మెయన్ ఫీచర్

‘సమాంతర ప్రక్రియ’కు సర్వం సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్గత అత్యవసర పరిస్థితి- ఇంటర్నల్ ఎమర్జెన్సీ- అమలులో ఉండిన నాటి మాట! విపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఎమర్జెన్సీ వ్యతిరేకులు తదితరులు కారాగృహ నిర్బంధవాసం చేస్తుండిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం క్రీస్తుశకం 1975వ 1976వ సంవత్సరాలలో నలబయి రెండవ రాజ్యాంగ సవరణకు పూనుకొని ఉంది. 1977 జనవరి మూడవ తేదీన అమలులోకి వచ్చిన ఈ ‘కుఖ్యాత’ రాజ్యాంగ సవరణ ‘లోక్‌సభ’, ‘శాసనసభల’ కాల పరిమితి సంవత్సరం మేర పెరిగింది. లోక్‌సభ కాల వ్యవధి ఐదేళ్లని రాజ్యాంగంలోని ఎనబయి మూడవ అధికరణంలోని రెండవ ఉప అధికరణంలో నిర్దేశించారు. గడువు ముగియక ముందే ఈ సభను రాష్టప్రతి రద్దు చేయడానికి కూడ ఈ అధికరణం వీలు కల్పిస్తోంది. రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధి కూడ ఐదు సంవత్సరాలని నూట డెబ్బయి రెండవ అధికరణం నిర్దేశిస్తోంది. కాల వ్యవధి ముగియక ముందే శాసనసభలు రద్దు కావడానికి కూడ వీలుంది. నూట డెబ్బయి నాలుగవ అధికరణం ప్రకారం మామూలు పరిస్థితుల్లో ‘రాజ్యపాల్’-గవర్నర్- శాసనసభను రద్దు చేయవచ్చు. అసాధారణ పరిస్థితులలో మూడు వందల యాబయి ఆరవ అధికరణ ప్రకారం రాష్టప్రతి పాలన విధించే సందర్భాలలోకూడ రాష్టప్రతి శాసనసభను రద్దు చేయవచ్చు! లోక్‌సభకు, శాసనసభలకు ఐదేళ్ల ఆయుఃప్రమాణం సరిపోదని భావించిన నాటి ప్రధాన మంత్రి నలబయి రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, శాసనసభల ‘వయస్సు’ను ఆరేళ్లుగా నిర్ధారించారు. ఇలా నిర్ధారణ కాకపూర్వమే ‘ఎమర్జెన్సీ’ నిబంధనల కింద ‘లోక్‌సభ’ కాల వ్యవధిని అనేక ‘ప్రాంతాల’ శాసనసభల కాల వ్యవధిని సంవత్సరం పాటు పెంచుతూ 1975లో పార్లమెంటులో చట్టం చేయడం వేరే కథ. 1976లో మరో ఏడాదిపాటు ‘చట్టసభల’ గడువును పెంచారు. ఎనబయి మూడవ, నూట డెబ్బయి రెండవ అధికరణాలలోనే ఇందుకు వీలు కల్పించారు. అందువల్ల 1971లో ఎన్నికయిన లోక్‌సభ 1978 వరకు ఏడేళ్ల పాటు కొనసాగడానికి వీలు కలిగింది. కానీ 1977 జనవరిలో ఇందిరాగాంధీకి మంచిబుద్ధి పుట్టి, లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలు జరిపించింది. దానివల్ల 1971లో ఎన్నికయిన లోక్‌సభ గడువు ఆరేళ్లకే 1977లో ముగిసిపోయింది. కానీ ఇలా ‘ఎమర్జెన్సీ’ సమయంలో లోక్‌సభ, ఇతర చట్టసభల గడువును పెంచడం తాత్కాలికమైన వైపరీత్యం. అత్యవసర పరిస్థితి రద్దు కాగానే ఈ తాత్కాలిక వైపరీత్యం తొలగిపోతుంది. కానీ నలబయి రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం వ్యవస్థీకరించిన వైపరీత్యం శాశ్వతమైనది, లోక్‌సభ, శాసనసభల కాల పరిమితి ఆరేళ్లకు పెరిగింది.
