మెయన్ ఫీచర్

వేడెక్కుతున్న రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చేనెలలో హిమాచలప్రదేశ్‌కు, డిసెంబర్‌లో గుజరాత్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజకీయాలని ఇవి ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే అస్తశ్రస్త్రాలకు పదునుపెడుతున్నాయి. నెమ్మదిగా దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు రెండు జాతీయ పార్టీల జాతకాలను నిర్ణయించనున్నాయి. గుజరాత్‌ను బిజెపి పరిపాలిస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకూ ఈ రెండు ఎన్నికలూ కీలకమైనవే. గుజరాత్ నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం. ఇక్కడ మోదీ మూడుసార్లు వరుసగా ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. అందువలన 2018 నవంబర్‌లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి విజయం సాధించాలంటే గుజరాత్‌ను గెలిచి తీరాలి. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇటీవల పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, పటేల్ రిజర్వేషన్ల ప్రభావం గుజరాత్ మీద పడింది. దీనిని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుంటున్నది. ఈ ముప్పునుండి ఎలా తప్పించుకోవాలా అని బిజెపి వ్యూహరచన చేస్తున్నది. కొద్దిరోజుల క్రితం రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో బిజెపి అభ్యర్థిని ఓడించి అహ్మద్ పటేల్ ఎన్నిక అయినాడు. ఆయన సోనియాగాంధీకి రాజకీయ సలహాదారు. ఇటీవల పంజాబులోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిని కాంగ్రెసు 2 లక్షల ఓట్ల తేడాతో ఓడించటం బిజెపి జీర్ణించుకోలేకపోతున్నది.
కాంగ్రెసు అధినాయకత్వ బాధ్యతలు రాహుల్ గాంధీ స్వీకరిస్తున్నారు. నిజానికి ఈ పని ఆయన గత పదేండ్లుగా చేస్తూనే వున్నారు. కాకుంటే 2018 ఎన్నికలలో ఆరోగ్య కారణాల దృష్ట్యా సోనియాగాంధీ విస్తృత పర్యటనలు చేయలేకపోవచ్చు. కాబట్టి యువకుడైన రాహుల్ ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ‘ఇది అనువంశిక రాజకీయం’ అంటూ బిజెపి ఎదురుదాడికి దిగింది. మరి వసుంధరా రాజే కుమారుని మాటేమిటి? రమణసింగ్ కుమారుని మాటేమిటి? అని కాంగ్రెస్ వాదిస్తున్నది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అనువంశిక రాజకీయాలున్నాయి. తెలంగాణలో కెటిఆర్, ఆంధ్రలో లోకేశ్, జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడులో స్టాలిన్, కేరళలో మురళీధర్, కర్ణాటకలో కుమారస్వామి, యుపిలో అఖిలేష్, పాట్నాలో తేజస్వి...కొన్ని ఉదాహరణలు. ఇది మన ప్రజాస్వామ్య లక్షణం.
కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు హిమాచల్‌ప్రదేశ్‌లో వీరభద్రసింగ్ గెలిచి తీరాలి. లేకుంటే మోదీ కలలు కంటున్న ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ సాధ్యమవుతుంది. అందుకే కమలదళం వీరభద్రసింగ్‌ను కోర్టుల చుట్టూ తిరిగేట్టు చేస్తున్నది. ఎన్నికల విజయాలు కేవలం డబ్బు వెదజల్లడంతోనే సాధించలేరు. ప్రజలకు కొన్ని ఆకాంక్షలు భావోద్రేకాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవటం ద్వారా విజయం సాధించవచ్చు. తెలంగాణలో కెసిఆర్ ‘‘నీళ్ళు నిధులు నియామకాలు’’ అనే నినాదం తీసుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం ‘సామాజిక తెలంగాణ’ అనే పల్లవిని అందుకున్నారు. బిజెపి ‘మజ్లిస్‌నుండి తెలంగాణాను రక్షించండి’ అనే నినాదాన్ని విన్పిస్తున్నది. ‘ఇది బంగారు తెలంగాణ కాదు మద్య తెలంగాణ’ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రత్యేక హోదా’, ‘కాపు రిజర్వేషన్’ వంటి నినాదాలు ఆయా పార్టీలకు ఎంతవరకు డివిడెంట్లు సాధించి పెడతాయో వేచి చూడాలి.
