మెయిన్ ఫీచర్

సందడే..సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ మాధ్యమం ద్వారా పిల్లల్లో వారి భవిష్యత్ పట్ల బాధ్యత, మనస్తత్వాన్ని, నైతిక విలువలను, మానవీయ ఆదర్శాలను పెంపొందించడం ప్రధానంగా తీసుకొని బాలల చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. కానీ కమర్షియల్ విలువలతో నిర్మించిన చిత్రాల స్థాయిలోనే బాలల చిత్రాలను ఆలోచించడంతో అనుభూతి ప్రధానమైన సినిమాలు కనపడటం లేదు. పరిశ్రమ నిరంతరం కామెడీ, లవ్, హారర్, కమర్షియల్ అంశాల వైపే తిరగడంతో బాలలకు నచ్చిన విధంగా సినిమాలను ఆలోచించడానికే భయపడుతున్నారు. గతంలో రాజు-పేద, లేత మనసులు, బాల మిత్రులకథ, గమ్మత్తు గూఢచారులు, పాపం పసివాడు, రాము, లిటిల్ సోల్జర్స్‌వంటి చిత్రాలను అందించిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు చేతలుడిగి చోద్యం చూస్తోంది. ఇప్పటి వరకూ చెప్పిన సినిమాలన్నీ కమర్షియల్ పంథాలో బాలలకు నచ్చిన విధంగా నిర్మించిన చిత్రాలే. అయితే ఇప్పుడు బాలల చిత్రాలు అంటేనే క్లాసికల్‌గా ఉండే నిశ్శబ్ద చిత్రాలు అన్న అపోహలో కొంతమంది ఆ చిత్రాలను నిర్మించడానికి ముందుకు రావడం లేదు. నిర్మాతలకు సబ్సిడీలు ఇస్తున్నా.. బాలల చిత్రాలు ఎలా నిర్మించాలో తెలియక నిర్మించడమే మానుకుంటున్నారు. మన హైదరాబాద్‌లో ప్రతి రెండేళ్లకోసారి బాలల పండగ జరుపుకుంటున్నట్లుగా.. ఈసారి కూడా జరుపుకుందాం అంటే చరిత్ర క్షమించదు.

మెరుపు మెరిస్తే, వాన కురిస్తే అవి తమ కోసమే అని అనుకుంటారు పిల్లలు. వారి అభిరుచికి తగిన విధంగా చిత్రాలను నిర్మిస్తే, మా కోసమే అని సంబరపడతారు. కానీ ఆ సంబరం ప్రస్తుతం దేశ చలనచిత్ర పరిశ్రమలో కించిత్తు కూడా కనిపించడంలేదు. ఆడే పాడే పిల్లలకు ఆటపాటలతో పాటు, కదిలే బొమ్మల కబుర్లు చెబితే వారి మానసిక వికాసానికి పెద్దలు ఎంతో సేవ చేసినట్లని చాచా నెహ్రూజీ చెప్పారు. అందుకు తగ్గట్లే బాలల కోసం ప్రత్యేక సినిమాలను నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారికి వినోదంతో పాటు వికాసం కలిగిస్తూ మానవీయ విలువలు నేర్పడానికి నైతిక విలువల గొప్పతనాన్ని చెప్పటానికి సినిమా మాధ్యమం ప్రధానమైన అంశంగా మారింది.
