివర్ణించిన ఆయన భావజాలం కలుషితమయి చాలా ఏళ్లయిందని, ఆ పుస్తకంలో సాగిన పాతకాలపువాసనలు చెప్పకనే చెబుతున్నాయి. అంటే సదరు మేధావి ఇంకా ఆధునిక యుగంలోకి అడుగుపెట్టలేదని, అడుగుపెట్టే ఆలోచన కూడా లేదని స్పష్టమవుతూనే ఉంది.
ఇంతకూ వైశ్యులపై ఆయన అక్కసు ఏమిటంటే.. గ్రామాల్లో అడిగిందే తడవుగా వడ్డీకయినా అప్పులిచ్చే సదరు సామాజికవర్గీయులు ప్రజలను దోచుకుంటున్నారట! దేశంలో ఒక శాతం కూడా లేని వైశ్యులు 43 శాతం వ్యాపారాలు చేస్తున్నారన్నది మరో ఆరోపణ. మోదీ బీసీ కోమటి, అమిత్‌షా కోమటి. రిలయన్సులు, జీఎంఆర్‌లూ అంతా కోమటోళ్లేనట. అదీ ఆయన కోపానికి అసలు కారణం!
కాసేపు ఆయన వాదనే నిజమనుకుందాం. మరి వాళ్ల దగ్గర ఎన్నికల్లో నిధులు తీసుకునే పార్టీలు ఏ తరహా కోమట్లు? ఐలయ్య ఉంటున్న హైదరాబాద్‌లో 75 శాతం వ్యాపారాలు చేస్తున్న వైశే్యతరులకు రచయిత ఏ పేరు పెడతారు? పెద్దగా జనాభా లేని రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా, ఇన్‌ఫ్రా, డైరీ, వ్యవసాయ, వైద్య, న్యాయ, ఆడిటింగ్, సినిమా రంగాలను శాసిస్తోన్న కమ్మ సామాజికవర్గాన్నీ కోమటోళ్లనే పిలవాలా? తెలంగాణలో భూస్వాములుగా ఉన్న వెలమ, రెడ్డి, బ్రాహ్మణ వర్గాలనూ కోమటోళ్లనే అంటారా? అంతెందుకు! తెలంగాణ- ఆంధ్రలో పాల, వడ్డీ వ్యాపారాలతో స్థితిమంతులైన యాదవ, కురమలు; రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ముదిరాజ్, మున్నూరుకాపు, పద్మశాలి కూడా ఐలయ్య దృష్టిలో కోమటోళ్లనే అంటారేమో సెలవిస్తే మంచిది.
అంతెందుకు? ఐలయ్య అమితంగా ప్రేమించే క్రైస్తవులు, ముస్లింలు హైదరాబాద్‌లో వ్యాపార, విద్యా, వైద్యరంగాల్లో స్థితిమంతులుగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంస్థలకు చెందిన స్కూళ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో లక్షలిస్తేగానీ సీట్లివ్వరు. విదేశీ నిధులతో కోట్లకు పడగలెత్తాయి. మరి కంచ వారి పరిభాషలో వారినీ కోమట్లనే పిలవాలా? అంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కోమట్లే అయితే, పుస్తకాలు ముద్రించి సొమ్ము చేసుకుంటున్న ఐలయ్య కూడా ఆయన లెక్కప్రకారం కోమటి అనడమే న్యాయం కదా?! కోమట్లను సామాజిక స్మగ్లర్లుగా అభివర్ణించిన ఐలయ్యపై గాయపడ్డవారు, కనె్నర్ర చేయడం మంచిదికాదని వామపక్ష మేధావుల చిలకపలుకులే విడ్డూరం.
సీపీఐ, సీపీఎంలో కమ్మ వర్గానికి తప్ప, తాను రోజూ వల్లించే దళిత, బడుగు బలహీన, బహుజనులకు పగ్గాలు ఎందుకు ఇవ్వరని ఐలయ్య ప్రశ్నిస్తే ఆయన రచనలకు విశ్వసనీయత ఉండేది. పాతబస్తీలో కాటికి కాళ్లు చాపిన ముదుసలి అరబ్ షేకులకు, ముక్కుపచ్చలారని ముస్లిం చిన్నారులకు నిఖాల పేరుతో జరుగుతున్న మానవ ఎగుమతి కిరాతకాలపై ఒక్కసారైనా గళం విప్పి ఉంటే ఐలయ్యకు వ్యక్తిగతంగా విశ్వసనీయత ఉండేది. ప్రజాస్వామ్యపిపాసిగా మాస్టారుకు ఓ మనవి. గల్ఫ్ దేశాల్లో అమలవుతున్న దారుణ చట్టాలు, అమానవీయ శిక్షలు, మహిళలపై వివక్ష, వాటికి బలయిపోతున్న వివిధ దేశాల బాధితుల పక్షాన అదే ముస్లిం దేశాల గడ్డపై నిలబడి గళమెత్తితే ఐలయ్య జగద్విఖ్యాతుడవుతారు కదా? తాను రోజూ వెనకేసుకువచ్చే అదే ముస్లిం, క్రైస్తవ వర్గాలే గల్ఫ్ దేశాల్లో బాధితులయినప్పుడు వారి పక్షాన ఆయనెందుకు పోరాడరు?
