ఎడిట్ పేజీ

చదువుల చెట్టు... ‘వేరు’కు చికిత్స?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేరుకు నీరు లభిస్తే చెట్టు ఎదుగుతుంది! వేరును ఎండగట్టి ఆకులపై కొమ్మలపై చల్లడంవల్ల చెట్టు పల్లవిస్తుందా?? పరిమళిస్తుందా..?? మన చదువుల వనంలోని వృక్షజాలాన్ని వేరు పురుగులు తొలుస్తున్నాయి, ఈ వేరు పురుగులు బ్రిటన్ సామ్రాజ్యవాదులు పెంచి పోషించినవి! మన దేశంనుంచి క్రీస్తుశకం 1947 ఆగస్టులో బ్రిటన్ రాజకీయ వాణిజ్య బీభత్సకారులు నిష్క్రమించినప్పటికి దశాబ్దుల పాటు వారు ఉత్పత్తి చేసిన వేరు పురుగులు మాత్రం ఇక్కడే తిష్టవేశాయి, విస్తరించాయి, నమిలి మింగుతున్నాయి. బ్రిటన్ దుండగులు నాటిన బౌద్ధిక బీభత్స - ఇంటలెక్చువల్ టెర్రర్- విషవృక్షాలు విద్యానందన ప్రాంగణమంతా విస్తరించిపోవడం సమాంతర పరిణామం! దూర విద్యా మాధ్యమం- కరస్పాండెన్స్- ద్వారా 2001 నుంచి లభించిన ‘స్థాపత్యకళల’ పట్టా - ఇంజనీరింగ్ డిగ్రీలను సర్వోన్నత న్యాయస్థానం వారు నవంబర్ మూడవ తేదీన రద్దుచేయడం ఆకులపై కొమ్మలపై నీళ్లు చల్లడం వంటిది.. విద్యారంగం ఘరానా వాణిజ్య సంస్థల, విదేశీయ బహుళ జాతి వాణిజ్య సంస్థల దోపిడీ ప్రాంగణంగా మారి ఉండడం వేరు తొలుస్తున్న పురుగుల తీరునకు నిదర్శనం. ‘‘వాణిజ్య కళాశాల- కార్పొరేట్ కాలేజ్‌ల ప్రాంగణాలు ఆత్మహత్యలకు ఆలవాలం అయ్యాయి, ఆడపిల్లలను లైంగిక బీభత్సకాండకు గురిచేస్తున్న ఆకతాయిలకు నిలయమయ్యాయి, మాదకం ముఠాల మత్తెక్కిన మూకల విశృంఖల విహార కేంద్రాలయ్యాయి... అక్రమ శృంగార కలాపాలకు ‘అడ్డా’లుగా మారాయి. ‘‘కార్పొరేట్ కాలేజీలను ప్రత్యేకించి ఇంజనీరింగ్ కార్పొరేట్ కాలేజీలను మూయించాలి!’’ అన్న నినాదాలు ఇటీవల భాగ్యనగరం వీధులలో మారుమోగడం సర్వోన్నత న్యాయ నిర్ణయానికి సమాంతర పరిణామం! కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులపట్ల బోధనా, బోధనేతర ఉద్యోగులపట్ల అమానవీయంగా క్రౌర్యంగా ప్రవర్తిస్తుండడం వివిధచోట్ల వివిధ సందర్భాలలో ధ్రువపడిన అభియోగం! ఈ దుశ్చర్యల పట్ల నిరసనగా హైదరాబాద్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్- ఏబివిపి- ఆధ్వర్యంలో నడచిన ఉద్యమంలో పాల్గొన్న ‘తల్లిదండ్రులు’ కార్పొరేట్ కాలేజీలను మూసివేయాలని నినదించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇలా కోరడం విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక పరిణామం! దశాబ్దులపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, హితైషులు విరివిగా ‘కార్పొరేట్ కాలేజీ’లను ప్రోత్సహించడం, తమ పిల్లలు ఫలానా ప్రభుత్వేతర వాణిజ్య కళాశాలలలో చదువుతున్నారని ‘గొప్పలు’ చెప్పడం నడుస్తున్న చరిత్ర! ‘కాపీలు’ కొట్టించి పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత, ఉత్తీర్ణులైన వారికి వందశాతమో తొంభయి ఎనిమిది శాతమో మార్కులు సాధించిపెట్టడం గురించి తల్లిదండ్రులు, వాణిజ్య పాఠశాలలవారు ఆలోచించారు! ఇది మొదలు.. అమెరికాకు వెళ్లి ‘డాలర్లు’ దండడం చరమ లక్ష్యం!