చారిత్రక నగరం హైదరాబాద్ వేదికగా 8 నుండి 14 వరకు 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్డెన్ ఎలిఫెంట్ పేరుతో అతి పెద్ద ఉత్సవంగా జరిపే ఈ చిత్రోత్సవ ప్రారంభ ము గింపు వేడుకలను శిల్పాకళావేదికలో నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐసిఎఫ్‌ఎఫ్‌ఐ), చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఎస్‌ఐ), కేంద్ర సమాచార, ప్రసార శాఖలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను పండగ వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకుగాను వివిధ రంగాలకు చెందిన 42మంది ప్రముఖులతో ఆర్గనైజింగ్ కమిటీని నియమించారు. ఈ చలనచిత్రోత్సవంలో 19మంది జ్యూరీ మెంబర్స్‌ను ఎంపిక చేయగా, వీరిలో భారతదేశం నుండి 8మందిని ఎంపికచేశారు. ఈ చలనచిత్రోత్సవంలో 93 దేశాలు పాల్గొంటున్నాయి. 295 సినిమాలు ప్రదర్శించనున్నారు. అన్ని దేశాల నుండి 291మంది చైల్డ్ డెలిగేట్స్, మన రాష్ట్రం నుండి 50మంది చైల్డ్ డెలిగేట్స్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఘన స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేశారు. వీరు బస చేసేందుకు అన్ని ఏర్పాటు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాల నుండి 1, 408 చిత్రాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకు తమ ఎంట్రీలను చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. చిత్రాల ప్రదర్శనకు ప్రసాద్ ఐ మ్యాక్స్‌ను ఎంపిక చేశారు. అంతేకాకుండా బుద్ది మాంద్యం, వికలాంగులైన పిల్లల కోసం తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో ప్రత్యేకంగా చిత్రాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బాలల చలన చిత్రాల ప్రదర్శనను హైదరాబాద్ జంటనగరాల్లో కాకుండా అన్ని జిల్లా కేంద్రాలలో ఒక థియేటర్‌లో కూడా ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయ. సుమారు 1.50 లక్షల మంది పిల్లల కోసం 45 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అద్దెకు తీసుకొని పిల్లలను థియేటర్ల వరకు తీసుకురావడం, తిరిగి పంపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఉత్సవాలలో ప్రదర్శనకు గాను షాను, మట్టిలో మాణిక్యాలు, ఎగిసే తారాజువ్వలు, డూ డూ ఢీ ఢీ, ఇండీవర్ స్పెషల్ ఫిల్మ్‌గా పూర్ణ తెలుగు చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈశ్వర్ (అత్తాపూర్), శివపార్వతి (కూకట్‌పల్లి), రంగా (జీడిమెట్ల), మహాలక్ష్మి (కొత్తపేట), ప్రశాంత్ (సికింద్రాబాద్), సినీ-పోలీస్ స్క్రీన్-3,4 (మల్కాజ్‌గిరి), హైటెక్ (మాదాపూర్), కుమార్ (కాచిగూడ), గోకుల్ (ఎర్రగడ్డ) సినిమా థియేటర్లను ఎంపిక చేశారు. తెలుగు లలిత కళాతోరణంలో ఈనెల 9 నుండి 13వ తేదీవరకు ప్రతిరోజు సాయంత్రం చలనచిత్ర ప్రదర్శనతో పాటు 98 పాఠశాలలకు చెందిన ఎంపిక చేసిన పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పబ్లిక్ గార్డెన్‌లోని జవహర్ బాల్‌భవన్‌లో 9నుండి 13వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4నుండి 6గంటల వరకు దాదాపు 120 మంది పిల్లలతో వర్క్‌షాప్ నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ వారు ఎంపిక చేసిన 30మంది, రెసిడెన్సియల్ స్కూల్స్‌కు చెందిన 20మంది పిల్లలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించారు.
