మెయన్ ఫీచర్

సచివుల తొలగింపుతో సాధించిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఎన్నికలకు సిద్ధం కావడానికి వీలుగా తన మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారని రెండు మూడు నెలలుగా కథనాలు వెలువడుతూ ఉంటే ఏదో బ్రహ్మాండం జరుగబోతున్నట్లు అందరూ భావించారు. అయితే మంత్రివర్గంలో మార్పులు జరిగిన తీరు అందరికీ విస్మయం కలిగించింది. మంత్రివర్గం నుండి కొందరిని తొలగించడానికి, మరికొందరిని చేర్చుకోవడానికి, కొద్దిమందికి పదోన్నతులు కలిగించడానికి ఎటువంటి హేతుబద్ధత ఎవ్వరికీ కనిపించడంలేదు.
ఈ మార్పులు వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ మాత్రం దోహదపడవని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వంలో కేవలం ఒకరిద్దరు ఇష్టప్రకారం జరుగవలసిందే. మిగిలినవారంతా ఉత్సవ విగ్రహాలు మాత్రమే అని చాటి చెప్పడం కోసం ఈ మార్పులు చేశారా అనే అనుమానం కలుగుతున్నది. తొలి మూడేళ్ల పాలనలో కేవలం పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనే అభిప్రాయాన్ని ప్రధాని కలిగించారు.
ఆ అభిప్రాయం పోగొట్టుకోవడం కోసం గత బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలపై కొంతమేరకు దృష్టి సారించినట్లు కనబడింది. తాజాగా ప్రకటించిన పేదలకు ఉచిత విద్యుత్ అటువంటి పథకమే. అయితే మంత్రివర్గంలో చేపట్టిన మార్పులలో అటువంటి ప్రయత్నం జరిగినట్లు కనబడడంలేదు. ముఖ్యంగా తెలంగాణనుండి మంత్రివర్గంలోగల ఏకైక ప్రతినిధి బండారు దత్తాత్రేయను మంత్రి పదవినుండి తొలగించవలసిన అవసరం గురించి ఇప్పటివరకు బిజెపి నాయకులు ఎవ్వరు నోరువిప్పకపోవడం గమనార్హం.
అర్థంతరంగా పిలిచి కొత్తవారికి అవకాశం కల్పించడం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయమని నిష్కర్షగా, ఒక విధంగా అవమానకరంగా పార్టీ అధ్యక్షుడు చెప్పడం మినహా పార్టీలో చాలా సీనియర్ నాయకుడైన ఆయనతో కనీసం ఆ విషయమై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయనట్లు తెలిసింది. ‘‘నేను మంత్రిగా సమర్థవంతంగా పనిచేయలేదా? నాపై అవినీతి ఆరోపణలు వచ్చాయా? నేను పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నానా’’ అని సహచరుల వద్ద వాపోవడం మినహా ఉమాభారతి వలే తిరుగుబాటుధోరణి ప్రదర్శించలేకపోయారు.
గవర్నర్ పదవి ఇస్తాములే అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని వార్త కథనాలు వెలువడ్డాయి. చరిత్రలో ఎవ్వరికీ రాని విధంగా 320 సీట్లు గెలుచుకున్న ఉత్తరప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్యవంటివారు శాసనసభకు పోటీ చేసే ధైర్యం చేయలేకపోయారు. ప్రతిపక్షంనుండి కొందరు ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయించమని ప్రోత్సహించి, వారితో రాజీనామాలు చేయించి, ఆ సీట్లనుండి శాసనమండలికి ఎన్నిక కావలసిన దుస్థితిలో బిజెపి పడింది.
అటువంటిది తనను గవర్నర్‌గా పంపి, తనతో లోక్‌సభకు రాజీనామా చేయించి, సికింద్రాబాద్ ఉప ఎన్నికకు సిద్ధపడే సాహసం పార్టీ చేయబోదని దత్తాత్రేయకు తెలియక కాదు. వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయడం కోసం, తమ మద్దతును పెంచుకోవడం కోసం అనేక అనైతిక పద్ధతులతో ప్రతిపక్ష నాయకులను ఆకట్టుకుంటున్న ప్రధాని తాజాగా అవినీతిపై రాజీలేని పోరాటం జరుపుతానని ప్రకటించడం దేశ ప్రజలని వంచించడమే కాగలదు.
బిజెపిలోనే జాతీయ స్థాయిలో చిరకాలంగా పనిచేస్తున్న బిసి వర్గాల నాయకుడు దత్తాత్రేయ. నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష పదవితోపాటు అనేక పదవులు నిర్వహించారు. పార్టీలో, ప్రభుత్వంలో, అనుభవంలో, సీనియారిటీ, సమర్థతల విషయంలో నేడు కాబినెట్ మంత్రులుగా ఉన్నవారెవ్వరూ దాదాపుగా దత్తాత్రేయతో సరితూగలేరని చెప్పవచ్చు.
