మెయన్ ఫీచర్

రక్తికడుతున్న ‘తెలుగు’ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల రాజకీయ కోయిలలు తొందరపడి ఏడాది ముందే కూస్తున్నాయి. అధికారంలో ఉన్న రెండు పార్టీలు తమ పథకాలతో తోపాటు, కులాలు-మతాల సమీకరణతో మళ్లీ గద్దెనెక్కే పనిలో బిజీగా ఉన్నాయి. ఆ గద్దెపై కనే్నసిన విపక్షాలు జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికల్లో మునిగిపోయాయి. ఇవన్నీ పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉండగా, బలం పెంచుకునే ఓపిక, తీరిక, శక్తి లేని బిజెపి-వామపక్షాలు తమ సహజ శైలి ప్రకారం.. ఎవరి బలం ఎక్కువగా ఉంటే వారి భుజానెక్కి బలం పెంచుకునే దగ్గరదారిని ఎంచుకునే పనిలో ఉన్నాయి. వారిది పరపోషకాల సిద్ధాంతం మరి! ఏపిలో యాత్రలు, అసెంబ్లీ సమావేశాల శాశ్వత బహిష్కరణ పర్వానికి తెరలేవగా, తెలంగాణలో వలసలు-కొత్త ప్రేమలతో రాజకీయాలు రక్తికడుతున్నాయి.
ఏపిలో జగన్ ఆరునెలల పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. వారాంతంలో ఒకరోజు అలా హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిలబడి, విమానంలో వచ్చి మళ్లీ జనక్షేత్రంలో ఉంటారన్నమాట. సరే.. ఎవరి బాధలు వారివి! తండ్రి బాటలోనే జనంలోకి వెళ్లి అధికారంలోకి రావాలన్న కోరిక ఆయనది. పార్టీ పెట్టిన వారందరికీ తాము అధికారంలోకి రావాలని, సీఎం కావాలని కోరిక ఉండటం సహజం. దాన్ని తప్పుపట్టలేం. కానీ వారి కలలు నిజమవుతాయా? కల్లలవుతాయా అన్నది తేల్చాల్సింది ఓటరుదేవుళ్లే! వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాబు కూడా మీకోసం యాత్ర చేసినా అధికారం దక్కలేదు. కాకపోతే 47 నుంచి 90కి పైగా సీట్లు సంపాదించుకున్నారు. రేపు జగన్ పరిస్థితీ అలాగే ఉంటుందా? అందుకు భిన్నంగా ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పడం సాహసమే అవుతుంది.
నిజానికి గతంలో బాబు మాదిరిగా ఇప్పుడు జగన్‌కూ పార్టీని కాపాడుకుని అధికారంలోకి రావడం కీలకం. బాబు పదేళ్లు ప్రతిపక్ష నేతగా అనేక ఎదురుదెబ్బలు తిని, వైఎస్ ఆకర్ష పథకంతో ఎమ్మెల్యేలు, సీనియర్లనూ పోగొట్టుకున్నా అన్నీ భరించి పార్టీని కాపాడుకున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయి ఉంటే బాబు పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. జాతీయ పార్టీలకు అధికారం లేకపోయినా ఏదో ఒక రాష్ట్రంలో దాని ఉనికి ఉంటుంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీ పదేళ్లు అధికార వియోగం అనుభవించి, మళ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమైతే మనుగడ దుర్లభం.
ముఖ్యంగా పార్టీ నేతలు అధికార పార్టీపై ఆశగా చూస్తుంటారు. అధికార పార్టీ కూడా విపక్షంలో బలహీనులని ఎంచుకుని, దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంటుంది. ఆ పరిస్థితిని బాబు తట్టుకుని మళ్లీ నిలబడ్డారు. మరి జగన్‌కు ఆ పరిస్థితి ఉంటుందా? అన్నది ప్రశ్న. అందుకే ముందు చెప్పినట్లు జగన్‌కు ఈ పాదయాత్ర కీలకం. ఎందుకంటే ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు జారిపోయారు. మరో ఏడెనిమిదిమంది నిష్క్రమించడానికి సాకుల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారం రాదన్న అభిప్రాయం ఏర్పడితే వారిని ఆపడం ఎవరి తరమూ కాదన్నది చరిత్ర చెప్పిన సత్యం. 2009 తర్వాత టిడిపి ఇలాంటి అనుభవానే్న చవిచూసింది. ఇప్పుడు వైసీపీ వంతు.
