మెయన్ ఫీచర్

సుప్రీంకోర్టు క్రియాశీలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే దేశాన్ని నడిపిస్తున్నాయా? న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని భావించవచ్చా? అనేక కుంభకోణాల్లోనే కాదు, రాజ్యాంగ సంక్షోభ సమయంలోనూ సుప్రీంకోర్టు సహా వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులు పెను సంచలనాలకు దారి తీశాయి. వ్యక్తిగత గోప్యత, ముమ్మారు తలాక్, ఇంటర్‌నెట్‌లో అభ్యంతరకర పోస్టులపై శ్రేయా సింఘాల్ కేసు, లింగమార్పిడి అభ్యర్ధులను మైనార్టీలుగా, మూడో జండర్‌గా చూడాలని నల్సా కేసులో సుప్రీంకోర్టు తీర్పు సంచలనం రేపాయి. ప్రజా ప్రతినిధులు ఏదైనా కేసులో రెండేళ్ల శిక్షకు గురైతే వారు తమ శాసనసభ్యత్వం లేదా శాసనమండలి సభ్యత్వం లేదా లోక్‌సభ సభ్యత్వాన్ని విడనాడాల్సిందేనని లిల్లి థామస్ కేసులో స్పష్టం చేసింది. దాంతో పలువురు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అరుషీ తల్వార్ కేసు, నిఠారి హత్యల కేసు, అజ్మల్ కసబ్ దేశద్రోహం కేసు, జస్సికా హత్య కేసు, ప్రియదర్శిని హత్య కేసులోనూ సుప్రీంకోర్టు తీర్పులు దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై గొప్ప నమ్మకాన్ని కలిగించాయి.
అంతే కాదు అతి సంక్లిష్ట, అతి సూక్ష్మ విషయాల్లోనూ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పులను ఇచ్చింది. ఎంతో దూరం వెనక్కు వెళ్లనక్కర్లేదు, గత ఏడాది కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చూస్తే న్యాయవ్యవస్థ అద్భుతమైన పనితీరును స్పష్టం చేస్తుంది. చట్టానికి అర్ధం చెబుతూ కోర్టులు ఇస్తున్న తీర్పులే దానికి ప్రతీక.
ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను పోలీసు వెబ్ సైట్‌లో ఉంచాలని, పరువునష్టం దావా రాజ్యాంగ విరుద్ధం కాదని, ఏదైనా ఒక కేసులో పడిన శిక్షకు రాయితీ లభించినంత మాత్రాన, మిగిలిన కేసుల్లో కూడా పడిన శిక్షకు ఆ రాయితీ వర్తించదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జిఎస్‌టి రాజ్యాంగ బద్ధమేనని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసులను ఇతర హైకోర్టులకు బదిలీ చేసే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. తద్వారా ఏళ్ల తరబడి కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయ సహాయం అందించినట్టయింది. పిండ దశలోనే శిశు మరణాలు, పబ్లిక్ సర్వీసు కమిషన్లు ఆర్‌టిఐ చట్టం కింద సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి సామాజిక భద్రత కల్పించాలని, వికలాంగులు సైతం గౌరవనీయమైన జీవితానికి వారికి హేతుబద్ధమైన మద్దతు ఇవ్వాలని కూడా సుప్రీం సూచించింది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని, ఆయా రాష్ట్రాల విధానాల ప్రకారం మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చినా అవి జాతీయ రహదారికి కనీసం 500 మీటర్లు దూరం ఉండాలని పేర్కొంది. ఎయిర్‌పోర్టుల్లో న్యాయమూర్తులను సెక్యూరిటీ చెక్‌వద్ద తనిఖీ చేయడం నుండి మినహాయింపు ఇస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కణ్ణన్‌పైనా, గాంధీని ఆంగ్లేయుల ఏజెంట్‌గానూ, నేతాజీని జపాన్ ఏజెంట్‌గానూ అభివర్ణిస్తూ బ్లాగ్‌లో రాసిన జస్టిస్ కట్జూపైనా సుప్రీంకోర్టు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కావేరీ జల వివాదంలోనూ, ‘నీట్’ నిర్వహణ విషయంలోనూ సుప్రీంకోర్టు బాధితుల పక్షాన గట్టిగా నిలబడింది. రాజద్రోహ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఎలాంటి మినహాయింపులు అక్కర్లేదని కూడా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల ఆస్తుల విభజనలోనూ సుప్రీంకోర్టు తనదైన శైలిలో మార్గాన్ని సూచించింది. వివిధ రాష్ట్రాల్లో శాసనసభల్లో వివాదాలపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. జాతీయ గీతం సినిమా హాళ్లలో ప్రదర్శించాల్సిందేనని తీర్పు చెప్పి జాతీయతా భావాన్ని పెంపొందించే చర్యలనూ చేపట్టింది.
