మెయన్ ఫీచర్

అసహనం పెరిగితే అనర్థమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనం అన్నింటికీ మంచిది. అసహనం మనిషి వ్యక్తిత్వాన్ని, తనలో ఉన్న రెండో మనిషిని ప్రపంచానికి తనకు తెలియకుండానే పరిచయం చేసుకుంటుంది. నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోవడం కష్టం. మామూలు చెట్టుకింద కబుర్లు చెప్పేవారిని ప్రపంచం పట్టించుకోదు. కానీ బాధ్యతాయుతమైన పదవితోపాటు, మాట్లాడే వారి వంశానికి, కుటుంబానికి ఓ గొప్ప చరిత్ర ఉన్న వారి వారసులు నాలుకకు, మెదడుకు సంబంధం లేకుండా మాట్లాడితే మాత్రం దానికి అందరూ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. తాజాగా నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేసే క్రమంలో, యువనేత లోకేష్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకే కాదు, స్వపక్షాలకూ రుచించకపోవడమే ఇక్కడ చర్చ!
చంద్రబాబునాయుడు చెప్పినట్లు నంది అవార్డుల్లో జోక్యం ఉండకపోవచ్చు. కొంతమంది నిష్ణాతులను ఎంపిక చేసుకుని, వారిని జ్యూరీలో చేర్చి వారిచ్చే సూచనల ప్రకారం నంది అవార్డులిచ్చే సంప్రదాయం ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. వారిచ్చే తీర్పులో తప్పొప్పులకు ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆ జ్యూరీ సభ్యులు పనిమంతులా? కాదా? అన్నది మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన బాధ్యత మాత్రం పాలకులదే. లేకపోతే ఇదుగో.. ఈ అవార్డుల ప్రహసనం మాదిరిగానే మారుతుంది.
నంది అవార్డులు ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్థాయిలో కులాలు, ప్రాంతాల రచ్చ జరిగిన దాఖలాలు లేవు. సహజంగా అవార్డులు రాని వారి నుంచే నిరసనగళం వినిపిస్తుంటుంది. కానీ ఈసారి విచిత్రంగా అవార్డు తీసుకున్న వారి నుంచే కులగళం వినిపించడం బట్టి, దాని తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతుంది. రచయిత, నటుడిగా లబ్ధప్రతిష్ఠుడైన పోసాని నంది అవార్డుల జ్యూరీలో 11 మంది కమ్మవారే ఉన్నారని, తన సొంత సామాజికవర్గ ఎంపికనే తప్పుపట్టారంటే, ఇతరులు వేలెత్తిచూపడటంలో ఆశ్చరమేమీ లేదు. తాను కమ్మ వాడినయినందుకే అవార్డు ఇచ్చారనుకునే అపోహ ఉన్నందున, అసలు తనకీ అవార్డే వద్దు పొమ్మని వాపసు ప్రకటించడం దిగ్భ్రమగొలిపే అంశమే.
ఏపీలో ఓటు, ఆధార్‌కార్డు లేని ఎన్‌ఆర్‌ఏ (నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్)లు మాత్రమే నంది గురించి మాట్లాడుతున్నారన్న లోకేష్ వైఖరిని తూర్పారపట్టిన పోసాని విమర్శలు సరైనవా? కావా? అన్నది పక్కకుపెడితే.. అవార్డులకు స్థానికత ఆపాదించడమే లోకేష్ చేసిన పొరపాటుగా కనిపిస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో తాను ఆంధ్రా కాదు, తెలంగాణ కాదు, నిఖార్సయిన హైదరాబాదీనని లోకేష్ చెప్పిన విషయాన్ని మర్చిపోతే ఎలా?
పరిచయం అవసరం లేని తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇది ఆధార్‌కార్డులకు ఇచ్చిన అవార్డులు కాదని, సినిమాలకి ఇస్తున్న అవార్డులని ఆవేదన చెందారు. లోకేష్ గురించి ఆయన పోసానిలా ఘాటుగా మాట్లాడకపోయినా, తనకు చిన్నప్పటినుంచీ తెలుసంటూ లౌక్యంగా చురకలు అంటించారు. తన తండ్రికి చెడ్డపేరు తీసుకురావద్దని సున్నితంగా చేసిన సూచన అర్ధం చేసుకుంటే, లోకేష్ ఎక్కడైనా రాణిస్తారు.
