మెయన్ ఫీచర్

రక్షణ కోల్పోతున్న ‘‘అక్షరాలు..’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష గల్లంతయిపోకుండా నిరోధించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించడం తెలుగు ప్రజల హృదయసీమలను ‘‘ప్రహర్ష పరిప్లుతం..’’ చేస్తున్న శుభపరిణామం! తెలుగు భాషలోని అక్షరాలు కొన్ని గల్లంతయిపోవడం తెలుగు భాష గల్లంతయిపోవడానికి దారితీసిన విచిత్ర పూర్వరంగం. నిజానికి ఈ అక్షరాలు గల్లంతు కాలేదు, కొంతమంది విబుధదైత్యులు పనికట్టుకొని గల్లంతు చేశారు! గల్లంతయిన ధ్యాస ఉన్న నిర్లిప్తులు, గల్లంతయిన ధ్యాసలేని అమాయకులు ఈ గల్లంతయిన అక్షరాలను ‘వ్రాత’లో వాడడం మానేశారు.. ఇంకా ‘బండి ఱ’ను మీరు వాడుతున్నారా? దాన్ని తీసేశారు కదా..?? అని ఎందరో ప్రశ్నిస్తున్నారు! ఈ ‘పృచ్ఛకుల’లో అధికాధికులు అమాయకంగా ఇలా ప్రశ్నిస్తున్నారు. గల్లంతు చేసిన భాషా విద్రోహులు, వారి వారసులు మాత్రం ముక్కులు చిట్లిస్తున్నారు, మూతులు వంకరగా తిప్పి బండి ‘ఱ’ను బతికించే ప్రయతాన్ని వెక్కిరిస్తున్నారు. ‘‘ఏమిటో వీరి వ్ఢ్యౌం..’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అక్షరాలను హత్యచేయడం ఆధునిక ‘విలాసం’ - ఫాషన్ - అన్నది ‘వీరి’ వంకరబుద్ధి. అక్షరాలను బతికించడం ఈ భాషా విద్రోహుల దృష్టిలో ‘వ్ఢ్యౌం’.. తెలుగు భాష గల్లంతు కాకుండా నిరోధించడానికి యత్నిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడైనా ఈ ‘అక్షర హనన’ బీభత్సకాండను నిరోధించగలగాలి! ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు తెలుగు భాషను అన్ని పాఠశాలలోను విధిగా బోధించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మన మాతృభాష గల్లంతు కాకుండా నిరోధించగలదు. కానీ, మాతృభాష నుంచి గల్లంతైన అక్షరాలను మళ్లీ బతికించాలి! తెలుగు భాషా బోధన అప్పుడే సమగ్రం అవుతుంది!
‘‘శ్రుతి మధురాక్షరంబయి విశుద్ధ
పదార్థ పరంపరా పరి
ష్కృతమయి లక్ష్య లక్షణ విశేష
వికస్వర సూరి సూత్ర సం
స్కృతమయి దేశ భాషల
కిరీటముగా పర పండితైక సం
స్తుతమయి వెల్గు తెల్గుదలతున్
కమనీయ వచోవిశుద్ధికై...’’
తెలుగు భాషా సరస్వతిని మహాపండితుడు మోచర్ల రామకృష్ణ కవి ప్రార్థించిన తీరు ఇది. వినడానికి ఇంపైన అక్షరాలు తెలుగు భాషా స్వరూపానికి అందమైన అవయవాలు. ఈ ‘మధురాక్షరములు’ ఆంధ్ర భాషకు మాత్రమే కాదు, అన్ని భారతీయ భాషలకూ సమాన స్వరూప సౌందర్య శోభలు.. ఎందుకంటే అతి ప్రాచీనమైన ‘బ్రాహ్మీలిపి’ అన్ని భారతీయ భాషలకు వౌలికమైన రూపం. ప్రతి భారతీయ భాషా లిపి బ్రాహ్మీ లిపికి రూపాంతరం. తెలుగుతో సహా అన్ని భారతీయ భాషలను ఎలా వ్రాస్తున్నామో అలానే పలుకుతున్నాము. ఇదీ, అక్షర రమ్యత. ఆదికవి నన్నయ భట్టు అందరూ ఈ భాషలోని ‘అక్షర రమ్యత’ను ఆదరిస్తారని ఆకాంక్షించాడు. గ్రాంథిక రూపం - క్లాసికల్ ఫార్మ్- లోను వ్యవహార రూపం - కమ్యూనికేటివ్ ఫార్మ్- లోను అక్షరక్రమం - స్పెల్లింగ్- సమానం, ఉచ్ఛారణ - ప్రొనౌన్సియేషన్‌లో తేడాలుండవచ్చు...
