మెయన్ ఫీచర్

ఆశ నిరాశల మధ్య ఉపాధ్యాయ నియామకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడిగడుతున్న దీపం ఎప్పుడైనా ఆరిపోతుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగం తీరు దీనికి భిన్నంగా లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిందనే సంబరం లేక తెలంగాణలో, అవశేష (నిజానికి విశేష) రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య పెనంపై నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. విభజన జరిగినవెంటనే ఇరు ప్రాంతాల్లో పునరుర్జీవం పొందాల్సిన విద్యారంగం మరింత పతనపు అంచులకు చేరుకుంది. ప్రతిష్ఠకు పోయిన తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఓ డిస్సీని పెట్టి దాదాపు 22,814 ఉపాధ్యాయ పోస్టుల్ని నింపాలని గత సెప్టెంబర్ 17న మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా నేటికీ ఆచరణకు రాలేదు. అటు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును మభ్యపెట్టడానికై డిఎస్సీ స్థానంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి) అనే ఓ ఆచరణ సాధ్యం కాని ప్రక్రియను ముందుకు తెచ్చింది.
విడిపోయినందుకు ఆంధ్రప్రదేశ్‌లో, కొత్త రాష్ట్రం ఏర్పడి నందుకు తెలంగాణలో గతంలోలా ప్రతీ సంవత్సరం పాత విధానంలో డిఎస్సీలు నిర్వహించబడినా శిక్షణ పొందిన ఉద్యోగార్ధులలో కొంత ఊరట జరిగేది. విడిపోయినా బాగుపడుతున్నామని, కొత్త రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నామని యువత సంబరపడేది. దాదాపు 180 దాకా వుండే వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో అత్యధికంగా ఉపాధి అవకాశాలుండేది విద్యాశాఖలోనే! తర్వాతనే ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ వస్తాయి. ముఖ్యంగా విద్యాశాఖ, ఆరోగ్య శాఖ బాగుంటే రాష్ట్రం యావత్తు సంక్షేమంగా, ఆరోగ్యంగా వున్నట్టుగా పరిగణించవచ్చు! కాని ఈ విషయంగా ఇరు రాష్ట్రాలలో ఈ రెండు శాఖలు అనారోగ్యంగా కునారిల్లుతునే వున్నాయి. కనీసం ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లా, ఇప్పుడు కొనసాగినా బాగుండేవి. అదీ లేకుండ, ఒకరిని చూసి మరొకరు పోటీపడాలనుకోవడమే కానీ, చేపడుతున్న చర్యలు శూన్యమే
నిజానికి తెలుగుదేశం హయాంలో విద్యారంగానికి గడ్డు రోజులని భావించినా, ఇప్పటి ప్రభుత్వాల విధానాన్ని చూస్తే, నాడే విద్యారంగం కొత్త పుంతల్ని తొక్కింది. పదివేల ఎల్‌ఎఫ్‌ఎల్ పోస్టుటలు, ఎలాంటి కార్పస్ ఫండ్ లేకుండా అన్ని పాఠశాలలు సెకండరీ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ కావడం, విషయాల వారీగా (ఎస్‌ఏ) పోస్టులు సృష్టించబడడం, ప్యానల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులుగా, జూనియర్ డైట్ కాలేజి లెక్చరర్లుగా (505, 5338, 95, 96 జీవోలు) ప్రమోషన్లు పొందడం జరిగింది. దీనికి కొనసాగింపుగా వైఎస్‌ఆర్ హయాంలో 6000 సక్సెస్ స్కూళ్లు, కెజివిబిలు ప్రారంభించబడి మరికొంత ప్రోత్సాహాన్ని ప్రభుత్వ విద్యారంగానికి అందించడం జరిగింది. ఇక రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కాలంనుంచే విద్యాశాఖ గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికై డిఎస్సీ పరీక్షకు అదనంగా టెట్ (టిఇటి)ను ప్రవేశపెడితే ఎవరూ వ్యతిరేకించని పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాతనన్నా దీనిపై ఓ రివ్యూ జరిగిందా అంటే, లేకపోగా, టెట్, డిఎస్సీలంటూ ప్రకటనల్ని ఇస్తూ, కోచింగ్ సెంటర్లను మేపడానికి (వీటికి రాజకీయ పలుకుబడే!), చెత్తరకం గైడ్లను, మెటీరియల్‌ను అమ్మి సొమ్ము చేసుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దోహదపడుతున్నాయి.
