మెయన్ ఫీచర్

గాంధీజీ.. ‘చంపారన్’ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర సమరానికి ఆత్మవిశ్వాసాన్ని, ఆయుధాన్ని అందించిన ఉద్యమం గాంధీజీ నిర్వహించిన చంపారన్ సత్యాగ్రహం. దేశానికి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన ఆ సంఘటన జరిగి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యాయి. మండుటెండల సమయంలో వేసవికాలం ఉదయానే్న.. ఏప్రిల్ 10, 1917న మహాత్మాగాంధీ కలకత్తా నుండి పాట్నాకు ఏసి కూడా లేని రైలులో వచ్చారు. అదే తదుపరి దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి దేశంలోని రైతులను, గ్రామీణ ప్రజలను పాల్గొనేలా ప్రేరేపించే మహోద్యమానికి భూమిక ఏర్పాటుకు దారితీసింది. అప్పటి వరకు స్వతంత్ర ఉద్యమం అంటే పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన కొద్దిమందికి పరిమితంగా ఉంటూ వచ్చింది. గాంధీజీ పాట్నాకు రావడం కూడా అదే మొదటిసారి. అక్కడి నుంచి నేరుగా నీలిమందు రైతులను కలుసుకోవడం కోసం చంపారన్‌కు బయలుదేరి వెళ్లారు.
రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు డిసెంబర్ 1916న లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కలిసి ఒక విధంగా వత్తిడి చేయడంతో గాంధీ ఈ ప్రయాణం పెట్టుకున్నారు. ‘‘నిజం చెప్పాలి. అప్పటి వరకు నాకు చంపారన్ ఊరు పేరే కాదు ఈ ప్రాంతపు భౌగోళిక స్వరూపం కూడా తెలియదు’’ అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. తెలియని ప్రాంతానికి వచ్చినా నీలిమందు రైతులను బ్రిటిష్ వారి దోపిడీ నుండి కాపాడ్డం కోసం విసుగు చెందకుండా సుమారు సంవత్సరం పాటు తీవ్రమైన ఉద్యమం జరిపారు.
ఈ సంవత్సరం భారత స్వాతంత్య్ర 70వ వార్షికోత్సవాలను, అదే సమయంలో చారిత్రాత్మకమైన ఈ సత్యాగ్రహం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ ఉద్యమాన్ని భారతదేశంలో తొలి రైతాంగ పోరాటంగా మాత్రమే కాకుండా గాంధీజీ జరిపిన తొలి రాజకీయ ఉద్యమంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తరువాత అహ్మదాబాద్‌లో మిల్లు కార్మికుల సమస్యలపై, ఖేదా వద్ద రైతుల సమస్యలపై పోరాటాలు నడిపిన గాంధీజీ 1919 నుండి స్వాతంత్య్ర ఉద్యమం సాగించడం తెలిసిందే.
1848 నుండే వస్త్రాల తయారీ, వాడకం పరిశ్రమలో ఉపయోగించే నీలి మందును ఉత్పత్తి చేయడంలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. 17వ శతాబ్దానికే వెస్టిండీస్‌లో ఆధునిక పద్ధతుల్లో నీలిమందును ఉత్పత్తి చేయడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే బ్రిటిష్‌వారు బెంగాల్‌ను స్వాధీనం చేసుకున్నారో అప్పటి నుంచి వస్త్రాలను తెలుపుచేసేందుకు అద్దకాలలో ఉపయోగించే నీలిమందును ఉత్పత్తి చేసే తోటలు పెంచే పనిని రైతులపై బలవంతంగా రుద్దారు. కౌలు రైతులు అందరూ తాము కౌలుకు తీసుకున్న భూమిలో కొంత మేరకు (20 ఎకరాలలో కనీసం మూడు ఎకరాలు) ఈ పంటను నిర్బంధంగా పండించవలసిందే. దీనినే థిన్ కటియా రివాజు అనేవారు.
