మెయన్ ఫీచర్

సోషల్‌మీడియా.. ప్రభుత్వాల దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల మధ్య సమాచారం అందించుకోవడంలో సోషల్ మీడియా వహిస్తున్న పాత్ర విశేషంగా పెరుగుతున్నది. రాజకీయ నాయకులు, ప్రజాజీవనంలో వివిధ రంగానికి చెందిన ప్రముఖుల ప్రతిష్టను, వారికిగల పలుకుబడిని సోషల్ మీడియాలో వారికిగల అనుచరవర్గం, వారికి లభించే స్పందననుబట్టి అంచనా వేయడం జరుగుతున్నది.
ఈ మధ్యనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి, ప్రత్యర్ధులపట్ల దుర్భాషలు, అసభ్య పదజాలంతో నిందాపూర్వకంగా వ్యవహరించడానికి ఎక్కువగా ప్రయత్నం జరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను ఆకట్టుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నవారు, తరువాత ఆ వేదికల ద్వారానే తమ విధానాలను తప్పుబడుతూ, తమకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూ వుంటె అసహనం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాము. సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం వ్యక్తం చేసినందుకు, ఒక పోస్టింగ్ చేసినందుకే అధికారంలో వున్నవారిపట్ల విమర్శనాత్మకంగా ఉన్నదంటూ కేసులు నమోదు చేయడం, జైలుకు కూడా పంపడం అక్కడక్కడా జరుగుతున్నది. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారాన్ని కట్టడి చేయడం కోసం చట్టబద్ధంగా విశేష అధికారాలు కైవసం చేసుకోవడానికి పలుచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆధునిక సమాజంలో సమాచార రంగంలో మహత్తర విప్లవానికి, పెద్ద మార్పునకు కారణమైన సోషల్ మీడియా నేడు దారుణంగా దుర్వినియోగం అవుతున్నది అనడంలో సందేహంలేదు. ఈ విషయమై పలువర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అందుకు ప్రభుత్వం సెన్సార్ విధించే ప్రయత్నం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించినట్లే కాగలదు.
పైగా ఈ విషయంలో ప్రధాన దోషిగా పలుచోట్ల ప్రభుత్వాలే ఉంటూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇంటర్‌నెట్ ఆవిర్భావమే ఒక సంచలనం. ప్రజలను సమాచార గోప్యత నుంచి బంధ విముక్తిచేసే సాధనంగా భావిస్తూ వస్తున్నాము. అయితే ఈ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలే సోషల్ మీడియాలో సమాచారాన్ని తప్పుదారి పట్టించుకోవడం కోసం జరుపుతున్న ప్రయత్నాలు నాటకీయంగా పెరుగుతున్నాయని ‘2017లో నెట్‌లో ఫ్రీడమ్’ పేరుతో ఫ్రీడమ్ హౌస్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తున్నది.
ఈ నివేదికలో ఒక్కొక్క దేశంలో ఆన్‌లైన్ స్వేచ్చ ఏమేరకు నెలకొన్నది అనే అంశంపై అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక విశే్లషణ చేసింది. గత సంవత్సర కాలంలో అమెరికాతోసహా ఎన్నికలు జరిగిన కనీసం 18 దేశాలలో ఆన్‌లైన్ ద్వారా తప్పుడు సమాచారం అందించే ఎత్తుగడలను పెద్దఎత్తున అనుసరించినట్లు తెలిపింది. దానితో వాస్తవమైన వార్తలు, సాధికారికతతో కూడిన చర్చల ఆధారంగా తాము ఎన్నుకోవలసిన నాయకుల గురించి స్పష్టమైన నిర్ధారణకు రావడానికిగల పౌరుల విచక్షణ శక్తికి తూట్లు పొడిచినట్లు అయింది. వరుసగా ఏడవ సంవత్సరంలో ఆన్‌లైన్ స్వేచ్ఛ తగ్గుతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే ప్రయత్నాలు పెరుగుతూ వస్తున్నాయి. దానితోపాటు మొబైల్ ఇంటర్‌నెట్ సేవలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. మానవహక్కుల రక్షకులు, స్వతంత్ర మీడియాలపై భౌతిక, సాంకేతిక దాడులు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
