మెయన్ ఫీచర్

సంక్షేమ రాజ్యంలో మరణ మృదంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరవ నిజాం మహబూబ్ అలీబాషా తన పాలన ఎలా సాగుతున్నదో చూడాలనే ఆలోచనతో ఓరోజు రాత్రి చార్మినార్ ప్రాంతంలోని ఓ చిన్న దుకాణానికి పాత గొంగడి కప్పుకుని వెళ్లి, ఓ బీడీకట్ట కొని వెండి సిక్కా ఇచ్చాడట! వెండి సిక్కా ఎక్కడిదని ప్రశ్నించిన దుకాణదారుడికి తన దగ్గర మరికొన్ని వున్నవని చూపాడట! ఆశ్చర్యపడిన దుకాణదారుడు బీడికట్ట ఇచ్చి తాను బయటకు పోయి వస్తానని, బీడి తాగుతూ కూర్చోమన్నాడట! కొంతసేపటికి ఓ జమేదారును వెంట పెట్టుకుని వచ్చిన దుకాణదారుడు పెద్దాయనను జమేదారుకు అప్పజెప్పాడట! ‘ఇన్ని వెండి సిక్కాలెక్కడివి? ఎక్కడ దొంగిలించావో చెప్పు?’ అంటూ జమేదారు గదమాయించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రంతా వుంచాడట! తెల్లారి వచ్చిన అమీన్, కేసులేమైనా వున్నాయా అని అడిగితే, పెద్దాయనను చూపాడట జమేదార్. పెద్దాయన దగ్గర వెండి సిక్కాల్ని చూసిన అమీన్ ప్రశ్నల వర్షం కురిపించినా, అవన్నీ తన కష్టార్జితమని జవాబు చెప్పాడట పెద్దాయన. తర్వాత రాజభటులు రావడం, పెద్దాయన మహబూబ్ అలీబాషా అని తెలవడం, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిందట!
పై వాస్తవ సంఘటన ద్వార పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు, గుణగణాలు తెలుస్తే, ప్రజల్లో (దుకాణదారుడు) పాలనా యంత్రాంగంలో (పోలీసు)వున్న నిజాయితీని, పారదర్శకతను తెలుపుతున్నాయి. హర్షవర్ధనుడు రాసిన ‘నాగానందం’ నాటకంలోని జీమూతవాహనుడి పాత్రకూడా ఇలాంటి సత్యాన్ని బోధిస్తుంది. ప్రజల్ని రాజు కన్నబిడ్డలవలే పాలించాడని, జనాలంతా సుఖసంతోషాలతో జీవించారని జానపద కథల్లో చదువుతాం. అంటే కాయకష్టం లేకుండా వడ్డించిన విస్తరి భోజనంతో అనే అర్థం కాదు. విధిగా ప్రజలందరు ఉత్పత్తిలో భాగమైనప్పుడు ఉత్పత్తి ఫలితాలు న్యాయంగా పంపిణీ జరిగినపుడు, శ్రమ దోపిడీ లేకుండా నోటికాడి ముద్ద కొల్లగొట్టబడనప్పుడు, భద్రతతోకూడిన పాలన, అందించబడినప్పుడే ఇది సాధ్యమనేది దాని గూఢార్థం. ఇప్పుడంతా ప్రజాపాలననే! ‘ప్రజలచే..’ అనే పర్యాయ పదం ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా వాడుతాం! పైన ఉదహరించిన కథనాలన్నీ ఈ ప్రజాస్వామ్య, సంక్షేమ రాజ్యంలో స్పష్టంగా దోహదమవ్వాలి. నిజానికి మరింతగా పరిఢవిల్లాలి. గత 70 సం.లుగా ఈ దేశంలో ఇలాంటి వాతావరణం ఏర్పడిందా, భవిష్యత్తులో ఏర్పడుతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు కష్టమేమీకాదు.
బ్రిటీషువారు పాలిస్తున్న కాలంలో లార్డ్ మెకాలే (1835) బెంగాల్ ప్రోవిన్సులో పర్యటించాడట! ఆయనకు ఎక్కడా బిక్షగాళ్లుగాని, అనాథలుగాని కనపడలేదట! ఉపాధి కావాలనో, ఉద్యోగం కావాలనో వెంపర్లాడే యువత తారసపడలేదట! స్వాతంత్య్ర పోరాటాన్ని కాంక్షించేవారు, పోరాటంలో పాల్గొనేవారు కూడా అంతంతమాత్రమే! పోతే కరువు, కాటకాలు, కుష్టు, ప్లేగు వ్యాధులు ప్రబలంగా వుండి వైద్య సదుపాయాలు లేవు. రాజుల మధ్యన అంతర్గత వైరుధ్యాలు, యుద్ధాలున్నా ధర్మయుద్ధాలే సాగేవి. తుపాకి మందు కనిపెట్టిన తర్వాతనే మోసపూరిత యుద్ధాలు మొదలయ్యాయి. అప్పుడే సైన్యం అవసరం కావడం, ఎవరూ చేరడానికి ముందుకు రాకపోవడంతో సంప్రదాయ కులవృత్తుల్ని దెబ్బతీసి యువతను దారి మళ్లించారు. దీనికి అనుగుణమైన విద్యా విధానాల్ని రూపొందించి ఆచరించితేగాని దేశ యువత చెప్పుచేతల్లో వుండదని బ్రిటీషు రాణికి లేఖ రాయగా, కులవృత్తుల్ని దెబ్బతీసే విద్యావిధానానికి నాందీ ప్రస్తావన జరిగింది. దీని ప్రతిఫలమే నేటికీ కొనసాగుతున్న ‘మెకాలే’ విద్యావిధానం. ఆధునికత పేరుతో ఆవిష్కరించబడిన నేటి సమాజం అభద్రతతో, అన్యాయంతో, మోసం, దగాతో బంధుప్రీతితో, పారదర్శకత లేని పాలనతో, జవాబుదారీ తనం లేని రాజ్యంతో విలసిల్లుతున్నది. 1997లో ‘అభివృద్ధి’ అనే అంశం పది లక్ష్యాల్ని నెరవేర్చినప్పుడే సాధ్యమని ఐక్యరాజ్యసమితి నిర్వచించడం జరిగింది. ఇవి నెరవేరినపుడే మానవాభివృద్ధి అనుకున్న దిశవైపు పయనిస్తున్నట్లని భావించింది.
వరుసగా వీటిని పరిశీలించినప్పుడు, కనీసం వుండడానికి ఓ ఆవాసం వుండాలనేది మొదటిది. అయితే, ప్రభుత్వాలు గత 70 సం.లుగా నిర్మిస్తున్న ఆవాసాలు ఏమయ్యాయో తెలియని అయోమయం. ఇక రెండవది, మానవ వనరులను అభివృద్ధి పర్చడం. దీనే్న నైపుణ్య భారత్ (స్కిల్ ఇండియా) అంటున్నాం. నిజంగా మానవవనరులు మన దేశావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పర్చబడుతున్నాయా? అయితే ప్రధాన రంగం వ్యవసాయంతోపాటు, చేనేత ఇతర కులవృత్తులు ఎందుకు దెబ్బతిన్నాయి? యువత దేశాన్ని వదిలి ఉద్యోగ వేటలో కాందిశీకులుగా ఎదుకు వెళ్లిపోతున్నారు? మూడోది, సామాజిక భద్రత. ధనిక, ఒకటి రెండు ఉన్నత వర్గాలకు తప్ప ఇది ఎంతమేరకు నెరవేరుతున్నదో రోజు పత్రికల్లో చూస్తూనే వున్నాం. నాల్గోది, మహిళల, పిల్లల రక్షణ, బాధ్యత. ఇది కూడా దాదాపు పై మూడో అంశంలాంటి ఆచరణనే! అయిదోది, నేరాల నియంత్రణ, చట్ట పరమైన పాలన. దీనికి వివరణ అవసరం లేదనుకుంటా? ఏ పోలీసుస్టేషన్‌కు వెళ్లినా, రోడ్డుపై ప్రయాణం చేసినా తెలుస్తూనే వున్నది. ఆరవది, న్యాయవితరణ, న్యాయం ఎంతమేరకు, ఏ వర్గాలకు న్యాయంగా అందుతున్నది ప్రతీ కోర్టు గోడలకు తెలుసు. బయట వుండాల్సినవారు బందీఖానాలో, బందీఖానాలో వుండాల్సినవారు చట్టసభల్లో వుంటున్న కాలం! ఏదోది, ఆర్థికపరమైన స్వేచ్ఛ, భౌతికపరమైన యాజమాన్యం- ఈ విషయాన్ని దేశంలో అతిపెద్ద బ్యాంకుకు అధికారిణి అయిన అరుంధతి భట్టాచార్య నడిగినా, లేదంటే విజయమాల్యా నడిగినా తెలుస్తుంది. అంబానీలను, ఆదానీలను, మిదానీలను అడిగితే మన లేకితనం బయటపడుతుంది. లేదా స్వదేశీ పేరున ఎలా సొమ్ము చేసుకోవాలో రాందేవ్ బాబా నడిగి తెలుసుకోవచ్చు! ఎనిమిదోది, జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంబంధమైనవి. ఆరోగ్యంపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని కాదు, మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న గోరక్‌పూర్ ఘోరాల్లాంటివి కాదు, ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఎంత న్యాయబద్ధంగా సేవలందిస్తున్నదో, శవాలకు కూడా వైద్యం చేస్తున్నట్లు నటించడం, వీటి వెనకగల రాజకీయ శక్తుల సంబంధాలే దీనికి గీటురాయి కాదా? తొమ్మిదోది, సంఖ్యలాగానే అతి ముఖ్యమైనది, ప్రభుత్వాల పారదర్శకత, జవాబుదారీతనం గూర్చి. ఏ రెవెన్యూ కార్యాలయమో, కలెక్టర్ కార్యాలయమో ఎందుకు? నేరుగా ఏ రాష్ట్ర సచివాలయానికి వెళ్లినా అద్దంలా కనపడుతుంది. ఇక చివరిది పర్యావరణం. ఓ అటవీ ప్రాంతానికో, నది ఒడ్డునకో లేదా ప్రాజెక్టు ప్రాంతానికో వెళితే ధర్మం ఎన్ని కాళ్లపై నడుస్తుందో తేటతెల్లం అవుతుంది.
ఒకప్పుడు పాలకుల పాలన గూర్చి చరిత్రకారులు రికార్డు చేసేవారు. మెగస్తనీస్, పాహియాన్‌లు అలాంటివారే! రాజప్రాసాదాల్లో వుండి, రాజులకు వ్యతిరేకంగా రాయలేరనే అనుమానం రావచ్చు. అయితే వీరు పిలిస్తే వచ్చినవారు కాదు. కాని, నేడంతా పత్రికల లిఖిత చరిత్రనే! గతంలో కొంత ప్రజాస్వామ్య బద్ధంగా నడిచినా, నేడా పరిస్థితి లేదు. ప్రకటనలు లేనిదే పత్రిక నడవదని, అందుకై ప్రభుత్వంతో సఖ్యతగా వుండాలనేదే వీటి నీతి. ఈ పత్రికలే ప్రభుత్వ అనుకూల కథనాల్ని ప్రోత్సహిస్తూ వుంటాయి. అలా రాస్తేనే పత్రికలు ప్రచురిస్తాయని కాలమిస్టులు కథనాల్ని రాస్తూ వుంటారు. నిన్నటికి నిన్న బతుకమ్మ చీరల కథ ఇదే! నేతన్నల్ని బతికించాలంటే వారి శ్రమకు తగ్గ ఫలితం వుండాలి. కాని, శ్రమనే యాంత్రీకరించ బడినప్పుడు వాటి ఉత్పత్తుల్నే చేనేత ఉత్పత్తులుగా భ్రమింపచేస్తే, ఎవరు లాభపడతారు? ఆడపడుచులు కాబట్టి, బట్టలు ఇవ్వాలి. కాని, దీనిపై ఖర్చు చేసిన సొమ్ము సౌందర్య సాధనాల ద్వారా, ఫెర్ అండ్ లలీ వంటి అనారోగ్య క్రీముల ద్వారా దోచుకున్నది కాదా? చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్గించడమంటే, ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి సంబంధాలు మెరుగుపర్చడం. అవి ఒకరు చెప్పారా? రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు. ఇందులో మహిళల (చిన్న పిల్లలతో కలిపి) సగమని భావిస్తే- కోటి చీరలు ఎవరికి పంపిణీ చేసినట్లు? మూడేండ్ల సంక్షేమ రాజ్యం తర్వాత కూడా కోటిమంది ఆడవాళ్లు గరీబోళ్లేనా? ఇందులో ముస్లిం మహిళల సంఖ్య ఎంత? ప్రభుత్వం దగ్గర వీటికి సమాధానం దొరకకున్నా, ప్రభుత్వ పక్షాన మాట్లాడుతున్న మేధావి వర్గం మాట్లాడాలిగా!