ఉపాధ్యాయ ఖాళీలతోపాటు, ఆలనాపాలనా లేక, పిల్లలు రాక అస్తవ్యస్తంగా మారితే, సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతను, జవాబుదారీతనాన్ని మరిచి, పాఠశాలల మూసివేతకు పూనుకున్నాయి. రోగి వైద్యుడి మధ్య వుండే సంబంధం చెడినట్టే ప్రజల, ప్రభుత్వం మధ్యన ఉండాల్సిన సంబంధాలు పూర్తిగా రాజకీయమయం అయిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది. ఎన్నికల హామీలు కాకున్నా, రాజ్యాంగబద్ధంగా పాలన అందించాల్సిన ప్రభుత్వాలు కోర్టుల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం ప్రారంభించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని కూడా ఇదే! నిజంగా తెలంగాణ ఏర్పాటు కాగానే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మొదలైనా దాదాపు ఓ పదివేల పోస్టులు నింపబడేవి. కొంతలో కొంత పాఠశాలలు సక్రమంగా నడిచేవి. పాఠశాలలు మూత పడేవి కాదు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగేది. శిక్షణ పొంది, నిరాశపడి, ఆత్మహత్య చేసుకున్నవారు ఈ సమాజానికి పనికివచ్చేవారు. పైగా రెగ్యులర్ పాఠశాలలు ఇలా నిరాదరణకు గురయ్యేవి కావు. వీటిని ఇలా గాలికి వదిలి, ప్రత్యామ్నాయంగా కులాలు పేరున, మతాల పేరున రెసిడెన్షియల్ పాఠశాలలంటూ మరో కొత్త ప్రక్రియను చేపట్టి, విద్యారంగాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా నడిపే ప్రయత్నం ప్రారంభించింది. పోనీ, వీటినన్నా ఉపాధ్యాయ నియామకాలు జరిపి అన్ని హంగులతో ప్రారంభించిందా అంటే అది లేదు. కేవలం భవన నిర్మాణాల పేరున కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి, ఉపాధ్యాయ నియామకాల్ని పెద్దగా పట్టించుకోలేదు. (365 మంది ఉపాధ్యాయులు రాత పరీక్ష ఫలితాల ప్రకటన తప్ప!). దీంతో ఈ పాఠశాలలో కూడా, ముఖ్యంగా మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులు (ఆంగ్ల మాధ్యమం అయినా) చేరడానికి అనాసక్తిని చూపుతున్నారు. ఓవైపు విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూనే, అప్పటికే ప్రమాదపుటంచుకు చేరిన ప్రభుత్వ విద్యను మరింత పతనావస్థకు నెట్టింది.
ఇక రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి, అటు సుప్రీంకోర్టు ఆదేశాలు తోడు కావడంతో విధిలేక తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీల స్థానే ఈ కొత్త ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టింది. గత అనుభవాల దృష్ట్యా సర్వీస్ కమిషన్ చేపట్టే ఏ నియామకం కూడా సక్రమంగా జరగదని తెలిసిందే! అనేక లొసుగులతో ప్రకటనలివ్వడం, అర్హతల్ని సరిగా నిర్దేశించకపోవడం, పరీక్షల్లో అవకతవకలు (ఇప్పుడు ఆన్‌లైన్ అయినా, ఇది న్యాయంగా జరుగుతుందనే నమ్మకం లేదు), ఫలితాల విడదలలో జాప్యం, నియామక ప్రక్రియ అంతా అస్తవ్యస్తమే! దీనికి తోడు, కొత్త జిల్లాల ఏర్పాటుతో, స్థానిక (లోకల్) అనే మరో సమస్య అభ్యర్థుల్ని వెంటాడుతోంది. దీన్ని ముందు పరిష్కరించుకోకుండా, కొత్త జిల్లాల వారిగానే నియామకాలు అనడంతో వేలాదిమంది స్వంత ప్రాంతాల్లోనే స్థానికేతరులుగా (నాన్ లోకల్) మారిపోతారు. దీంతో 20 శాతం కోటాపై విపరీతమైన పోటీ ఏర్పడి, ఉన్న కాస్త ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి. నిజానికి, తెలంగాణ ఏర్పడగానే, ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, శాస్ర్తియ పద్ధతిలో ఉపాధ్యాయుల్ని నియామకం చేయడానికి తగు సూచనల్ని ఇవ్వమని ప్రభుత్వం కోరాల్సింది. అంతకు ముందే టెట్‌ను పూర్తిగా రద్దు చేయాల్సింది. ఓ అపనమ్మకమైన పంతులుగిరి