మెయన్ ఫీచర్

న్యాయవ్యవస్థకూ జవాబుదారీతనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాలు అవినీతికి అతీతం అని అంతా భావించే సమయంలో గాలి జనార్దన రెడ్డి బెయిల్ వ్యవహారంలో ‘కోట్లు’ కేసు అనుమానాలను చెరిపేసింది. రాజకీయ వ్యవస్థకు, పాలనా వ్యవస్థకు మాత్రమే పరిమితమైన అవినీతి కళంకం న్యాయవ్యవస్థ గడప తొక్కింది. గాలి బెయిల్ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి టి పట్ట్భారామారావు, ఆయనను నచ్చచెప్పినందుకు జడ్జీలు టి లక్ష్మీనరసింహరావు, డాక్టర్ డి ప్రభాకరరావులు పదవులు కోల్పోయారు. న్యాయస్థానాల్లో ఇలాంటి వ్యవహారాలకు పట్ట్భారామారావు మొదటి వ్యక్తీ కాదు, చివరి వారూ కాదు. 1949లోనే జస్టిస్ సిన్హాను పార్లమెంటు అభిశంసించింది. అవినీతి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అందరి కళ్లూ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయి. కొంతమంది న్యాయమూర్తులు అవినీతి కేసుల్లో బహిరంగంగా దొరకిపోవడమే దానికి కారణం. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల కేసుల్లో హైకోర్టులు స్పందిస్తున్న తీరు మరో కారణం. గతంలో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ బాలకృష్ణన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జయలలిత అవినీతి కేసు, ప్రముఖ నటులు సల్మాన్, సంజయ్‌దత్ కేసులు విశే్లషించిన వారికి న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్ధకంగానే కనిపిస్తాయి. మద్రాస్ హైకోర్టులో ఒక న్యాయమూర్తి ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఆరోపణలు మోపారు. దానిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవల్సి వచ్చింది. మొన్నటికి మొన్న జస్టిస్ కర్ణన్ - సుప్రీంకోర్టు వివాదం ఎంత వరకూ వెళ్లిందో తెలిసిందే. జస్టిస్ కర్ణన్ 20 మంది అవినీతి న్యాయమూర్తుల పేర్లను పేర్కొంటూ ప్రధానికి ఒక లేఖ కూడా రాశారు. జస్టిస్ కక్రూకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ పదవి ఇచ్చినపుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన సదాశివం కేరళ గవర్నర్‌గా నియమితులైపుడు కూడా విమర్శలు వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది న్యాయమూర్తులు తమ పదవుల నుండి బహిష్కరణకు గురయ్యారు. మరికొంత మంది జైలు ఊచలు కూడా లెక్కపెట్టారు. అయితే ఈ అవినీతి ఆరోపణలు ఇంత కాలం రాష్ట్రాలలోని హైకోర్టుల వరకే పరిమితం అయ్యాయి. ఇంత వరకూ సుప్రీంకోర్టు తన సచ్ఛీలతను కాపాడుకుంటూ , ఎదుటివారు వేలు చూపకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది.
జవాబుదారీతనం ఏదీ?
న్యాయవ్యవస్థలో అవినీతి సహించరానిదని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా గతంలో వ్యాఖ్యానించారు. అవినీతి న్యాయమూర్తులు ఉంటే వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. దిగువ కోర్టుల్లోని న్యాయమూర్తుల్లో 20 శాతం మంది అవినీతి పరులేనని మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామయ్య పేర్కొన్నారు. మిగిలిన రంగాలతో పోలిస్తే ఉన్నత న్యాయవ్యవస్థలో అవినీతి లేదని జస్టిస్ కె జి బాలకృష్ణన్ చెప్పారు.