ఆర్ధిక వనరుల విషయంలో జగన్‌ది వైఎస్‌కు భిన్నమైన మనస్తత్వం. ఆ విషయంలో వైఎస్- బాబుది ఒకే రకమైన మనస్తత్వమైతే, జగన్-లోకేష్‌ది ఒకే తీరన్నది రెండు పార్టీల్లో వినిపించే సరదా వ్యాఖ్య. గత ఎన్నికల్లో జగన్ జనం తనను చూసి, తన తండ్రిని చూసీ తనను గెలిపిస్తారన్న భ్రమల్లో ఉండేవారు. ఇక వనరులు, కష్టాల్లో ఉన్న నేతలను ఆదుకునే విషయంలో బాబు-జగన్‌కూ చాలా వ్యత్యాసం ఉంది. బాబు పదేళ్లు విపక్షంలో ఉన్నప్పటికీ, చాలామంది సీనియర్లను ఆర్ధికంగా ఆదుకున్నారు. నాడు తన పార్టీలో ఉండి, నేడు తెలంగాణలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి కుమార్తె పెళ్లికి 30 లక్షల సాయం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. అప్పటికే సదరు నేత బాబు హయాంలో చాలా శాఖలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో తనకున్న పలుకుబడి ఉపయోగించి, తనను తిట్టి వెళ్లిపోయిన సీనియర్లకు యుపి, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టులు ఇప్పించారు.
ఇప్పుడు ‘తెలంగాణ యువ తుపాను’ కూడా నెల్లూరులో ఓ సబ్ కాంట్రాక్టు పని ఇప్పించి, 20 కోట్ల వరకూ లబ్ధి చేశారన్నది తాజా ముచ్చట. హైదరాబాద్ పార్టీ ఆఫీసులో రోజూ 300 మందికి తక్కువ కాకుండా ‘నిత్యాన్నసమారాధన’ జరుగుతూనే ఉంటుంది. ఇవి కాకుండా తన వద్దకు వచ్చే నాయకుల అవసరాలను తీరుస్తుంటారు. పార్టీ నేతలను ఆదుకునే విషయంలో బాబు ఎక్కడా వెనక్కివెళ్లరు. ఈ విషయంలో లోకేష్ వ్యవహారశైలి తండ్రికి భిన్నంగా ఉంటుందనేది తమ్ముళ్ల మాట. అది వేరే విషయం.
మరి ఈ లక్షణాలు జగన్‌లో ఉన్నాయా అంటే లేవన్నది వైసీపీ నేతల మాట. గత ఏడేళ్ల నుంచి నాయకులు నియోజకవర్గాల్లో పార్టీకి టికెట్ల కోసమో, జగన్ టూర్ల కోసమో, ఆయనిచ్చిన పిలుపుమేరకు నిర్వహించిన ఆందోళనలకో డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేశారు. వాటికి వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితి చాలామంది ఎమ్మెల్యే, ఎంపీలది! బాబు మాదిరిగా జగన్ కూడా వారిని ఆదుకుంటే, ఎమ్మెల్యేలకు పక్కచూపులు చూడాల్సిన పని ఉండదు. అందుకే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తొలిసారిగా జగన్ కొంతమేరకు స్వంత ఖర్చులు పెట్టుకోవలసి వచ్చింది. అయినా పరాజయం పాలుకావడం, ఆ తర్వాత కొద్ది నెలలకే కర్నూలు ఎంపి రేణుక టిడిపిలో చేరడం వైసీపీ శ్రేణుల నైతిక స్థైరాన్ని మరింత దిగజార్చింది. ఫలితంగా కింద నుంచి పై స్థాయి నేతల్లో ఈసారి గెలవడం కష్టమన్న అభిప్రాయం మానసికంగా స్థిరపడింది.
జగన్‌కు బాబు కంటే ఎక్కువ జనాలొస్తున్నా, ఎన్నికల్లో ఓడిపోతోందన్న భావన మరింత బలపడటం వైసీపీ భవిష్యత్తుకు ప్రమాదఘంటికనే! ఈ నిరాశ, నిర్లిప్తత, బేలతనాన్ని పోగొట్టడానికే జగన్ పాదయాత్రను ఎంచుకున్నారన్నది సుస్పష్టం. అది ఆయనకు అనివార్యం కూడా! జగన్ పట్టుదల, మొండితనం తెలిసినందున ఆయన పాదయాత్ర సక్సెస్ అవడంలో సందేహం లేదు. కాకపోతే ప్రతివారం కోర్టుకు హాజరై, మరుసటి రోజు ప్రభుత్వ అవినీతిని విమర్శిస్తే ఎలాంటి స్పందనలొస్తాయన్నదే చర్చ.