జర్మన్లు చౌకగా కృత్రిమ రంగును తయారు చేయడంతో నీలి మందుకు డిమాండ్ తగ్గింది. చాలామంది రైతులకు తాము చెల్లించే కౌలు ధర కూడా ఈ పంట అమ్మకంతో గిట్టుబాటు అయ్యేది కాదు. అయితే నిర్బంధంగా పండిస్తూ వుండేవారు. ‘‘మానవ రక్తంతో తడవకుండా ఒక్క బొట్టు నీలిమందు కూడా ఇంగ్లాండ్ చేరేది కాదు’’ అంటూ ఒక బ్రిటిష్ అధికారి రాసాడు. వారికి అతి తక్కువ ధర చెల్లించడమే కాకుండా అబివాబ్స్ పేరుతో అక్రమ సెస్‌లను వారి నుంచి వసూలు చేస్తూ వుండేవారు.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల రంగు అందుబాటులోకి రాకపోవడంతో నీలిమందుకు డిమాండ్ పెరిగింది. అయితే రైతులకు తగు ధర చెల్లించేవారు కాదు. సాగుకోసం తోటల యజమానులు ఏనుగులను కొనాలి అనుకుంటే కౌలు రైతులే అందుకు అవసరమైన డబ్బును సమీకరించుకోవాలి. దానిని హతియాహి అనేవారు. గుర్రాలు, కారులు వంటి వాటిని కొనడానికి కూడా అటువంటి పన్నులను వసూలు చేసేవారు. అంతకుముందు పలుసార్లు ఈ అక్రమాలకు వ్యతిరేకంగా రైతులు అక్కడక్కడా తిరగబడినా బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేసేవారు.
అటువంటి సమయంలో చంపారన్‌కు చేరుకున్న గాంధీజీ వినూత్నమైన రాజకీయ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఒకవిధంగా ఆ తరువాత దేశ స్వతంత్ర సంగ్రామంలో ఆయన నిర్వహించిన వీరోచిత పాత్రకు ఇదొక ప్రయోగం అని చెప్పవచ్చు. సాధారణ ప్రజలను ఒక అంశంపై శాంతియుతంగా సమీకరించడంలో తనకు గల అసాధారణమైన శక్తి సామర్థ్యాలను మొదటిసారిగా ఇక్కడ ప్రదర్శించారు.
‘‘గాంధీజీ చాల ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గలవారు కావడంతో లక్షలాది మంది ప్రజలను సమీకరించగలుగుతూ వుండేవారని అంటూ వుంటారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలను ఆయన అర్థం చేసుకుంటూ ఉండటమే సత్యం. అందుకు ఎంతో కష్టపడుతూ వుంటారు. ప్రతిరోజు తన జీవితంలో వందలాదిమందిని కలుసుకుంటూ వుండటం, ఆయన నడిపే వారపత్రికతో వందలాది మందితో ఆయన సంభాషణలు జరుపుతూ వుండటం చూడండి. అసహజమైన ఆయన రాజకీయ వ్యక్తిత్వం అద్భుతమైన అనుభవాల నుండి ఏర్పడినదే’’ అంటారు ప్రముఖ చరిత్రకారిణి డా. మృదుల ముఖర్జీ.
చంపారన్‌లో రైతులు తీవ్ర అణచివేతకు గురయ్యారని, వారు చాలా భయపడి వున్నారని గాంధీజీ గ్రహించారు. అందుకనే న్యాయం కోసం కోర్టులకు వెళ్లడం వలన ప్రయోజనం వుండబోదని భావించారు. ‘‘్భయం నుండి విముక్తి చేయడంవల్లనే వారికి నిజమైన ఉపశమనం కలుగుతుంది. బిహార్ నుండి ఆ భయాన్ని పోగొట్టేవరకు మనం కూర్చుండలేము’’ అంటూ రాసుకున్నారు. ఆ విధంగా వ్యూహాత్మకంగా కార్యరంగంలోకి దిగారు.
కొందరు నమ్మకమైన సహచరులతో, ముఖ్యంగా స్థానిక న్యాయవాదులతో కలిసి ఆ ప్రాంతం అంతా కలియతిరిగారు. రైతుల అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. రైళ్లలో మూడో తరగతిలో ప్రయాణం చేసారు. మండుటెండలను సహితం లెక్క చేయకుండా మైళ్లకొలది నడిచి వెళ్లారు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో సాధారణ రవాణా సదుపాయంగా వుండే ఏనుగులపై కూడా ప్రయాణం చేసారు. దుమ్ము రేపుతున్న గాలుల మధ్యనే ఒక్కొక్క గ్రామం వెడుతూ వచ్చారు.
