ఎడిట్ పేజీ

తరగతి గదే కావాలి ఓ కార్యక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులే కారణమంటూ గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో వాస్తవం లేదు. కాని, తల్లిదండ్రులే ఎందుకు కారణమవుతున్నారో, దాన్ని ఎలా నివారించాలో ఎక్కడా పొందుపర్చలేదు. ఇందులో విద్యాసంస్థలనుగాని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్నిగాని ప్రస్తావించకపోగా, ప్రైవేట్ విద్యారంగం ఎలా నిర్వహించబడాలో కూలంకషంగా చర్చించిన జీఓ (1) (1-1-1994) గూర్చి మాట్లాడకపోవడం, 2009 నాటి విద్యాహక్కు చట్టాన్నిగాని, బోధన అంశాలపట్ల, పనిగంటల పట్ల నిర్దేశకాలగల జాతీయ విద్యా ప్రణాళికా చట్రం 2005ను ప్రస్తావించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నది.
జవాబుదారీతనంతో విద్యారంగాన్ని నడపాల్సిన ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నానే్న చేపట్టాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల బాధ్యతల్ని లయన్స్‌క్లబ్‌కు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని తీసుకోవడం, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ ఆలోచనకు స్వస్తి పలికారు. తిరిగి ఇదే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం తిరిగి ప్రారంభించి, తమిళనాడులోని కోయంబత్తూర్ కేంద్రంగా నడుస్తున్న జగ్గి వాసుదేవ్ ‘ఇషా’ ఫౌండేషన్‌కు కుప్పంలోని 4 మండలాల ప్రాథమిక పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమం మోజుతో అప్పజెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులకు జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం, ఈసారి ఏకపక్షంగా చిత్తూరు జిల్లాలోని 3వేల ప్రాథమిక పాఠశాలల్ని ఆధ్యాత్మిక గురువులకు తిరిగి అప్పజెప్పింది. ఈ గురువుగారే గత సెప్టెంబర్‌లో ర్యాలీ ఫర్ రివర్స్ పేరున కన్యాకుమారి నుంచి ఢిల్లీదాకా ఓ ర్యాలీని నిర్వహించి, నీటి పారుదల ప్రాజెక్టుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని ప్రవచించడం తెలిసిందే! దీన్ని గుర్తించినవారుగాని, ఖండించినవారుగాని లేని వ్యవస్థలో, పాఠశాలల్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, అందునా ఆంగ్లమాధ్యమం అంటే, వ్యతిరేకిస్తారనుకోవడం అత్యాశే!
ఇలాంటి చర్యల్ని సమర్థించుకోవడానికే గత జులైలో ‘స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల’ చట్టం 2017ను చర్చకు పెట్టింది. దీనిపై ప్రజల స్పందన ఎలావున్నా, ఉపాధ్యాయ సంఘాల, పౌర సమాజాల స్పందన పెద్దగా లేకపోవడంతో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్ని ‘ఇషా’ ఫౌండేషన్‌కు ధారాదత్తం చేసింది. అంటే, భవనాలు, బోధించే ఉపాధ్యాయులు, పాఠ్య ప్రణాళికలు, పుస్తకాల సరఫరా అంతా ఫౌండేషన్ వ్యవహారంగా మారిపోతుంది. పోనీ, వీరు ఉత్తపుణ్యానికి ఇవన్నీ చేస్తారా? సంబంధిత ఖర్చులు, ఉపాధ్యాయుల జీతభత్యాలు, నిర్వహణ అంతా ప్రభుత్వం చూస్తే, అజమాయిషీ, బోధన సంబంధ అంశాలన్ని ఇషా ఫౌండేషన్ చూస్తుందన్నమాట! పోనీ, సద్గురుగాని, ఆయన సంస్థగాని పెడగాజీ విధానాల్లో నిష్ణాతులా, బోధనలో నైపుణ్యతలు, శాస్ర్తియత ఉన్నదా అంటే, అదో ఆధ్యాత్మిక సంస్థ! ఓ ఆధ్యాత్మిక సంస్థ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వహించుతుంటే ప్రభుత్వాలెందుకు? చట్టసభలు ఎందుకు? ప్రభుత్వ ఎపెక్స్ సంస్థ అయిన ఎస్‌సిఇఆర్‌టి ఎందుకు? వీటన్నింటిని ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేదా వీటిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పుతుందా?
