మెయన్ ఫీచర్

రాజకీయాలు.. విచిత్ర యుద్ధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధానికి బయలుదేరడానికి ముందే అసలు మన శత్రువు ఎవరో నిర్ధారించుకోవాలి. అలాకాకుండా గుడ్డిగా వెళితే పరాజయం మాట అటుంచి పరాభవం తప్పదు. నీడలతో యుద్ధం చేస్తే అది వీరత్వం అనిపించుకోదు. బాకులు, కత్తులతో కాకుండా బంతిపూల యుద్ధం చేసే వారిని చరిత్ర గుర్తించదు. స్వపక్షంలోనే విపక్షాలు. అస్మదీయులెవరో తెలియదు. తస్మదీయులెవరో అసలే తెలియదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇలాంటి రాజకీయ విచిత్ర యుద్ధాలే దర్శనమిస్తున్నాయి. శత్రువెవరో సుస్పష్టంగా కనిపిస్తున్నా, రేవంత్‌రెడ్డి వంటి ఒక్కరిద్దరు తప్ప నేరుగా కత్తిదూసే మొనగాళ్లు భూతద్దం వేసినా కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వపక్షం-విపక్షాలెవరన్న దానిపై ఎవరికీ అయోమయం అవసరం లేదు. చంద్రబాబు-జగన్ ఇద్దరూ నేరుగానే రాజకీయ యుద్ధం చేసుకుంటున్నారు. అక్కడ ఇనుప తెరలేవీ లేనందున ఆ దృశ్యాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారపక్షంలో ఉంటూ సొంత పార్టీ ఓడిపోవాలనుకునే విభీషణుల సంఖ్య బహు స్వల్పం. అలాగే తాము ఓడిపోతే బాగుండుననే కోరికలున్న ప్రతిపక్ష జీవులూ కనిపించరు. కాకపోతే టిడిపి వైదొలగితే బిజెపి చంకనెక్కాలన్న వైసీపీ కోరిక ఒక్కటే ఇంకా సజీవంగా కనిపిస్తోంది. అది మినహా మిగిలిన రాజకీయ ముఖచిత్రమంతా బహిరంగమే.
కానీ, తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియదు. ఎవరు ఎవరికి శత్రువో, ఎవరికి తెరచాటు మిత్రులో అంతకంటే తెలియదు. ఎవరు ఎవరితో పొత్తు కడతారో తెలియదు. కమల దళాలు ఓవైపు కేసీఆర్ అండ్ కో ను రాష్ట్రానికి వచ్చి ఆకాశానికెత్తిపోతారు. కానీ అదే లోకల్ కమలనాథులు కేసీఆర్ కుటుంబపాలనపై ఒంటికాలితో లేస్తుంటారు. ఇంత కామెడీ సీన్‌లో కూడా ‘టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని’ బిజెపి నేతలు సీరియస్‌గా పండిస్తుంటారు.
అటు తెలుగుదేశం పార్టీది మరింత సీరియస్ పొలిటికల్ కామెడీ! ఆ పార్టీ చిచ్చరపిడుగు, తెలంగాణకు సీఎం కావాలని కలలు కంటున్న రేవంత్‌రెడ్డి, ఇంకో సీమటపాకాయ్ నర్శిరెడ్డి సీఎం కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ పాలనను రోజూ అదేపనిగా సీరియస్‌గా ఎండగడుతుంటారు. అదే పార్టీ అధ్యక్షుడు అండ్ అదర్స్ మాత్రం కేసీఆర్ సర్కారును బంతిపూలతో కొడుతుంటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసేదిలేదని, అవసరమైతే టీఆర్‌ఎస్‌తోనయినా కలసి పోటీ చేస్తామని ‘కాబోయిన గవర్నర్’ మోత్కుపల్లి సెలవిస్తారు. ఇంత హాస్య సన్నివేశంలో అసలు తెలంగాణలో టిడిపి ఎక్కడుందని కేసీఆర్ అండ్ కో ఎకసెక్కాలాడితే, రేవంత్‌రెడ్డి మినహా మిగిలిన తెలంగాణ తెలుగు సైన్యమంతా టీఆర్‌ఎస్ వైపే ఉందని తెలుగుదేశం మాజీ, తెలంగాణ తాజా దయాకరుడు ప్రకటిస్తారు. మళ్లీ అంతలోనే ఆంధ్రా సర్కారు జలదోపిడీ చేస్తోందని హరీష్ కేంద్రానికి లేఖ రాస్తారు.
అనంతపురం పెళ్లికి వెళ్లిన కేసీఆర్ తెలుగు తమ్ముళ్లతో చెట్టపట్టాలేసుకుని, చెవిలో రహస్యాలు చెప్పుకుంటే, అంత ఓవరాక్షన్ ఎందుకుని ‘తెలుగు చంద్రుడు’ ఆంధ్రా తమ్ముళ్లకు అక్షింతలేస్తారు. పోనీ ఇన్ని లోకోత్తర రాజకీయ దృశ్యాలు చూస్తున్న వారికి ఇద్దరు చంద్రులూ వచ్చే ఎన్నికల్లో తమ మధ్య పొత్తులుండవని కుండబద్దలు కొడతారా అంటే ‘ఆ ఒక్కటీ తప్ప’ అన్నీ చెబుతారు. అవన్నీ ఎన్నికల సమయంలోనేనని దాటవేస్తారు.
