మెయిన్ ఫీచర్

తత్వదర్శి ..సమదర్శి శ్రీ రమణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైదిక కర్మ సదాచారములకు పుట్టినిల్లు. అయినా ఈ భరత ఖండమునందు ఎంతోమంది మహర్షులు, యోగులు తమ వాక్కులతో చేష్టలతో ప్రజలను ప్రభావితం చేసారు. వౌనస్వామిగా విశ్వవిఖ్యాతి నొందిన రమణ మహర్షులు ఈ కోవకే చెందుతారు. ఆర్తి లేనిదే ఆత్మ సాక్షాత్కారం కాదు అని ప్రబోధించిన ఈ తత్వ జీవి తిరుచ్చిలో పుట్టి మధురలో పెరిగి పదహారవ ఏట అరుణాచలమునందు ఆత్మవిచారము పొందారు. ఈయన స్వేచ్ఛను ఎక్కువగా ప్రేమించేవారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేవారు. ఈయన తన జీవన పర్యంతం తోటివారితో ఇది చేయి అది చేయి అని ప్రబోధించలేదు. కానీ ఏ పని చేస్తూ వున్నా ఇది నేను చేస్తున్నాను అనే భావనను విసర్జించమన్నారు. అద్భుతాలు సిద్ధులు వీరికి ఎరుకే కానీ వాటిని ప్రదర్శించుటకు ఏరోజూ ఇష్టపడలేదు. వీరి మతానుసారం ఆవహించిన అజ్ఞానమును వదిలించుకొనుటయే ఆత్మసాక్షాత్కారం. ఈయన మానవులతో సమానంగా పశుపక్ష్యాదులను ప్రేమించేవారు. ఒక పర్యాయం రమణ మహర్షులు విశ్రాంతి తీసుకుంటుంటుండగా ఒక కోతి పొట్టన బిడ్డనుంచుకుని వారి వద్దకు రాబోతు వుండగా స్వామివారి పరివారం నిలువరిస్తున్నారు. స్వామివారు పరివారమును ఆగమని సంజ్ఞ చేయగా వారు ఆగారు. ఆ కోతి రమణులవారిని చేరి తన బిడ్డను వారికి చూపి ఆనందంతో కిచకిచలు పోయింది. రమణుల వారు ప్రేమగా కోతిని కోతిబిడ్డను నిమిరారు. అప్పుడు అచటనుండి కోతి ఎవరినీ బాధపెట్టక వెడలింది. అపుడు రమణులు అచటవుండే వారిని ఉద్దేశించి తమ సంతతిని నాకు చూపించి ఇచటకు వచ్చే సందర్శకులు సంతోషపడతారు. ఈ కోతి కూడా తన బిడ్డను చూపుదామని వచ్చింది అన్నారు. అదీ భూతదయ అంటే. సకల జీవరాశిని సమభావంతో చూడగల తత్వదర్శ సమదర్శి ఆయన.
ఈయన మానవాళి అందరు చక్కటి జీవన విధానం హెచ్చు తగ్గులు లేకుండా వుండాలని భావించారు. తన ఆశ్రమంలో వుండేవారికి రమణుల వారు తెల్లవారుజామునుండి వంటయందు సహాయం చే సేవారు. వీరు వంట చేస్తే ఎంతో రుచి. ఒకమారు పరివారం రెండురకముల పాకములు తయారుచేస్తున్నారు. ఇంకొక వంట ఎవరికని రమణులు ప్రశ్నించగా బహిష్టు స్ర్తిలకు అని సమాధానం వచ్చింది. అయ్యా బహిష్టు ఆగుట అనేది ప్రత్యేకంగా చేసే పాపం కాదు ఇది ప్రకృతి ధర్మం ఇలా విడివిడి వంటలు చేయవద్దు అందరికీ ఒకేవిధమైన వంట చేయండి అని సూచించారు. సమానత్వం అనేది వంటబట్టించుకోమని అందరికీ సలహా ఇచ్చారు. ఇతరులపట్ల తగిన శ్రద్ధ కలిగి వుండడమే ఆధ్యాత్మిక సాధనకు తొలిమెట్టు అని వీరి భావన. మానవుడు తనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వము కలిగి వుండకపోవడమే సహజ ఆధ్యాత్మిక ప్రాప్తి అని అనేకసార్లు తెలియజెప్పారు.
