మెయిన్ ఫీచర్

‘బాలికా వధువుల’కు కొత్త జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడికి వెళ్లాల్సిన బాలికలను బలవంతంగా సంసార బంధంలోకి నెట్టడం దారుణం.. శారీరక, మానసిక ఎదుగుదల లేకుండానే ‘పసుపుతాడు’తో వారి స్వేచ్ఛను బంధించడం నేరం.. బాగా చదువుకోవాలని, సొంతకాళ్లపై నిలబడాలని పరితపించే బాలికల కలలు సాకారం కావాలి.. బాల్యవివాహాల ఫలితంగా అత్తవారింట్లో అగచాట్లు పడుతున్న బాలికలకు భద్రత కల్పించి, భవిత పట్ల వారికి భరోసా కల్పించాలి.. మూఢాచారాలకు స్వస్తి పలికి, బాలికలను విద్య, ఉపాధి రంగాల్లో ప్రోత్సహించినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది..
పనె్నండేళ్ల ప్రాయంలోనే ఆమెకు పెళ్లి వేడుక జరిపారు.. పదిహేడేళ్లు రాగానే ‘గౌనా’ ఉత్సవం జరిపి ఆ బాలికను అత్తవారింటికి సాగనంపారు.. మూడుముళ్లూ పడ్డ తర్వాత అయిదేళ్లపాటు పుట్టింట్లోనే ఉన్నా ఇంటి పనులు నేర్పించారే తప్ప బడికి పంపలేదు. మిగతా పిల్లల్లా చదువుకోవాలన్న ఆశ బలంగా ఉన్నా అందుకు తల్లిదండ్రులు ‘ససేమిరా’ అన్నారు. పదిహేడవ ఏట మెట్టినింట అడుగుపెట్టిన ఆ బాలికకు అక్కడా స్వేచ్ఛ లభించలేదు. అత్తమామల సాధింపులు, తాగుబోతు భర్త వేధింపుల నడుమ ఆమె నరకాన్ని చవిచూసిందే తప్ప అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. పెళ్లయ్యాక జీవితం ఆనందమయంగా ఉంటుందనుకున్న ఆమె అంచనాలు తారుమారయ్యాయి. చదువు, ఉపాధి లేని భర్త మద్యానికి బానిసయ్యాడే తప్ప ఆమె బాగోగులను విచారించిన పాపాన పోలేదు. చిన్నతనంలో పెళ్లి చేయడం వల్లే తన జీవితం ఇలా అయిందని ఆమె విలపిస్తున్నా వినిపించుకునే నాథుడే లేడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె తెగించి- అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటపడి సామాజిక కార్యకర్త కృతి భారతి సాయంతో జోధ్‌పూర్‌లోని ప్రభుత్వ శరణాలయానికి చేరింది. సనాతన సంప్రదాయాలకు, మూఢాచారాలకు నిలయమైన రాజస్థాన్‌లో ఇలాంటి ఉదంతాలు సర్వసాధారణమే.
***
బాల్యవివాహాలపై సమరభేరి మోగించి ఇప్పటివరకూ 900 మంది బాలికలను రక్షించిన కృతి భారతి (29) బెదిరింపులను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ‘బాలికా వధువుల’కు భరోసా ఇస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో సుమారు వందలాది బాల్యవివాహాలను అడ్డుకున్నందుకు కృతి ఘనత ‘వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా’లో నమోదైంది. బాల్యవివాహాలను నిరోధిస్తూ, బాధితులకు అండగా నిలిచేందుకు ఆమె ‘సారథి’ పేరిట ఓ ట్రస్టును నిర్వహిస్తున్నారు. సంప్రదాయాల పేరిట బాలికల భవిష్యత్‌ను నాశనం చేయడం తగదని ఆమె అంటారు. గ్రామీణ ప్రజల్లో అవగాహన కలిగిస్తే తప్ప ఈ దురాచారం అంతం కాదని కృతి చెబుతుంటారు.
బాల్యవివాహాల కారణంగా బాధలు పడుతున్న బాలికలను గుర్తించడం, వారిని బడికి పంపేలా తల్లిదండ్రులను ఒప్పించడం, పల్లెల్లో కౌనె్సలింగ్‌లు నిర్వహించడం వంటి పనులు తనకెంతో సంతృప్తినిస్తాయని ఆమె అంటారు. బాధితురాళ్లను గుర్తిచడమే కాదు, వారికి భద్రత కల్పించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయని ఆమె తన అనుభవాలను వివరిస్తుంటారు. రాజస్థాన్‌లోని కొన్ని కులాల్లో లింగవివక్ష, బాల్యవివాహాలు, పరువు హత్యలు ఇంకా కొనసాగుతున్నాయని కృతి చెబుతున్నారు. సహా యం కోరివచ్చిన బాధిత బాలికలను శిశు సంక్షేమ కమిటీ వద్దకు తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి, వారిని ప్రభుత్వ శరణాలయాల్లో చేర్చుతున్నట్లు ఆమె తెలిపారు. ఇల్లు వీడిన బాలికలకు భద్రత కల్పించడం పెనుసవాల్‌గా ఉంటోందని ఆమె అం టారు. శరణాలయా ల్లో ఆశ్రయం పొం దిన బాలికలను తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు అదేపనిగా ప్రయత్నిస్తుంటారని, వారి ఒత్తిళ్లకు లొంగని బాలికలు స్వేచ్ఛ ను కోరుకుంటున్నారని ఆమె చెబుతున్నారు. ఉన్నత చదువులతో మంచి ఉద్యోగాలు సంపాదించాలని చాలామంది బాలికలు దృఢ నిశ్చయంతో శరణాలయాల్లో ఉంటున్నారని కృతి తెలిపారు. పల్లెప్రాంతాల్లో కుటుంబ సభ్యులు, కులపెద్దల ధోరణిలో మార్పు రావాలని, బాల్యవివాహాలను అరికడితే బాలికలు సైతం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారని, మార్పు కోసం కృషి చేసినపుడే ఇది సాధ్యమవుతుందని ఆమె అంటున్నారు. అత్తవారింట శారీరక, మానసిక వేధింపులకు లోనయ్యే బాలికలు- తమ పిల్లలేనన్న విషయాన్ని తల్లిదండ్రులు మరవరాదని కృతి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దురాచారాన్ని నిర్మూలించేందుకు తాను చేసింది తక్కువేనని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆమె అంటున్నారు.

చిత్రం కృతి భారతి

- అర్చన