పాకిస్తాన్‌లో అమాయక ముస్లింలు ఆకలిచావులు చస్తుంటే, భారత్‌లో నిరుపేద ముస్లింల దారిద్య్రాన్ని అరబ్ షేకులు సొమ్ము చేసుకుని అడ్డదారిలో బానిసలుగా మార్చుకుంటుంటే ‘కాబోయిన అంబేద్కర్’ ఐలయ్య శివాలెత్తే సాహసం ఎందుకు చేయరు? దేశాన్ని కబళించేందుకు నిరంతరం కాలుదువ్వుతున్న చైనా, పాక్ ముష్కరులపై పల్లెత్తుమాట అనే ధైర్యం ఎందుకు చేయరు? పాక్ కిరాతకమూకల చేతుల్లో వందలమంది భారత సైనికులు నిహతులవుతుంటే ఆ అరాచకాన్ని ఎందుకు ఖండించరు?
ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో గిట్టే వైశ్యులే సామాజిక స్మగ్లరయితే, ఈ దేశ ఆర్ధికవ్యవస్థను, చిన్న మార్కెట్లను చిన్నాభిన్నం చేస్తున్న చైనా మార్కెట్లు ఐలయ్యకు ముద్దయిందా? రచయితలకు సామాజిక బాధ్యతే కాదు, దేశభక్తీ అవసరం లేదా? సోమిరెడ్డి అన్నట్లు రచయితలకు ఏమైనా ప్రత్యేక చట్టాలుంటాయా? బురదపూసి కడుక్కోమనడమే ప్రజాస్వామ్యం అయితే అలాంటి ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరమా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. దేశంలో కుల మతాల గీత చెరిగి.. ఫేస్‌బుక్కు, వాట్సాప్, ట్విట్టర్ల కాలంలో వర్ణాంతార వివాహాలు జరుగుతున్న ఈ ఆధునిక కాలాన్ని ఇంకా చిత్తూరు నాగయ్య నాటి తరం కళ్లతో చూస్తున్న ఐలయ్య, ఆయనను వెనుకేసుకువచ్చే వామపక్ష మేధావులకు ప్రచారం కల్పించే మీడియా మిడిమేళాన్ని నవ్వుకోవడం తప్ప చేయగలిగిందేమీలేదు.
ఇక్కడో చిన్నమాట. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కమ్మ వర్గానికి చెందిన ఓ రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాలనూ శాసిస్తూ, శ్వాసిస్తున్న ఆ వర్గంలోనూ పేదలున్నట్లే కదా? అదేవిధంగా కోమట్లని ఐలయ్య మర్యాదగా పిలిచిన వైశ్యుల్లోనూ కడు పేదలున్నారు. ఒక్క వైశ్యులే కాదు. అన్ని కులాల్లోనూ పేదలున్నారు. దేశంలో రెండే కులాలు. ఒకటి ధనికులు, రెండు పేదవారు! ఈ సూత్రం తెలియని వాళ్లని ప్రపంచం అమాయకంగానే చూస్తుంది. అందుకు ఐలయ్యకు మినహాయింపు ఉండదు. ఇది నిజం!!
* * *
పాలకులకు ముందుచూపు లేకపోతే వారు తీసుకున్న నిర్ణయాలు వారికే బెడిసికొడుతుంటాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ సందర్భంగా ఆడపడచులకు చీరలు పంపిణీ చేసిన మంచి చేయకపోగా, ఎదురిచ్చి తిట్టించుకోవలసి వచ్చింది. సిరిసిల్ల చేనేతలకు మాత్రం 60 లక్షల చీరలకు ఆర్డరిచ్చి, మిగిలిన చేనేతలకు మొండి చేయి చూపి, 50 రూపాయల సూరత్ చీరలు తమ ముఖానకొట్టిన వైనం మహిళలకు ఆగ్రహం కలిగించడంలో తప్పేమీలేదు. దీనిలో కూడా వందల కోట్ల కుంభకోణం జరిగిందని, సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుల కనుసన్నల్లోనే ఈ చీరల కొనుగోళ్లు జరిగాయన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలకు నిర్దిష్ట సమాధానం ఇవ్వకుండా, సెంటిమెంటును తెరపైకి తీసుకురావడం తప్పు. అంతా సక్రమంగా చేసి ఉంటే.. లక్షల రూపాయల చీరలు కట్టుకునే కవిత, ఈ సూరత్ చీరలు కట్టుకోగలరా? అన్న మహిళల ప్రశ్న సోషల్‌మీడియాలో సోషల్‌మీడియా వరకూ వచ్చేది కాదు!
* * *
కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వైఎస్ అయిపోయారు. నమ్మినవారిని, కష్టాల్లో వెంట ఉన్న వారిని మర్చిపోకుండా, కులాల పట్టింపులేకుండా చేస్తున్న నియామకాలే కేసీఆర్‌ను మరో వైఎస్‌ను చేస్తున్నాయి. ఇప్పటివరకూ కేసీఆర్ నియామకాల్లో వెలమ వాసనలు అత్యల్పం. ఏపిలో అందుకు పూర్తి భిన్నం. తాజాగా సమాచార చీఫ్ కమిషనర్‌గా బీసీకి చెందిన రాజా సదారాం, వైశ్య వర్గానికి చెందిన జర్నలిస్టు మిత్రుడు బుద్దా మురళిని నియమించిన తీరు ప్రశంసనీయం. ఆ ఇద్దరిలో ఒక్కరూ కేసీఆర్ వెలమ వర్గం కాదు. అదే ఏపిలో అయితే, నిర్ణయాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. కులాల పట్టింపులేని రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144