ఈయన స్వయంగా ఒక గొప్ప ఋషి అయినప్పటికీ ఎవరిపైనా ప్రత్యేక అభిమానం చూపలేదు. వీరి దృష్టి ఎప్పుడూ ఏకత్వ భావనపై వుండేది. నాకు ఎవరూ ప్రత్యేకించి శిష్యులు లేరు నేను ఎవరికీ గురువును కాను ఎందుకంటే అద్వైత స్థాయి పరమార్ధం ఏమిటంటే ద్వంద్వ భావనలు లేకుండా ఏక భావన కలిగి ఏకాత్ముకని చేరుటయే. వౌనం అంటే పెదాలు కదల్చకుండా వుండుటయే కాదు ఇది ఒక మనోభావన అని రమణుల అభిప్రాయం. ఈయన స్వయంగా మితభాషి. కేవలం ఈయన చల్లటి చూపులతో లేదా దర్శన భాగ్యంతో సమస్యలు తీరినవారు మనశ్శాంతి పొందినవారు ఎందరో. వారు తమ అభిప్రాయాలు అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. వీరు కుల మతములకు అతీతులు ఎందుకంటే నిన్ను నీవు అంతర్లీనంగా అనే్వషించుకో ఫలితంగా నీలోఅంతర్లీనంగా వుండే ఆనంద స్వరూపమును గుర్తించగలుగుతారు. ఈ దేహమే నేను అనే భ్రభమ వదిలించుకుంటే అంతా బోధపడుతుంది అని చెప్పేవారు.
తనను ఆశ్రయించిన లేదా దర్శించిన వారికి ‘అయ్యా భక్తితోపాటు ప్రపత్తిని కలిగి వుండండి. భక్తి అంటే సరే మరి ప్రపత్తి అంటే మనకు ఇష్టమైన వారికి అర్పితం అవడం. ఈ ప్రపత్తి యందు అహంకార భావన అసలే వుండదు. ప్రతిఫలాపేక్ష ప్రసక్తి లేదు. ప్రపత్తిగల భక్తుడు భగవంతునినుండి మోక్షం సైతం ఆశించడు. భగవంతుని ప్రేమించుట మాత్రమే ప్రపత్తి గల భక్తునికి తెలుసు. శరీర ధ్యాస అనేది ఒక జాడ్యం’ అని సెలవిస్తారు భగవాన్. మనిషి సుషుప్తిలో ఎంతో సంతోషంగా వున్నట్టు వుంటాడు. కానీ మెలకువలో శరీర ధ్యాస వలన నాది పోయే నాదిపోయే అని అన్నీ మరిచి వెదుకులాడుతు వుంటాడు. ఎవరైతే శరీర ధ్యాసకు అతీతులో వారు అంతటా విజయం సాధిస్తారు. వీరి మతానుసారం అనుగ్రహం అంటే భగవంతుని కరుణ. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే భగవంతుని స్మరించను కూడాలేము. కష్టసుఖములు రెండూ భగవంతుని అనుగ్రహమే. కష్టసుఖములను రెండింటిని సమ దృష్టితో చూడగల శక్తి ఏకాగ్రతతో కూడిన స్మరణ వలనే సాధ్యమని రమణులు చెప్పేవారు. వీరి దృష్టిలో మనసే జింక మనసే పులి. వాస్తవానికి ఆత్మకు ఇది తనది ఇది పరాయిది అనే భావన ఇది లోపల ఇది బయట అనే భావన వుండదు. వీరి మతానుసారం దేహం అంటే ద్వైతము దేహమంటే నేనుకాదు అనుకోవడం అద్వైతం. నేను ఎవరు అనే విచారముకు మించిన జపము లేదు.
సమాధి స్థితి గురించి వివరణ ఇస్తూ ఇంద్రియములు తాము చేసే పనులు . తమస్సు అణగిపోతే అది నిద్ర. ఇంద్రియములు తాము చేసే పనులు మెలకువలో ఆగిపోతే అది సమాధి స్థితి. దీనికి సాధన చాలా అవసరం. సాధకులు ద్వివిధములు కృతోపాసకులు, అకృతోపాసకులు. కృతోపాసకులు ఎటువంటి వాసనలు అంటవు. వీరు ఏకాగ్రతతో గూడిన సాధనతో గురువు సలహాలతో గమ్యం సులువుగా చేరుతారు. అకృతోపాసకులు చాలా శ్రమకు ఓర్చి సమాధి స్థితి చేరగలుగుతారు. ధ్యానం అనేది ప్రయత్న సిద్ధం కాని సమాధి స్థితి అనేది అప్రయత్న సిద్ధం. సంతోషము అనేది మూడు విధములు. అవి వరసగా ప్రియము, మోదము, ప్రమోదము. మనం ఏ వస్తువును కోరుకున్నా అది చేరువలో ఉంటే ప్రియం. తనదైతే మోదం. అదే వస్తువును అనుభవిస్తే ప్రమోదం. కాని సంతోషమునకు పాత్రమయ్యే వస్తువు వైరాగ్యం అయి వుండాలి. అది మోక్ష ప్రాప్తికి దారి తీస్తుంది.

-వేదగిరి రామకృష్ణ