ఈ మొత్తం ప్రక్రియలో సమాజ సమష్టిహిత ధ్యాసకాని, దేశభక్తి జాతీయత వంటి స్వభావం కాని, వైయక్తిక, సమష్టి సౌశీల్యం కాని, సాంస్కృతిక అవగాహన కాని పొడచూపకపోవడం బ్రిటన్ దురాక్రమణ నాటి ‘వారసత్వం’ కొనసాగుతున్న ఫలితం! తొండ ముదిరి ఊసరవెల్లి అయింది, ‘బ్రిటన్ - ఐరోపా’ వారసత్వం బలిసి ‘ప్రపంచీకరణ’గా మన నెత్తికెక్కి తొక్కుతోంది! బ్రిటన్ బీభత్స ‘పాలకుల’కు మన దేశం పట్ల మమకారం లేదు, భక్తి లేదు.. సహజం. దోపిడీకి వచ్చిన దొంగలకు దోచుకున్న ఇంటిపట్ల మక్కువ ఉండదు. ‘ఇంటి’లోని వారికి సైతం ‘ఇంటి’పట్ల మక్కువ లేదు, దోపిడీ దొంగల వారసత్వ ప్రభావం ఆవహించిన ఫలితం! మనదాని పట్ల మనకు మక్కువ లేకపోవడం అన్ని రంగాలలోనూ మన విద్యావంతుల పతనానికి అనైతిక, విద్రోహ, పైశాచిక ప్రవర్తనకు వౌలిక కారణం! కళాశాలలో విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న బోధనలో కాని, స్నాతకోత్సవ సభల వేదికలపై కాని, తల్లిదండ్రుల వాత్సల్యంతోకాని ‘దేశం పట్ల మక్కువ’కు స్థానం కనిపించడంలేదు.. యుగ యుగాల స్వజాతీయ సౌశీలనాన్ని విజాతీయ వికృతులు దిగమింగుతున్నాయి! ఇలా మింగిన ఫలితమే పరీక్షలలో ‘కాపీ’లు వ్రాయడం, పరీక్షలు వ్రాయకుండానే ‘పట్టాలు’ లభించడం!!
‘ఇంజనీరింగ్’ బోధనలో ‘కరెస్పాండెన్స్’ ప్రక్రియకు స్థానం లేదట! లేదని ‘అఖిల భారత సాంకేతిక విద్యామండలి’- ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్- ఎఐసిటిఇ- వారు 2001వ సంవత్సరానికి ముందే నిర్ణయించారు. అయినప్పటికీ ‘దూర విద్యా మాధ్యమ మండలి’- డిస్టాన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్- డిఇసి- వారు అనుమతి ఇచ్చేశారట! అధికారుల నిర్లక్ష్యంవల్ల కావచ్చు, అధికారులకు రాజకీయవేత్తలకు కళాశాలల యాజమానులకు దళారీలకు మధ్య కుదిరిన ‘లంచాల’ ఒప్పందం వల్ల కావచ్చు- అనుమతి లభించింది! 2005లో ‘గుట్టు’ రట్టయింది. ‘డిఇసి’ వారు కూడా అనుమతిని రద్దు చేశారట! కానీ ఆ తరువాత కూడా నాలుగు ప్రధాన విద్యాసంస్థలు ‘కరస్పాండెన్స్’ అక్రమాన్ని కొనసాగించి దేశమంతటా ఉన్న వేలాదిమందికి ఇంజనీరింగ్ డిగ్రీలను ప్రదానం చేశారు! ఈ అక్రమ స్థాపత్య కళల పట్టాలను సర్వోన్నత న్యాయస్థానం ఇపుడు రద్దు చేసేవరకు పదహారు ఏళ్లపాటు ఈ బౌద్ధిక బీభత్సకాండ అప్రతిహతంగా జరిగిపోయింది!
