ఎడిట్ పేజీ

సమతుల్యతే అసలు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని మూడు ప్రజాస్వామ్య మూలస్తంభాలైన కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలలో ఎవరు గొప్ప ? ఎవరిది పైచేయి? రాజ్యాంగం ఏం చెబుతోంది. అత్యంత సంక్షుభిత సమయంలో మూడు వ్యవస్థలు కలిసి ఉమ్మడిగా ఎలా పనిచేయగలుగుతున్నాయి? ఇంత ఆదర్శప్రాయమైన వ్యవస్థలు ప్రపంచంలో మరేదేశంలోనూ లేవనడం అతిశయోక్తి కానేకాదు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోని అనేక దేశాల్లో అత్యుత్తమ నియమనిబంధనలతో కూడుకున్నది కావడమే దానికి కారణం కావచ్చు. సందర్భం వస్తే ప్రతి వ్యవస్థపైనా అజమాయిషీ ఉండేలా రాజ్యాంగం రూపుదిద్దుకుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో ప్రతి సంస్థ స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయగలిగే గొప్ప విశిష్టత రాజ్యాంగ నిర్మాతలు మన ప్రజాస్వామ్య మూలస్తంభాలకు ధారాదత్తం చేశారు. ఇటీవల జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాలు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు తావిచ్చాయి.
అన్ని వ్యవస్థలూ ఒక కుటుంబంలో భాగమని, అవి ఒకదానికొకటి బలొపేతం చేసుకునేందుకు పనిచేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునివ్వగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారాల విభజన సూత్రం న్యాయవ్యవస్థకూ వర్తిస్తుందని న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొనడం ద్వారా సుప్రీంకోర్టు పరిమితులను పరోక్షంగా గుర్తుచేశారు. అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో న్యాయవ్యవస్థ కూడా అలాగే కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రభుత్వాలే చేయాలని వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రవిశంకర్ ప్రసాద్ ప్రజాస్వామ్యంలో వివిధ వ్యవస్థల మధ్య ఉన్న చాలా స్పష్టమైన పారదర్శక విభజన గురించి చెప్పారు. అక్కడితో ఆయన ఊరుకోలేదు. చట్టాల రూపకల్పన బాధ్యత ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకే వదిలిపెట్టాలని ఆయన నిష్కర్షగా చెప్పారు. వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సి ఎస్ కర్ణన్‌ను అన్నిరకాల చట్టాల్లో నిపుణుడని గతంలో కొలీజియం పేర్కొందని, అదే వ్యిక్తి చివరికి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పడం ద్వారా కొలీజియం వ్యవస్థలో లోపాలను రవిశంకర్ ప్రసాద్ ఎత్తి చూపారు. గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడిషియల్ కమిషన్ అన్నింటికీ పరిష్కారమవుతుందని సూచించారు. అంతేకాదు, దేశ ప్రధానిపై ఎందుకు నమ్మకం పెట్టుకోరని కూడా ఆయన నిలదీశారు.