న్యాయమూర్తుల అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా రాజ్యాంగపరమైన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై ఖచ్చితమైన సాక్ష్యాధారాన్ని చూపడం మినహాయిస్తే ఇతరత్రా సివిల్ , క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీలు లేకుండా న్యాయమూర్తుల రక్షణ చట్టం (జెపిఎ) 1985లో చాలా నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా సిఆర్‌సిపి సెక్షన్ 154లోనూ, ఐపిసి సెక్షన్ 77లోనూ న్యాయమూర్తులకు రక్షణ ఉంది. జెపిఎలో సెక్షన్ -3 సబ్ సెక్షన్ 2 కూడా రక్షణ కల్పిస్తుంది. ఒక వేళ ఏదైనా న్యాయమూర్తిపై కేసు పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే కేసు పెట్టాల్సి వస్తే ఎలా అనే దానిపై రాజ్యాంగంలో పూర్తి స్పష్టత లేకున్నా ఏదైనా న్యాయమూర్తిని కేంద్రప్రభుత్వం సంప్రదించవచ్చు.
దిగువ న్యాయస్థానాల్లో అవినీతికి సంబంధించి ఎప్పటికపుడు సర్వోన్నత న్యాయస్థానం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా... సర్వోన్నత న్యాయస్థానంపైనే ఆరోపణలు వస్తే ఎలా? ఇలాంటి పిటీషన్లనే సుప్రీంకోర్టు బెంచ్ కొట్టివేయడం ద్వారా ఉన్నత స్థాయి సంస్థకు ఎలాంటి మకిలి అంటించే ప్రయత్నాలకు తావు లేదని స్పష్టం చేసింది.
తాజా వివాదం
వివాదాస్పద మెడికల్ స్కామ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండానే సర్వోన్నత న్యాయస్థానంలో నెంబర్ -2 గా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ ఒక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటలు తిరగకుండానే ఆ బెంచ్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కొట్టివేసింది. రెండో స్థానంలో ఉన్నంత మాత్రాన ప్రధాన న్యాయమూర్తి అధికారాలను చేతిలోకి తీసుకోవడాన్ని సహించేది లేదని కూడా ఈ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాలు దేశ ప్రజలకు ఆసక్తికరంగామారిపోయాయి.
మీడియాను నిరోధించలేం
కేసు మాట ఎలా ఉన్నా, సుప్రీంకోర్టులో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను రిపోర్టు చేయకుండా మీడియాను నిరోధించాలన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాక్ స్వాతంత్య్రాన్ని పత్రికా స్వేచ్ఛను ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నీ ఆషామాషీగా గత వారం వ్యవహారాలే అనుకోవడానికి వీలులేదు. దీని వెనుక గత రెండేళ్లుగా జరుగుతున్న అనేక తీర్పులు, వాటి తీరుతెన్నుల ప్రభావం ఉంది. నీట్ ద్వారానే ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్లు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అడ్మిషన్లకు కటాఫ్ తేదీలను నిర్ణయించిన కేసుకు సంబంధించి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉల్లంఘనలు జరిగాయి. అలాగే లక్నోలోని ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టు నిర్వహించే మెడికల్ కాలేజీకి ఎంసిఐకి మధ్య జరిగిన వివాదం మలుపులు తిరిగింది.
లక్నో ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టు కనీస నిబంధనలు పాటించడం లేదని ఎంసిఐ రెండేళ్లపాటు అడ్మిషన్లను రద్దు చేసింది. ఎంసిఐ ఆదేశాలపై ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2002 నుండి మెడికల్ కాలేజీ నడుపుతూ వెయ్యి మందికి అత్యున్నత విద్యను అందిస్తున్నామని ప్రసాద్ ట్రస్టు వాదించింది. దానిని మరోసారి పరిశీలించమని సుప్రీంకోర్టు ఎంసిఐకి సూచించింది. కాని ఎంసిఐ రెండేళ్ల పాటు రద్దుకే మొగ్గు చూపింది. కాని, ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టులో మాత్రం అడ్మిషన్లు జరిగాయి. ఇది ఈ మొత్తం కథకు ఆధారం. భారత వైద్య మండలి - ఎంసిఐ కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసును జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం విచారించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా విచారణ చేపట్టడం భారత ప్రధాన న్యాయమూర్తికి రుచించలేదు. ఎవరు ఏ కేసు చేపట్టాలనే రోస్టర్‌ను తాను నిర్ణయించాలని, తమకు తామే న్యాయమూర్తులు కేసుల విచారణ చేపట్టరాదని ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. జస్టిస్ జె చలమేశ్వర్ నిర్ణయంపై ప్రధాన న్యాయమూర్తి తన అధికారాలను స్పష్టం చేస్తూ, తానే ‘మాస్టర్ ఆఫ్ ద రోస్టర్’ అని తెలిపారు. కేసు విచారణ నుండి బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కార చేపట్టాల్సి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు.