భారతీయమైన విలువలు, పద్ధతులు, సంప్రదాయాలు, కథలు, నీతులు రీతులు- వీటి ప్రస్తావన వచ్చిన వెంటనే ముక్కులు చిట్లించే వికృతమైన మూతులవారు మేధావులుగా చెలామణి అవుతున్నారు. అందువల్ల కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వంటి భారతీయ కాలగణనం మూల పడింది. ప్రస్తుతం కలియుగంలో ఐదువేల నూట పంతొమ్మిదవ సంవత్సరం నడుస్తోందని, ఇది కలియుగంలో యాభయి రెండవ శతాబ్ది అని తెలియకపోవడం- తెలియకపోవడమే ఆధునికత అని ప్రచారం జరుగుతోంది. ఈ సహజ యుగాలను, మొత్తం ప్రపంచానికి మాత్రమే కాక విశ్వవ్యవస్థకు వర్తిస్తున్న ఈ సనాతన- శాశ్వత- కాలగణన పద్ధతిని మరచిన వారు కృతకమైన యుగాలను సృష్టించారు. కోతియుగం, రాతియుగం, లోహయుగం, మోహయుగం వంటి కృత్రిమ సిద్ధాంతాల మోహం మన జీవితాలను ఆవహించి ఉంది.. ఈ భ్రాంతిని తొలగించడం మాత్రమే చదువుల వృక్షాల వేళ్లకు నిజమైన చికిత్స! త్రేతాయుగం ఆరంభం నాటి కచుడు బృహస్పతి కుమారుడు! విద్యావంతుడు స్వీయ జీవన ప్రయోజనం కోసం కాక స్వీయ జాతీయ హితం కోసం శ్రమించాలన్నది కచుడు నేర్పిన పాఠం! తన జాతి శ్రేయస్సుకోసం అవసరమైన ‘అమృత సంజీవని’ విద్యను సాధించడానికై శత్రు జాతి మధ్యకు ధైర్యంగా వెళ్లిన సాహసవంతుడు కచుడు. రాక్షసుల గురువైన శుక్రుని శిష్యుడుగా చేరిన ‘కచుడు’ రాక్షసుల చేత అనేకసార్లు హత్యకు గురి అయ్యాడు. హత్యకు గురి అయిన ప్రతిసారి అతడిని గురువైన శుక్రుడు ‘మృత సంజీవని’ చికిత్సలో బతికించడం చరిత్ర. ఇందుకు కారణం గురువు కుమార్తె అయిన దేవయాని కచుడిని అభిమానించడం! ఇలా తన జీవితాన్ని ఫణంగా పెట్టి జాతీయ జీవితానికి కచుడు ప్రాణం పోశాడు, మృత సంజీవనిని సాధించాడు. ఇలాంటి కథలు ఇపుడు తల్లిదండ్రులకే తెలీదు! తెలిసినవారికి ఇలాంటి సంగతులు జాన్.ఎఫ్.కెన్నడీ వంటివారు మాత్రమే చెప్పారన్నది భావదాస్యపు ప్రభావం.. ‘‘మా కుమారుడు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, డిజిపి కావాలి, అమెరికాకు వెళ్లాలి’’ అని ఆకాంక్షించడం జీవన విలాసం- ఫాషన్ - అయింది. ‘‘మా కుమారుడు సౌశీల్యవంతుడు కావాలి..’’ అని ఎంతమంది కోరుకుంటున్నారు? చదువుల చెట్టు వేరునకు ఎవరు చికిత్స చేయాలి??
శుక్రుని వద్ద చదివిన ‘కచుడి’ని శుక్రుని పుత్రిక ‘దేవయాని’ మోహించింది.. తనను పెళ్లి చేసుకొమ్మని కచుడిని దేవయాని కోరింది! కచుడు నిరాకరించాడు. గురువునకు శిష్యుడు కుమారునితో సమానుడు. గురుపుత్రిక శిష్యునికి చెల్లెలు, అక్క.. అందువల్ల సోదరీ సోదరులమధ్య వివాహ బంధం తగదన్నది దేవయానికి చెప్పిన హితువు.. భారతీయ సంప్రదాయం ఇది. బడులలో కళాశాలలో- ఒకే తరగతిలో ఒకే గురువు వద్ద చదివేవారు సహాయధ్యాయులు సోదరీ సోదరులు.. కానీ దశాబ్దుల తరబడి మన ‘సినిమాలు’ నేర్పుతున్న పాఠం ఏమిటి?? ‘‘కళాశాల అంటే వధూవరుల వివాహ పరిచయ వేదిక’’ అన్న అభిప్రాయం యువజనులలో వికృతంగా వేళ్లూనడం ‘సినిమా’ ప్రభావం. తొమ్మిదవ తరగతి చదువుతున్న అబ్బాయికీ అమ్మాయికీ మధ్య తరగతి గదిలో ‘వివాహ దోహదమైన’ ప్రేమను ‘సినిమా’లు అంకురింప చేశాయి, చేస్తున్నాయి. పద్దెనిమిది ఏళ్ళు నిండని భార్యతో లైంగిక బంధం నేరమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పునిచ్చింది! పద్దెదిమిది ఏళ్లు నిండని వారు పెళ్లి చేసుకోవడానికి అనర్హులు! పద్దెనిమిది ఏళ్లు నిండని యువతీ యువకులు ప్రేమించుకోవటానికి అర్హులా?? వివాహం తరువాత జరుగవలసిన శృంగార కలాపాలను వివాహం జరగడానికి ముందే జరుపవచ్చునా? పద్దెనిమిది ఏళ్లు నిండకముందే జరపుకోవచ్చునా?? చదువుల నందనవనంలోని ఎన్ని చెట్ల వేళ్లు పదిలంగా ఉన్నాయి??
విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోను, స్నాతక- అధ్యయన పరిసమాప్తి- ఉత్సవంలో విద్యార్థులు మనదేశంలో చేసిన ప్రతిజ్ఞ- ‘‘సమాజాన్ని దేశాన్ని ఆయువు చేత - ఆయుషాచ- ధనంచేత కూడా - ధనేన చ- సేవిస్తాను..’’ అన్నది బ్రహ్మచారి- విద్యార్థి చేత తండ్రి, గురువు ఈ ప్రతిజ్ఞను చేయించారు. బ్రిటన్ ప్రధాని చర్చిల్ క్రీస్తుశకం 1940వ దశాబ్దిలోను, అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ 1961వ సంవత్సరంలోను ఈ భారతీయ ఉపదేశాన్ని పునరుద్ఘాటించారు! మనకు మాత్రం మన విజ్ఞాన సంప్రదాయ ధ్యాసలేదు.. ‘‘చర్చిల్ చెప్పాడు, కెన్నడీ చెప్పాడు..’’ అని మెచ్చుకోవడమే మన కుహనా అనుభూతి! ఇలా ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థి- బ్రహ్మచారికి యుగాలుగా ఆచార్యుడు చేసిన ఉపదేశం ఏమిటి?? ‘‘కొడుకులో మంచి కొడుకువి కమ్ము, కుమార్తెలలో మంచి కుమార్తెవు కమ్ము.. వీరులలో శ్రేష్ఠుడవైన వీరుడిగా, తేజోవంతులలో గొప్ప తేజోవంతుడిగా, పోషించే వారిలో ఉత్తమ పోషకుడిగా, గృహస్థులలో మేటి గృహస్థుడివిగా, నిర్వాహకులలో మేలైన నిర్వాహకుడివిగా, మేధావంతులలో వరిష్ఠుడైన మేధావిగా, విద్యార్థులలో సౌశీల్యవంతమైన విద్యార్థిగా..’’ రూపొందడం అధ్యయనానికి లక్ష్యమన్నది ఈ బ్రహ్మోపదేశం ‘‘సుప్రజా ప్రజయా భూ యాసం, సు వీరో వీరైః సువర్చా వర్చసా సుపోషః పోషైః సుగృహో గృహైః సుపతి పత్యాః సుమేధా మేధయాః సుబ్రహ్మా బ్రహ్మచారిభిః..’’ అన్నది ఆకాంక్ష! ఈ ఆకాంక్షలో విద్యార్థి గొప్ప ధనవంతుడు కావాలన్న వాంఛ లేదు, ప్రపంచాన్ని జయించాలన్న దురహంకారం లేదు! నిజమైన ఆకాంక్షలు మరుగున పడ్డాయి. విపరీతంగా ధనం సంపాదించాలన్న ఆధిపత్యం వహించాలన్న దుర్వాంఛలు విదేశీయ దుష్ప్రభావంవల్ల దాపురించిన వికృతులు! అక్రమార్జనపరులు అధిక సంఖ్యలో విస్తరించడం ఈ వికృతి. మన చారిత్రక మహాపురుషుల ధ్యాస లేదు.. గ్రీసు దేశం నుంచి క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో చొరబడిన, గుప్త సామ్రాజ్య పటిమకు బెదరి పారిపోయిన అలెగ్జాండర్ అన్న బీభత్సకారుడు వీరుడైపోయాడు! ‘‘గ్రీకువీరుడు’ అని చెప్పుకోవడం భారతీయులు తమ దేశానికి చేస్తున్న భయంకర విద్రోహం.. చదువుల వనంలోని ‘వేరు’నకు చికిత్స మొదలయ్యేదెప్పుడు..??

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352