ఈ మాటలే పునఃసమీక్షకు తావిచ్చాయి. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా ధీటైన సమాధానం ఇస్తూ మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలని, ఏ ఒక్క వ్యవస్థ కూడా తమదే పైచేయిగా చెప్పుకోకూడదని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నపుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణ మాత్రమే కోర్టులు చూపుతున్న చొరవ అని ఆయన స్పష్టం చేశారు. నిజానికి విధానాల రూపకల్పనలో తమకు (సుప్రీంకోర్టుకు) ఎలాంటి ఆసక్తి లేదని, వాటికి భాష్యం చెప్పి అమలు జరిగేలా చూడడానికి మాత్రం తమకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. చేయకూడని పనుల జోలికి తాము వెళ్లబోమని, విధానాల రూపకల్పనకు, దేశాన్ని పాలించడానికి ప్రజాప్రయోజన వ్యాఖ్యలను ఒక సాధనంగా వాడుకుంటున్నారనే విమర్శను కూడా ఆయన తోసిపుచ్చారు. అనేక రిట్‌లు, పిల్‌లను తాము కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యావంతులైన, డిజిటల్ సాధికారతతో కూడిన దేశం కోసం ప్రధాని కంటున్న కలలు సాకారం చేయడంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన ఉత్ప్రేరకంగా తనవంతు పాత్రను పోషిస్తుందని చెప్పారు. పేరుకుపోతున్న కేసుల సంఖ్య న్యాయవ్యవస్థ నుండి గర్జించే పులి కాకూడదని అన్నారు. కేసుల్లో అనవసర వాయిదాలు కూడా ఇందుకు ఒక కారణం అవుతున్నాయని గుర్తించాలన్నది ప్రధాన న్యాయమూర్తి భావన. అలాంటపుడే వివిధ వ్యవస్థల ఉనికి గురించి వాటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి వాటి విస్తృత అధికారాల గురించి చర్చ జరగడం షరామామూలే.
సుప్రీంకోర్టు దేశంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థగా పరిగణించాలా? సుప్రీంకోర్టులో ప్రభుత్వ జోక్యం తగదా? న్యాయసూత్రాలకు అనుగణంగా ప్రభుత్వం చేసే పొరపాట్లను సుప్రీంకోర్టు ఎత్తిచూపడం తప్పవుతుందా? ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య సిగపట్లు ఈనాటివి కాదు.
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన మూడు వ్యవస్థల మధ్య సహనశీలత, సమతుల్యతపై మరో మారు చర్చ జరుగుతోంది. రాజ్యాగం స్ఫూర్తిని అనుసరించి న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ మూడూ సమాన ఉనికితో కూడిన సంస్థలు. ఈ మూడు సంస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి లేవని, లేదా వేటికవే స్వతంత్రంగా వ్యవహరించే సంస్థలని కూడా చెప్పలేం. ఏ వ్యవస్థ మిగిలిన రెండు వ్యవస్థల పరిధిలోకి పొరపాటునైనా చొరబడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పరస్పరం విమర్శించుకోవల్సిన అవసరం కూడా లేదు. అపుడే ఈ సంస్థలు స్వేచ్ఛను గుర్తెరుగుతాయి.
శాసన వ్యవస్థ చేసే చట్టాలను తప్పకుండా అమలు జరపాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థది. ప్రభుత్వం ఈ చట్టాన్ని సరిగా అమలు జరుపుతుందో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థది. అంటే కోర్టులది. అలాగే న్యాయస్థానాల పనితీరును మళ్లీ సమీక్షించేది, న్యాయమూర్తులకు సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర వహించేది కార్యనిర్వాహక వ్యవస్థే. ఆ విధంగా చూస్తే న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలు పరస్పర ఆధారితమైనవి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత హోదా తమదేనంటూ కార్యనిర్వాహక వ్యవస్థ భావిస్తుండగా కాదు, తామే అత్యున్నత సంస్థ అంటూ శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలు భావించడం తరచూ జరిగేదే. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో అత్యున్నత హోదా దేశ ప్రజలదే. ఏం జరిగినా తొలి ప్రాధాన్యం దేశ ప్రజలదే, ఆ విషయాన్ని విస్మరించి వివిధ వ్యవస్థల మధ్య కనీకనిపించని రీతిలో చెలరేగే ఘర్షణలకు రాజ్యాంగం చాలా స్పష్టమైన సమాధానం చెప్పింది.