చట్టసభలతోపాటు, ఏ ప్రభుత్వ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా, ఎన్నికల్లో ఇచ్చిన స్ఫూర్తితో నడవడం లేదనేది తెలిసిందే! అలాంటప్పుడు, వ్యవస్థీకృత లోపాల్ని సమీక్ష చేసుకొని, చేపట్టాల్సిన చర్యల్ని, ప్రభుత్వ బాధ్యతల్ని గుర్తించాల్సిన ప్రభుత్వాలు, విద్యారంగానే్న ప్రయోగానికి ఎందుకు ఎంచుకుంటున్నారో ఆలోచించాలి. ఓవైపు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేయడంతోపాటు సేవారంగాలన్నింటిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం జరుగుతున్నది. లాభాల్ని ఆశించకుండా, ఏ ప్రైవేట్ సంస్థ ఉచిత సేవల్ని అందించడు. ఇలా రోజురోజుకు ప్రభుత్వమే నిర్వీర్యంగా మారిపోతూ, బాధ్యతల్ని తప్పించుకోవడానికే ప్రభుత్వాలు ఏర్పడడం, వీటికై ఎన్నికలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఓవైపు మాతృ భాషలోనే బోధన కొనసాగాలని, తెలుగు భాషను కాపాడాలని ఉద్యమం జరుగుతుంటే ఓ జిల్లాలోని మొత్తం ప్రాథమిక పాఠశాలల్ని ఓ ఆధ్యాత్మిక సంస్థకు అప్పజెప్పడమంటే, ఇంతకన్నా అప్రజాస్వామ్యం మరొకటి ఉంటుందా?
ఈ మధ్యనే 800 కాలేజీలకు నోటీసులు ఇవ్వడం, 600 కాలేజులను తనిఖీ చేయగా 300 హాస్టళ్లు, 200 కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ప్రభుత్వమే పేర్కొంటూ కొన్ని సూచనలు చేసింది. అందులో ఒకటి ఆదివారాల్లో కాలేజీలు నడపకుండా సెలవు ఇవ్వాలని. కాని, మొన్నటి (12-11-17) రోజున పరిశీలిస్తే ఏ ఒక్క కాలేజీ కూడా సెలవు ప్రకటించకపోగా, రోజంతా బందిఖానా చదువులు జరుగుతూనే ఉన్నట్లు పత్రికల పరిశీలనలో తేలింది. ఏదో జనాకర్షణకై నివేదికల్ని, ఆదేశాల్ని ఇచ్చి, ఆచరణల్ని పట్టించుకోని లోపాయికారితనాన్ని గుర్తించినా, మిన్నకుంటున్నామంటే, ప్రభుత్వం ప్రస్తావించినట్లు తల్లిదండ్రులదే మూర్ఖత్వం! 200 చ.గ. ఇంటిలో ఓ కుటుంబం నివసించగలదు. ఆ విస్తీర్ణంలోని ఇంటిలో 160 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ‘విద్య’ అనే శిక్షను ముక్కుపచ్చలారని విద్యార్థులకు వేస్తుంటే శివరుచిత్‌లాంటి బాలురు సంప్‌లో పడకుండా ఎలా వుంటారు? నిజానికి ఇలాంటి ఏ ఒక్క ఘటన ప్రభుత్వ పాఠశాలల్లోగాని, విద్యాసంస్థల్లోగాని జరగని విషయాన్ని తల్లిదండ్రులు ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాదు. కారణం, మనకంటుకున్న ఐఐటి రోగం, ఐఎఎస్ రోగం, పరదేశీ వ్యామోహం తప్ప మరొకటి కాదు! తాము విద్యార్థి దశలో చదువుపట్ల నిరాసక్తత కలిగవుండి, తల్లిదండ్రులకు తలనొప్పిగా వున్న విషయాన్ని మరచి, తమ పిల్లలు మాత్రం చదువుల్లో చుక్కలను తాకాలని, తమకు తలనొప్పిగా వుండవద్దని భావించడం దొంగ ఆలోచనా విధానమే! అనేక దురలవాట్లతో, తప్పుడు ఆలోచనలతో, భావాలతో, బాధ్యతారాహిత్యంతో విరాజిల్లే తల్లిదండ్రులందరు, తమ పిల్లలు మాత్రం బంగారు తునకలు కావాలని ఆత్యాశపడడాన్ని ఏమనాలి?
విద్యారంగం అంటే కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించి తల్లిదండ్రులకుండాల్సిన బాధ్యతల్ని, పౌరులుగా ఆలోచించాల్సిన అంశాల్ని మరిస్తే ప్రభుత్వాలు ఇంతకన్నా మెరుగ్గా పనిచేయలేవు. బాధ్యతలనెరిగి, ప్రభుత్వాన్ని నిలదీసి మెడలువంచితే, ప్రజాస్వామ్య భావజాలం పెంపొంది ఆరోగ్యకరమైన వ్యవస్థ ఏనాడో రూపుదిద్దుకునేది. ఈ ఏడు దశాబ్దాల కాలంలో రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ పార్టీలు అవతారం ఎత్తితే, జనాల్లో స్వార్థ చింతన దండిగా పెరిగిపోతుంది. పెట్టుబడి దృక్కోణం రోజురోజుకు బలోపేతం అయింది. వీటి ఫలితాల్నే నేడు సమాజం వ్యతిరేక దిశలో అనుభవిస్తున్నది. నిజానికి ఈ ఏడు దశాబ్దాల్లో విద్యావిధానంలో ప్రజాస్వామిక ఆలోచనలు బలోపేతమై, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యల దాకా మొత్తం విద్యారంగం ప్రజాస్వామికరించబడాల్సింది. కనీసం ఈ ఆలోచనలకు కూడా తావివ్వాలి. విద్యావ్యవస్థ అపసవ్య దిశలో తిరగడంతో నేటి అనూహ్య పరిస్థితులు పిల్లల మెడపై వేలాడుతున్నాయి.
