మెయిన్ ఫీచర్

నెట్ లో చిక్కిన బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటిపౌరుల’పై శ్రద్ధ ఏదీ? చిన్నకుటుంబాలతో చిక్కులు పెద్దల తోడులేక పెడదారిలోకి..
ఆటపాటలకు అవకాశమే లేదు ‘పసిమనసుల’ను పట్టించుకుంటేనే ప్రగతి

పిల్లలు.. ఆశారేఖలు.. రేపటి పౌరులు...

బాల్యం.. స్వేచ్ఛాప్రపంచం. హద్దుల్లేని ఆలోచనల స్రవంతి..

ఆ రేపటి పౌరులను.. వారి ఆలోచనా ప్రవాహాన్ని సరైన మార్గంలోకి మళ్లించడమే ఇప్పుడు పెద్ద సమస్య. తీరికలేని తల్లిదండ్రులు తీరికయ్యాకా చూసేసరికి పిల్లలు పెద్దలైపోతున్నారు. పెద్ద సమస్యగా మారిపోతున్నారు. ఆడేపాడే వయసులోనే వారు మంచీచెడు నేర్చుకుంటారు. తప్పటడుగులు వేసేటప్పుడే నడక నేర్పాలి. పడిపోయినప్పుడే నిలబెట్టాలి. ఒరిగిపోతున్నప్పుడే ఆసరా ఇవ్వాలి. అన్నీ అయ్యాక అయ్యో అంటే లాభం లేదు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే బిజీ జీవన విధానంలో పెద్దలు ఇవేవీ పట్టించుకోకపోవడమే పిల్లలకు శాపంగా మారుతోంది. ఆధునిక జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం మేలు ఎంత చేస్తోందో.. కీడు కూడా అంతే ఉంటోంది. పెద్దలు సరిగ్గా వ్యవహరిస్తే, పిల్లలకు అండగా నిలిస్తే వారు నిజంగా అద్భుతాలే సృష్టిస్తారు. పిల్లలు కాదు పిడుగుల్లా మారిపోతారు. చిన్న కుటుంబాలు, ఒక్కగానొక్క సంతానం, గడపదాటకుండా ఆటలు, అంతర్జాలపు మాయాజాలంలో ఇరుక్కుపోవడం పిల్లల మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది.
ఒంటరితనం.. పెనుప్రభావం
అనుబంధం, అనురాగం, ఆత్మీయత, వాత్సల్యం చూపించే తల్లిదండ్రులు తమకున్నారనే భరోసా లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పిల్లలు చురుకుదనాన్ని కోల్పోతున్నారు. స్నేహితులను నమ్మి, వారు చూపించే మార్గంలో పయనించడం మంచిదో కాదో నిర్ణయించుకోలేక తమ బంగారు బాల్యానందాల్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. రేపటి పౌరులుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిందిపోయి తమకు ఎవరూ లేరనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి మానసిక స్థితిలో ఉన్న పిల్లలు తమకు ఆహ్లాదాన్నిచ్చేది కేవలం ఇంటర్నెట్ అనే భావనలో ఉంటున్నారు. ఇంటర్నెట్ గేమ్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఆప్స్‌పై ఆధారపడి ఎటు వెళ్తున్నారో తెలియని అయోమయ స్థితిలో ఇంటిని, పరిసరాలను, చదువును మర్చిపోయి దానిపైనే కూర్చుని తమ విలువైన ఆరోగ్యాన్ని, కాలాన్ని, భవిష్యత్‌ను వృథా చేసుకుంటున్నారు. భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మన నేతలు చిలుకపలుకులు పలుకుతున్నారు. మన భవిష్యత్ తరం నెట్టింట్లో అవసరమైనవి, అనవసరమైనవి చూస్తూ వృథా కాలక్షేపం చేస్తున్నారు. దీనికంతటికీ సాంకేతిక విప్లవమే కారణం అంటే ఒప్పుకోనక్కరలేదు. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించకపోవటమే ప్రధాన సమస్య. ఇక్కడే పెద్ద తంటా వస్తోంది. ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద, పేద, గొప్ప అనే తేడాలేకుండా ప్రతివారి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈరోజుల్లో స్మార్ట్ఫోన్‌ని స్మార్ట్‌గా వాడాలన్నది కనిపెట్టిన వాడి ఆలోచన. కాని మన ఉనికిని మర్చిపోయేంతగా దానిలో లీనమైపోయి జబ్బులు తెచ్చుకుంటోంది నేటి యువతరం. ఇక ఫోన్‌లో గేమ్స్ మాటకొస్తే చిన్న, పెద్ద అందరూ దానికి బానిసలైపోతున్నారు.
అప్పటి అనుబంధాలు ఏవీ?