భారత రాజ్యాంగంలో తొలి విభాగాలు అన్నీ భారతదేశ భూభాగం గురించి, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ, దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక విద్యాహక్కులు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ గురించే ఉంటుంది. తర్వాత ఆదేశిక సూత్రాలు, సామాజిక వ్యవస్థ, ప్రాథమిక బాధ్యతల ప్రస్తావన ఉంది. ఐదో విభాగంలోనే కేంద్రప్రభుత్వం ప్రస్తావన ఉంటుంది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, కేంద్ర ప్రభుత్వం, మంత్రిమండలి చర్చ జరిగిన తర్వాత పార్లమెంటు, ఆర్థిక వ్యవహారాలను ప్రస్తావించారు. విభాగం -5 అధ్యాయం -4లో సుప్రీంకోర్టు గురించి ఉంటుంది. తద్వారా రాజ్యాంగంలోనే ఎవరి తర్వాత ఎవరు అనేది చెప్పకనే చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్టప్రతి, క్లాజు-4లో ఉదహరించిన విధానం అనుసరించి రాష్టప్రతి పార్లమెంటు తీర్మానం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించవచ్చు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన అధికార బాధ్యతలను స్వీకరించడానికి ముందు రాష్టప్రతి లేదా ఆయన నియమించిన (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) అధికారి ఎదుట ప్రమాణం చేయాల్సి ఉంటుంది. చివరికి సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా ఒకరిని నియమించాలన్నా రాష్టప్రతి అనుమతి అవసరం. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటే ఆ అధికారం పార్లమెంటుకు ఉంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.
మరో వైపు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వానికి మధ్య వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించాల్సింది సుప్రీంకోర్టు. ఒక దశలో కేంద్ర ప్రభుత్వ శాసనాల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే అధికారం ఒక్క సుప్రీంకోర్టుకే ఉండేది. ఈ అధికరణం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చినా ఒక ఏడాది తర్వాత 43వ రాజ్యాంగ సవరణ ద్వారా 1977లో తొలగించారు. విభాగం -4 ఆదేశిక సూత్రాలు అధికరణం 50 కింద రాజ్యాంగం చాలా స్పష్టంగా కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయశాఖను వేరు చేసి ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని పేర్కొంది.
విధులు నిర్వహించాలంటే నిధులు ఉండాలి, వౌలిక సదుపాయాలు కల్పించాలి. దేశంలో న్యాయస్థానాలు కోరుకునేది ఇదే. దిగువస్థాయి కోర్టుల్లో కోట్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నా, ఉన్నత న్యాయస్థానాల్లో లక్షల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా, ప్రతిసారీ న్యాయవ్యవస్థవైపు సామాన్యుడు చూపు సారించడం మానలేదు. దానికి కారణం ఆ వ్యవస్థపై ఇప్పటికీ సమాజానికి ఉన్న నమ్మకం.
న్యాయస్థానాల సంఖ్యే తక్కువగా ఉందని అనుకుంటున్న సమయంలో న్యాయస్థానాల్లో గదుల సంఖ్య కంటే న్యాయమూర్తుల సంఖ్య ఇంకా తక్కువగా ఉందని ఈ మధ్యనే న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక నివేదికలో పేర్కొంది. 17,576 కోర్టు రూమ్‌లు, 14363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా, 22288 మంది జడ్జీలు ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు ఈ నివేదికను అందించింది.
ఏ అధికారానికైనా ఒక హద్దు ఉంటుందంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన మాటలు మరిచిపోరాదు. మారిన పరిస్థితుల్లో ఎలా ముందడుగు వేయాలనే విషయమై కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు మేధోమథనం చేయాలి. మూడు వ్యవస్థల్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది రుజువు చేసుకోవల్సిన అవసరం ఇపుడు లేదు. బలాలేమిటో, బలహీనతలేమిటో దేశ ప్రజలు అందరికీ తెలుసు. హక్కుల కోసం పోరాడేవారు తమ బాధ్యతలను విస్మరించవచ్చా? నిజానికి మూడు వ్యవస్థల మధ్యనున్న సమతుల్యత రాజ్యాంగానికి వెనె్నముక వంటిది, స్వీయ నియంత్రణ, లోటుపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోవడం జవాబుదారీతనం, నిజాయితీ కాపాడుకోవడం ఏ వ్యవస్థ ఆరోగ్యానికైనా మంచిది.

-బి.వి.ప్రసాద్