మెయన్ ఫీచర్

మాతృభాష కోసం కదలిన తెలుగుదండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిర్బంధ అధికార భాష అంటే అర్థమేమిటి? ఆచరణలో, రష్యా ప్రజానీకంలో మైనారిటీగా వున్న మహారష్యన్ల (ఉజజఆళ) భాషను రష్యాలోని ఇతర ప్రజానీకమంతటిమీద విధించడం దాని అర్థం. ప్రతి బడిలోనూ అధికారిక భాషను బోధించడం తప్పనిసరి కావాలి. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అధికారిక భాషలో జరగాలి, స్థానిక ప్రజానీకపు భాషలో కాదు..’ అంటూ రష్యా విప్లవోద్యమం సందర్భంగా, జార్ చక్రవర్తులు అవలంబిస్తున్న భాషా విధానంపై ఉదారవాదులకు గల భాషా దారిద్య్రంపై 18 జనవరి, 1914న లెనిన్ అన్నమాటలివి. ఈ మాటల్ని మన తెలుగు రాష్ట్రాలకు అన్వయించుకుంటే అధికారిక భాష అంటే కనీసం ఓ మైనారిటీ ప్రజలు కూడా మాట్లాడని ఆంగ్ల భాషన్నమాట!
ఈ సందర్భంగా పాఠశాలల్లో విధిగా పిల్లల ఇంటి భాషలోనే బోధన జరగాలన్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 (ఎన్‌సిఎఫ్ 2005)లోని సెక్షన్ 3 (1)(1)లను గమనించాలి. ఒకవేళ సెకండరీ స్థాయిలో ఇది సాధ్యంకాదని భావిస్తే, ప్రాథమిక స్థాయిలో ఇంటి భాషనే తప్పనిసరి చేయాలని ఈ నిబంధన సూచిస్తుంది. పైగా భాష అంటే కేవలం భాషా బోధనే కాదని, సామాన్య, సాంఘిక, గణిత శాస్త్ర బోధన కూడా విధిగా మాతృభాషలో జరగాలని, అప్పుడే భాష వికాసంతో పాటు, విషయ పరిజ్ఞానం, సాంకేతిక పదజాలం విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతుందని (ipso facto) ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే విద్యా హక్కు చట్టం 2009 కూడా మాతృభాష (ఇంటి)లోనే బోధన జరగాలని సూచించడం గమనార్హం! ఈ రెండూ కూడా రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటు సాక్షిగా రూపుదిద్దుకున్నవే! ప్రజలో, పనికిమాలినవారో ఉబుసుపోక రాసుకున్న నివేదికలు అంతకన్నా కావు. ఇలా చట్టాల్ని చేసి చెత్తబుట్టలో వేసే దేశం బహుశా ప్రపంచంలో భారత్ తప్ప, మరొకటి లేదనుకుంటా! ఈ సందర్భంగా ఇలాంటి చట్టాలున్నాయన్న జ్ఞానం మన పాలకులకు ఉందా అనేది మరో ప్రశ్న! రోగమొకటైతే మందొకటిలా, మతి చెడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జనవరి 25, నూతన సంవత్సర కానుకగా జీవో 14ని విడుదల చేసింది, చేయడమే కాకుండా, మున్సిపల్ పాఠశాలల్లో వెంటనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. విద్యా సంవత్సరం మధ్యన, ఎలాంటి పాఠ్యపుస్తకాలు లేకుండా, ఉన్నఫళంగా ఎలా? అనేక సందేహాలు అన్నివర్గాలనుంచి రావడం, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరికలు చేయడంతో 2017-18 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చింది. ఒకటి, రెండో తరగతులంటే ఏదోవిధంగా బోధించవచ్చు! కాని అప్పటిదాకా తెలుగు మాధ్యమంలో చదువుతున్న సెకండరీ స్థాయి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో ఎలా చదువుకుంటారనే ఇంగితజ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడాన్ని ఏమనాలి?