పూర్వం ఇంటిల్లిపాదీ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఇప్పుడు ఎవరికి వారు తమ చేతిలో ఉన్న ఫోన్‌తో మయమరచిపోయి బంధాలను, అనుబంధాలను కూడా మర్చిపోతున్నారు. ఇది ఎంతటి విపత్కర పరిణామమో ప్రతిఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. పూర్వం చిన్న పిల్లలు సెలవు రోజుల్లో ఆడుకునే గోళీలాట, కర్రా-బిళ్ల, కోతికొమ్మచ్చి, ఏడు పెంకులాట వంటివి ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. అలాగే ఆడపిల్లలు ఆడుకునే గుజ్జనగూళ్లు, తొక్కుడుబిళ్ల, ఉప్పలగుప్ప, గచ్చకాయలు వంటి ఆటలు ఇప్పటి పిల్లలకు చెబితే అవి ఎలా ఆడతారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బయటకు వెళ్లి పదిమందితో కలసి ఆడితే గెలుపు ఓటముల ప్రభావాన్ని చిన్నప్పుడే తెలుసుకోవచ్చు. విజయం, ఓటమి నేర్పే పాఠాలు తెలుస్తాయి. నలుగురితో కలసి జీవించడం అలవాటవుతుంది. ఇప్పటి ఆటలు అలా లేవు. వాటి గురించి తెలియజేసే బామ్మలు, తాతయ్యలను ఆధునిక కుటుంబ వ్యవస్థ దూరం చేసేసింది.
ఇంట్లో కాకుండా వృద్ధాశ్రమాల్లో పెద్దల్ని పెట్టేస్తే పిల్లలకు కబుర్లు, కథలు చెప్పేవారు ఎక్కడి నుంచి వస్తారు. వారికొచ్చే భయాలు, సందేహాలను ఎవరు తీరుస్తారు. అమాయకమైన ప్రశ్నలు, అనూహ్యమైన ఆలోచనలు, అర్థవంతమైన సందేహాలు ఎవరివద్ద వ్యక్తం చేస్తారు. వాటికి నేర్పుగా, ఓర్పుగా, నచ్చేట్లుగా, ఒప్పించేట్లుగా ఎవరు చెప్పారు. మమీడాడీలు యాంత్రికంగా కుటుంబాన్ని నడిపేస్తూంటే పిల్లల్లో ప్రేమానుబంధాలు ఎక్కడినుంచి అల్లుకుంటాయి. నెట్ ఆటలు తప్ప శారీరక, మానసిక ఆరోగ్యాన్నిచ్చే ఆటల గురించి ఎలా తెలుస్తుంది? దీనికి బాధ్యులెవరు? తల్లిదండ్రులే కదా! కనీసం సెలవు రోజుల్లోనైనా వారితో కూర్చుని సరదాగా ‘మా చిన్నప్పుడు’.. అంటూ చిన్ననాటి సంగతులు వారికి చెబుతున్నట్లు నెమరేసుకుంటే మనసుకి ఎంతటి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో నేటితరం తల్లిదండ్రులకి అర్థం కావడం లేదు. ఎంతసేపూ ఇంట్లో కూడా ఆఫీసు విషయాలు చర్చించుకుంటూ ఫోన్లలో బిజీ అయిపోతే వారు నెట్‌లో గేమ్స్ కాక పనికొచ్చే ఆటలు ఎలా ఆడగలుగుతారు? టీనేజ్‌కి వచ్చిన దగ్గర నుండి క్రికెట్ పిచ్చివల్ల ఇంకా ఎన్నో ఆటలున్నా వాటి జోలికి వెళ్లడం లేదు. అవగాహనా లోపం కొంతవరకైతే, ప్రోత్సాహ లోపం కూడా కారణమని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో చదువుల ఒత్తిళ్ల పొత్తిళ్లలో నలిగిపోతూ చదువు అనే భారాన్ని పుస్తకాల రూపంలో మోసుకుంటూ ఆటలకు దూరమవుతున్నారు నేటి బాలలు.
ప్రాణాలు తీస్తున్న ఆటలు
ఇక ఇంటర్నెట్ ఆటల విషయానికొస్తే ఒకప్పుడు ‘టాకింగ్ టామ్, టెంపుల్ రన్, బబుల్స్, కార్ రేస్ వంటి చిన్నపాటి టార్గెట్లు, టాస్క్‌లు లేని ఆటలుండేవి. కాని ఇప్పుడు ప్రాణాంతకమైన, ప్రాణాలు తీసుకునే ‘బ్లూ వేల్, 48 అవర్స్ ఛాలెంజ్’ వంటి ఆటలు కనిపెట్టి వాటిని పిల్లలపై వదులుతున్నారు. దానివల్ల వారికి కలిగే పైశాచిక ఆనందానికి అవధుల్లేవు. ఈ ఆటలు కేవలం 10 నుండి 20 ఏళ్లలోపు వయస్సున్న వారికి మాత్రమే. వీటి లింక్‌లు ఫేస్‌బుక్ అకౌంట్స్‌కి పంపి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ వయస్సులో మంచి ఉడుకు రక్తంతో దేనినైనా సాధించగలం, ఎదిరించగలం అనే పట్టుదలతో ఉంటారు పిల్లలు. ఆ టాస్క్‌లు కూడా తమను తాము హింసించుకునేందుకు ప్రేరేపించేవిగా ఉండటం చాలా బాధ కలిగించే విషయం. అలాంటి ఈ ఆటల్లో వారికిచ్చిన