డబ్బు ఖర్చుపెట్టి తమ వాదనలను, ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజలకు చేరేటట్లు చేయడంతో చైనా, రష్యాలలో ప్రారంభించిన ‘పెయిడ్ వ్యాఖ్యలు, వార్తలు’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయని ఫ్రీడమ్ హౌస్ అధ్యక్షుడు మైఖేల్ జె అబ్రమోవిట్జ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇటువంటి ప్రయత్నాలు వేగంగా పెరుగుతూ వుండడంతో ప్రజాస్వామ్యం, పౌరసమాజ కార్యక్రమాలపై వినాశకర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
అసమ్మతిని అణచివేయడం కోసం, ప్రజాస్వామిక వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువెళ్లడం కోసం ప్రభుత్వాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించడం గణనీయంగా పెరుగుతున్నట్లు ‘నెట్‌పై స్వేచ్ఛ’ ప్రాజెక్టు డైరెక్టర్ సంజాకెల్లీ తెలిపారు. వెబ్‌సైట్ బ్లాకింగ్ వంటి ఇతర రకపు ఆంక్షలకన్నా ఈవిధంగా సమాచారాన్ని తప్పుదోవ పట్టించడాన్ని ఎదుర్కోవడం కష్టమవుతున్నదని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. అందుకు సోషల్ మీడియాను ప్రభావితం చేయడం కోసం భారీ సంఖ్యలో ప్రభుత్వాలు మానవ వనరులను ఉపయోగిస్తూ ఉండటమే కారణం.
ఈ సందర్భంగా స్వతంత్ర భావాలు కలిగిన బృందాలు, సాధారణ ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోతున్నది. ప్రపంచంలో ఇంటర్‌నెట్ ఉపయోగిస్తున్నవారిలో 87 శాతం మందిప్రజలు వున్న 65 దేశాలలో నెలకొన్న ఇంటర్‌నెట్ ఫ్రీడమ్‌ను ‘2016లో నెట్‌పై ఫ్రీడమ్’ నివేదికలో అంచనా వేసే ప్రయత్నం చేశారు. కొన్ని తాజా సంఘటనలను కూడా జత చేసినప్పటికీ, ఎక్కువగా జూన్, 2016 నుంచి మే 2017 వరకు జరిగిన పరిణామాలపైన ఈ నివేదికలో దృష్టి సారించారు.
ఆన్‌లైన్ సమాచారాన్ని తప్పుదోవ పట్టించేందుకు గత సంవత్సరం 23 దేశాలు ప్రయత్నం చేయగా, ఈ సంవత్సరం వాటి సంఖ్య 30కి చేరింది. పెయిడ్ సమాచారం, తప్పుడు వార్తలు, ప్రచారం వ్యూహాలు, అవినీతి చర్యల ద్వారా సమాచారాన్ని అనుకూలంగా మార్చుకోవడం వంటి పలు వ్యూహాలను ఈ సందర్భంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. మొత్తంమీద ఈ 65 దేశాలకు 32 దేశాలలో ఆన్‌లైన్ ఫ్రీడమ్ తగ్గిపోతూ వుండగా, ఈ సంవత్సరంలో ఉక్రెయిన్, ఈజిప్ట్, టర్కీలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఫిలిప్పీన్స్‌లో డ్రగ్ వ్యాపారంపై ప్రభుత్వం అనుసరించిన దారుణమైన అణచివేత విధానాలపట్ల ప్రజల మద్దతు వున్నదని ప్రచారం చేసుకోవడం కోసం ‘కీ బోర్డు ఆర్మీ’ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం టర్కీలో అధికారపక్షం 6వేల మందికి పైగా వ్యక్తులను నియమించినట్లు తెలుస్తున్నది.
చాలా ప్రభుత్వాలు తమ దేశంలో ప్రజాభిప్రాయాలను తమకు అనుకూలంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తుండగా రష్యా వంటి దేశాలు విదేశాలలో సైతం తప్పుడు సమాచారం వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం రష్యా సాగించిన ‘తప్పుడు సమాచార’ ప్రచారాన్ని ఈ సందర్భంగా ఉదహరించవచ్చు. తప్పుడు వార్తలను ప్రభావితం చేయడం, జర్నలిస్టులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగడంతో సాధారణ స్వేచ్ఛాపూర్వక వాతావరణం ఉన్నదని చెప్పుకునే అమెరికా ఇంటర్ నెట్ స్వేచ్ఛలో వెనుకబడవలసి వచ్చింది.