పిడి వాదానికి ముగింపు
ఇస్లాం మూల సూత్రాలకు విరుద్ధంగా వివాహిత మహిళలకు అప్పటికప్పుడు ముమ్మారు తలాక్ చెప్పి వారితో తెగతెంపులు చేసుకునే అనాగరిక సంప్రదాయానికి సుప్రీంకోర్టు చెల్లుకొట్టింది. భారతరాజ్యాంగంలోని వౌలిక సూత్రాలకు పట్టం కట్టిన తీర్పు ఇది.
భారత్‌లో వివిధ మతాల వారి కుటుంబాల్లో వివాహాలు, ఆస్తి హక్కులు, విడాకులు, వారసత్వం తదితర అంశాలకు లెక్కలేనన్ని చట్టాలున్నాయి. సంప్రదాయ చట్టాలు కొన్నైతే ప్రభుత్వం రూపొందించిన చట్టాలు మరికొన్ని ఉన్నాయి. ఖురాన్ ద్వారా కొత్త ముస్లిం న్యాయశాస్త్రం ఏర్పడినా, మొహమ్మద్ ప్రవక్త అనంతరం అతని వారసుల మధ్య పోరు జరిగింది. షియా, సున్నీ శాఖలు ఏర్పడ్డాయి. ఈ రెండు శాఖల మధ్య వారసత్వం, వివాహం, విడాకులు మొదలైన అంశాల్లో తేడాలు ఉన్నాయి. ముస్లింల న్యాయశాస్త్రం ప్రకారం వివాహం అంటే స్ర్తి పురుషులు కలసి జీవించడానికి, సక్రమమైన సంతానం కనడానికి ఏర్పాటు చేసుకున్న ఒక పౌర ఒప్పందం మాత్రమే. ముస్లింలలో షియాల్లో తాత్కాలిక వివాహం కూడా అమలులో ఉంది. సక్రమంగా జరిగిన ముస్లింల వివాహం, ఇద్దరిలో ఎవరైనా మరణించినా, లేదా ముస్లిం వివాహం రద్దు చట్టం 1939 కింద గాని, లేదా ఊహించని సంఘటనలు జరిగినపుడు గాని ఆ వివాహం యథాలాపంగా రద్దవుతుంది. అంతే కాకుండా విడాకుల వల్ల కూడా ఆ వివాహం రద్దు కావచ్చు. ముస్లిం న్యాయశాస్త్రం ప్రకారం భార్య తన భర్త నుండి విడిపోవడానికి ఇష్టపడితే, భర్త దానిని అంగీకరిస్తే విడాకులు (తలాక్) అవుతాయి. ఇద్దరు కలిసి విడిపోవడానికి అంగీకరిస్తే (ముబారహత్) కూడా విడాకులు అవుతాయి. ఒక వేళ వివాహ అగ్రిమెంట్ ద్వారా ఎప్పుడైనా విడాకులు ఇవ్వడానికి భార్యకు భర్త అధికారం ఇచ్చి ఉంటే భార్య విడాకులు పొందవచ్చు. దానిని తలాక్ ఇ తఫ్వీజ్ అంటారు. లేదా భర్తే తనంతట తానుగా భార్యకు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వవచ్చు. ముస్లింలకు న్యాయవ్యవస్థ దృష్టిలో పటిష్టమైన చట్టాలున్నాయి. అధిక వడ్డీ వసూలుచేసే రుణాల చట్టం -1918, మత సహన చట్టం, మత స్వేచ్ఛ చట్టం 1950, సంరక్షకుల చట్టం -1890, ముస్లిం వక్ఫ్ చట్టం -1913, తర్వాత 1930లో, 1954లో వచ్చిన వక్ఫ్ చట్టం, బాల్యవివాహాల నియంత్రణ చట్టం 1929, షరియత్ చట్టం -1937, ముస్లిం మహిళల వివాహాల రద్దు చట్టం 1939, భారత ఒప్పంద చట్టం -1872, ముస్లింల చట్టం 1986, ముస్లిం మహిళల సంరక్షణ హక్కులు,విడాకుల చట్టం -1986లో అనేక నిబంధనలు ముస్లిం మహిళలకు అండగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డు రూపొందించిన ముస్లిం వివాహాల చట్టం లోని సెక్షన్-2 ప్రకారం వివాహం ఒక ఒప్పందం. సక్రమవివాహాలు సాహిహ, అక్రమవివాహాలు బాతిల్, చెల్లని వివాహం ఫాసిద్ అనే పేరిట జరుగుతున్నాయి. వీటన్నింటికీ ఎప్పటికీ తలాక్ ఒక్కటే పరిష్కారంగా ఉన్న సమయంలో చాందసవాదుల పిడివాదానికి సుప్రీంకోర్టు తలాక్ తలాక్ తలాక్ చెల్లబోదని స్పష్టం చేసింది. 