ఇలా ‘దిగువ’ సభల ఆయుర్దాయాన్ని ఐదేళ్లనుంచి ఆరేళ్లకు పెంచడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించడానికి తార్కికమైన సమంజసమైన ప్రాతిపదికలేదు. ప్రపంచంలోని అన్ని పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థలలోను ‘చట్టసభల’ కాల వ్యవధి ఐదేళ్లు లేదా నాలుగేళ్లు. అమెరికా ‘కాంగ్రెస్’- పార్లమెంట్-లోని దిగువ సభ- ప్రతినిధుల సభ- హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్- కు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ‘కాంగ్రెస్’ ఎగువసభ-సెనెట్ -కాలవ్యవధి మాత్రం మన దేశపు ఎగువ సభల-రాజ్యసభ, శాసనమండలుల-రీతిలోనే ఆరేళ్లు! కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం మాత్రం ఎగువ సభలకు ఉన్నట్టుగానే లోక్‌సభ శాసనసభల వయస్సును ఆరేళ్లకు పెంచింది! కానీ నలబయి రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం శాసనసభల కాల వ్యవధి ఆరేళ్లు కావడమన్న రాజ్యాంగ నిబంధన జమ్ము కశ్మీర్‌కు మాత్రం వర్తించలేదు. రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయ్యవ అధికరణం ప్రకారం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి-స్పెషల్ స్టేటస్-ఉంది మరి. దేశానికి మొత్తం ఒక్క జాతీయ రాజ్యాంగం మాత్రమే ఉంది, రాష్ట్రాలకు మళ్లీ విడివిడిగా రాజ్యాంగాలు లేవు! కానీ జమ్ము కశ్మీర్‌కు మాత్రం విడిగా మరో రాజ్యాంగం ఉంది. ఇదీ ప్రత్యేకత! జాతీయ పతాకంతోపాటు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రాంతీయ పతాకం ఉంది. క్రీస్తుశకం 1940వ దశకం ఆరంభం వరకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిని ‘ప్రధానమంత్రి’ అని పిలిచేవారు. ‘ఒకే దేశంలో ఇలా రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు- ఏక్ దేశ్‌మే దో విధాన్, దో నిశాన్, దో ప్రధాన్- ఉండడం జాతీయ సమైక్యానికి, ప్రాదేశిక సమగ్రతకు, దేశ సార్వభౌమ అధికారానికి, ఒకే మాతృభూమితత్త్వానికి విఘాతకరం, విద్రోహకరం. ఈ విద్రోహాన్ని వ్యతిరేకిస్తూ 1950వ దశకంలో ‘్భరతీయ జనసంఘ్’ రాజకీయ పక్షం వారు ఉద్యమం చేశారు. ఉద్యమంలో భాగంగా జమ్ము కశ్మీర్‌కు వెళ్లిన జనసంఘ్ అధినాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీని జమ్ము కశ్మీర్ పోలీసులు కొట్టి గాయపరిచి అనేక రోజులపాటు కారాగృహంలో నిర్బంధించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర యోధుడు. శ్యామాప్రసాద్ ముఖర్జీ కారాగృహ నిర్బంధంలోనే మరణించడం చరిత్ర... షేక్ అబ్దుల్లా ‘ప్రధానమంత్రిత్వం’లోని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ముఖర్జీని కొట్టి చంపించిందన్నది కొనసాగుతున్న ఆరోపణ.. ముఖర్జీ బలిదానం కారణంగా జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిని ‘ప్రధానమంత్రి’ అని పిలిచే దుష్ట సంప్రదాయం 1960వ దశకంలో రద్దయింది. కానీ జమ్ము కశ్మీర్‌కు మరో జెండా, మరో రాజ్యాంగం మాత్రం ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. అందువల్ల ‘ఎమర్జెన్సీ’లో కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ వెంటనే జమ్ము కశ్మీర్ శాసనసభకు వర్తించలేదు. పార్లమెంటు చేసే చట్టాలు జమ్ము కశ్మీర్‌కు వర్తింపచేస్తూ రాష్టప్రతి ఆదేశించాలి! ఈ రాష్టప్రతి ఆదేశానికి - ప్రెసిడెన్షియల్ ఆర్డర్ - పూర్వరంగంగా జమ్ము కశ్మీర్ శాసనసభ ఆమోదం లభించాలి. అవసరమైన ఆయా సందర్భాల్లో జమ్ము కశ్మీర్ రాజ్యాంగాన్ని కూడ సవరించాలి! ఈ ప్రాంతీయ రాజ్యాంగ ‘తతంగం’ తలపెట్టకుండా జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలు తరచు ‘మొరాయించడం’ మొండికెత్తడం చరిత్ర, మూడు వందల డెబ్బయ్యవ అధికరణం ‘మహిమ’ సుమండీ..! ‘మహిమ’ కాదు ‘మాయ’ అనేవారు దేశంలోని అత్యధిక శాతం ప్రజలు..