ఈ అక్షరమ్యత భారతీయ భాషలకు ప్రత్యేకం. ఆసేతు శీతనగం అన్ని భారతీయ భాషలూ- సింహళ, టిబెట్ భాషలతో సహా- ఒకే భాష కుటుంబానికి చెందిన వాస్తవానికి ఈ ‘లిపి సామ్యం’ ప్రత్యక్ష ప్రమాణం. అన్ని భారతీయ భాషల అక్షరమాల ‘అ ఆ’లతోనే ప్రారంభం అవుతుంది. ‘అ ఆ’లతో ప్రారంభం కాని భాషలు భారతీయ భాషలు కావు. ఈ భారతీయేతర, విదేశాలలోని అత్యధిక భాషలకు తెలుగు భాషకున్న అక్షర రమ్యత లేదు, భారతీయ భాషలకున్న అక్షర రమ్యత లేదు. ఉదాహరణకు ఆంగ్ల భాషలో ఒక విధంగా వ్రాస్తాము, మరో విధంగా పలుకుతాము. ‘అమ్మ’ అని వ్రాసి ‘అమ్మ’ అని పలుకుతాము. ‘అ, మ’ అక్షరాలనే వ్రాస్తున్నాము. ఆంగ్ల భాషలో ‘మదర్’ అన్నప్పుడు ‘మ, ద, ర’ అన్న అక్షరాలు వ్రాయము. అలాంటి అక్షరాలే ఆ భాషలో లేవు. ‘ఎమ్ ఒ టి హెచ్ ఇ ఆర్’ అన్న అక్షరాలను వ్రాసి ‘మదర్’ అని పలుకుతున్నాము. ఉదాహరణలు అసంఖ్యకాలు. కానీ ఇలా ‘అక్షర రమ్యత’ - వ్రాయడం, పలకడం మధ్య సమానత - లేని ‘ఆంగ్లం’ వంటి భాషలలోని అక్షరాలన్నింటినీ ఆయా భాషలవారు రక్షించుకుంటున్నారు. మనం, భారతీయులం, మరింత శ్రద్ధతో నిష్ఠతో ఆంగ్ల భాషలోని అక్షరాలను, అక్షరక్రమాన్ని పరిరక్షించుకొంటున్నాము. ఆంగ్ల అక్షరాల నుండి ‘జెడ్’ను కాని ‘జి’ని కాని ‘జె’ను కాని తీసివేయాలన్న బుద్ధి ఎవ్వరికీ పుట్టలేదు. కాని అక్షర రమ్యత ఉన్న తెలుగు భాష నుంచి బండి ‘ఱ’ను తీసేయాలన్న దుర్బుద్ధి కొందరికి పుట్టింది. ఈ కొందరు భాషాద్రోహులను అమాయకంగా అనేకమంది అనుసరించడం ఆరంభమైంది!
