మెయన్ ఫీచర్

జగన్ వ్యూహం ఫలిస్తుందా? వికటిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్న విషయం జగన్‌కు ఆలస్యంగా అర్ధమయినట్లుంది. కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దూరం చేసుకున్న తర్వాత గానీ ఆయనకు తత్వం బోధపడనట్లుంది. మూడున్నరేళ్ల తర్వాత కారణాలను అర్ధం చేసుకుని, దూరమైన ఓటు బ్యాంకును దరిచేర్చుకునేందుకు అమలుచేస్తున్న వ్యూహం ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నదే ఇప్పుడు చర్చ.
గత ఎన్నికల్లో వైసీపీపై క్రిస్టియన్ మైనారిటీలకు అనుకూలమన్న ముద్ర ఉండటం, ఎస్‌సిలలో ఒక వర్గం దన్నుగా నిలవడం, వైఎస్‌పై అభిమానం ఉన్న రెడ్డి వర్గం తమ ప్రేమానురాగాలు ప్రదర్శించిన ఫలితంగా 67 సీట్లు దక్కాయన్నది నిర్వివాదం. హిందూ ముద్ర ఉన్న బిజెపి టిడిపితో కలసి పోటీచేయటం, కాపుల్లో ఇమేజ్ ఉన్న పవన్ టిడిపి-బిజెపి కూటమికి జైకొట్టిన ఫలితంగా టిడిపి గద్దెనెక్కిందన్నది కూడా అంతే నిజం! వైఎస్ సతీమణి విజయమ్మ బైబిల్‌తో ప్రచారం చేయడం వల్ల, వైఎస్‌ను సాంప్రదాయకంగా అభిమానించే రెడ్డి సామాజికవర్గం మినహా, మిగిలిన మెజారిటీ హిందూ వర్గం పార్టీకి దూరం కావలసి వచ్చిందనేది నిజంన్నర!
ఓటమి ముందు వరకూ జగన్ ధోరణి వేరేలా ఉండేది. తననో దైవాంశ సంభూతుడిలా, తనను సీఎం చేయడం ఈ రాష్ట్ర ప్రజల బాధ్యత అని భావించేవారు. నాకు బాగా గుర్తు! ఆయన సీబీఐ కేసులో అరెస్టయి కొన్ని నెలలు చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు, మరో కేసులో అరెస్టయిన ఇంకో ప్రముఖుడితో ములాఖత్ కోసం నేను ఉద్యోగధర్మం రీత్యా కొన్ని నెలల పాటు తరచూ అక్కడికి వెళ్లిన సందర్భం అది! జగన్ తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలతో వచ్చేది తన ప్రభుత్వమేనని, ప్రజలు మనకు తప్ప టిడిపికి ఓటు వేయరన్న ధీమా ప్రదర్శించేవారు. ఒక్కో నియోజకవర్గానికి అంత ఖర్చుపెట్టేవాళ్లనే తీసుకుంటామని, మీరు అన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఖర్చులు చూసుకోవాలని కచ్చితంగా చెప్పేవారు. తన బ్యారెక్‌లో ఉండే జైల్‌మేట్స్‌తో ‘రాహుల్‌గాంధీ రాజీవ్‌గాంధీ కొడుకయితే, నేను రాజశేఖర్‌రెడ్డి కొడుకున’ని ఇద్దరి స్థాయి ఒక్కటేనన్నట్లు ధీమా ప్రదర్శించేవారు. తనకు అన్నీ తెలుసనని, తనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు నేతలతో నిర్మొహమాటంగా చెప్పేవారు. తనకంటే పెద్దవాళ్లు, తన తండ్రి సహచరులను కూడా పేర్లు పెట్టి పిలిచేవారు. అయితే.. అప్పుడు జగన్ వ్యవహారశైలికి, ఇప్పటి తీరుకు చాలా వ్యత్యాసం ఉందనుకోండి. అది వేరే విషయం.
ఓటమి తర్వాత చాలాకాలానికి వైఖరి మార్చుకున్న జగన్, ముందు తనకు దూరమైన కాపు సామాజిక వర్గంపై దృష్టి సారించడం మంచిదే. కాపులను బీసీల్లో చేర్చాలంటూ గళమెత్తిన ముద్రగడ ఉద్యమానికి నిర్మొహమాటంగా బహిరంగ మద్దతు ప్రకటించిన ఫలితంగా, టిడిపిని వ్యతిరేకించే సంప్రదాయక కాపువర్గం, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వైసీపీనే ఎంచుకుంటున్నారు. అంటే కాపులలో జగన్ వ్యూహం ఫలించినప్పటికీ, ముద్రగడ వైసీపీ ముద్ర వేయించుకోవలసి వచ్చింది.