దాదాపు సంవత్సరం సమయం ఉండగానే అప్పుడే లోక్‌సభ ఎన్నికల వేడి మొదలయింది. ఉత్తరప్రదేశ్‌లో సరయూ నదీ తీరంలో నూరు అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతున్నది. త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా మొదలుకావచ్చు. అంతేకాదు, ప్రపంచ టూరిస్టు జాబితాలో నుండి తాజమహల్‌కు బదులు అయోధ్యను చేర్చటం జరిగింది. దీనిని స్థానిక సమాజవాద పార్టీ వ్యతిరేకిస్తున్నది.
ఇప్పుడు కాంగ్రెస్‌ను పూర్తిగా ఇరుకునపెట్టే అంశాలకు బిజెపి రంగంమీదికి తెచ్చింది. అందులో బోఫోర్స్ ఒకటి. 1986లో రక్షణ అవసరాల దృష్ట్యా బోఫోర్స్ శతఘు్నలను భారత్ కొనుగోలు చేసింది. అందులో రాజీవ్ గాంధీకి భారీగా ముడుపులు ముట్టాయి. ఆ మొత్తాన్ని స్విట్జర్లాండ్‌లో ఒక కోడ్ నేమ్ (మెర్బో) పేరులో జమ కట్టారు. ఈ నెలలో ఈ విషయాలన్నీ మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇది కక్షసాధింపు, రాజకీయ దురద్దేశం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. నిజమే కావచ్చు. ఐతే బోఫోర్స్ పరిశోధనాధికారి హైకేల్ హార్స్‌మన్ చెప్పినవి నమ్మదగిన నిజాలే. రాజీవ్ గాంధీ పేరును ఈ పరిశోధన నుండి తొలగిస్తే పది లక్షల డాలర్లు ఇస్తామని, లేకుంటే చంపుతాము అని మైకేల్‌ను బెదిరించారు. ఆనాటి రక్షణ మంత్రి వి.పి.సింగ్‌ను ఆర్థిక శాఖకు మార్చారు. ధక్కర్ నటరాజన్ కమిటీని వేసి కేసును మసిపూసి మారేడు కాయను చేశారు. 2009లో కేసు ఫైలు మూసివేశారు. 2017 అక్టోబర్‌లో మళ్లీ బోఫోర్స్ కేసు విచారణకు వచ్చింది. దీని ప్రభావం స్పష్టంగా ఎన్నికల మీద పడుతుంది. అంటే నేరుగా సోనియాగాంధీ ‘ఇటాలియన్ కనెక్షన్’ ఈ కేసులో ప్రశ్నింపబడుతున్నది. ఎందుకంటే రాజీవ్ గాంధీ, ఖత్రోచి, వి.పి.సింగ్, చంస్వ్రామి వంటి ఈ కేసు సంబంధిత వ్యక్తులంతా చనిపోయారు. ఇప్పుడు మిగిలింది మైకేల్ హార్స్‌మన్, సిగ్నోరా గాంధీ మాత్రమే. ఇలా బోఫోర్స్ కేసు యంగ్ ఇండియా- నేషనల్ హెరాల్డ్ పత్రికల అమ్మకాల కేసు రాబోయే రోజులలో కాంగ్రెస్‌కు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిని తీసుకురాగలవు. మాధవ్‌సింగ్ సోలంకీ పుత్రరత్నం భరత్‌సింగ్ సోలంకీ గుజరాత్‌లో మీడియా మీద ఎందుకు దాడి చేసినట్లు? అంతటి అసహనం దేనికి? బోఫోర్స్ ఫార్స్‌లో ఆనాడు మాధవ సింగ్ సోలంకీ ప్రమేయం కూడా ఉందని ఆయనను పదవినుండి తప్పించారు. అంటే రాజీవ్ గాంధీకి బదులు సోలంకిని బలిపశువును చేశారు. ఇదంతా మూడు దశాబ్దాల నాటి చరిత్ర! ఇవన్నీ 2018 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవు.