‘‘నిప్పుల్లో పడి నీఱయింది..’’ అని గ్రామీణ ప్రాంతాలలోని జానపదులిప్పటికీ అంటున్నారు. ‘నీఱు’ అని అంటే ‘బూడిద’! అంటే ఏదైనా పదార్థం నిప్పులలో పడితే కాలి ‘బూడిద’ అయిపోతుంది, ‘నీఱు’ అయిపోతుంది! బండి ‘ఱ’ను తొలగించిన వారు ‘నీఱు’- బూడిదను ఎలా వ్రాయగలరు? ‘నీరు’ అని వ్రాస్తారా? అలా వ్రాస్తే అర్థం వ్యతిరేకంగా మారదా? లేక ‘ఱ’ అక్షరంతోపాటు ‘నీఱు’ అన్న పదాన్ని కూడా హత్య చేయాలా?? బండి ‘ఱ’ వ్యథ అక్షర హననానికి ఒక ఉదాహరణ మాత్రమే! ‘ఱ’ మన భాషకున్న ప్రత్యేక అలంకారం! తమిళంలో ‘డ్ఘ’ అనే అక్షరం ఉందట! ఈ ‘డ్ఘ’ గురించి తమిళులు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ అక్షరాన్ని వారు హత్య చేయలేదు. మనం మన భాషలోని ‘ఱ’ అక్షరం గురించి ఎందుకని గొప్పగా చెప్పుకోలేకపోతున్నాము, ఎందుకు హననం చేస్తున్నాము?? తెలుగు భాషలోని యాభయి ఆరు అక్షరాలు ‘మాతృభాషా యోష’కు వైవిధ్య శోభల అవయవాలు. ఒక్క ‘అక్షరాన్ని’ ఖండించినప్పటికీ తెలుగు భాషా జనని స్వరూపం వైకల్యానికి గురి అవుతుంది. తమ భాషా మృతదేవి శరీరంపై ఏడు చోట్ల గాయాలు అయి ఉన్న దృశ్యాన్ని తెలుగువారు భావించగలరా? తిలకించి ఆనందించగలరా?? తెలుగు అక్షరమాల నుంచి ఏడు అక్షరాలను గల్లంతు చేసిన వారు ఇలా తల్లిని గాయపరిచినవారు. తెలుగు భాష గల్లంతు కాకుండా నిరోధించడానికి, మోడువారిన భాషా వృక్షాన్ని మళ్లీ పల్లవింపచేయడానికి, పరిమళింపజేయడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుంది. కానీ గల్లంతయిన తెలుగు అక్షరాలను భాషామతల్లి స్వరూపంలో మళ్లీ పొదగవద్దా?? త్వరలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో ఈ అక్షర హననం గురించి పునఃప్రాణప్రతిష్ఠ గురించి చర్చించగలరా?? అక్షర సౌందర్య దేవతకు ఒక చెవిని ఖండిస్తే ఎలా ఉంటుంది?? వేలినో కాలినో తొలగిస్తే ఎలా ఉంటుంది.. ఏడు అక్షరాలు తొలగిన తెలుగు భాషా స్వరూపం మళ్లీ సర్వ సమగ్ర శోభలతో వెలగవద్దా??
అచ్చులలో నాలుగు అక్షరాలను ‘పథకం’ ప్రకారం తొలగించారు. ‘ఋ’ వర్ణమాలలో లేదు, దాని తరువాతి మూడక్షరాలను కూడా పిల్లలకు నేర్పడంలేదు. అందువల్ల ‘ఋగ్వేదము’ అన్న పదాన్ని ‘రుగ్వేదము’ అని వ్రాస్తున్నారు. ‘ఋ’ వాడవలసిన చోట ‘రు’ వాడడంవల్ల రెండు రకాల వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. అర్థాలు మారిపోవడం మొదటిది. పద్య కవిత్వానికి ప్రాతిపదిక అయిన ‘్ఛందస్సు’ నియమాలు భంగపడుతుండడం రెండవ వైపరీత్యం. ‘ఋక్’ అని అంటే నిర్దిష్ట ఛందస్సుతో నిబద్ధమైన కవిత్వం. ఈ ఋక్కులతో కూడి వున్నది ఋగ్వేదము. ‘రుక్’ అని అంటే ‘రోగి’ అని అర్థము. ‘రుగ్వేదము’ అని అంటే ‘రోగాల వేదము’ లేదా ‘రోగుల వేదము’ అవుతోంది. ఇలా భాషను భ్రష్టుపట్టించడం ద్వారా భావాన్ని భంగపరుస్తున్నారు. ఆయుర్వేదాన్ని ‘‘రుక్ చికిత్సా వేదం’’ అని కాని ‘రుక్ వ్యతిరేక వేదం’’ అని కాని అనవచ్చుకాక.. కానీ ఋక్ వేదాన్ని ‘రుక్ వేదం’గా మార్చడం ‘్భష’కు మాత్రమే కాదు ‘్భరతీయత’కు కూడా జరిగిపోతున్న విద్రోహం! ‘తెలుగు’నకు సాంస్కృతిక భాష లేదా విశిష్ట భాష - క్లాసికల్ లాంగ్వేజ్ - హోదాను సాధించుకొనడానికి గొప్ప పోరాటం జరుపవలసి వచ్చింది. కానీ మన భాషలోని ‘వైశిష్ట్యాన్ని’- క్లాసికల్ నేచర్ - మనమే పాడుచేసుకుంటున్నాము. ‘అక్షర హననం’ ఇందుకు నిదర్శనం. ‘చ’వర్గంలో ఏడు అక్షరాలు ఉన్నాయి. కాని ‘రెండవ అక్షరాన్ని’, ‘ఐదవ అక్షరాన్ని’ హత్యచేశారు. ఫలితంగా ‘చందమామ’ ‘చక్కెర’ ‘జంటనగరాలు’, ‘జల్లెడ’ వంటి తప్పుల కుప్పలు భాషలోకి చేరిపోయాయి. ‘చ’ వర్గంలోని రెండవ, ఐదవ అక్షరాలను ‘కంప్యూటర్‌ల కీబోర్డుల’లో చేర్చకపోవడం ఈ అక్షరాలు ఎలా ఉంటాయన్నది కూడా తెలియని తెలుగువారు తయారయ్యారు. అన్నమాచార్యుని ‘పదాల’ను భద్రాచల రామదాసు కీర్తనలను ఆలపిస్తున్నవారు ‘చ’ వర్గంలోని అక్షరాల ఉచ్ఛారణను వికృతపరురస్తుండడానికి ఈ ‘అక్షర హననం’ కారణం! తెలుగు మహాసభలలో ఈ అక్షర హననం గురించి, ఏడు అక్షరాలను నిర్మూలించినందువల్ల ఏర్పడిన భాషా వైపరీత్యాల గురించి చర్చింపచేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వికలమై ఉన్న తెలుగు అక్షరమాలను సకలంగా మార్చడానికి పూనుకోవాలి! వైవిధ్యాలను పరిరక్షించుకోవడం పెంపొందించుకోవడం మన సంస్కృతి. వైవిధ్య అక్షరాలను హత్య చేయడం అసహిష్ణుత - ఇన్‌టాలరెన్స్‌కు, పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం! గ్రాంథిక, వ్యవహార, గ్రామ్య, జానపద రూపాలన్నీ విశిష్ట భాషకున్న వైవిధ్యాలు, అలాగే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వైవిధ్యం. అన్ని వైవిధ్యాలు సమాంతరంగా, వైరుధ్య రహితంగా కొనసాగడం కొనసాగించడం మన ‘సంస్కృతి’లో నిహితమై ఉన్న సమన్వయం!
అక్షరాలు అజరామర
భావానికి రూపాలు,
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు...
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు
‘అమ్మా!’ అను పసిపాపల
పరిశోధక సుస్వరాలు...
పర్వతాలను అధిరోహించిన వారికి చిన్న చిన్న కొండలను, గుట్టలను, పుట్టలను ఎక్కడం మైదానంలో పరుగులు తీయడం చాలా సులభం. కానీ పర్వతాలను ఎక్కడాన్ని వెక్కిరించడం, ఎక్కరాదని తీర్మానించడం విచిత్రమైన వ్యవహారం. గుట్టలను ఎక్కగల వారందరూ మహాపర్వతాలను అధిరోహించలేరు, పర్వతాలను అధిరోహించిన వారందరూ గుట్టలను ఎక్కగలరు, మైదానంలో పరుగులను కూడా తీయగలరు! పద్య కవిత్వం వ్రాయడం పర్వతాన్ని అధిరోహించడం వంటిది.. ‘మాత్రా ఛందస్సు’లతో కవిత్వం వ్రాయడం చిన్న కొండలను గుట్టలను ఎక్కడం వంటిది. ‘వచనం’ వ్రాయడం మైదానంలో పరుగుతీయడం వంటిది! ‘ఋ’ అన్న అక్షరాన్ని ‘రు’గా వ్రాయడంవల్ల పద్య కవిత్వంలోని ఛందో నియమాలు భంగపడుతుండడం భాషాభిమానులు, వేత్తలు చర్చించదగిన మహావిషయం. ‘‘ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి..’’ అన్న సీస పద్యంలోని ఈ పాదాన్ని ‘‘రుషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి..’ అని వ్రాయడంవల్ల ‘్ఛందస్సు’ నియమమైన ‘యతి’ తప్పుతోంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే... ఉదాహరణలు కోకొల్లలు...

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352