ఇక క్రైస్తవ ముద్రతో దూరమైన హిందూ ఓటు బ్యాంకుకు చేరువకావాలన్నది జగన్ తాజా వ్యూహం. విశాఖ శారదా పీఠాథిపతి స్వరూపానందేంద్ర శిష్యరికంలో జగన్ చాలాకాలం నుంచి తరిస్తున్నారు. అక్కడి పీఠంలో జరిగిన కార్యక్రమాలకూ హాజరయ్యారు. స్వామి ఆయనతో దగ్గరుండి యాగం కూడా జరిపించారు. కృష్ణా పుష్కరాల సమయంలో కూడా జగన్ పుణ్యస్నానం చేశారు. తర్వాత తరచూ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరువుతున్నారు. విజయమ్మ రిషికేష్ కూడా వెళ్లొచ్చారు.
మొన్నటికి మొన్న శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆయన పాదాలు మొక్కి, ఆ ఫొటోలను జగన్ స్వయంగా ట్విట్టర్‌లో ఉంచారు. స్వామి కూడా ఆయనను ఆశీర్వదించి, కారుదాకా సాగనంపిన దృశ్యాలు చూడముచ్చట గొలిపేవే. అంతకుముందు విహెచ్‌పితో సన్నిహిత సంబంధాలున్న నర్సాపురం బిజెపి ఎంపి గోకరాజు గంగరాజు కుమారుడు, రంగరాజుతో సెక్యూరిటీ లేకుండా వెళ్లి, అక్కడున్న కొందరు వీహెచ్‌పీ అగ్రనేతలతో భేటీ అయిన వార్త మీడియాలో వచ్చినా దాన్ని ఆయన ఖండించలేదు. అంటే వౌనం అంగీకారమన్నమాట!
తాజా పరిణామాలు జగన్ హిందువులకు దగ్గరయేందుకు చేస్తున్న వ్యూహంలో భాగమే! బిజెపి నాయకత్వానికి దిశానిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితంగా ఉండే స్వాములు, వీహెచ్‌పి నేతల ద్వారా బిజెపికి దగ్గరయ్యే మార్గంతోపాటు, గత ఎన్నికల్లో తన పార్టీపై ఉన్న పడిన క్రైస్తవ మైనారిటీ అనుకూలురన్న ముద్రను తొలగించుకునే ద్విముఖ వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నట్లు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
అయితే, జగన్ స్వాముల చుట్టూ తిరగడం, గుళ్లలో పూజలు, పునస్కారాలు చేయడం, జ్యోతిష్యులకు చేతులు అప్పగించడం వంటి విషయాలను ఆక్షేపించనవసరం లేదు. ఇది సెక్యులర్ దేశం. రాజకీయ నేతలకు ఇవి సహజమే. వైఎస్ గుళ్లకువెళ్లి పట్టువస్త్రాలు సమర్పించేవారు. బండారు దత్తాత్రేయ అప్పట్లో తరచూ ఆర్చిబిషప్ అరులప్పతో సన్నిహితంగా మెలిగేవారు. వీటినెవరూ తప్పుబట్టని వారు, కేవలం జగన్‌ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నది ఆయన అభిమానుల పాయింటు!
నిజమే. వైఎస్ క్రైస్తవుడయినా ఆయనపై జగన్ మాదిరిగా ఎప్పుడూ క్రైస్తవ ముద్ర కనిపించలేదు. ఆయన అల్లుడైన బ్రదర్ అనిల్ అప్పట్లో క్రైస్తవ సభలు నిర్వహించినా ఆ ప్రభావం వైఎస్‌పై పడలేదు. వైఎస్ అప్పటి సొంత ఇంటిపైన గానీ, ఆ తర్వాత సీఎం అయి క్యాంపు ఆఫీసు నిర్మించి అక్కడ ఉన్నప్పుడు గానీ బయట.. ఇప్పటి జగన్ నివాసమైన లోటస్‌పాండ్ ఇంటిపైన ఉన్నట్లు శిలువ గుర్తు పెట్టుకోలేదు. ఇలాంటి ముద్రల వల్ల ఆయన అడుగుల్లో అనుమానాలు సహజమేనన్నది జగన్ ప్రత్యర్థుల వాదన!