నవంబర్ 14 బాలలకు పండగరోజు..బాలల దినోత్సవం... దేశంలో ఉన్న బాలలందరూ ఆనందంగా చేసుకొనే ఈ వేడుకలో వారికి అనే తీపి కబుర్లు, ముచ్చట్లు, దేశభక్తి ప్రభోదకాలు చెబుతారు. అలాగే వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే విషయాలను సూచన ప్రాయంగా తెలియజేస్తారు. పిల్లలకు నైతిక విలువలు, సమాజ ధర్మాలు, వింతలు విశేషాల అద్భుతాలు, జానపద కథల మనోల్లాస గాథలు వివరిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి, దేశాన్ని ముందుకు నడిపే ప్రక్రియ చిన్న వయస్సునుండే వారి మనసుల్లో బీజం వేస్తారు. అలా వారి పాఠశాలలో ఉపాధ్యాయులు సక్రమ బోధన చేస్తూ దేశ పునాదిని గట్టిగా చేయడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆనందంగా ఎదగాలని కోరుకుంటారు. ఇలా.. అందరూ బాలల కోసం తమవంతు శక్తిమేర కృషి చేస్తుంటే, బాలలకు అద్భుతాలు చూపగల మన సినీ పరిశ్రమ మాత్రం ఆ చిత్రాలతో మాకేం లాభం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. బాలల కోసం ఫిలిం ఫెస్టివల్స్ జరిపే ప్రభుత్వం బాలల చిత్రాలు నిర్మించాలన్న నియమం ఏదీ విధించలేదు. చివరికి ప్రభుత్వం పరాయి దేశాల బాలల చిత్రాలపై, లేక భారతీయ భాషల్లో వచ్చిన ఇతర భాషా చిత్రాలపై ఆధారపడి బాలల చిత్రోత్సవాన్ని జరుపుతుంది. అంతేలే.. అన్నీ మన సినిమాలే చూపితే.. పిల్లలకు ఇతర దేశాల భాషలు, సంస్కృతి, సంప్రదాయాల గూర్చి ఎలా తెలుస్తుంది? అప్పట్లో ‘్భద్రం కొడుకో’ అన్న చిత్రం
తెలుగులో వచ్చింది. ఆ చిత్రం వచ్చి ఇప్పటికి పుష్కరం దాటింది. ఆ చిత్రానికి జాతీయ అవార్డులు వచ్చాయి. తల్లిదండ్రుల మాట వినక, చదువుకోవడానికి ఇష్టపడక ఇంట్లో నుండి పారిపోయిన పిల్లల కథను ఆ చిత్రంలో తెరకెక్కించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత ఏవో కొన్ని చిత్రాలు వచ్చాయి. కానీ, అవి బాలలను ఆకర్షించలేకపోయాయి. వారి సాధక బాధకాలను చిత్రణ పట్టలేక పోయాయి. ఆ మధ్య దివంగత డా.డి. రామానాయుడు బి.నరసింగరావు దర్శకత్వంలో ‘పొదరిల్లు’ అనే బాలల చిత్రం నిర్మించినా, అది ఆకట్టుకోలేక పోయింది. ఇలా ఎప్పుడో ఒక్కసారి ఎవరో ఒక నిర్మాత ఒకటీ అర చిత్రాలు నిర్మిస్తున్నా రు. బాలల చిత్రాలను పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. వారికి లాభాలు ఆర్జించిపెట్టే చిత్రాలు కావాలి.
‘‘అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు అరుపులతో, నృత్యాలతో కలుసుకున్నారు. సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది. తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది. తోవ తెలియని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది. నావలు భగ్నవౌతున్నాయి. పిల్లల గొప్ప సమావేశం జరుగుతూనే వుంది’’ అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్.
బాలల అభ్యున్నతికి వారి మానసిక వికాసం కోసం నిబద్ధతతో చిత్రాలను నిర్మించే స్థాయి ప్రస్తుతం హీన దశలో వుంది. బాల్యం సముద్రంలా పిల్లలతో ఆడుకుంటూనే ఉంటుంది. పెద్దలు చిరునవ్వుతో వారిని చూస్తూనే ఉంటారు. కానీ తోవ తెలియని సినిమా మాత్రం తుఫానులా గుంభనంగా కమర్షియల్ దారిలో తిరుగుతూనే ఉంటుంది. పెద్దలు పిల్లల కోసం చేసిన ఆలోచనలు నిరంతరం భగ్నం అవుతూనే ఉంటాయి. అయినా పిల్లలు పెద్దలను క్షమిస్తూ వాళ్ల ఆనందాన్ని వాళ్లు వెతుక్కుంటూనే ఉంటారు. ఇక్కడిలా వుంటే.. అంతర్జాతీయంగా అనేక చిత్రాలను బాలల కోసం రూపొందిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద పెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న భారతదేశంలో మాత్రం అటువంటి ప్రయత్నాలు జరగకపోవడం విచారకరం.