ఉద్యోగానికి, ఎడ్‌సెట్, డైట్‌సెట్ రాయడం, వేలాది రూపాయలు పోసి రెండు సంవత్సరాలు శిక్షణ పొందడం, రిక్రూట్‌మెంట్‌కై ఏళ్ల తరబడి ఎదురు చూడడం, వయసుమీద పడడం, పెళ్లిళ్లు కాకపోవడం, కుటుంబ పోషణం, ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటూ, డిఎస్సీల పేరున, టెట్‌ల పేరున కోచింగ్‌లపై కోచింగులు తీసుకోవడంవల్ల ఇల్లే కాదు, ఒళ్లుకూడా గుల్లబారే చర్యలే! ఇంత తతంగం తర్వాత ప్రభుత్వ టీచర్లుగా ఎంపికైతే వీరు సరిగా బోధించరని ప్రభుత్వం, సమాజం అనుకోవడమే కాదు, స్వయానా ఉపాధ్యాయులే భావించడం ఈ విధానంలోని డొల్లతనాన్ని తెలుపుతుంది. కాబట్టి మొత్తంగా ఉపాధ్యాయ ప్రక్రియనే ప్రక్షాళన చేయాల్సి ఉంది. దీనికి ముందుగా ఉపాధ్యాయ శిక్షణ విద్యను నియంత్రించాలి. ఇవి ప్రభుత్వ రంగంలోనే వుండాలి. అంటే తెలంగాణలో జిల్లాకొకటి చొప్పున, ఆంధ్రప్రదేశ్‌లో డివిజన్‌కు ఒకటి చొప్పున డి.ఇడి కాలేజీలు (ఇందులోనే పిఇటి, ప్రీ ప్రైమరీ శిక్షణలుండాలి) ఉండాలి. ఇక బిఇడి కళాశాలలు (ఇందులోనే బిపిఇడి) తెలంగాణలో పాత జిల్లాకొకటి చొప్పున, ఆం.ప్ర.లో జిల్లాకొకటి చొప్పున వుంటే సరిపోతుంది. ఈ శిక్షణను నిర్దిష్టంగా నడిపితే సుశిక్షితులైన ఉపాధ్యాయులు తయారవుతారు. వీరిని ఏర్పడే ఖాళీలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం జూన్ నాటికే ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నియమిస్తే విద్యారంగం సాఫీగా సాగి, ప్రభుత్వానికి అనేక సమస్యలు తగ్గుతాయి. రాష్ట్ర విభజన తర్వాతనన్నా ఇరు రాష్ట్రప్రభుత్వాలు ఇటువైపుగా ఆలోచించినా, కొంతలో కొంత యువతలో అశాంతి తగ్గేది. ప్రభుత్వాలపై నమ్మకం పెరిగేది. పైగా ఇరు ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం, నియంత్రించకపోవడం, ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం జరుగుతునే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రకటన వెలువడకపోగా, ప్రకటన వెలువడిన తెలంగాణలో పరీక్షలెప్పుడో తెలియదు. ఇప్పటికే లక్షలాదిమంది తిరిగి కోచింగ్ సెంటర్లలో చేరి, జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, రాజస్థాన్ ‘కోట’గా వెలిగిపోతూనే ఉన్నది. సరియైన సమయంలో సరియైన విధంగా యువత శక్తిని వినియోగించుకోవాల్సిన రాజ్యం, వారి శక్తియుక్తుల్ని, మేధో సంపత్తిని అపసవ్య దిశలో తిప్పుతున్నది. ఇది సంక్షేమ రాజ్యపు ఆలోచనా విధానం కాదు. ఏ దేశమైనా యువత సేవల్ని 20-30 వయసులోనే వినియోగించుకుంటుంది. అదే నిజమైన ప్రయోక్తర, ఉపయోగ దశ. ఈ దశ దాటితే వారినుంచి అందేది వట్టి ఊక మాత్రమే! కాని ఈ దేశంలో ఏనాడు యువతను సక్రమంగా సమాజ నిర్మాణంలో పాల్గొనేలా చేయడంలేదు. ఉత్పత్తిలో భాగస్వామ్యం చేసే చర్యలు మృగ్యం! పైగా కులవృత్తులలో వినియోగించబడే ఈ విధానానికి ఈ పనికిరాని విద్య గండికొట్టి, యువతను రెంటికి చెడ్డ రేవడిలా చేస్తున్నది. నిరాశల పల్లకిలో ఊరేగలేని యువత తనువును చాలిస్తున్నది. తీవ్రవాదంవైపు అడుగులు వేస్తున్నది. దీనికి ముగింపు పలకాలంటే, ముందుగా విద్యారంగం సమూలంగా ప్రక్షాళన జరగాలి. ఉపాధితో ముడిపడే విద్య, శిక్షణ పొందితే ఉపాధి గ్యారంటీ అనే వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. విద్యకు, శిక్షణకు, సాంకేతిక అనుభవానికి, సమాజానికి అనులోమానుపాత సంబంధం ఉండాలి. అప్పుడే యువత శక్తి యుక్తులు దేశానికి వినియోగింపబడుతాయి. లేదంటే మరింతగా గాడి తప్పుతుంది. ఇప్పటికే ఇది చేజారిందని గుర్తించకపోతే, పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162