ఏపీలో ఆధార్, ఓటు లేనివాళ్లే విమర్శిస్తున్నారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యను, సొంత పార్టీ వారూ స్వాగతించడం లేదు. దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు నుంచి భారతరత్న, పద్మశ్రీ అవార్డుల వరకూ ఏవీ స్థానికత చూసి ఇవ్వరు. అలాగైతే కృష్ణా జిల్లాకు చెందిన అక్కినేని, ఎన్టీఆర్, కె.విశ్వనాథ్‌కు నందికి మించిన పెద్ద అవార్డులు దక్కేవికాదు. విశ్వనాథ్‌కు ఢిల్లీలో ఓటు, ఆధార్‌కార్డు లేకపోయినా ఆయనకు దాదా అవార్డు ఇచ్చారు. అవార్డులకు కులం, మతం, ప్రాంతాలుండకూడదు. పైగా సినిమా అన్ని ప్రాంతాలకు చెందిన భాష. దీన్ని గుర్తించకుండా, విమర్శలకు విమర్శలే సమాధానం అన్నట్లు ఎవరు నోరు జారినా అది వారికే నష్టం. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లోకేష్ వంటి యువనేత భవితవ్యానికి మంచిదికాదు.
ఈ రచ్చ చూసిన చంద్రబాబు నందులు దారి తప్పుతాయనుకుంటే సర్వే ద్వారా ఎంపిక చేసేవాళ్లమని వాపోవాల్సి వచ్చిందంటే, అందులో తప్పులు జరిగినట్టే భావించక తప్పదు. అసలు నంది అవార్డులకు జ్యూరీ సభ్యుల నుంచి సర్వం తానై నడిపించిన బాలకృష్ణ తానే ఓ అవార్డు తీసుకోవడం, తన సినిమాకే 9 అవార్డులిప్పించుకోవడం ఔచిత్యమనిపించుకోదన్నది విజ్ఞుల వాదన. ఒక జడ్జి తన ప్రాంతానికో, తన కుటుంబానికో సంబంధించిన కేసు బెంచిమీదకు వస్తే ఆ బెంచి నుంచి తప్పుకుంటారు. ఎందుకంటే తనపై నీలాపనిందలు వస్తాయని!
అలాగే బాలయ్య కూడా నీలాప ‘నందులు’ రాకుండా చేసి ఉంటే బాగుండేది, ప్రజలూ మెచ్చేవారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో బాలయ్యకు చెందిన ఓ భవనంలో ప్రభుత్వ సంస్థలు లీజుకు తీసుకునే అంశం కూడా ఉంది. అయితే బాబు విజ్ఞత ప్రదర్శించి ఆ సమయంలో బయటకు వచ్చి, నిర్ణయాన్ని మంత్రిమండలికి వదిలేశారు. తాను ఉంటే మంత్రివర్గాన్ని ప్రభావితం చేస్తుందన్న దూరాలోచనతోనే ఆయన ఆ పనిచేశారు. బాలయ్య కూడా అదేపని చేసి ఉండాల్సింది. ఇక్కడ నంది అవార్డులపై బాబు చేసిన వ్యాఖ్యలను స్వాగతించిన వారే, లోకేష్ చేసిన విమర్శలను తూర్పారపడుతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి, న్యూ ఎంట్రీకీ తేడా అదే!
ఈ రచ్చకు కారణాలు అనే్వషించేందుకు మూలాలకు వెళ్లాల్సి వచ్చింది. అసలు ఆ రోజు లోకేష్ ఎందుకలా వ్యాఖ్యానించారు? దాని నేపథ్యమేమిటి? అన్న అంశాల్లోకి వెళ్లాలంటే, బయట వారికి తెలియని అసెంబ్లీ లోని లోకేష్ చాంబర్ పరిస్థితిని ఓసారి విశే్లషించక తప్పదు. లోకేష్ చుట్టూ ఇప్పుడు కుర్ర జర్నలిస్టుల కోటరీ ఒకటుంది. ఆయనకు సలహాదారుగా ఉంటూ, నడిపిస్తున్న వారికి నటన-రచనానుభవమే తప్ప రాజకీయపోకడలు లేశమాత్రమైనా తెలియవు.
పోనీ అతడనేక యుద్ధములలో ఆరితేరినవాడన్నట్లు అనుభవమేమైనా ఉందా అంటే అదీ లేదు. ఆ రోజుకు గాలిలో వార్తలు పంపే పనిమంతులే తప్ప, రాష్ట్ర రాజకీయాలను ఆకళింపు చేసుకునే వయసుగానీ, అనుభవం గానీ కనిపించదు. లోకేష్ నోరుజారి చేసిన ఆ వ్యాఖ్యల వెనుక సదరు మహాపండితుల ప్రోద్బలం, ఒత్తిడి ఉన్నట్లు చివరాఖరున తేలింది. ఇంతకూ లోకేష్ ఆధార్‌కార్డుల వ్యాఖ్యలు చేసింది ప్రత్యేక హోదా ఉద్యమకారులమీదయితే, మిడిమేళపు మీడియా కుర్రకారు దానిని నందులకు కలిపి గాల్లో వదిలి ఆ రోజుకు పనికానిచ్చేశారట! ఏలినవారు కూడా కుర్రకారైతే ఏమిటి? అందులో ‘మనవాళ్లు’ ఎక్కువమంది ఉంటే చాలనుకుంటున్నారు మరి! ఈ పరిస్థితిలో భవిష్యత్తు రాజకీయాలను శాసించాలనుకునే వారికి ఇలాంటి బలహీనతలు అవరోధం కలిగించక తప్పవు.