ఇరాన్‌లో బాలల చిత్రాల కోసం ఓ ప్రత్యేకమైన శాఖ పనిచేస్తూ వారికి నచ్చిన విధంగా చిత్రాలను నిర్మిస్తున్నారు. మన దేశంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు 1979 నుండి బొంబాయిలో ప్రారంభమయ్యాయి. మొదట్లో ఈ ఉత్సవాలలో విజేతలకు కేవలం జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఉత్తమ చిత్రానికి బంగారు నందితో పాటు లక్ష రూపాయల నగదు అందిస్తుండగా, 2007 నుండి నగదు బహుమతి రెండు లక్షల రూపాయలకు పెంచారు. తొలి బాలల చలనచిత్రోత్సవం బొంబాయిలో జరగగా, 81లో చెన్నయ్, 83లో కోల్‌కతా, 85లో బెంగుళూరులో, 91లో త్రివేండ్రంలో, 93లో ఉదంపూర్‌లో నిర్వహించారు. 1995 నుండి శాశ్వత వేదికగా హైదరాబాద్‌ను నిర్ణయించారు. 1995 నుండి 2015 వరకూ బాలల చలనచిత్రోత్సవ వేదికగా హైదరాబాద్ సేవలందించింది. ఈ ఏడు కూడా మళ్లీ బాలల సినిమా పండగ ప్రారంభమవుతోంది. ఇది 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల పండగ. అనేక రాష్ట్రాల నుండి దేశాల నుండి బాలలతో పాటుగా, ఆయా దేశాలలో నిర్మించిన బాలల చిత్రాలు కూడా పోటీకి రావడం.. అవి ఇక్కడ ప్రదర్శింపబడి బహుమతులను అందుకుని వెళ్లడం ప్రతీసారి చూస్తూనే వున్నాం. కానీ భారతీయ చలనచిత్ర సమాఖ్య తరపునుండి ఎటువంటి చిత్రాలు కూడా పోటీ పడలేకపోతున్నాయి. దాదాపుగా అన్ని దేశాల నుండి పిల్లలు, పెద్దలు వస్తున్నారు.
సినీ మాధ్యమం ద్వారా పిల్లలలో వారి భవిష్యత్ పట్ల బాధ్యత, మనస్తత్వాన్ని, నైతిక విలువలను, మానవీయ ఆదర్శాలను పెంపొందించడం ప్రధానంగా తీసుకొని బాలల చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. కానీ కమర్షియల్ విలువలతో నిర్మించిన చిత్రాల స్థాయిలోనే బాలల చిత్రాలను ఆలోచించడంతో అనుభూతి ప్రధానమైన సినిమాలు కనపడటం లేదు. పరిశ్రమ నిరంతరం కామెడీ, లవ్, హారర్, కమర్షియల్ అంశాల వైపే తిరగడంతో బాలలకు నచ్చిన విధంగా సినిమాలను ఆలోచించడానికే భయపడుతున్నారు. గతంలో రాజు-పేద, లేత మనసులు, బాల మిత్రులకథ, గమ్మత్తు గూఢచారులు, పాపం పసివాడు, రాము, లిటిల్ సోల్జర్స్ లాంటి చిత్రాలను అందించిన తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడు చేతలుడిగి చోద్యం చూస్తోంది. ఇప్పటి వరకూ చెప్పిన సినిమాలన్నీ కమర్షియల్ పంథాలో బాలలకు నచ్చిన విధంగా నిర్మించిన చిత్రాలే. అయితే ఇప్పుడు బాలల చిత్రాలు అంటేనే క్లాసికల్‌గా ఉండే నిశ్శబ్ద చిత్రాలు అన్న అపోహలో కొంతమంది ఆ చిత్రాలను నిర్మించడానికి ముందుకు రావడం లేదు. దీనికి తోడు చిల్డ్రన్స్ ఫిలింస్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించి ఏళ్లు దాటిపోతోంది. ఈ కాంప్లెక్స్ ద్వారా చిన్న పిల్లలకు అవసరమైన విధంగా చిత్రాలను నిర్మిస్తారు. అయితే ఇది ఇప్పటికీ అతీగతీలేని వ్యవహారంగా మారింది. నిర్మాతలకు సబ్సిడీలు ఇస్తున్నా.. బాలల చిత్రాలు ఎలా నిర్మించాలో తెలియక నిర్మించడమే మానుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరుపుకుంటున్నట్లుగా ఈ సారి కూడా జరుపుకుందాం అంటే చరిత్ర క్షమించదు.
ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రంలోనే బాలల చిత్ర నిర్మాణం జరగకపోవడానికి కారణాలు అనేకం. ఈ సారి బాలల చిత్రాలలో యానిమేషన్, షార్ట్ ఫిలింస్, లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శించనున్నారు. పోటీ విభాగం, పోటీయేతర విభాగంలో ప్రదర్శించే ఈ చిత్రాల్లో పోటీకిగాను అంతర్జాతీయ పోటీ విభాగం, భారతీయ పోటీ (కాంపిటీషన్ ఇండియా), లఘు చిత్రాల పోటీ, లిటిల్ డైరెక్టర్స్ విభాగాలలో ఉంటుంది. బాలల చిత్రాల ప్రదర్శనలో భాగంగా వారితో చర్చలు జరుపుతారు. అందులో భాగంగా యానిమేషన్ విభాగాలు, ఫిలిం మేకింగ్ పద్ధతులు, స్క్రిప్ట్ రచన వగైరా విషయాలపై బాలలకు అవగాహన కలిగిస్తారు. బాలల చిత్రాలను సరైన పద్ధతిలో రూపొందిస్తే అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది. అనేక దేశాల నుండి సరికొత్త ఆలోచనలతో, కథలతో చిత్రాలు నిర్మించి పలు దేశాల్లో ప్రదర్శించి అవార్డులు కైవసం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. మన దేశంలో మాత్రం కమర్షియల్ సునామీలో కొట్టుకుపోతూ, చిన్న ఆధారం దొరికినా పట్టుకోలేని స్థితిలో వున్నారు. పిల్లల కోసం నిర్మించిన చిత్రాలకు ఎటువంటి లాభాలు రావని, అవార్డులను ఏం చేసుకుంటామన్న అపోహతో అటువైపు ఆలోచించటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇందులో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ బాలల చిత్రోత్సవంతో తమకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. బాలల పండుగ అంటే రెండేళ్లకోసారి చలన చిత్రోత్సవం నిర్వహించి తూతూ మంత్రంగా, నిబద్ధతలేని వ్యవహారంగా పండగను నిర్వహించి చేతులు దులుపుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కానీ, నిర్మాతను ప్రోత్సహించి, వారి చేత సినిమాలు నిర్మించే ప్రయత్నాలు జరగడం లేదు. చిత్రోత్సవాలలో అగ్ర నిర్మాతలను, దర్శకులను ఆహ్వానించి పిల్లల చిత్రాలను నిర్మించడానికి కనీసం అవగాహన అయినా వారికి కల్పించాలి. పిల్లల సినిమాలు అంటేనే కథ, కాకరకాయ అవసరం లేదనే వారిచేతే కమర్షియల్ పంథాలో కథలను వండించి రూపొందిస్తే తెలుగు చిత్రాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతాయనడంలో సందేహం లేదు. కానీ అంత ఆలోచన, నిబద్ధత మన వారికి లేకపోవడం శోచనీయం. పిల్లల్లో వుండే వివిధ మనస్తత్వాలు, వారి ఇష్టాలు, తల్లిదండ్రుల వ్యవహారాల్లో పిల్లలు ఎలా నలిగిపోతున్నారు, వారి కోరికలేమిటి? ఆశయాలు ఎలా వున్నాయి? అంతరిక్ష అద్భుతాలు, విచిత్ర వస్తువులు వారికి ఎదురైనప్పుడు వారి కేరింతలు, చిన్న మనసుల్లో కలిగే వింతవింత ఆలోచనలు, ఏదైనా కొత్త వస్తువును చూసినప్పుడు వారిలో కలిగే ఆశ్చర్యకర అనుభూతి తదితర అంశాలతో బాలల చిత్రాలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాలన్నీ తెలుగులోకాక, ఇతర భాషల్లో రావడం విచారకరం. విదేశాలలో బాలల కోసం అనేక చిత్రాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ దేశంలో పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసే చిత్రాలు, భూత హింస, ఉగ్రవాదం వంటి సమస్యలపై అనుభూతి ప్రధానంగా అనేక చిత్రాలు నిర్మిస్తున్నారు. అవి మన పిల్లలకు భాషాపరంగా అర్థం కాకపోయినా, దృశ్య ప్రధానంగా, కథలోవున్న ఫీల్‌గుడ్‌తో అవి పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి చిత్రాలు మన తెలుగులో కనీసం ఊహించనైనా ఊహించలేం. అంత అట్టడుగున పడివుంది మన గొప్పదైన తెలుగు చిత్రపరిశ్రమ.
బాలల చిత్రాలకు సరైన ప్రోత్సాహం తెలుగులో లేదా? లేక భావదారిద్య్రంతో పరాయి రాష్ట్రాల కథలనే నమ్ముకుని చిత్రాలు తీయవలసి వస్తుందని మానుకున్నారా? పిల్లలకు అందించ వలసిన సందేశాల్లో సినిమా పరిశ్రమ వంతు ఏమీలేదా? ఏడాదికి కనీసం ఓ పది చిత్రాలన్నా బాలల కోసం నిర్మించే దర్శక, నిర్మాతలు తెలుగు పరిశ్రమలో కరువయ్యారు. భావి పౌరులకు ఓ మంచి చిత్రాన్ని అందించవలసిన బాధ్యతను ఒక విధిగా పరిశ్రమ భావించడంలేదు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం చారిత్రక నగరమైన హైదరాబాద్‌లో పండగలా చేసుకొని మురిసిపోతున్నాం. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ వంతుగా ఒక్క బాలల చిత్రం కూడా అందించడానికి ఎవరూ కృషి చేయడం లేదు. అలా కాక కొన్ని చిత్రాలను మనం కూడా నిర్మించి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నిర్వహిస్తున్న ఈ బాలల పిల్లల పండగకు అర్థం చేకూరుతుంది. చిత్రసీమ ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం..

‘‘తెలంగాణలో చలన చిత్ర రంగాన్ని అభివృద్ధి పర్చడానికి, చిత్ర నిర్మాణాలకు కావలసిన వౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడానికి, కళాకారులకు తగిన శిక్షణ ఇప్పించి వారి ప్రతిభను ప్రోత్సహించడానికి అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. చారిత్రాక నగరం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ పిల్లల పండగలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది పిల్లలు, చలనచిత్ర నిపుణులు పాల్గొంటుండడం వల్ల పిల్లల్లో ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఏడు రోజులపాటు అద్భుతమైన ప్రదర్శనలు, షార్టు, లైవ్ యాక్షన్, యానిమేషన్ సినిమాలు చూడడానికి ఆస్కారం ఉంది. ఈ 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను అత్యంత వైభవంగా, బాలలకు కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది’’

-తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి

‘‘తెలంగాణలో నిర్మించిన కొన్ని బాలల చిత్రాల్లో నాణ్యత వుండడం వల్ల వాటిని ఈ 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశాం. ఇలాంటి చిత్రాకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. నాణ్యతతో కూడిన బాలల చిత్రాలు మరిన్ని రావాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది’ ’

-రామ్‌మోహన్‌రావు టి-ఎఫ్‌డిసి చైర్మన్

-ఎం.డి అబ్దుల్