మెయన్ ఫీచర్

రాజీవ్ హత్యపై వీడని అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన. ఇది జరిగి 27 ఏళ్లవుతోంది. హత్యకు బాధ్యులుగా నిర్థారించి సుప్రీంకోర్టు నలుగురికి మరణశిక్ష విధించి కూడా 18 ఏళ్లయింది. మరో ముగ్గురికి జీవితఖైదు విధించింది. అయినా ఈ హత్యకు సంబంధించిన అనేక అనుమానాలు వెంటాడుతూనే వున్నాయి. ముఖ్యంగా హత్య వెనుక జరిగిన కుట్రకు సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుట్రకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు లేదు.
ఈ హత్య కేసులో అనుమానితుడైన వివాదాస్పద వ్యక్తి చంద్రస్వామి మరణించి ఆరు నెలలైన తరువాత, ఈ కేసులో తీర్పు ఇచ్చిన ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సీనియర్ అయిన జస్టిస్ కె.టి.్థమస్ ఇప్పుడు నోరు విప్పారు. చంద్రస్వామిపై వచ్చిన అనుమానాలను నిగ్గుతేల్చడంలో సిబిఐ విఫలమైందని థామస్ చెప్పడంతో అనుమానాలు తిరిగి తెరపైకి వస్తున్నాయి. చంద్రస్వామి ముగ్గురు ప్రధానమంత్రులు- పి.వి.నరసింహారావు, చంద్రశేఖర్, అటల్‌బిహారి వాజ్‌పేయిలకు సన్నిహితుడు కావటంతో సిబిఐ ఈ విషయంలో ముందుకు వెళ్లలేదా అనే అనుమానాలు రేగుతున్నాయి.
అసలు రాజీవ్ గాంధీ హత్య కేసులో సిబిఐ జరిపిన దర్యాప్తులో తీవ్రమైన తప్పిదాలు ఉన్నట్లు జస్టిస్ థామస్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన కుట్రదారునిగా పేర్కొన్న శివరాసన్‌ను సిట్ సభ్యులు కాల్చిన సమయంలో అక్కడినుండి స్వాధీనం చేసుకున్న రూ.40 లక్షలు ఎక్కడినుండి వచ్చాయో కనుగొనే ప్రయత్నం చేయనే లేదు. ఇది అత్యంత ఘోరమైన తప్పిదమని ఆయన విమర్శించారు.
ఈ కేసులో శిక్షపడిన నిందితులలో ఒకరు ఒక వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ డబ్బును చంద్రస్వామి ఇచ్చారని పేర్కొన్నాడు. అయితే చంద్రస్వామికి వ్యతిరేకంగా నోరు విప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని సిబిఐ అధికారులే అతడిని హెచ్చరించినట్లు థామస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చెబుతున్నది రంగనాథ్ గురించి అనుకుంటా. శివరాసన్‌ను కాల్చి చంపిన ఇల్లు అతనిదే. నేరస్థులకు ఇల్లు అద్దెకు ఇచ్చి కుమ్మక్కయ్యారని అతనిపై సిబిఐ నేరాభియోగం చేసింది. శివరాసన్‌ను సన్నిహితంగా తెలిసినవారిలో ఇంకా జీవించి ఉన్న అతికొద్దిమందిలో అతను ఒకడు కావడం గమనార్హం.
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీలంకకు చెందినవాడు కావడంతో అతని వద్ద కొద్ది శ్రీలంక నోట్లు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ భారీ మొత్తంలో, అంటే దాదాపు రూ. 40 లక్షల విలువైన భారతీయ కరెన్సీ లభ్యమైంది. అంటే మన దేశంలోనే బలమైన శక్తులు ఈ హత్య కోసం అతనికి అడ్వాన్స్ ఇచ్చి ఉండాలని జస్టిస్ థామస్ కేసు విచారణ సందర్భంగా పేర్కొన్నారు. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో కనుగొన్నారా అని అడిగితే సొలిసిటర్ జనరల్ అల్త్ఫా అహ్మద్ సిట్ అధిపతి డి.ఆర్.కార్తికేయన్‌తో కొద్దిసేపు మాట్లాడి సమాధానం కోసం కొంత వ్యవధి అవసరం అన్నారు. ఆ మరుసటి రోజు తమకు ఎటువంటి ఆధారం దొరకలేదని నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్‌లోని మిగిలిన ఇద్దరు న్యాయమూర్తుల వ్యవహారశైలి పట్ల కూడా థామస్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులో నెలకొన్న పొరపాట్లను వారిద్దరూ ముందు ప్రస్తావిస్తే తుది తీర్పులో సిబిఐ దర్యాప్తులో లోపాలను విమర్శిస్తే బాగుండదని అన్నారని, అపుడు తాను విమర్శలు చేయకపోయినా ప్రశంసలు కూడా చేయవద్దంటే సరే అన్నారని అప్పటి సంఘటనలను థామస్ గుర్తుచేసుకొన్నారు. ముసాయిదా తీర్పు ప్రతి అదేవిధంగా ఉందని, అయితే తీర్పును చదువుతున్నపుడు సిబిఐ అధికారి కార్తికేయన్‌ను పొగడుతూ జస్టిస్ డి.పి.వాద్వా పేర్కొనటం తనకు విస్మయం కలిగించిందని వివరించారు. దానితో తీర్పు జరిగిన తీరుపట్ల సుప్రీంకోర్టు సంతోషంగా ఉన్నదనే అభిప్రాయం కలిగించినట్లు అయినదని అన్నారు.
ఈ కేసులో అప్పటికి మీసాలు కూడా రాని ఏజీ పేరరివలన్ అనే యువకుడికి మరణశిక్ష విధించడం తెలిసిందే. అతను చేసిన నేరం రాజీవ్ గాంధీ హత్యలో ఉపయోగించిన డిటొనేటర్ పనిచేయడం కోసం 9 వోల్ట్‌ల బ్యాటరీని తీసుకురావడం. వాస్తవానికి ఆ బ్యాటరీని ఎందుకు ఉపయోగిస్తున్నారో అతనికి తెలిసే అవకాశం లేకపోయినా, పైగా అది పోలీస్ నిర్బంధంలో ఇచ్చిన ప్రకటన అయినా దానినే ప్రధాన సాక్ష్యంగా తీసుకొని మరణశిక్ష విధించడం సహితం భారతీయ సాక్ష్యం చట్టానికి పూర్తిగా వ్యతిరేకం అని జస్టిస్ థామస్ వాదిస్తున్నారు.
‘రాజీవ్ గాంధీ హత్య: లోపలివారి పని’ అనే పేరుతో జస్టిస్ థామస్ వ్రాసిన గ్రంథంలో సహితం రాజీవ్ గాంధీ తిరిగి అధికారంలోకి వస్తే శ్రీలంకలో ఐపికెