మెయిన్ ఫీచర్

‘కథ’తోనే కాసుల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నో వేల సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను రంజింపజేశాయి. కాసుల వానను కురిపించాయి. కానీ వేళ్లమీద లెక్కబెట్టుకోదగినన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వీరుల్లా కాసుల పంట కురిపించి టాప్‌స్టార్ సినిమాలుగా నిలిచాయి. అనేక సినిమాలు వస్తూ పోతూ వున్నా ఆయా చిత్రాల్లో కథ, కథనాలు ఎలా వున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. కానీ సినిమాపై నిజమైన ప్రేమతో పట్టం కట్టిన చిత్రాలు తక్కువే. ఏ రోజుకారోజు వచ్చే సినిమాలని ఒక్కసారి చూసేసి వదిలేస్తే ఓకె. కానీ కోట్ల రూపాయలు ఆయా చిత్రాలకు నజరానాగా ఇచ్చి సినీ రాజమకుటాన్ని అందించి అభిమానుల ఆదరణను చూరగొన్న పది గొప్ప భారతీయ చలన చిత్రరాజాల గురించి చెప్పుకుంటే ఆహా..అనిపించక మానదు.
కథలో దమ్ముంటే కలెక్షన్ల కాసులు సునామీలా ఆ నిర్మాతను చుట్టుముడతాయి. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా జరిగి ఆయా సినిమాల స్టామినాను చూపిస్తాయి. నిర్మాతల జేబులు నిండితేనే ఆ తరువాత మరిన్ని మంచి చిత్రాలకు అంకురార్పణ జరుగుతుంది. మరెందరో సినీ కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. థియేటర్‌లో సినిమా ఎన్ని రోజులు నిలిచి ఆడింది అన్న విషయాన్ని బట్టి దాని హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ప్రస్తుతం సినిమా తీరు మారిన నేపథ్యంలో వాటి లెక్కలు మారిపోయాయి. ఎన్ని కలెక్షన్లు ఎన్నివారాల్లో వచ్చాయి? ఎన్ని రికార్డులు తిరగరాసింది? అన్నదానిమీదే సినిమా హిట్టా, ఫట్టా చెబుతున్నారు ఇప్పుడు. హీరోల స్టార్‌డమ్‌ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు కలెక్షన్లు వస్తున్నాయని రుజువు అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన సంఘటనలు కూడా వున్నాయి.
భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలు చాలా ఉన్నా, వాటికి పది స్థానాలు ఇస్తున్నారు. పరిశ్రమ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు సినిమాకూ వుందని ‘బాహుబలి’ రుజువు చేసింది. ప్రభాస్ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి-2’ తెలుగు సినిమా కలెక్షన్ల ఉద్ధృతిని ప్రపంచ వ్యాప్తంగా చుట్టివచ్చింది. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 చిత్రాల విషయానికి వస్తే, ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1.దంగల్ (1862 కోట్లు), 2. బాహుబలి-2 (1706 కోట్లు), 3. పి.కె (792 కోట్లు), 4. బాహుబలి (650 కోట్లు), 5. భజరంగీ భాయిజాన్ (626 కోట్లు), 6. ధూమ్ -3 (585 కోట్లు), 7. సుల్తాన్ (584 కోట్లు), 8. కబాలి (477 కోట్లు), 9. ప్రేమ్త్రన్ ధన్ పాయో (432 కోట్లు), 10. చెన్నై ఎక్స్‌ప్రెస్ (423 కోట్లు). ఇలా టాప్ టెన్‌లో వున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సునామీ కలెక్షన్లు సృష్టించడంలో ఆయా చిత్రాలలో ఉన్న విషయం ఏంటి? ఊహించినదానికంటే నిర్మాతలకు అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించడం వెనుక కారణమేమిటి? సినిమాలు ఇలాంటి రికార్డులను తిరగరాసి, నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని కలిగించడం వెనుక కారణం? విశ్వవ్యాప్తంగా భారతీయ సినిమా అంటే ఇదీ.. అని ఎలుగెత్తి చాటిన ఈ చిత్రాలను గురించి విశే్లషిస్తే ‘కథే ప్రధాన కథనం’ అని రూఢీగా చెప్పచ్చు. ఆయా చిత్రాల కథలను గమనిస్తే...
దంగల్: ఏ పాత్ర చేసినా మిస్టర్ పర్‌ఫెక్షన్‌గా పేరొందిన అమీర్‌ఖాన్ ఇండియన్ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర నేపథ్యంగా ‘దంగల్’ చిత్రాన్ని రూపొందించారు. దంగల్ అంటే మల్లయుద్ధం అని అర్థం. మహిళలు రెజ్లింగ్ క్రీడవైపు రావడానికే భయపడే రోజుల్లో ఫోగట్ తన ఇద్దరు కుమార్తెలను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారు అనేదే ప్రధాన కథనం. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన సామాన్యమైన మల్లయుద్ధ వీరుడు భారతదేశానికి బంగారు పతకాలు సాధించే కలను కుమారులవల్ల కాకపోయినా కుమార్తెలతో సాకారం చేసుకున్న కథే ఇక్కడ ప్రధానాంశం. కుమారుడు కలిగితే రెజ్లర్‌గా తీర్చిదిద్దాలన్న ఫోగట్ ఆశయం నెరవేరదు. నాలుగుసార్లు కుమార్తెలే జన్మించడంతో నిరాశలో వున్న ఫోగట్‌కు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. కుమారులే కాదు కుమార్తెలను కూడా రెజ్లరుగా తీర్చిదిద్దవచ్చునన్న ఆలోచనతో కఠోర శిక్షణతో తన కలను నెరవేర్చుకుంటాడు.
బాహుబలి-2: ప్రభాస్ బాహుబలిగా నటించిన రెండవ చిత్రం 1706 కోట్లు సాధించడం వెనుక కథ ఏమిటి అని ప్రేక్షకుల్లో ఉత్కంఠత రేగింది. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. బాహుబలి సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా మొదలవుతుంది. భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందించిన ఈ సినిమా కథాపరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు భాషల్లో విడుదలై అత్యధిక వసూళ్లను సాధించింది. శివగామిగా రమ్యకృష్ణ హైలెట్‌గా నిలిచింది. ప్రతి 15 నిమిషాలకు ప్రేక్షకులకు కావలసిన మసాలా దినుసులను కూర్చి రాజవౌళి ఈ సినిమా రూపొందించాడు. సినిమాలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాలతోపాటుగా యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రతి విజువల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసిన బాహుబలి-2 చిత్రం పగ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చినా కొత్త స్టయిల్‌లో ప్రెజెంటేషన్ చేయడంతో ప్రేక్షకులకు నచ్చింది. బాహుబలి-2 ఇంత విజయవంతం అవడానికి ప్రధాన కారణం బహుబలి చిత్రంలో చర్చించిన కథే. బాహుబలి.. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఇదే పేరు. అందరూ ఓ సినిమా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. భారతీయ చలనచిత్ర దశ దిశని మార్చేలా కొన్ని వందల మంది రెండున్నరేళ్లు కష్టపడి అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో, భారీ సెట్టింగులతో మనముందుకు తీసుకువచ్చిన టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజవౌళి కలల ప్రాజెక్టు ఇది. మొదటి సినిమా (బాహుబలి-650 కోట్లు)లో వేసిన థ్రెడ్ రెండో సినిమాలో ఎలా ముడివిప్పారు అన్నదానే్న ప్రధానంగా ప్రేక్షకులు ఆలోచించారు. అందుకే ఈ రెండు చిత్రాలకు కాసుల వర్షం కురిసింది.
పి.కె: అమీర్‌ఖాన్, అనుష్కశర్మ ప్రధాన తారాగణంగా వినోద్‌చోప్రా ఫిలింస్ పతాకంపై రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో పరిచయం కాని ఓ సరికొత్త జోనర్‌తో రూపొందింది. గ్రహాంతరవాసి భారతీయ చిత్రాల్లో కనిపించిన దాఖలాల కథలు ఎక్కడా లేవు. పాత చిత్రాల్లో యమలోకం నుంచి వచ్చిన చనిపోయిన మనుషుల కథనాలతో కొన్ని చిత్రాలు వచ్చాయి. కానీ ఇది దానికి పూర్తి విరుద్ధంగా వుంటుంది. వేరే గ్రహం నుండి వచ్చిన వ్యక్తి, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను ఎలా మార్చుకున్నాడు అన్న టాపిక్‌లోనే వైవిధ్యాన్ని నింపే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. భూగ్రహంపై మనుషుల మనస్తత్వాలు వారి ఆలోచనా విధానాలను సున్నితంగా విమర్శించే ప్రయత్నం చేసి నవ్వించే ప్రయత్నం చేయడంతో ఈ సినిమా విజయవంతమైంది. మనుషుల ఆలోచనా విధానాలు ఎలా వుంటాయి అన్న అంశాన్ని తీసుకుని హృదయానికి హత్తుకునేలా కథను తీర్చిదిద్దడం ఈ సినిమాకు ఓ ప్లస్.
భజరంగీ భాయ్‌జాన్: కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో భావోద్వేగాల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొత్త సల్మాన్‌ఖాన్ కనిపిస్తాడు. బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాదే ఈ చిత్రానికి కథ అందించారు. రెండు మతాల భావోద్వేగాలు, దేశ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తూ సాగే ఈ చిత్రంలోని కథ కథనాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పవన్‌కుమార్ చతుర్వేదిగా సల్మాన్‌ఖాన్ నటనతోపాటుగా రెండు దేశాల వారధిగా రూపుదిద్దిన ప్రతి సన్నివేశం కథకు అనుగుణంగా సాగడంతో ఈ చిత్రం ఆదరణ పొందింది.
ధూమ్-3: విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన అమీర్‌ఖాన్ అభిషేక్‌బచ్చన్, కత్రినాకైఫ్, ఉదయ్ చోప్రా నటించిన ‘్ధమ్-3’ ప్రేక్షకులకు పరిచయమైన కథే. అయినాకానీ ఒకటీ రెండు చిత్రాలకన్నా మూడో చిత్రం దుమ్మురేపేసింది. కలెక్షన్ల పరంగా టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎసిపి జైగా అభిషేక్‌బచ్చన్, అలీగా ఉదయ్‌చోప్రా, సహేర్ పాత్రలో అమీర్‌ఖాన్ ఆకట్టుకున్నారు. అమీర్‌ఖాన్ చేసిన రెండు పాత్రలు ఆ సినిమాకు హైలెట్.
సుల్తాన్: రెజ్లర్ అర్ఫాగా అనుష్క శర్మ నటన హైలెట్‌గా నిలిచిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.
కబాలి: పారంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కబాలి’ చిత్రం ఊహకు అందని విధంగా అంచనాలను సృష్టించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకపడినా అద్భుతమైన కథ కథనాలతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. రియలిస్టిక్ షూటింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా 477 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘కబాలి’ పాత్రలో రజనీకాంత్, అతడి భార్య కుందన్‌వల్లి పాత్రలో రాధికా ఆప్టే నటించారు. సౌత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఈ పేరును కలవరించినంతగా మరే పేరును కలవరించలేదేమో.
ప్రేమ్త్రన్ ధన్‌పాయో: సల్మాన్‌ఖాన్, సోనమ్‌కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది. సూరజ్ ఆర్ బర్జాతియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యువరాజ్ విజయ్‌గా సల్మాన్‌ఖాన్, మైథిలిగా సోనమ్‌కపూర్ నటించారు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటుగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథ వుండడంతో ఈ సినిమా విజయవంతమైంది.
చెన్నైఎక్స్‌ప్రెస్: షారూక్‌ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే సాగడంతో కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల చరిత్రను తిరగరాసింది. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య వున్న తేడాలను భారతదేశంలో ఏకసూత్రత, ప్రజల్లో ఎలా అంతర్గతంగా వున్నది అన్న అంశాన్ని ఈ చిత్రంలో చర్చించడంతో ప్రేక్షకులకు అభిమాన పాత్రమైంది.
మీరు ఏ నటులను పెడతారో మాకవసరంలేదు. ఎలా తీర్చిదిద్దుతారో చూడం- కానీ సినిమాలో ప్రధానంగా కథే కావాలి. కథను అనుసంధానించి మీరు ఎలా సినిమాను చిత్రీకరించినా ఎన్ని ట్విస్టులు పెట్టినా, ఎన్ని పాటలున్నా, పాటలు లేకపోయినా, ఫైట్స్ గట్రాలు వున్నా లేకపోయినా సినిమా బాగుంటే మాత్రం ఆదరిస్తామంటున్నారు ప్రేక్షకులు. కానీ కథ ముడివస్తువు దొరక్క హాలీవుడ్ సినిమాలను చూసి సన్నివేశాలు పేర్చుకుంటూ రూపొందించే చిత్రాలన్నీ కథ కంచికె అన్నట్లు వెళ్లిపోతున్నాయి. సరికొత్త జోనర్‌లో మీరు కథ రాయవద్దు. పాత జోనర్‌లోనే కొత్తగా కథ రాయండి అని ప్రేక్షకుడు పరిశ్రమకు చెబుతూనే వున్నాడు. విన్నవాళ్లకు కాసుల వర్షం, విని విననట్లు వుండేవాళ్లు నష్టాల బాట పడుతున్నారు. కనుక గమనించడయ్యా! *

-ఎం.డి అబ్దుల్