ఇలా వివిధ సందర్భాల్లో మొండికెత్తిన జమ్ము కశ్మీర్ ఫ్రభుత్వం 1976లో మాత్రం మొండికెత్తలేదు. వెంటనే రంగంలోకి దిగిపోయింది, జమ్ముకశ్మీర్ ప్రాంతీయ రాజ్యాంగంలోని యాబయి ఐదవ నిబంధనకు సవరణను విధానమండలిలో ఆమోదింపచేసింది, పార్లమెంటు చేసిన నలబయి రెండవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా, శాసనసభ కాల పరిమితిని ఆరేళ్లకు పెంచుతూ జమ్ము కశ్మీర్ రాజ్యాంగంలోని యాబయి రెండవ నిబంధనను సవరించింది. దేశం మొత్తంమీద అన్ని శాసనసభలకూ సమాన ‘ఆయుఃప్రమాణం’ ఏర్పడింది. 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ‘జనతా పార్టీ’ ప్రభుత్వం ఏర్పడింది. మురార్జీ దేశాయ్ ప్రభుత్వం మళ్లీ రాజ్యాంగాన్ని సవరించింది. ఈ నలబయి నాలుగవ రాజ్యాంగ సవరణ 1979 జూన్‌నుంచి అమలులోకి వచ్చింది. 1977లో అమలు జరిగిన నలబయి రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరేళ్లకు పెరిగిన ‘దిగువ’ సభల కాల వ్యవధి ఈ నలబయి నాలుగవ సవరణద్వారా మళ్లీ ఐదేళ్లకు తగ్గింది. అందువల్ల లోక్‌సభ, శాసనసభలకు యథాపూర్వంగా ఐదేళ్లకొకసారి జరుగుతున్నాయి. యథావిధిగా నలబయి నాలుగవ రాజ్యాంగ సవరణ కూడ జమ్ము కశ్మీర్‌కు వర్తించలేదు. అందువల్ల జమ్ము కశ్మీర్ శాసనసభ కాల వ్యవధి ఇప్పటికీ ఆరేళ్లుగానే స్థిరపడి ఉంది. ఎందుకంటే మురార్జీ దేశాయ్ ప్రభుత్వం నలబయి నాలుగవ రాజ్యాంగ సవరణ చేసిన తరువాత జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఇంతవరకు జమ్ము కశ్మీర్ రాజ్యాంగాన్ని మళ్లీ సవరించలేదు. శాసనసభ కాల వ్యవధిని యథాపూర్వంగా ఐదేళ్లకు తగ్గించలేదు. మిగిలిన అన్ని శాసనసభల కాల వ్యవధి ఐదేళ్లు, జమ్ము కశ్మీర్ శాసనసభ వయసు మాత్రం ఆరేళ్లు. అన్ని శాసన సభలకు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలంటున్నవారు, జరిపిస్తామంటున్నవారు ఈ ‘ప్రత్యేకత’ను గుర్తించారా? ఆరేళ్ల కాలవ్యవధి ఉన్న జమ్ము కశ్మీర్ శాసనసభకు, ఐదేళ్ల ఆయుర్దాయం కల ఇతర రాష్ట్రాల శాసన సభలకు, లోక్‌సభకూ సమాంతరంగా ఒకే సమయంలో ఎన్నికలు జరిపించడం ఎలా సాధ్యం?