అయితే, ఈ పరిణామాలను వైసీపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న వర్గం జీర్ణించుకుంటుందా అన్న కొత్త చర్చ ఆసక్తికరమే. బిజెపిని వ్యతిరేకించే ఆ వర్గం, రాష్టప్రతి ఎన్నికల్లో హిందూ ముద్ర ఉన్న బిజెపికి జగన్ మద్దతునివ్వడాన్ని జీర్ణించుకోలేదన్నది రహస్యమేమీ కాదు. తాజా పరిణామాలన్నీ జగన్ హిందూ అనుకూల వైఖరిగానే ఆ వర్గం పరిగణించడం సహజం. దానికితోడు జగన్ కులమతాలు ఏమిటన్నదానిపై టిడిపి నాయకత్వం ద్విముఖ ప్రచారానికి తెరలేపడం మరో ఇరకాటమే. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్నట్లు జగన్ స్వాముల పాదపూజలు, ఆలయ సందర్శనలూ ఆయనపై ఉన్న మత ముద్రను చెరిపివేస్తాయా అన్నది ప్రశ్న. బిజెపి హిందు అనుకూల విధానాలు, దాని హయాంలో తగ్గిన ప్రాధాన్యంవల్ల ఎన్డీఏను క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు వ్యతిరేకించడం సహజమే. అన్నింటికంటే మించి తాము వ్యతిరేకించే బిజెపి, దాని అనుబంధ సంఘాల మెప్పు కోసం జగన్ ప్రయత్నించడాన్ని ఆ వర్గం స్వాగతిస్తుందనుకోలేం. మిగిలిన పార్టీలు, నేతలు ప్రార్ధనలు, క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం వారి రాజకీయ ఉనికి కోసమేనని తెలిసినందున, ఆ వర్గం వారిని పెద్దగా పట్టించుకోదన్నది నిర్వివాదం. కానీ తమ వాడకున్న జగనే హిందుముద్ర ఉన్న బిజెపికి చేరువయేందుకు చేసే ప్రయత్నాలను ఆహ్వానించకపోతే.. అటు జగన్‌ను నమ్మాలో నమ్మకూడదో తెలియని హిందువులు, ఇటు హిందు అనుకూల వైఖరి తీసుకుంటున్నందుకు ఇంతకాలం అండగా ఉన్నవారు ఆగ్రహిస్తే రెంటికీచెడ్డరేవడి అవుతారు. జగన్ ఈ సూక్షాన్ని పి.కె.ను తప్ప ఎవరినడిగినా చెబుతారు.
* * *
ఇంతకూ తెలంగాణ చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డి అర్జునుడా? అభిమన్యుడా? ఇప్పుడు ఇదీ చర్చ. రెండేళ్లు కేసీఆర్ సర్కారుపై కత్తిదూసిన తెలుగు మీడియా కులశేఖరులు, యాగం తర్వాత స్వామిభక్తుడిగా మారితే, అంతా తన వద్దకే రావాలి తప్ప తానెవరి వద్దకు వెళ్లే అలవాటు లేని మరో మీడియా మోతుబరి, అంతకుముందే ఆయనను స్వయంగా కలిసి తరిస్తే ఇక మిగిలిన రేవంత్ మాత్రమే సర్కారుపై పోరాడుతున్నారు. కానీ, ఓ వైపు తానెవరిపైనయితే పోరాడుతున్నారో, అదే రాజకీయ శత్రువుతో అంటకాగేందుకు సొంత పార్టీ నేతలే తహతహలాడుతుంటే రేవంత్‌పై జాలి కలగక మానదు. పరిటాల సమాథికి నివాళులర్పించిన కేసీఆర్ తీరు, పక్కనే ఉన్న తన పార్టీ నేత కేశవ్‌ను పక్కకుతీసుకువెళ్లి చేసిన రహస్య మంతనాల మర్మాన్ని రేవంత్ ప్రశ్నించడమే పెద్ద ట్రాజిడీ. కేశవ్‌తో ఏం మాట్లాడారో చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేసే బదులు, ఆ ముచ్చట్లేవో బయటపెట్టాలని తన మిత్రుడైన కేశవునే అడిగితే పోయేది కదా?!
రేవంత్ ఇప్పుడు నిఖార్సయిన ప్రతిపక్షనేత అన్నదానికి ఎవరి సర్ట్ఫికెట్టూ అవసరం లేదు. పేరుకు చాలామంది నేతలున్నా, కేసీఆర్‌తో సై అని తొడకొడుతున్న నేత. సొంత పార్టీ నేతలు ప్రగతిభవన్ వైపు చూస్తున్నా రేవంత్ మాత్రం కొండను ఢీ కొంటున్నారు. తన కుమార్తె పెళ్లికి కేసీఆర్‌ను పిలవని యువనేత తీరు చూస్తే కేసీఆర్‌తో ఆయన వైరం ఏమిటన్నది సుస్పష్టం. కానీ పాపం రేవంతుది ఇప్పుడు ఎవరితో కలసి పోరాడాలో తెలియని గందరగోళ స్థితి. తనతో పోరాడే నేతలే విభీషణుల అవతారమెత్తి తెరాసతో పొత్తుకోసం తపిస్తుంటే, రేవంత్ మాత్రం అభిమన్యుడయ్యారు. సింగరేణి ఎన్నికల్లో ఓ వైపు లెఫ్టు, రైటుతో కలసి రేవంత్ పోరాడుతుంటే, టిడిపి భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిసేదిలేదని, అవసరమైతే టీఆర్‌ఎస్‌తోనయినా కలుస్తామని ‘కాబోయిన గవర్నర్’ మోత్కుపల్లి కుండబద్దలు కొట్టిన తర్వాత రేవంత్‌ను చూస్తే జాలిపడని వాడు కఠిన పాషాణహృదయుడి కిందే లెక్క!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144