సంజయ్ భండారి ఆయుధాల వ్యాపారి. ఆయన దాదాపు పది లక్షల రూపాయల విలువైన విమాన టిక్కెట్లు రాబర్ట్ వాద్రాకు ఎందుకు కొనిపెట్టాడు? ఆ టిక్కెట్ల నెంబర్లు విమానాల పేర్లూ తేదీలూ ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. లండన్‌లో ఇల్లును గిఫ్ట్‌గా వాద్రాకు భండారీ ఎందుకు ఇచ్చినట్లు? ఆ ఇంటి ‘ఇంటీరియర్ డెకరేషన్’ కోసం షాండ్లియర్స్‌ను స్వయంగా రాహుల్ గాంధీ తెప్పించారు. ఆ ఇంటి ఖరీదు ఎంత? ఇందుకోసం బదులుకు బదులుగా (క్విడ్‌ప్రోకో) ఆయుధాల వ్యాపారి పొందిన ‘లాభం’ ఎంత? ఇలా అనేకమైన పరిశోధనాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ భారతదేశపు సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు.
అమేధిలో స్మృతి ఇరానీ చేస్తున్న ఎదురుదాడికి రాహుల్ బాబు తట్టుకోగలడా? ప్రసుతం లోక్‌సభలో ఉన్న నలభై సీట్లు కాక ఇంకా కాంగ్రెస్ పిండుకోవాలంటే ఏం చేయాలి? పంజాబ్ మినహాయిస్తే కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రం మరొకటి లేదు. తెలంగాణలో కెసిఆర్‌ను కాదని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. వెలమ సామాజిక వర్గానికి వున్న ఓట్ల శాతం 1.4 మాత్రమే. కాని రెడ్డి సామాజిక వర్గం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగానే వుంది. కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి సాగిస్తున్న దాడిని టిఆర్‌ఎస్ ఎలా నిలువరించబోతున్నది?
కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం కష్టసాధ్యం. చేసిన తప్పులనే సిద్ధరామయ్య మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. ఇటు ఒక్కళిగ అటు లింగాయత్ సామాజిక వర్గాలను దూరం చేసుకుంటున్నాడు. హత్యకు గురి అయిన కలుబర్గి, గౌరీ లంకేశ్ వంటివారు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు. బెంగళూరు రోడ్లు నరకప్రాయంగా మారితే అక్కడి శాసనసభ్యులు 25 కోట్ల వెండి బంగారు నాణాలు పంచుకుంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇదే! ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి ఓడిపోయిన రోజున గుజరాత్‌లో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఎంత తీవ్రంగా వుందో గమనించారా? మొత్తం గుజరాత్‌ను కాంగ్రెసు వారు ఎలా అవమానించారో ఆయన ఉదహరించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను, ఆయన కుమార్తె మణిబెన్ పటేల్‌ను నెహ్రూ వంశం ఎలా అవమానించిందో పేర్కొన్నారు. నిజమే! పటేల్‌కి భారతరత్న రాకుండా నెహ్రూ పరివారం అడ్డుకున్నది. పి.వి.నరసింహారావును ఎంతగానో అవమానించారు. ఇవ్వాళ పి.వికి భారతరత్న ఇవ్వాలి అని బిజెపి ప్రభుత్వంమీద ఒత్తిడి తెస్తున్నారు. 2019 తర్వాత ఏం జరుగుతుందో చెప్పేందుకు మనం జ్యోతిష్కులం కాదు. కాని కాంగ్రెస్‌కు రాజ్యాధికారం అసంభవం. కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం ఉన్న పరిమిత స్థానాలను నిలుపుకుంటే అదే చాలు. ఇంకా సంవత్సరం కాలం మోదీ చేతిలో ఉంది. ఈ సంవత్సరకాలంలో ఏమైనా సంభవమే!
తెలంగాణలో కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవచ్చు. కొత్తగూడెంలోని (సింగరేణి కార్మికుల) ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలిచినా ప్రత్యర్థుల ఉమ్మడి అభ్యర్థికి 20 వేల ఓట్లు రావడం పరిగణనలోకి తీసుకోవలసిన అంశం. అంటే కెసిఆర్‌కు రాజకీయంగా బిజెపి నుండికన్నా ప్రొ. కోదండరాం నుండి ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పునరుత్థానం ఇక అసంభవం. నంద్యాల ఉప ఎన్నికలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు వెయ్యి మాత్రమే. మొత్తంమీద గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల ప్రకటన దేశ రాజకీయాలను వేడెక్కిస్తోంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్