ఇదొక్కటే కాదు సమస్య. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిహితమై ఉన్న రాజ్యాంగ నిబంధనలు ‘ఏకకాలం’ ఎన్నికలకు వీలుగా లేవు! ఐదేళ్ల గడువు పూర్తి కాకమునుపే లోక్‌సభ కాని, శాసనసభలు కాని రద్దయిపోవడానికి రాజ్యాంగం వీలు కల్పిస్తోంది, ఇలా రద్దు కావడం అనివార్యం అయ్యే పరిస్థితులు ఏర్పడడం కూడ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో సహజం! కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు, ఎన్నికల కమిషన్ ఆకాంక్షిస్తున్నట్టు ఒకే సమయంలో లోక్‌సభకు శాసనసభకు ఎన్నికలు జరగడం ఎలా సాధ్యం. ఇప్పుడు అలా జరగాలంటే గడువుముగిసిన ‘సభ’లతోపాటు గడువు ముగియని ‘సభ’లను కూడ ఏదో ఒక సమయంలో రద్దు చేయాలి! ఇలా రద్దు చేయడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే సాధ్యమవుతుంది. ఒకటో రెండో రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించవు! అప్పుడు ‘ఏక సమయం’లో ఎన్నికలు ఎలా సాధ్యం! మూడు వందల యాబయి ఆరవ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మంత్రివర్గాలను రద్దు చేయవచ్చు, రాష్టప్రతి పాలన విధించవచ్చు! రాష్టప్రతి పాలన విధించిన తరువాత ఆయా రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయవచ్చు! కానీ రాష్టప్రతి పాలన విధింపునకు దోహదం చేయగల రాజ్యాంగ సంక్షోభం ఆయా రాష్ట్రాలలో ఏర్పడాలి కదా! ఏకకాలంలో ఎన్నికలకు వీలుగా ఏక సమయంలో ‘సభ’లు రద్దు కావడానికి వీలుగా ‘రాజ్యాంగ’ సంక్షోభాలు ఏర్పడవు! రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకపోయినా, సంబంధిత రాష్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్టు, లేదా శాంతిభద్రతలకు ఘోరంగా విఘాతం కలిగినట్టు నిర్ధారించి కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రాల ‘సభ’లను రద్దు చేసి, రాష్టప్రతి పాలన విధించిన సందర్భాలున్నాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ఇలాంటి ‘రద్దు’లు బోలెడన్ని జరిగిపోయినట్టు చరిత్ర సాక్ష్యం చెబుతోంది. ఇలా రాష్టప్రతి పాలనను విధించడాన్ని, శాసనసభలను రద్దు చేయడాన్ని ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు సమీక్ష చేయడానికి వీలు లేదన్నది-నాన్ జస్టిసబుల్-అప్పటి రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. కానీ గత రెండు దశాబ్దులకు పైగా ‘రాష్టప్రతి పాలన విధింపులు’, ‘శాసనసభల రద్దులు’ న్యాయ సమీక్షకు గురి అవుతున్నాయి. గతంలోవలెనే సరైన కారణం లేకుండా ‘సభ’లను ఇప్పుడు రద్దు చేయడం సాధ్యం కాదు! ఇదంతా ‘సమాంతర’-సైమల్టేనియస్-ప్రజాస్వామ్య ప్రక్రియ ఆరంభానికి సంబంధించిన తతంగం...
కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ఒకే సమయంలో లోక్‌సభకు అన్ని శాసనసభలకు-జమ్ము కశ్మీర్ శాసనసభకు తప్ప-ఎన్నికలు జరిపించవచ్చు! కాని ఆ తరువాత ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయన్న హామీ ఎవ్వరివ్వగలరు? మధ్యలో ఏ మంత్రివర్గమైనా లోక్‌సభ లేదా శాసనసభ విశ్వాసం కోల్పోతే ఏమవుతుంది? ఈ పరిస్థితిని అధిగమించి ‘ఏకకాలం’లోనే ఎన్నికలు జరిపించాలంటే రాజ్యాంగంలో అనేక మార్పులు చేయాలి. ఆ వివరాలను మరోసారి చర్చించుకోవచ్చు! క్రీస్తుశకం 1952 తరువాత లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలు జరగకపోవడం ఈ చర్చకు నేపథ్యం!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352