అవును మరి! ఏడాదిలో ఎంత మార్పు? ఏడాది క్రితం ఒకరినొకరు కత్తులతో దూసుకుని, ఒకరి సంగతి మరొకరు తేల్చుకునే స్థితి నుంచి, పెళ్లిళ్లు, పబ్బాలకు బొట్టుపెట్టి శుభలేఖలు ఇచ్చుకుని ఆహ్వానించేంత సానుకూల పరిస్థితికి చేరడం నిజంగా అద్భుతమే కదా? పాపం ఇంత విశాల హృదయం లేకనే తమిళనాడులో ఇంకా డిఎంకె-అన్నా డిఎంకెలు ఇంకా బద్ధశత్రువుల్లా కాట్లాడుకుంటున్నాయి. అక్కడ మన తెలుగు మీడియా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్లు ఉండి ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో?! ఇప్పటికయినా కరుణానిధి-పళనిస్వామి అర్జెంటుగా తెలుగు రాష్ట్రాల మీడియా స్వాములను కలిస్తే మంచిది!!
అటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా నేరుగా యుద్ధం చేస్తోందా అంటే అక్కడా నీడలతో యుద్ధాలు చేసే వారే ఎక్కువ. పగలు సర్కారుకు శాపనార్థాలు పెడుతూ, రాత్రి ములాఖత్ అయ్యే శాల్తీలే ఎక్కువన్నది బహిరంగ రహస్యమే. అధికార పార్టీ నేతలతో వ్యాపార-వ్యక్తిగత బంధాలు సరేసరి. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా సర్కారుపై సీరియస్‌గా యుద్ధం చేసే సైనికులు నలుగురైదుగురు కంటే కనిపించరు. మిగిలిన వారిదంతా అవసరార్ధ రాజకీయమే. మరి ఈ పొలిటికల్ సస్పెన్స్ సినిమాలో హీరోలెవరు? విలన్లు ఎవరు? కథను మలుపుతిప్పే పాత్రధారులెవరన్నదే ప్రశ్న.
కథానాయకులు, ప్రతి కథానాయకులెవరన్నది చూచాయగా కనిపిస్తున్నా, ‘కనిపించని నాలుగో సింహం’మాదిరిగా అందరికీ కనిపిస్తూ కథను తనకు అనుకూలంగా మలుపు తిప్పాలనుకునే పాత్రలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనిపిస్తూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల పాలకులకు సలహాదారుగా ఉన్న మీడియా కుల గురువులుంగారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ పాత్రనే పోషించాలని తపిస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతపురం జిల్లా వెంకటాపురం పెళ్లికి పాలకులతోపాటు హెలికాప్టర్‌లో వేంచేసి, అక్కడ రెండు కులాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ఉడతసాయం అనన్య సామాన్యం. పరిటాల రవి సమాధికి నివాళి అర్పించేందుకు కేసీఆర్‌తో కలసి కనిపించిన ఆ భక్తిపూర్వక విన్యాసం చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
అంతేనా? తెలంగాణలో వెలమ వర్గం సంఖ్య తక్కువయినందున, అక్కడ దశాబ్దాల నుంచి స్థిరపడిన కమ్మ వర్గాన్ని, వెలమ వర్గంతో అనుసంధానం చేయించే అతి పెద్ద బాధ్యత భుజానేసుకున్న సదరు మీడియా కులగురువుగారి ప్రయత్నాలపై, సామాజిక మాథ్యమాల్లో వచ్చిన కథనాలు పరిశీలిస్తే ఆయన కష్టం వృధా పోదనిపించకమానదు. ఇటు ఆంధ్ర-అటు తెలంగాణలో కులం కార్డుతో దునే్నస్తున్న మహనీయుల శ్రమదానం ఫలిస్తే, కారు-సైకిల్ కలసి వెళ్లడం, తెలంగాణలో కమ్మ వర్గాన్ని మూకుమ్మడిగా కారెక్కించడం, స్వామివారే సెలవిచ్చినట్లు జలగం వెంగళరావు వెలమ-కమ్మ ఫార్ములా కొనే్నళ్ల తర్వాత మళ్లీ జీవం పోసుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పితామహుడు రవిశంకర్‌కే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిన మీడియా కులపతులను చూసి పత్రికాలోకం గుండె ఉప్పొంగడమే కాదు, మురిసి ముక్కలవుతోంది.