ఈ ఉద్యమంలో గాంధీజీతో కలిసి సన్నిహితంగా పనిచేసి ఆ తరువాత చంపారన్ సత్యాగ్రహంపై ఒక పుస్తకం రాసిన బాబూ రాజేంద్రప్రసాద్ తన గ్రంథంలో ఏప్రిల్ చివరినాటికి వేలాదిమంది రైతుల కథనాలను నమోదు చేయడం ద్వారా వారి సమస్యలు అన్నింటిపై ఒక అవగాహనకు గాంధీజీ వచ్చారు. ‘‘మొత్తం ఆ జిల్లాలో మా వద్దకు వచ్చి తమ బాధలను వివరించని రైతులు వున్న ప్రాంతం అంటూ లేదు’’ అని పేర్కొన్నారు.
పాట్నాలో కాలు మోపినప్పుడు బ్రిటిష్‌వారు చెబుతున్న కథనాలు మాత్రమే తెలిసిన గాంధీజీ నాలుగైదు రోజుల్లో రైతులను ఏవిధంగా అణచివేస్తున్నారో వారిద్వారానే తెలుసుకుంటూ వచ్చారు. ఆయన కదలికలపై నిఘా వుంచిన అధికారులు, ఏప్రిల్ 15 నాటికే చంద్రహాయి అనే గ్రామంలో ఒక పోలీసు సబ్ ఇన్స్‌పెక్టర్ ఆయనను మూడు గంటలపాటు నిలిపివేసారు. జిల్లా పోలీసు కమిషనర్ జారీచేసిన హెచ్చరికను అందజేసారు. ఆయనను ‘‘ప్రజా ప్రశాంతత’’కు ‘ప్రమాదకారి’గా భావించడంతో వెంటనే ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేసారు.
‘‘నేను ఇక్కడి నుండి వదిలి వెళ్లే ప్రసక్తిలేదు. జిల్లా అధికారులు పట్టుబడితే శాసన ఉల్లంఘన కింద ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా వున్నాను’’ అని గాంధీజీ దృఢ సంకల్పంతో స్పష్టం చేసారు. ఆ రోజులలో ఒక సమస్యపై శాసన ఉల్లంఘనకు పాల్పడటం భారతదేశంలో అనూహ్యమైన పరిణామం. బాలగంగాధర్ తిలక్ సహితం ఒక సందర్భంలో ఒక ప్రాంతం నుంచి బహిష్కరిస్తే ఆ ఉత్తర్వు మేరకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మిగిలినవారు నిరసనలు తెలిపారు అనుకోండి.
ఏప్రిల్ 18 నాటికి జైలుకు వెళ్లడానికి గాంధీజీ సిద్ధపడ్డారు. ఆయనను అరెస్టు చేయవచ్చనే వార్త ఆ ప్రాంతంలో కార్చిచ్చులా వ్యాపించడంతో వేలాదిమంది కౌలు రైతులు ఉదయం నుంచి కోర్టు వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. ‘‘చట్ట ప్రకారం నాపై విచారణ జరపవలసి వుంది. అయితే వాస్తవానికి ప్రభుత్వమే విచారణ ఎదుర్కోవలసి వచ్చింది’’ అని ఈ సంఘటనపై ఆయన రాసుకున్నారు. ఆవిధంగా ప్రజలు పెద్దఎత్తున గుమికూడడం అధికారులలో వణుకు పుట్టించింది.
ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోతానని, తిరిగి రానని హామీ ఇస్తే ఆయనపై కేసును ఉపసంహరించు కుంటామని హామీ ఇచ్చారు. అయితే అందుకు గాంధీజీ తిరస్కరించారు. ‘‘ఇప్పుడే కాదు నేను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంపారన్‌ను నా ఇల్లుగా మార్చుకుంటాను’’ అని దృఢంగా జవాబిచ్చారు.
ఏప్రిల్ 20న ఉదయం 7 గంటలకు గాంధీజీ ప్రతివాదన వినిపించడానికి సిద్ధపడుతున్నారని భావించి గందరగోళానికి గురైన పాలనా యంత్రాంగం ఆయనపై కేసు ఉపసంహరించుకుంది. ‘‘ఆ విధంగా దేశం మొదటిసారిగా శాసన ఉల్లంఘన ప్రయోగం నుంచి ప్రత్యక్షంగా మొదటి పాఠం గ్రహించింది’’ అని గాంధీజీ రాసారు.