1400 ఏళ్లుగా ముస్లిం సమాజంలో కొనసాగుతూ వచ్చిన ఆచారానికి తెరపడింది. సాయిరా బానో, ఇషత్ బహాన్, గుల్సన్ పర్వీన్, ఆఫ్రీన్ రెహ్మాన్, అతియా సబ్రీ, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించి 395 పేజీల తీర్పు ఇచ్చింది. ముమ్మారు తలాక్‌తో విడాకులు తీసుకోవడం రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రసాదిస్తున్న సమానత్వపు హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని జస్టిస్ నారీమన్ అభిప్రాయపడ్డారు. తలాక్ కేవలం చట్టపరంగా అనుమతించే పద్ధతి మాత్రమేనని, ఇదేసమయంలో దానిని పాపపుచర్యగా హనాఫీ స్కూలే చెబుతోందని గుర్తు చేశారు. ఈపద్ధతి తక్షణం జరిగిపోయేది, వెనక్కి రాలేనిది. కుటుంబానికి మధ్యవర్తుల ద్వారా భార్యాభర్తలు పశ్చాత్తాపం చెంది వెనక్కు రావడానికి ఆస్కారమే ఇందులో లేదు. వివాహ బంధాన్ని కాపాడటానికి ఆస్కారం ఉండాలి. తలాక్ పద్ధతి ఖురాన్‌కు తగ్గట్టు లేదు, ఏకపక్షంగా, చపలచిత్తంగా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునేందుకే ఉపయోగపడుతోందనేది స్పష్టం అవుతోందని జస్టిస్ నారీమన్ నిర్వచించారు. ఈతీర్పు మానవత్వ హక్కు కోసం పోరాడుతున్న అతివలకు కొండంత అండనిచ్చింది. ఈసమస్యకు ప్రభుత్వం చట్టపరమైన పరిష్కారాన్ని చూపించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచన ఊరట కలిగించింది. చట్టాలతో పాటు ఖురాన్‌లోని అంశాలనూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. వాస్తవానికి ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు తలాక్‌ను రద్దు చేశాయి. పాకిస్తాన్, ఇండోనేషియా, టర్కీ, ఇరాన్, ఈజిప్టు , బంగ్లాదేశ్, ట్యునీషియా, శ్రీలంక, అల్జీరియా వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్ అమలులో లేదు.
సున్నీ ముస్లింలే ఎక్కువగా మూడుమార్ల తలాక్ పద్ధతిని పాటిస్తున్నారు. ఇకపై ఈ పద్ధతిని పాటించడానికి వీలుండదు. ఒక వేళ అలా చేసినా చట్టవిరుద్ధం అవుతుంది. విడాకుల కోసం వారు ఇకపై తలాక్ హసన్, లేదా తలాక్ అహ్‌సాన్ పద్ధతులపై ఆధారపడాల్సి ఉంటుంది. స్ర్తి రుతుచక్రం (తుహర్)పై ఆధారపడి తలాక్ అహ్‌సాన్ కింద ముస్లిం పురుషుడు నెలకోసారి చొప్పున వరుసగా మూడు నెలల పాటు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వవచ్చు. ఏదేమైనా రాజ్యాంగంలో ప్రవచించిన వౌలిక సూత్రాలకు ముమ్మారు తలాక్ వ్యతిరేకం. తలాక్ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్లు ఈనాటివి కావు. అయితే ఆ దిశగా ఏ ప్రభుత్వమూ సాహసోపేత నిర్ణయం తీసుకోలేకపోయింది. దేశంలో బహుళత్వ స్ఫూర్తి కొనసాగాలంటే రాజకీయాలు పక్కన పెట్టి స్పష్టమైన కొత్త చట్టం అనివార్యం.

-బి.వి.ప్రసాద్