గతంలో (2002-2004) విశాఖ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన నవీన్ మిట్టల్ కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. విద్యాశాఖ అనుమతి లేకుండానే విశాఖపట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏకపక్షంగా ప్రారంభించాడు. ఆయన కూడా నేటిపాలకులు చెపుతున్న కారణాల్నే చెప్పాడు. కాని అత్యధికంగా బడుగు వర్గాల పిల్లలు చదువుకునే మున్సిపల్ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేకపోవడంతో, మధ్యలోనే బడి మానడం జరుగుతుంది. ఇలా మానినవారంతా దుకాణాల్లో, ఇతర పనుల్లో, బాల కార్మికులుగా, రాజకీయ, బ్యూరోక్రాట్లు ఇళ్లల్లో పనిమనుషులుగా చేరడం తెలిసిందే. ఇలా చేరినవారికి విధిగా ఆంగ్ల పరిజ్ఞానం లేకపోతే, తమ పిల్లలకు ‘తెలుగు భాష రోగం’ అంటుకుంటుందని భావించి ఈ చర్యకు నాటి కలెక్టర్ పాల్పడిండని ఆరోపణలు రావడంతో నాటి చంద్రబాబు ప్రభుత్వమే కలెక్టర్ చర్యను గర్హించింది! తిరిగి ఇదే ప్రయోగాన్ని అవశేష (విశేష) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడంలోని ఉద్దేశం, కార్పొరేట్ విద్యా వ్యధశాలల్ని ప్రోత్సహిస్తున్న ఇద్దరు మంత్రుల కబంధ హస్తాల్లో విద్యారంగం వుండడమే! పైగా, ఈ వ్యధశాలలకు ఉన్నత, మధ్య తరగతి కుటుంబాల పిల్లలే బలిపశువులౌతున్నారు. ఇక నుంచి మున్సిపల్ పాఠశాలల్లో చదువుకునే బడుగు, బలహీన వర్గాల పిల్లల్ని కూడా ఆకర్షించాలంటే, ఆంగ్ల మాధ్యమం ట్యాగును మెడలో వేయాల్సిందే! నిజంగా ఆంగ్ల మాధ్యమమే అవసరమని భావిస్తే, ముందుగా భవన సదుపాయాల్ని సమకూర్చి, ఉపాధ్యాయుల్ని (అన్ని విషయాల్లో ఆంగ్ల పరిజ్ఞానంగలవారిని) నియామకం చేసి, దశలవారీగా (1-10) ప్రవేశపెడితే కొంత ఔచిత్యం ఉండేది. ఈ తరహాలోనే ప్రవేశపెట్టిన సక్సెస్ స్కూళ్ళు ఎలా వున్నాయో కూడా చూస్తూనే వున్నాం. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు దొరుకుతాయనే ఓ తప్పుడు భావజాలాన్ని ప్రజల్లో కల్గించి సొమ్ము చేసుకోవడం తప్ప, నిజంగా ఉద్యోగాలు దొరుకుతాయా, దొరుకుతున్నాయో అనేవి సమాధానం లేని ప్రశ్నలే!