నిజంగా ఒక్కోసారి హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం పనిచేసి, నవ్యాంధ్ర రాజధాని వాతావరణం చూసిన వారికి, పోసాని వ్యాఖ్యల్లో అబద్ధం లేదనిపిస్తుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కులం లేదు, మతం లేదు. వాటికి అతీతమైన సహజీవనమే దర్శనమిచ్చేది. తలపండిన జర్నలిస్టులుండేవారు. అనుభవం ఉన్న వారు డజన్లమంది ఉండేవారు. వారి కులాలేమిటో ఎవరికీ తెలియవు. పాలకులు కూడా కులంరంగు బయటపెట్టుకునేందుకు జంకేవారు. విభజన తర్వాత పరిస్థితి అందుకు భిన్నం. పక్క రాష్ట్రం వారైనా ఫర్వాలేదు, మనవాళ్లయితే చాలనుకునే పరిస్థితి. నంది అవార్డుల జ్యూరీలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అలాంటి‘మనవాళ్లే’నాయె!
నంది అవార్డులు తీసుకున్న వాళ్లకుగానీ, వారిని ఎంపిక చేసిన వారికి గానీ ఏపీలో ఆధార్‌కార్డులున్నట్లూ లేవు. ఇక అవార్డులివ్వబోమన్న లీకు కథనాలతో పోయేది సర్కారు ప్రతిష్ఠనే. పోసాని చెప్పినట్లు భారతరత్న, పద్మ అవార్డులపైనా విమర్శలొస్తాయి. అంతమాత్రాన వాటిని కేంద్రం ఇవ్వమని చెప్పలేదు కదా? వచ్చిన విమర్శలను సరిదిద్దుకోవడమే విజ్ఞుల లక్షణం కదా?!
* * *
ఏపీ శాసనసభాపతి కోడెలపై అంబటి రాంబాబు అనే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యపై సభ్యులు ఆగ్రహించి, ఆయనకు సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులివ్వాలని ఎలుగెత్తారు. సభ్యుడు కాని వ్యక్తికి నోటీసులివ్వాలన్న ఈ డిమాండు మళ్లీ 30 ఏళ్ల తర్వాత వినిపించడం ఆసక్తిదాయకమే. గతంలో పెద్దలసభలో గలాభా అని రాసినందుకు రామోజీరావుపై నాటి కాంగ్రెస్ సర్కారు కనె్నర్ర చేసింది. ఆ తర్వాత కోర్టు స్టేలు, ఎన్టీఆర్ వచ్చి ఆయనే చెప్పినట్లు ఆరోవేలయిన కౌన్సిల్‌ను రద్దుచేయడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ అనే్నళ్ల తర్వాత అలాంటి దృశ్యాలే కనిపించబోతున్నాయన్న సంకేతాలు కనిపించాయి.
అయితే, ఇంటా బయటా ఉన్న సమస్యలను సహనంతో ఎదుర్కొని పరిష్కరించేపనిలో ఉన్న చంద్రబాబు, ఒక బయట వ్యక్తి కోసం అంత సాహసం చేసి తన ప్రతిష్ఠను పణంగా పెడతారా? అన్నదే ప్రశ్న. జగన్ లాంటి నేతనే పట్టించుకోవద్దన్న పెద్దసారు, చిన్నలీడరయిన రాంబాబును సభకు పిలిపించి పెద్దలీడరును చేసేంత సాహసం చేస్తారా అన్నది తమ్ముళ్ల పాయింటు. ఈలోగా లాయర్లు, నాయకులు కొత్త లాజిక్కులు తెరపైకి తీసుకురావడం, ఈ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతోందన్న అనుమానాలకూ ఆస్కారమిస్తోంది. ఓ బిజెపి నేత ఆ క్రమంలో గతంలో కోడెల కుటుంబసభ్యురాలు చేసిన ఆరోపణలకు సంబంధించి తీసిన లా పాయింటు చూస్తే అదే అనిపించకమానదు.
ఇక్కడ సభ్యులు గానీ, బయట వ్యక్తులు గానీ సభను విమర్శించిన దాఖలాలు లేవు. గతంలో స్పీకర్లుగా ఎన్నికైన వారు తమ పార్టీకి రాజీనామా చేసిన సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడా అంత విశాలహృదయులు కనిపించడం లేదు. కాబట్టి ఆ స్థానంలో కూర్చున్న వారికి అది ముళ్లకిరీటమే. మరి అంబటి వ్యవహారాన్ని ఎటునుంచి ప్రారంభించి, ఎటు ముగిస్తారో చూద్దాం.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144