మెయిన్ ఫీచర్

పురుషుల డప్పుల కోటకు బీటలు బీహార్‌లో తొలి దళిత మహిళా టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది బీహార్‌లోని దనాపూర్ పంచాయతీలోని ధిబ్రా. ఓ ఇంటి టెర్రస్‌పైన 12 మంది మహిళలు ఇంటి పనులు ముగించుకుని వచ్చి కూర్చున్నారు. వారంతా ఆకుపచ్చ చీరలు ధరించారు. కబుర్లతో కాలక్షేపం చేయటానికి అక్కడికి రాలేదు. వచ్చిన మహిళలంతా రెండు వరుసల్లో నిలబడ్డారు. వారి మెడలో డప్పులు వేలాడుతున్నాయి. ఒక్కసారిగా ఆ మట్టి మిద్దెపై నుంచి డప్పుల మోత లయబద్ధంగా వినిపించడం మొదలైంది. ఆ డప్పు శబ్దానికి అటుగా వెళుతున్నవారు లయబద్ధంగా చేతులు, కాళ్లు కదుపుతూ ముందుకు సాగిపోతున్నారు. డప్పు మోగిస్తున్న ఆ మహిళల్లోనూ నిండైన ఆత్మవిశ్వాసం. డప్పు మోగించటం అంటే అదేదో మగవాళ్లు చేసే పని అనుకుంటాం. కాని తాము కూడా చేయగలం అని నిరూపిస్తున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన వీరు దేశంలోనే తొలి దళితా మహిళా డప్పుల బృందంగా ప్రసిద్ధి చెందారు. ఎంతోమంది ఎగతాళి చేసినా ఆత్మస్థయిర్యంతో డప్పు వాయించటం తమ వృత్తిగా చేసుకుని మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రపంచ వందమంది ప్రభావ మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి స్ఫూర్తిదాయకమైన వివరాలు తెలుసుకుందాం.

కూలీ పనులకు వెళ్లేవారు.
.
ధిబ్రా గ్రామంలోని దళిత మహిళలంతా అక్షరం ముక్కరానివారు. రోజూ కూలీకి వెళ్లి రూ.100లు సంపాదించుకునేవారు. ఆ వచ్చిన సంపాదనతోనే కుటుంబాలను వెళ్లదీసుకునేవారు. అలాంటి మహిళలు నేడు రోజుకు రూ. 500ల నుంచి రూ.1000ల వరకు సంపాదించుకోగలుగుతున్నారు. పాట్నా జిల్లాలో ఏ వేడుక జరిగినా ఈ మహిళా డప్పు దళం ఉండాల్సిందే. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సైతం ఏన్నో వేడుకలకు ఈ మహిళా డప్పు దళాన్ని పిలుపించుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారు.

ముదుసలి అయినా..

ఈ డప్పు దళం లీడర్ సవితాదేవి తల్లి చిత్రలేఖా దేవి ఈ టీమ్‌ను ముందుండి నడిపారు. ఆమెకు ఈ డప్పు వాయించటం అంటే ఎంతో ఇష్టం. వృద్ధాప్యం మీదపడినా ఆమెలో ఈ తృష్ణ తీరలేదు. తొలుత తన కుమార్తెను ఈ దళంలో శిక్షణకు పంపింది. సవితాదేవిని చూసి మిగిలిన వారు కూడా స్ఫూర్తిపొంది డప్పు శిక్షణ తీసుకోవటానకి ముందుకు వచ్చారు. ఇలా పనె్నండు మంది మహిళలతో డప్పు దళం తయారైంది. వీరందరికీ ఆరు నెలల పాటు ‘నారీ గుంజన్’ వలంటీర్లు వారంలో నాలుగు రోజులు గ్రామానికి వచ్చి శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ తీసుకోవటంతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయించటం ఈ వృద్ధురాలి దినచర్యలో ఓ భాగమైంది. ఒకప్పుడు రోజుకు వంద రూపాయలు కూలీ సంపాదించే ఈ పనె్నండు మంది మహిళలు నేడు రోజుకు ఐదంకెలకు తగ్గకుండా డబ్బు సంపాదించగలుగుతున్నారు
.
ఇతర రాష్ట్రాలకూ వెళుతున్నారు..