టాస్క్‌లు పూర్తి చేయలేకపోతే స్నేహితులు తమను చిన్నచూపు చూస్తారేమోనని భావించి వారు మాసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఆటలు కూడా వారిని మానసికంగా బలహీనపరుస్తూ, ఆత్మహత్య చేసుకునే స్థాయికి టాస్క్‌లు పెడుతూ రూపొందిస్తున్నారు. అలాంటి ఆటలు ఆడడం వల్ల పిల్లలు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి చివరకు తమ జీవితానే్న అడ్మిన్ చేతికి అందించేస్తున్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో తమకు గేమ్స్‌కి కేటాయించిన సమయాన్ని కూడా క్లాస్‌రూంలో బట్టీ కొట్టేలా పాఠ్య పుస్తకాలతోనే కూర్చోపెట్టడం మరో వైపరీత్యం. అసలు కొన్ని స్కూళ్లల్లో పిల్లలకు ఆటస్థలాలే ఉండటం లేదు. అలాంటప్పుడు వారు ఇంటికొచ్చాక కాస్సేపు రిలాక్స్ అవుదామంటే అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఎక్కడ ఆడుకుంటారు? పోనీ అమ్మతో, నాన్నతో సరాదాగా కాస్సేపు గడుపుదామంటే వారిద్దరూ ఉద్యోగాలతో బిజీ.. బిజీ.. గజిబిజీ! మరి వారి అందమైన బాల్యాన్ని, ఆటల పట్ల ఆసక్తిని చంపుకోలేక నెట్టింటికి పరిమితం చేస్తున్నారు.
పెద్దలు మారితే మంచిది
ఇప్పుడున్న స్పీడ్ యుగంలో కేవలం చదువు ఒక్కటే కాకుండా పిల్లలకు వివిధ రకాలైన ఆహ్లాదాన్ని కలిగించే ఆటలు, సంగీతం, డాన్స్, చిత్రలేఖనం, మైమింగ్ వంటి కళల్లో కూడా ప్రోత్సహించే విధంగా స్కూళ్లలో కరిక్యులమ్ తయారు చేయాలి. దాన్నిబట్టి వారికి ఎటువైపు ఆసక్తి మెండుగా ఉందో ఉపాధ్యాయులతో పాటు ఇంట్లోని తల్లిదండ్రులకు కూడా తెలిసే అవకాశాలుంటాయి.
తల్లిదండ్రులు తమ సమయాన్ని కేటాయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే టెక్నాలజీలో తల్లిదండ్రులకన్నా పిల్లలే ముందుంటున్నారు. కనుక డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకుండా డబ్బు కన్నా కన్నపిల్లలు ముఖ్యమనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. కావలసినవి ఇస్తూనే ఒక కంట కనిపెట్టడం తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత. అప్పుడప్పుడూ వారిని బయటకు తీసుకెళుతూ దేనిపట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో తెలుసుకోవాలి. ఇంట్లోనే ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో వారినే అడుగుతూ ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఆసక్తి ఉన్నట్లు నటిస్తూ ఎలా ఆడాలి అనే విషయాలను తెలుసుకోవడం వల్ల ఆ ఆటల పట్ల తల్లిదండ్రులకు కూడా అవగాహన కలగడమే కాకుండా ఒకవేళ ప్రమాదకరమైనవి అయితే ముందుగా వారిని హెచ్చరించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారితో ప్రేమగా వ్యవహరిస్తూ చెయ్యాలి తప్ప వారిపై నిఘా ఉన్నట్లు ప్రవర్తిస్తే తప్పుదోవ పట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కుటుంబం, సమాజం వారికి అండగా లేదనే బాధతో బంగారు భవిష్యత్‌ను చూడాల్సిన పిల్లలు మొగ్గలుగానే రాలిపోతుంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులా? వారి ఒంటరితనమా? మేమున్నామనే ఆపన్న హస్తం అందించే వారి భరోసా లేకపోవడమా? నేటి పిల్లలు బాల్యాన్ని మర్చిపోయి తమదైన నెట్ లోకంలో బతికేస్తున్నారు.
నేటి ఖరీదైన రోజుల్లో ఒక్కరైతే చాలు అనుకుంటూ వారికి తోడుగా ఎవరూ లేకుండా చేస్తున్నారు. అందుకే వారితో స్నేహంగా మెలగాలి. నవమాసాలు మోసి కన్న ఆ తల్లికి జీవించినంత కాలం తనకు తాను వేసుకున్న శిక్షే అవుతుంది.

-వసుంధర.. 9885620065