ఈ సందర్భంగా గత అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు పట్టణ వైకాపా ఎంఎల్ అనిల్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన మాట తెలిసిందే! ఆయన నిజాయితీగా చెప్పినట్లు, ముఖ్యమంత్రి నుంచి గ్రామ సర్పంచి దాకా, ఐఎఎస్ అధికారి నుంచి అటెండర్ దాకా ప్రజల సొమ్మును భత్యాలుగా, జీతాలుగా తీసుకుంటున్నందుకు తమ పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడంలేదనేది ఆలోచించాల్సిందే! దీనికి సమాధానాలు తెలిసి కూడా, రోగమొకటైతే మందొకటిలా, ఆంగ్ల మాధ్యమ వైద్యాన్ని పాలకులు ప్రారంభించారు. ఇదే వాస్తవమైతే ప్రభుత్వ పరంగా వున్న ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు పాలకులే కాదూ, చివరికి ఉపాధ్యాయులు కూడా పంపని వైనాన్ని ఏమనాలి? కనీస పెట్టుబడి లేక, ఫీజుల దోపిడీతో, సరియైన విద్యార్హతలు, శిక్షణ, వౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు విద్యారంగం వికసిస్తే, డబ్బు దస్కంతో, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో, మంచి వౌలిక సదుపాయాలతో వుండే ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు కుంచించుకుపోతున్నాయో ఎవరు జవాబు చెప్పాలి? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చంద్రబాబు, మండలానికో ఆంగ్ల మాధ్యమం పాఠశాలను ప్రాథమిక స్థాయిలో ప్రారంభించాలని ఆదేశించడం తెలిసిందే! అవి కొడిగట్టిన దీపంలా ఆరిపోతుంటాయి. చివరిదాకా ప్రయత్నం చేసిన తూర్పుగోదావరి జిల్లాలో కూడా అవి చతికిలబడ్డాయి. ఇన్ని ఉదాహరణలున్నా, అదే ఆంగ్ల మాధ్యమం రోగాన్ని మున్సిపల్ స్కూళ్లకు తగిలించడమంటే, త్వరలోనే వాటిని కూడా బలిపశువులుగా మార్చడానికే!
పోగొట్టుకున్న వాళ్లే పోగొట్టుకున్న చోట వెతకాలన్నట్లు జనం తెలుగు దండుగా మారి, తెలుగు భాషా సంరక్షణ కోసం మనుగడ కోసం, పాలకుల కళ్లు తెరిపించడానికై నవంబర్ ఒకటో తారీఖునుంచి విశాఖలో ఉద్యమాన్ని ప్రారంభించింది. పరవస్తు ఫణిశయన, పారిపల్లి కోదండరామయ్య లాంటి తెలుగు భాషాభిమానులు నేతృత్వంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం ముందుగల గాంధీ విగ్రహం దగ్గర నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభమైందన్నట్లు, ఈ దండు తొలిపొద్దులా తూర్పున ఉదయించి దక్షిణానగల తిరుపతికి పాకింది. తెలుగుకు ఓ వెలుగునిచ్చిన రాజమహేంద్రవరాన్ని గోదావరి అలలా తాకింది. నవంబర్ 5న తిరుపతి బస్టాండ్‌వద్దగల తెలుగు తల్లి విగ్రహం నుంచి శంకరంబాడి సుందరాచార్య విగ్రహం దాకా భాషాభిమాని, సాహితీవేత్త సాకం నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడగా, చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులైన తులసినాథం నాయుడు నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. నిన్నటి రోజున కళాగౌతమి సంపాదకులైన బివిఎస్‌ఎన్ మూర్తి పిలుపుతో కదిలి తెలుగు భాషను రక్షించుకోవాలని నినదించడం శుభసూచకం! ఈ నిరసన కార్యక్రమాలన్నింటిలోను జనాలు తరలిరావడం గమనార్హం! విశాఖలో జరుగుతున్న నిరసన దీక్షల్లో అన్ని వర్గాలవారు పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయం. ఈ సందర్భంగానే హైదరాబాద్‌లో 7న ఓ సమావేశం జరగడం, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషను రక్షించాలనే డిమాండ్లతో తెరాస ప్రభుత్వానికి వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ముదావహం. ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను. ఇదే శీర్షికన గత సోమవారం నేను రాసిన వ్యాసంలో 1975 తెలుగు మహాసభల సందర్భంగా శంకరంబాడిచే మా తెలుగుతల్లి గీతాన్ని రాష్ట్ర గీతంగా రాయించారని ప్రస్తావించా. అప్పటికి అది రాష్టగ్రీతం కాదు. నిజానికి ఈ గీతం 1942లోనే రాశారు. 1975 మహాసభలలో ఆ గీతాన్ని సూర్యకుమారి ఆలపించారు. ఆ సమయంలో శంకరంబాడి ఓ చెట్టుకింద బాధతో ఉంటే మండలి కృష్ణారావు గుర్తించి ఆ గీతానికి ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు.
