మెయిన్ ఫీచర్

నీ వెంటే.. మేమూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనల్ని మనం జయిస్తే ఆ విజయం చిరకాలం నిలుస్తుంది.. ఆ విజయం ఎలాంటి విచారాన్నీ కలిగించదు’ అనే భరోసాను పిల్లలకు కల్పించినపుడు వారు ఒత్తిడిని చిత్తు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తారు అంటున్నారు నిపుణులు. ఈ చిన్ని విషయాన్ని నేటి యువత అర్థం చేసుకోలేక, అలాంటి ధైర్యం ఇవ్వాల్సిన తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చదువుల పులిపై వారిని బలవంతంగా కూర్చోబెట్టి స్వారీ చేయస్తున్నారు. బంగారు బాల్యం పులిబోనులో బందిఖానా అవుతుంది. ఇలాంటి ఒత్తిడే ఆత్మహత్యలకు కారణమవుతోంది. అందుకే మనదేశంలో ప్రతి గంటకు ఓ భావిభారత పౌరుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సర్వేలు సైతం చెబుతున్నా ..పసిమొగ్గలను పదిలంగా కాపాడుకోలేక పోతున్నాం.

రేపటి రోజున తమను తాము గొప్పగా చూపించుకోవాలనుకున్న చిన్ననాటి కలలను సాకారం చేసుకునే మానసిక స్థైర్యం లేక ఎంతోమంది చిన్నతనంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులా? సమాజమా? నేటి విద్యా విధానమా..? అని ఆలోచించాలి. ఎన్నో ఆశలతో, ఎన్నో వ్యయప్రయాసలతో వారిని పెంచి పెద్దచేసి, వారి బంగారు భవిష్యత్‌కు బాట వేసుకుంటారనే కొండంత నమ్మకంతో తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీలకు పంపిస్తున్నారు. అయితే అక్కడ విద్యాబోధన ఎంతవరకూ జరుగుతోంది? ఈ మార్కుల వెంపర్లాట వారిని ఏవిధంగా ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తోంది? అనే విషయాలపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. మానసికంగా కుంగుబాటుకు అవకాశం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఎదిగే వయస్సులో మానసిక సంఘర్షణకులోనై ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెబితే తక్కువగా చూస్తారేమోననే న్యూనతా భావంతో వారి చిన్ని మనసుల్లో పడే మానసిక ఆందోళనకు చావే శరణ్యమని భావిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం మరేమైనా ఉంటుందా? ఈ ప్రశ్న ప్రతిఒక్కరూ తమకు తాము వేసుకుంటే దానికి సమాధానం పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల కన్నీటి సంద్రమే.
స్నేహంగా మెలిగితే సమస్యలు దూరం
ఇక్కడ రెండు విషయాలని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతసేపూ వారిపై ఉన్న అమితమైన ప్రేమతో పిల్లలు ఏదంటే అది చేయడమే తమ పరమావధిగా భావిస్తున్నారు. అలా కాకుండా వారి మనసులో ఏముందో తెలుసుకుని వారితో స్నేహంగా మెలిగితే వారి బాధను, ఒత్తిడిని పంచుకునే అవకాశం ఉంటుంది. ప్రసార మాధ్యమాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో ఇప్పటి తరం వారికి అవగాహనా పటిమ ఎక్కువనే చెప్పవచ్చు. అందుకని వారికి దేనిమీద ఆసక్తి ఉందో అందులో చేర్పించి చదివిస్తే వారు ప్రపంచాన్ని ఏలేస్తారు. ఇప్పటి తల్లిదండ్రుల్లో ఉన్న మరో దురభిప్రాయం హాస్టల్‌లో ఉంటేనే బాగా చదువుతారని అనుకోవడం. ఇది చాలా పొరపాటు. ‘పిడుక్కీ.. బియ్యానికీ ఒకటే మంత్రం’ అనే సామెతగా అందరికీ అదే పద్ధతి పనికి రాదని చెప్పడానికి ఇటీవల జరిగిన ఆత్మహత్యలే నిదర్శనం. పక్కవారితో పోలుస్తూ తల్లిదండ్రులు మాట్లాడితే చిన్నారులు సహించలేకపోగా.. ఆత్మన్యూనతా భావానికి లోనై ఏం జరిగినా చెప్పలేకపోతున్నారు. దాని గురించే మదనపడిపోతూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కనుక తల్లిదండ్రులు వారి మనోభావాలకి తగిన విధంగా, వారికి నచ్చే విధంగా చదువుకోమని చెబుతూ ఒక కంట కనిపెడుతుంటే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసిన వారవుతారు.
విద్యా సంస్థల్లో ఎదుగుతున్న వయస్సులో వారి మానసిక వికాసానికి కావాల్సిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోగా పొద్దుటి నుండి రాత్రి వరకూ చదువు.. చదువు అంటూ వారిపై ఒత్తిడి తేవడం, అంతేకాకుండా కేవలం ర్యాంక్‌ల ప్రాతిపదికనే చదువు చెప్పటం పిల్లలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. అందువల్ల కేవలం ర్యాంక్ వస్తే చాలు అనుకోవడమే తప్ప అసలు వారు సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోతున్నారు. అందువల్ల ఐఐటిలు, ఎన్‌ఐటిల వంటి ప్రాముఖ్యత కలిగిన విద్యాలయాల్లో సీటు సాధించినా అక్కడి వారితో పోటీ పడలేక, తమకు తాముగా చదువుకోలేక వెనకబడిపోతామేమో అనే భావనతో కూడా వారు చదువు పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. మార్కుల ఆధారంగా ముందు, వెనక సెక్షన్లకు మార్చే విధానం అసంబద్ధం. ఒక పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన జీవితంలో ఆ విద్యార్థి దేనికీ పనికిరాడని నిర్ణయించడం నేటి ఉపాధ్యాయులు చేస్తున్న అతిపెద్ద తప్పు. అనేకమంది మానసిక విశే్లషకులు ఈవిషయమై ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా వారి విధానంలో మార్పు తెచ్చుకోవడం లేదు. అంతటితో ఆగకుండా ఉపాధ్యాయులు వారిని కొట్టడం, బెదిరించడం, భయపెట్టడం వంటి చర్యలు కూడా వారిని మానసికంగా కుంగదీస్తూ చదువుపై ఆసక్తి లేకుండా చేస్తున్నాయి.
ఇంత జరిగాక కూడా ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకురాకపోతే మరింతమంది భావిభారత పౌరులు ఆత్మార్పణలే తమకు విముక్తిగా భావిస్తారు. ఇకపోతే 8 గంటల కనీస నిద్ర కూడా లేకపోవడం వల్ల వారు ఒత్తిడికి గురై మానసిక ఆందోళనతో ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ‘నాకంటే తోపు మరెవ్వరూ లేరు’ అనే ఆత్మస్థైర్యం ప్రతీ విద్యార్థికి కలిగిన నాడు ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి. అలాగే చదువు పట్ల ఆసక్తి కలిగించేలా విద్యా సంస్థల్లో బోధనా పద్ధతులను మార్పుచేయాలి. ఆత్మన్యూనతతో బాధపడే విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి వారికి జీవితం పట్ల ఆసక్తి, అవగాహన కలిగేలా కౌనె్సలింగ్ చేసినప్పుడు ఈ విరిసీ విరియని మొగ్గలు రేపు వికసించిన పుష్పాలై సుగంధ పరిమళాల్ని వెదజల్లుతాయనేది నగ్నసత్యం.

వసుంధర