* * *
జనసేనాథిపతి పవన్‌కు ఎట్టకేలకు మెలకువ వచ్చింది. అప్పుడప్పుడు విజిట్లు, అవి లేకపోతే ట్వీట్లు, మధ్యలో ప్రెస్‌నోట్లతో రోజులు లాగించేసిన పవన్ కూడా ఓ ఆఫీసు తెరిచారు. అయితే, ఆ ప్రారంభోత్సవంలో సినిమా వాసనలే కనిపించడం బట్టి, కొత్త పార్టీ ఎలా ఉంటుందన్న అంచనా, చర్చ మొదలవడంలో ఆశ్చర్యం లేదు. తనకూ జనంలోకి వెళ్లాలనుందన్న కోరిక చూస్తే, ఆయనా ఏదో ఒక యాత్రకు బయలుదేరేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది. మంచిదే. గతంలో బెజవాడకు వచ్చినప్పుడు పాదయాత్రపై ప్రశ్నలడిగితే నా కారే జనంలోకి వెళ్లడం కష్టంగా ఉందని సెలవిచ్చిన కల్యాణ్‌బాబు, సరిగ్గా జగన్ పాదయాత్ర సమయంలో ఇంకో యాత్రకు సిద్ధమవుతుండంలో మతలబేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అది జగన్ యాత్ర దృష్టి మళ్లించడమా? లేక తానూ ఓ పోటీదారుడినేనని సంకేతాలివ్వడమా? అన్నది చూడాలి. కండలు తిరిగిన బౌన్సర్లు, వందిమాగధులు, జిందాబాదులు కొట్టే ఓటులేని బ్యాచ్‌లు లేకుండా ఏ యాత్ర చేసినా జనం మెచ్చుతారు. జగన్, పవన్ యాత్రాస్పెషల్‌లో ఎవరెన్ని ఓట్లు పంచుకుంటారో, ఎన్ని పెంచుకుంటారో చూడాలి!
* * *
తెలంగాణ టిడిపిలో రేవంత్ నిష్క్రమణతో ముసుగు యుద్ధాలు ముగిశాయి. తెలంగాణ తెలుగుదేశం యోధుడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ సీనియర్లు ఎట్టకేలకు విజయవంతంగా బయటకు పంపించి తెరాస పెదవులపై చిరునవ్వులు పూయించారు. తెలంగాణలో కొనప్రాణంతో ఉన్న పార్టీకి కాసింత ఆక్సిజన్ ఇస్తున్న ఆయనను పంపించడం ఏమాత్రం తెలివైన పనికాదన్నది మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే- మోత్కుపల్లి, అరవిందకుమార్ గౌడ్, నర్శిరెడ్డి వంటి అతికొద్దిమందిని మినహాయిస్తే.. పట్టుమని పదిమందిని ఆకర్షించి చప్పట్లు కొట్టించుకునే సీనున్న వాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. మహానాడులో రేవంతుకు వినిపించిన చప్పట్లే దానికి నిదర్శనం.
అయితే, రాజు-వైద్యుడి చందంగా అటు రేవంతుడు కూడా నిష్క్రమణ ఆశించారు. బాబు వచ్చే వరకూ వేచి చూడకుండా తమ్ముళ్ల దూకుడు ప్రదర్శన టీఆర్‌ఎస్‌కు తప్ప మరెవరికీ ఉపయోగం లేదు. నిజానికి రేవంత్ ఇతర పార్టీలతో స్నేహాలు చేస్తున్నట్టే, ఆయనను తప్పు పట్టే తమ్ముళ్లూ టీఆర్‌ఎస్ నాయకత్వంతో చీకటిస్నేహాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
తెలంగాణ రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే రేవంతుకు మరో మార్గమూ లేదనిపిస్తోంది. టిడిపి-టీఆర్‌ఎస్‌కు ప్రేమ వివాహం జరిపేందుకు ‘వెల్‌కమ్’గ్రూపు శ్రమదానం చేస్తోంది. ఏపిలో బాబు సర్కారు వల్ల లబ్థిపొందుతున్న మీడియా కులగురువులు, తెలంగాణలో టిడిపి కార్యక్రమాలకు గుర్తింపు ఇవ్వడం లేదు. మరి అలాంటి వారికే ఏపీలో బాబు పెద్దపీట వేస్తున్నారు. కులగురువుల ప్రయత్నాలు ఫలించి టీఆర్‌ఎస్-టిడిపి పొత్తు పొడిస్తే, కేసీఆర్ వ్యతిరేక అజెండాతో వెళుతున్న రేవంత్ భవితవ్యం శూన్యమవుతుంది. ఇప్పటివరకూ టిడిపి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే పార్టీ కంటే తాను పెరిగి, ‘కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం’ అన్న కీర్తి సాధించారు. ఆ విషయంలో రేవంత్ తన రాజీనామా లేఖలో నిజాయితీనే ప్రదర్శించారు. ఓటుకు నోటు కేసులో పార్టీ కోసమే జైలుకెళ్లి ఆ రుణం తీర్చుకున్నారు. చివరాఖరకు బాబుకు రాజీనామా లేఖ ఇచ్చి సగౌరవంగానే వెళ్లిపోవడం టిడిపికి శరాఘాతమే. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా ఇచ్చి నైతికంగా మరో మెట్టు ఎక్కిన రేవంత్ నిర్ణయం పార్టీ మారిన వారికి చెంపదెబ్బనే. కానీ.. తెలంగాణలో రాజకీయ శత్రువెవరో ఇప్పుడైనా స్పష్టత ఇవ్వకపోతే మరింత మంది రేవంతులు తెరపైకొస్తారు. తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు వరం!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144