సరే! మంచి పాలననే సాగుతోంది. ఆర్థికాభివృద్ధి 16.5 శాతంతో గణనీయంగా వుంది. పెట్టుబడులు వరదలై వస్తున్నాయి. ఈ మూడేళ్లలో పారుదల, విద్యుత్, మైనింగ్, సేవారంగాల్లో పెరిగిన వాటా 68.6 శాతమని అసోచామ్ సర్వే తేల్చింది. (రూ.33,11,242 లక్షల నుంచి 59,25,607కు) సంతోషం. మరి ఈ రంగాల్లో ఎంతమందికి అన్ని సౌకర్యాలతో కూడుకున్న శాశ్వత ఉద్యోగాలు దొరికాయి? ఎంతమందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి. దినసరి కూలి లభిస్తున్నదా? ఓసారి ఓ మోస్తరు పట్టణంలోగాని, గ్రామంలోగాని, ఎస్సీ, ఎస్టీ వాడల్లో, తండాల్లో పర్యటిస్తే తేటతెల్లంకాదా? లేదా పట్టణాల్లోని లేబర్ అడ్డాల్ని అడుగుతే చెప్పవా? ఈ వాదన సహేతుకంగా లేదనేవారు వుండవచ్చు. మన సూర్యాపేట కస్తూరి జనార్ధన్ (బిఎస్‌ఎన్‌ఎల్ లైన్‌మెన్) పరిమళ భరితమైన రాష్ట్భ్రావృద్ధి కస్తూరిని ఎందుకు ఆస్వాదించలేక అయిదుగురు కుటుంబసభ్యులతో ఆత్మహత్య చేసుకున్నాడు? ఇది వ్యక్తిగతమా, వ్యవస్థీకృతమా? జనార్ధన్‌దీ, రైతులది కూడా వ్యక్తిగతమే అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు బాటలో నడుస్తుంటే విద్యార్థులెందుకు మరణిస్తున్నారు?
పైన సూచించిన మానవాభివృద్ధి సూచికలు మనకెందుకు వర్తించడంలేదు? మానవ, సామాజిక, ఆర్థిక తదితర సూచికలు ఈ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ఏమైనా వున్నాయా? అవేంటో బయటపెడితే, అభివృద్ధికి అవే గీటురాళ్లని నిర్వచిస్తే ప్రాపంచిక ఆర్థిక సూత్రాల్ని మార్చాల్సిందే! మార్క్స్ పెట్టుబడిని తిరగరాయాల్సిందే! పరోక్షంగా ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో డొనాల్డ్‌ట్రంప్ మొదట ఈ ప్రత్యామ్నాయ నమూనాలనే ఢంకా భజాయించి చెబితే మన సుష్మ ప్రసంగంలో ఆనందంగా చప్పట్లు కొట్టింది. ఈ పరిభాషలోనే రాష్ట్రాలు వెలుగొందితే, దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశ జాబితా నుంచి బయటకు రానంటుందా మరి...?

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162