తన అరెస్ట్ తప్పదనుకొన్నపుడు అంతటితో ఆ ఉద్యమం ఆగిపోకుండా భవిష్యత్ కార్యాచరణను ముందే ప్రణాళికను, అందుకు సహచరులను సిద్ధం చేసారు. తాను అరెస్టయితే మజ్‌హారుల్, బాబు బ్రిజ్‌కిశోరె ప్రసాద్ ఉద్యమం కొనసాగించాలని, వారు అరెస్టయితే బాబు ధరణిధర్, బాబు రామ్ నవమి కొనసాగించాలని, వారు అరెస్టయితే రాజేంద్రప్రసాద్, శంభూశరణ్, అనుగ్రహ నారాయణసింగ్ చేపట్టాలని.. అంటూ వరుసగా జాబితా తయారు చేసారు. ఈ కొద్దికాలపు సహచర్యంతోనే ఆ ప్రాంతంలోనివారితో జీవితకాలమంతా గాంధీజీ సన్నిహిత స్నేహబాంధవ్యాలను పెంపొందింప చేసుకున్నారు. వారి దినచర్యలో కూడా నాటకీయ మార్పు తీసుకువచ్చారు.
రైతుల పట్టుదల చూసిన ప్రభుత్వానికి ఒక విచారణ కమిషన్ వేయక తప్పలేదు. ఆ కమిషన్‌లో గాంధీజీని కూడా ఒక సభ్యునిగా నియమించారు. అప్పటికే 8 వేల మంది రైతుల కథనాలను నమోదుచేసి వుండడంతో వాటిని సాక్ష్యంగా ముందుంచారు. దానితో రైతులను దోపిడీకి, అణచివేతకు గురిచేస్తున్న తింకతియా విధానాన్ని రద్దు చేసారు. వారినుంచి దోచుకొన్న కొంత మొత్తాలను తోటల యజమానులకు తిరిగిచ్చారు. తాము పండించే పంటలపై రైతులకు మరింత నియంత్రణ కల్పిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తోటల యజమానులు రైతులకు ఒప్పంద పత్రాలు కూడా రాసి ఇవ్వవలసి వచ్చింది.
ఈ ఘన విజయం దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని కొత్త దిశవైపు నడిపించడానికి దోహదపడింది. గాంధీ పాట్నాలో దిగినపుడు దక్షిణాఫ్రికాలో ఆయన ఏదో చేసారని కొద్దోగొప్పో తెలియడం మినహా ఆయన గురించి అక్కడి వారెవ్వరికీ తెలియదు. పైగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. తర్వాతి కాలంలో దేశం నుండి బ్రిటిష్‌వారిని వెళ్లగొట్టడానికి ‘శాసన ఉల్లంఘన’ అనే ఒక బలమైన ఆయుధాన్ని ఈ సత్యాగ్రహం అందించింది. ఇక్కడనే మొదటగా గాంధీని ‘బాపు’, ‘మహాత్మా’ అని పిలువడం ప్రారంభించారు. ఈ పేర్లతోనే తరువాతి కాలంలో ప్రపంచం అంతా ప్రసిద్ధి చెందారు.
‘‘అంత కాలం అసహ్యులుగా అణిగిమణిగి పడివున్న ఈ దేశపు అట్టడుగు తరగతుల ప్రజల్ని ఒక్కసారిగా మొక్కవోని ఆత్మగౌరవంతో దిక్కులు పిక్కటిల్లే విధంగా నినదించి, చైతన్యవంతమైన మానవ సమూహంగా మలచిన అద్భుతం చంపారన్ సత్యాగ్రహం’’ అని జెబి.కృపలాని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా కేవలం అణచివేతకు గురవుతున్న రైతులను సమీకరించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం పలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పడం, పూర్థకు స్వస్తి చెప్పమని గ్రామస్తులను ప్రోత్సహించడం, పారిశుద్ధ్య పనులు చేపట్టడం, మహిళల అణచివేతను నిరుత్సాహపరచడం, అంటరానితనాన్ని విడనాడమని ప్రబోధించడం చేసారు. పాఠశాలలను ఏర్పాటు చేయడంద్వారా నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు గ్రామీణ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసారు.

-చలసాని నరేంద్ర 9849569050