ఇపుడు ఈ మహిళాదళం ఒడిస్సా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు సైతం వెళుతోంది. మహిళలు డప్పు వాయిస్తుంటే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ముందుకు వచ్చి డ్యాన్స్ చేయటం ఆ వేడుకకు మరింత వనె్న తెస్తోంది. ఏనాడుగ్రామ పొలిమేరలు దాటి బయటకు వెళ్లని తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు అక్కడ ఎన్నో ప్రదేశాలను చూడగలుగుతున్నామని ఆమె చెబుతున్నారు. డప్పు వాయించే ఆడవాళ్లం అని ఎక్కడా కూడా తమను చిన్నచూపు చూడటం లేదని ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తున్నారని ఆమె చెబుతున్నారు.

సాటి మహిళలకు అండగా..

ఓ ఇంటి ఎదుట ఈ పనె్నండు మంది మహిళలు డప్పులు చేతబట్టి ఆపకుండా కొడుతూనే ఉన్నారు. ఆ డప్పు శబ్ధానికి ఊరి జనమంతా గుమిగూడారు. ఇంట్లో భార్యను చితకబాదుతున్న భర్తకూ ఆ డప్పుల శబ్దానికి ముచ్చెమటలు పోశాయి. భార్యను కొట్టడం ఆపేసి మెల్లగా వణుకుతూ బయటకు వచ్చాడు. అక్కడ జరిగిన పంచాయతీలో ఆ భర్తకు చివాట్లు, దండన తప్పలేదు. ఇదేదో సినిమాలోని సీన్ అని అనుకుంటున్నారా? కానేకాదు. ఈ డప్పుల దళమే సాటి మహిళకు అండగా నిలబడుతోంది. ఏ ఇంటిలోనైనా మహిళ గృహ హింసకు గురవుతున్నట్లు తెలిసిందంటే ఇలా దళం డప్పు వాయించి ఆ మహిళను రక్షిస్తారు.

తొలి దళిత మహిళా డప్పు దళంగా పేరుగాంచిన ఈ మహిళలు తాము నేర్చుకున్న కళను తమ పిల్లలకు సైతం నేర్పించి వారితో మరిన్ని దళాలను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వీరి సంకల్పం నెరవేరుతుందని ఆశిద్దాం.

ఇలా నేర్చుకున్నారు..

సామాజిక కార్యకర్త మిస్సెస్ సుధావర్గీస్‌కు వచ్చిన ఐడియానే ఇది. ఆమె దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు ఆమెను వరించింది. ఓ రోజు కేరళలోని ఓ క్రిస్టియన్ ఉత్సవానికి సుధావర్గీస్ హాజరయ్యారు. అక్కడ మగవారు ఓ దళంగా ఏర్పడి డప్పు వాయించటం చూశారు. లయబద్ధంగా చేస్తున్న ఆ డప్పువాయిద్యం ఆమెను ఆకర్షించింది. ఈ డప్పు వాయిద్యం మహిళలు వాయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆమెలో కలిగింది. దళిత మహిళా డప్పు దళాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈవిధంగా సుధావర్గీస్ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మహిళా డప్పు దళం. పాట్నాలో ‘నారీ గంజన్’ అనే స్వచ్ఛంద సంస్థను సుధ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 3000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఈ సంస్థే దళిత మహిళలకు డప్పులో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. దళితులు ఎక్కువగా ఉండే ధిబ్రా గ్రామం నుంచి మహిళ దళాన్ని తయారు చేయటానికి ఆమె నానాతంటాలు పడ్డారు. ఇది మగవారు చేసే పని తామెలా చేస్తాం అంటూ ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఆమె ఎంతో ఓపిగా వారికి నచ్చజెప్పి శిక్షణ ఇప్పించారు.

-టి.ఆశాలత