ఈ విచిత్ర రాజకీయ యుద్ధంలో జగన్‌బాబు కూడా తన పాత్ర అద్భుతంగా పోషిస్తున్నారు. తెలంగాణ గడ్డపై సేద దీరుతూ, ఆంధ్ర నేలపై రాజకీయాలు చేస్తున్న పులివెందుల ముద్దుబిడ్డ, గులాబీని రహస్యంగా ముద్దాడుతూనే ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ఎగరేసుకుని పోయినా, ఒక్కగానొక్క ఎంపి గులాబీ గూటికి పోయినా వారిని అనర్హులని చేయాలనే ఆలోచన మర్చిపోయిన ఆయనది విశాల హృదయమే కదా? ఆంధ్రలో బాబు సర్కారు నీటి చౌర్యం చేస్తోందని తన మీడియా ద్వారా ఉప్పందించి, సాధ్యమైనంత మేరకు గులాబీ సేవ చేస్తున్న ఆయన దాతృత్వాన్ని మెచ్చుకోవలసిందే. తెలంగాణలో కాంట్రాక్టు పనులు ఇప్పించుకుని, తనకూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చని నిరూపించుకున్న జగన్ తెలివికి జోహార్లు అర్పించకతప్పదు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు, అటు తెదేపా-ఇటు వైకాపాతో సయ్యాటలాడుతున్న కేసీఆర్ వీళ్ల కంటే అసలైన తెలివైన నేత. కాదన్నవాడు అమాయకుడి కిందే లెక్క!
* * *
పుత్రోత్సాహంలో ‘కమలదళపిత’లూ ఎక్కడా వెనకబడినట్లు లేరు. మేము సైతం అంటూ వారు తమ చిరంజీవుల ఆస్తులు పెరిగేందుకు ఉడత సాయం చేస్తున్నట్లున్నారు. కమలదళపతి అమిత్‌షాజీ ముద్దుల కొడుకు జైషా కంపెనీ ఆదాయం జెట్ స్పీడులో ఎలా పైకి ఎగబాకిందో చెప్పాలని, దానిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతున్న విపక్షాల ఆశను చూస్తే జాలి వేయక తప్పదు. ఒక వ్యక్తి ఆదాయం 50 వేల నుంచి, ఏడాది కాలంలో 80 కోట్లకు ఎలా పెరిగిందన్నది కమలనాథుల దృష్టిలో చచ్చు పుచ్చు ప్రశ్న. నీతి, నిజాయితీ ఆరోప్రాణంగా, అసలు నిజాయితీనే ఇంటిపేరుగా పెట్టుకున్న ‘కస్తూరి కమలం’ ఇంటావంటా అవినీతి వాసన ఉంటుందా? ఏం..ఇటలీమాత అల్లుడు రాబర్ట్‌వధేరా కంపెనీల ఆస్తులు పదేళ్లలో ఎలా పైకి ఎగబాకాయి? ఆరేళ్లలో మన జగన్ బాబుకు అన్ని వేలకోట్లు ఎలా వచ్చి పడ్డాయి? లాలూ అండ్ సన్స్, కరుణానిధి అండ్ దయానిధి మారన్, మాయావతి, వీరభద్రసింగ్, చిదంబరం అండ్ సన్స్ కోట్లకు పడగలెత్తగా లేనిది.. దేశ ఆర్ధిక పరిపుష్ఠి కోసం అహర్నిశలు శ్రమటోడ్చి పనిచేస్తున్న ‘కమలదళపిత’ల తనయులు ఆఫ్టరాల్ వందకోట్ల లోపు సంపాదిస్తే ఎందుకింత గావుకేకలు? 2 వేల రూపాయల కోసం కోట్లాదిమంది ప్రజలకు క్యూలైన్లలో నిలబడే క్రమశిక్షణ నేర్పిన దేశభక్త పార్టీపై నిందలు వేయడం భావ్యమా? ఇటలీ కళ్లద్దాలతో కాదు, మేకిన్ ఇండియా కళ్లద్దాలతో చూడాల్సిన అవసరం లేదా? అందుకే జైషా బాబుకు చిర్రెత్తి పరువునష్టం దావా వేశారు.
అయినా మనలో మనమాట! మన తెలుగురాష్ట్రాల నేతల సుపుత్రుల సంపాదనతో పోలిస్తే ఈ గుజరాత్ చిరంజీవి సంపాదన ఏపాటి? ఇంకా జైషా బాబు ఏదో వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల యువకిశోరాలు చాలామంది వ్యాపారాల వంటి లంపటాలేవీ పెట్టుకోకుండా, ఎంచక్కా రాజమార్గంలో సంపాదిస్తున్న తీరు ఎంత చెప్పినా తక్కువే కదా? ఈ మూడున్నరేళ్లలో కొందరు చిరంజీవుల వ్యాపారాలు మూడువందల రెట్లు ఎలా పెరిగాయో జైషా ఇక్కడకు వచ్చి నేర్చుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో బయటకు కనిపించేది జగన్ ఒక్కరే. కనిపించని జగన్లు బోలెడు!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144