ప్రత్యక్షంగా 14 దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్‌నెట్ ఫ్రీడమ్‌పై ఆంక్షలు విధించాయి. తద్వారా వాస్తవ సమాచారం వ్యక్తం చేయకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ అధికారులు దేశంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ నెట్‌వర్క్, సెర్చ్ ఇంజన్‌లతోపాటు రష్యా ఆధారిత ఇంటర్‌నెట్ సేవలను బ్లాక్ చేసారు. క్రెమ్లిన్ అభిప్రాయాలను వివరిస్తూ రష్యా ఏజెంట్లు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పెద్దఎత్తున వ్యాప్తిచేస్తుండడంతో ఇటువంటి తీవ్రమైన చర్యకు పాల్పడ్డారు.
విదేశాలనుంచి వ్యాప్తిచెందే దుష్ప్రచారాన్ని కట్టడి చేసే మిషతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడాన్ని అనుమతించలేము. నిషేధాలు, ఆంక్షల ద్వారా కాకుండా తప్పుడు వార్తలు, వ్యాఖ్యానాలను ఏ విధంగా గుర్తించాలి అన్నది తెలుపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా విదేశాల నుంచి జరిగే దుష్ట ప్రయత్నాలను ఎదుర్కోవచ్చని కెల్లీ సూచించారు. ప్రజాస్వామ్య దేశాలలో ఆన్‌లైన్‌లో జరిగే రాజకీయ ప్రచారాలు పారదర్శకంగా, విశ్వనీయంగా ఉండేటట్లు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వుంది.
ఇంటర్‌నెట్ ఫ్రీడమ్‌ను అధ్వాన్నంగా దుర్వినియోగం చేస్తున్న దేశాలలో వరుసగా మూడో సంవత్సరం చైనా మొదటి స్థానాన్ని పొందింది. ఆ తరువాత స్థానాలలో సిరియా, ఇథియోపియా వున్నాయి. ఇథియోపియాలో పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగడంతో గత సంవత్సరం అక్టోబర్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో సుమారు రెండు నెలలపాటు మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం మూసివేసింది.
ప్రపంచంలో ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్న వారిలో మూడవవంతుకన్నా తక్కువ మంది ఇంటర్ నెట్ సులభంగా, పెద్ద ఇబ్బందులు లేకుండా లభిస్తున్న దేశాలలో నివసిస్తున్నారు. ఈ దేశాలలో ఇంటర్నెట్‌లో వుండే సమాచారంపై ఎటువంటి ఆంక్షలు లేవన్నమాట.గత కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్ చర్చలను నియంత్రించుకోవడం కోసం ప్రభుత్వాలు అత్యంత ఆధునికమైన సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. చాల దేశాలు రాజకీయ, భద్రత కారణాలతో మొబైల్ ఇంటర్‌నెట్‌పై తరచు ఆంక్షలు విధిస్తున్నాయి. గత సంవత్సరంలో విధించిన ఆన్‌లైన్ ఆంక్షలు సగానికిపైగా మొబైల్ నెట్ వినియోగం పైననే కావడం గమనార్హం.
చాలా ప్రభుత్వాలు ప్రత్యక్ష వీడియో ప్రసారాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఫేస్‌బుక్‌తోపాటు పలు సోషల్ మీడియా వేదికలపై ఇటువంటి సదుపాయం లభిస్తూ వుండడంతో ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. కనీసం తొమ్మిది దేశాలలో ప్రత్యక్ష వీడియో ప్రసారాలపై దాడులు జరిగాయి. ఇంటర్‌నెట్ వాడుతున్న పౌరులపై, ఆన్‌లైన్ జర్నలిస్టులపై భౌతిక దాడులు గత సంవత్సరంలో 50 శాతం పెరిగాయి. ఇటువంటి దాడులు జరిగిన దేశాల సంఖ్య కూడా 20 నుంచి 30కి పెరిగాయి. ఆన్‌లైన్‌లో భావాలు వ్యక్తం చేసినందుకు ఎనిమిది దేశాలలో హత్యలు జరిగాయి. జోర్డాన్‌లో ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా కార్టూన్ వేసిన వ్యక్తిని హత్య చేసారు.

-చలసాని నరేంద్ర 9849569050