భాషను భావి తరాలకు అందించాలని, ప్రాథమిక స్థాయినుంచే తెలుగు భాషను పాఠ్యాంశంగా నిర్బంధం చేయాలని, బోధన, పాలన భాషగా తెలుగునే అమలు చేయాలని, తెలుగు మాధ్యమంలో చదివినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించాలనే నినాదాలతో తూర్పున రాజుకున్న నిప్పు ఇరు రాష్ట్రాల్లో వ్యాపించాల్సిందే! ఈ విషయంగా తెలంగాణలో కూడా గొంతులు పెగలాల్సిందే! అందునా, డిసెంబర్ 15-19లమధ్య ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్న సందర్భంగా ఈ ఉద్యమ ఆవశ్యకత ఎంతైనా వుంది. ప్రాంతాలకు అతీతంగా, వ్యక్తులకు, రాజకీయాలకు తావు లేకుండా తెలుగు రక్షణోద్యమం దావానలంలా వ్యాపించాలి. ఇపుడు కాకుండా, మరెప్పుడు కూడా చేయలేమన్నట్లే, ఇలాంటి సభల సందర్భంగానే ప్రభుత్వాల్ని నిలదీయాలి. పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి. మనం మిన్నకుంటే, ఇలాంటి సభలతో నిజంగానే తెలుగు భాష వెలిగిపోతుందనే తప్పుడు సంకేతం జనాల్లోకి వెడుతుంది.
భాష ఓ సాంస్కృతిక చిహ్నం. ప్రతి జాతికి అదో మకుటం! భాషను చంపడమంటే, మన మెదడును ఆలోచింపకుండా చేయడమే! నిన్నటి వలసవాదుల దుర్నీతిని కొనసాగిస్తున్న నేటి నేతి బీరకాయ పాలకుల్ని నిలువరించకపోతే, రేపు మనం మనంకాకుండా పోతాం! చివరికి అమ్మా, అయ్యా అనే పదాలకు అర్థాల్ని ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో వెతుక్కోవాల్సి వస్తుంది.
ఇలా భాషను, సంస్కృతిని దెబ్బతీసే పాలకులు, వీరి అడుగుజాడల్లో నడిచే కొంతమంది కుహనా మేధావులు విదేశీ వేదికలపై తెలుగు వెలుగుల గూర్చి, సంస్కృతి సంప్రదాయాల గూర్చి ఉపన్యాసాలు దంచుతూ వుంటారు. దీన్ని తీవ్రంగా భావించాల్సింది భాషాభిమానులు, రచయితలు, కవులే! భాషా పరిరక్షణ తర్వాతి మాట, ముందు సన్మానాల సంగతి చూద్దామనుకుంటే, మనకన్నా భాషా ద్రోహులు మరొకరుండరు. మన వ్యక్తిత్వాలు బయటపడేది ఇలాంటి సందర్భాలలోనే అనేది గుర్తించకపోతే, జనం కళ్లు తెరిచినపుడు మనకు కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన తెలుగు పరిరక్షణ ఉద్యమానికి విధిగా తెలంగాణ భాషాభిమానులు ఉప్పందించాలి. తెలంగాణలో కూడా ఉద్యమాల్ని లేవదీయాలి. లేదంటే, తెలుగు తల్లి తెలంగాణ తల్లులే కాదు, స్వయాన మన పిల్లలే క్షమించరు.
(తెలుగు భాషను తన నాలుకపై నాట్యమాడించిన జానపద ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య స్మృతిపథంలో!)

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162