అంతటి సినీయర్ బిసి నాయకుడికి నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలోని కాబినెట్ హోదా లభించగలదని అందరూ భావించారు. అయితే మొదట్లో కనీసం మంత్రి పదవే లభించలేదు. తరువాత కేవలం సహాయ మంత్రి పదవి మాత్రమే లభించింది. ప్రస్తుతం మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికైనవారికి కాబినెట్ హోదాతోపాటు కీలక మంత్రిపదవులు కట్టబెట్టి, నాలుగైదుసార్లు లోక్‌సభకు ఎన్నికైనవారికి, వారిలో ఒకరు బిహార్‌లో ఎనిమిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం వున్నా కేవలం సహాయ మంత్రి పదవులు ఇవ్వడం గమనిస్తే సామర్థ్యానికి మోదీ మంత్రివర్గంలో అసలు పరిగణన లేదని స్పష్టం అవుతుంది.
ఇక దత్తాత్రేయ విషయానికి వస్తే ఆయన రాజకీయాలపట్ల, వ్యవహారాల పట్ల భిన్న అభిప్రాయాలు ఉన్నా కార్మిక మంత్రిగా ఆయన పనిచేసిన తీరు ఏ మాత్రం తప్పుపట్టడానికి వీలులేని విధంగా ఉంది. కార్మిక పక్షపాతిగా నిరూపించుకున్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేయడంవల్లనే మంత్రి పదవి పోగొట్టుకున్నారనే అభిప్రాయాలు నేడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. యుపిఎ హయాంలో కార్మిక మంత్రిగా పనిచేసిన మల్లిఖార్జున ఖర్గే తరువాత ఈ శాఖలో అంత క్రియాశీలకంగా పనిచేసి రాజకీయాలకు అతీతంగా కార్మికవర్గం నుండి ప్రశంసలు అందుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రధాని కాగానే దేశంలో ప్రముఖ కార్మిక సంఘాలు అన్నీ భయపడ్డాయి. తాము ఎటువంటి విమర్శలు చేసినా, ఆందోళనలకు దిగినా కర్కశంగా అణచివేస్తారనే భయానికి గురయ్యాయి. చివరకు వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు సహితం నోరు విప్పడానికి సందేహించాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ కార్మిక సంస్థ బి.ఎం.యస్ సహితం మోదీ పాలన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని సార్వత్రిక సమ్మెకు పూనుకొంది.
అటువంటి సమయంలో కార్మిక మంత్రిగా వచ్చిన దత్తాత్రేయ కార్మిక సంఘాలు అన్నింటితో సవివరంగా సమాలోచనలు జరిపారు. ప్రధాని మోదీతో సమావేశం ఏర్పాటు చేయించారు. కార్మిక విధానాలలో పెను సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. సంక్లిష్టగా ఉన్న కార్మిక చట్టాలను కుదించి, సులభతరం కావించారు. పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. కార్మిక ప్రతినిధులు ఎవ్వరు వచ్చినా సహనంతో వారి సమస్యలు విని, తగు పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేశారు.
దత్తాత్రేయ అనుసరిస్తున్న కార్మిక అనుకూల విధానాలు సహజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి కార్యాలయంలోని కొద్దిమంది పారిశ్రామిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఉన్నతాధికారులకు మింగుడుపడలేదు. పలుసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన లెక్కచేయలేదు. తాను ప్రధానికి వివరిస్తాను అంటూ వారికి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. ఈ ధోరణులు కారణంగానే దత్తాత్రేయ మంత్రి పదవిని కోల్పోయారా అనే అనుమానం కలుగుతున్నది.
పనితీరు కారణంగా అయితే నేడు మంత్రివర్గంలో వున్న చాలామంది సీనియర్ మంత్రులనే తొలగించవలసి ఉంది. ఒక విధంగా మంత్రులు ఎవ్వరు స్వతంత్రంగా పనిచేయడం ఈ ప్రధానికి అసలు ఇష్టం లేదు. దౌత్య నీతిలోనే సమర్థురాలిగా పేరొందిన విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను అలంకారప్రాయంగా మిగిల్చి ప్రధానికి సన్నిహితులైన ఒకరిద్దరు మొత్తం విదేశాంగ విధానంపై ఆధిపత్యం వహించడం చూస్తూనే ఉన్నాము. జవాబుదారితనం లేని వారు ఈ ప్రభుత్వంలో పెత్తనం చేస్తూ ఉండడంతోనే ఆర్థికంగా తీవ్రమైన ప్రమాద పరిస్థితులకు దారితీస్తున్నదని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
మంత్రులలో ఎంతో పలుకుబడిగలవారుగా పేరొందిన అరుణ్ జైట్లీ వంటివారుతయారుచేసిన వార్షిక బడ్జెట్‌లోనే 60 శాతంకుపైగా ప్రధాని కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారులు మార్చివేస్తున్నారు. దానితో మంత్రులు ఎవ్వరు స్వతంత్రంగా పనిచేయదగిన పరిస్థితులు లేవు.