సుప్రీంకోర్టు విస్పష్ట ఉత్తర్వులను జారీ చేసినా, ఒడిసాలోని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబిబిఎస్ విద్యార్థులను చేర్చుకున్న వ్యవహారంతో మొత్తం కథ మొదలైంది. వెంకటేశ్వర మెడికల్ కాలేజీ (మీరట్) సహా 46 కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి యాజమాన్యాలకు అనుకూలంగా అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇషత్ మష్రూర్ ఖుద్దుసీ వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనుకూలమైన పరిష్కారాలు వచ్చేలా చూస్తానని ఇషత్ పిటీషన్‌దార్లకు హామీ ఇచ్చారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సిబిఐ దర్యాప్తు జరిపింది. ఆ న్యాయమూర్తిని సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఆయన ఇపుడు తిహార్ జైలులో ఉన్నారు. ఆయన పోలీసులకు ఏం చెప్పారో తెలియదు, ఎఫ్‌ఐఆర్ ఇంత వరకూ వెలుగు చూడలేదు. జస్టిస్ ఖుద్దుసీ వెల్లడించినట్టు కొన్ని పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపించాయి. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని కాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ రిఫార్మ్సు స్వచ్ఛంద సంస్థ అభ్యర్ధించింది. ఈ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు.
కొంత మంది న్యాయమూర్తుల పేర్లుచెప్పి ఒడిశా న్యాయమూర్తి లంచాలను తీసుకున్నారనే ఆరోపణల వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఇరకాటంలో పెట్టింది. దీంతో గతవారం సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామాలకు దారితీశాయి. జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం హడావుడిగా ఏర్పాటైంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, చీఫ్ జస్టిస్ అధికారాలను చేతిలోకి తీసుకుని ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదనే అభిప్రాయాన్ని చీఫ్ జస్టిస్ సారధ్యంలోని జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవరాయ్, జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ సారధ్యంలోని ధర్మాసనం ఉత్తర్వులపై చోటు చేసుకున్న పరిణామాలపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాదాపుప్రత్యక్ష మాటల యుద్ధానికే దిగారు. ఒక దశలో విచారణను ఆయన బహిష్కరిస్తానని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పేరు ఈ కుంభకోణానికి సంబంధించి వినిపిస్తోందని ఆయనే ఈ అంశాన్ని ఎలా విచారిస్తారని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో చీఫ్ జస్టిస్ పేరు ఉందా...ఉంటే చూపించండి అని బెంచ్ ప్రశ్నించినపుడు ప్రశాంత్ భూషణ్ వౌనం పాటించారు. దీనిపై చర్చ కొనసాగించడం సబబుకాదని సుప్రీంకోర్టు రెండు పిటీషన్లను కొట్టివేసింది.
న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా కాకుండా సొంత అభిప్రాయాలకు అనుగుణంగా వెళితే న్యాయవ్యవస్థపై సందేహాలు రావడానికి ఆస్కారం కలుగుతుంది. న్యాయమూర్తులు నిర్ణయాలు చేసేటపుడు ఖచ్చితంగా కొన్ని నిబంధనలను పాటించకపోతే అది వ్యవస్థకే చేటు తీసుకురావచ్చు. న్యాయవ్యవస్థ వివిధ సందర్భాల్లో శక్తివంతులైన వ్యక్తులు, వ్యవస్థలకు సంబంధించిన కేసుల్లో నిష్పాక్షికంగా వ్యవహరించే రీతిలో నిర్దిష్ట నియమనిబంధనలు రూపొందించుకోకపోతే ప్రజల్లో విశ్వాసం సడలుతుంది. ఇలా జరగడం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. న్యాయవ్యవస్థ ప్రజలకు ఆదర్శంగానూ, ప్రజాస్వామ్యానికి మార్గదర్శకంగానూ మారాలని కోరుకోవడం అత్యాశ కాదు.

-బి.వి.ప్రసాద్