విద్యారంగం బాగులేదని, మారాలని, మార్పు రావాలని నినదించడం జరిగినా, ఎలాంటి విద్యావిధానం వుండాలో, దృక్పథాలేంటో, ఇతర దేశాల్లో పరిఢవిల్లుతున్న విధానాలేంటో, స్వీకరించే విధానాలేమైనా వుంటే ఎందుకు స్వీకరించలేకపోతున్నామో, అలాంటి విధానాల్ని అమలు చేయాలని ప్రభుత్వాలపై ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నామో, మన బలాల్ని, బలహీనతల్ని బేరీజువేసుకోక, గొర్రెదాటు పద్ధతిలో పిల్లల్ని బడికి పంపిచడం జరుగుతున్నది. అభ్యుదయ సంఘాలుగా ప్రచారం చేసుకుంటున్న ఉపాధ్యాయ సంఘాలుగాని, విద్యార్థి సంఘాలుగాని, పౌర సంస్థలుగాని ఈ దిశగా ఆలోచించలేకపోవడం నేటి విద్యారంగ దుస్థితికి ప్రధాన కారణం. నిజానికి ఈ సంస్థలు వాటివాటి స్థాయిల్లో చర్చలు జరిపి విద్యారంగ స్థితిగతుల్ని బేరీజువేసి ఉండగూడని, చేయగూడని అంశాలను రద్దు చేసే ఉద్యమాన్ని ఎప్పుడో లేవదీయాల్సింది. ఏ పట్టింపు లేక, ఉన్న వ్యవస్థలో అది తప్పుడు విధానం అని తెలిసినా దానే్న విధిగా చదవాలని పిల్లల్ని ఒత్తిడి చేయడం జరుగుతున్నది.
ఈ మధ్యన ఇలాంటి ప్రయత్నాలు కొన్ని సంస్థలు మొదలుపెట్టడం సంతోషించదగ్గ అంశం. గత ఆదివారం ప్రజ్ఞ్భారతి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో కేవలం ఆంగ్ల రైమ్స్ విషయంగా వర్కుషాప్‌ను నిర్వహించడం, జాతీయతతో రైమ్సుగాని, పాటలుగాని వుండాలని, అర్థంలేని పదజాలంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అర్థం కాకుండానే వాటిని తరాలుగా తరగతి గతిలో బోధించి పిచ్చి ఆనందాన్ని పొందతడం జరుగుతోందని, ఆ వర్కుషాపునకు హాజరైన విద్యాభిమానులు ప్రస్తావించారు. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానికతకు అనుగుణంగా రైమ్సు, పాటలు, కథలు, వ్యాఖ్యానాలు వుండాలని, సూచించారు. ఈ కోణంతోనే దాదాపు 50 మంది ఉపాధ్యాయని, ఉపాధ్యాయులతో ఓ ప్రయోగాన్ని చేసి, స్థానిక అవసరాలకు అనుగుణంగా, సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా, విద్యార్థులు ఆలోచించే విధంగా ఆంగ్లంలో రైమ్సును తయారు చేయించి వారిచేతనే వాటిని అభినయంతో పాడించి ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి కలిగించడం జరిగింది.
నిజానికిదో చిరు ప్రయోగమే! ఇలాంటి వర్కుషాపులు అన్ని స్థాయిల్లో, అన్ని ప్రాంతాల్లో జరగాలి. పాఠ్యాంశాల రూపకల్పనతోపాటు స్థానిక సంస్కృతులు, భాషలు కాపాడబడేలా, చుట్టూ ఉన్న పరిసరాల్ని, లభించే సహజ వనరుల్ని, ఖనిజ సంపదల్ని కాపాడుతూనే వినియోగించే విధానాల్ని అధ్యయనం చేసేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. ఈ విధంగా జరగడమంటే, ఉపాధ్యాయుల సాధికారిత పెరగడమే కారణంగా, సమాజంపట్ల, పరిసరాలపట్ల వారి బాధ్యతలు పెరుగుతాయి. ఎక్కడో, ఎవరో తయారుచేసిన పుస్తకాలు, స్థానికతను కాదంటూ, దూరపు కొండల్ని నునుపుగా చూపే విధానంతో పుస్తకాలు తయారు కావడంతో ప్రాథమిక స్థాయిలోనే చదువుపట్ల పిల్లలకు నిరాసక్తత పెరుగుతున్నది. బోధించే ఉపాధ్యాయులకు పట్టింపు లేకుండా పోతున్నది. ఫిన్‌లాండ్‌లో లాగ ఉపాధ్యాయులే తరగతి గదిని దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశాల్ని రూపకల్పన చేసే విధానం వస్తే, విద్యారంగంలో చోటుచేసుకున్న రుగ్నతలన్నీ కనుమరుగవుతాయి.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162