రాజకీయంగా సహితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి ఏ సమస్య ఎదురైనా వెంటనే బయలుదేరే ఒకరిద్దరు బిజెపి నాయకులలో దత్తాత్రేయ ఒకరని చెప్పవచ్చు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా హైదరాబాద్ దాటి అరుదుగా మాత్రమే కదిలే వారంతా నేడు పార్టీ అధిష్ఠానం దృష్టిలో ప్రశంసలు పొందుతున్నారు. ప్రజా సమస్యలపై ఎక్కడికైనా, ఎవరితోనైనా వెళ్లే చొరవచూపిన దత్తాత్రేయను మంత్రిపదవినుండి తొలగించడం తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్న బిజెపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నది.
జాతీయ ప్రయోజనాలు, దేశ అవసరాలతో సంబంధం లేకుండా నేటి ప్రభుత్వం నడుస్తున్నదని అభిప్రాయం కలుగుతున్నది. కేవలం మరో రెండు నెలల్లో జరగనున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా కాలువల నిర్మాణం పూర్తికాకుండా, నిర్వాసితుల పునరావాసం పూర్తి చేయకుండా హడావుడిగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆర్థికంగా దేశానికి గుదిబండగా మారగలదని నిపుణులు హెచ్చరిస్తున్నా బుల్లెట్ రైలుకు శ్రీకారం చుట్టారు. ఈ రైలుపై తొలినుండి ప్రధాని వ్యక్తం చేస్తున్న ముచ్చటను తీర్చలేకపోవడంవల్లనే సురేష్ ప్రభు రైల్వే మంత్రిత్వ శాఖను పోగొట్టుకోవలసి వచ్చింది.
ఈ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకొంటున్న నోట్ల రద్దు, జిఎస్‌టి దేశ ఆర్థిక వ్యవస్థను పతనం వైపు తీసుకువెడుతున్నట్లు, ఆర్థిక వృద్ధి రేటును మందగించే విధంగా చేస్తున్నట్లు రిజర్వుబ్యాంకు నివేదిక, అర్ధ సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టం చేస్తున్నాయి. యుపిఎ ప్రభుత్వం కాలం నాటి ఆర్థిక సలహా మండలిని మార్చడానికి మూడున్నరేళ్లు పట్టిన ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. రాష్టప్రతి అభ్యర్థి ఎంపిక గురించి బిజెపి పార్లమెంటరీ పార్టీలో కేవలం రెండు నిముషాలు మాత్రమే చర్చ జరిగింది. మరే పార్టీ వేదికలో చర్చలు జరుగలేదు. అంటే విధాన నిర్ణయాలలో పార్టీలో ఎవ్వరు భాగస్వాములు కావడంలేదని అర్థం అవుతుంది.
ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 10 శాతం మంది రాజకీయ నేపథ్యం లేకుండా సైన్యంలో, ప్రభుత్వంలో పనిచేసినవారే. అటువంటి వారు ఎప్పుడూ బాస్‌లను సంతృప్తిపరచడం కోసమే ప్రయత్నం చేస్తుంటారు. జనం ఏమనుకొంటున్నారో అని రాజకీయ నాయకుడివలే వెనుకకు చూడరు. మిగిలిన మంత్రులలో కూడా చాలామంది ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే సాహసం చేయకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, మీడియాలో తమ ఉనికి కాపాడుకుంటూ పదవులు పొందుతున్నవారే. వారెవ్వరూ ప్రజలకు జవాబుదారీ కానవసరం లేదు. అటువంటి వారితో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని మోదీ భావిస్తున్నారా?
తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలలో ప్రధాని లేదా మోదీ పేరును 21సార్లు ప్రస్తావించారు. గత మూడేళ్లలో మోడీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత బిజెపి తీర్మానాలలో ఆయన పేరు 191 సార్లు ప్రస్తావనకు వచ్చింది. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న మొత్తం ఆరేళ్లలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికన్నా మూడు రెట్లు ఎక్కువగా మూడేళ్ళకే మోదీ ప్రస్తావన రావడం గమనార్హం. అంటే బిజెపికి ఇతర పార్టీల బాటలో సైద్ధాంతిక భూమికకు, నైతిక రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అటువంటి ధోరణులు గతంలో ఇందిరాగాంధీని అత్యవసర పరిస్థితి పేరుతో నిరంకుశంగా వ్యవహరించే పరిస్థితులకు దారితీశాయని మరువలేము.

-చలసాని నరేంద్ర 9849569050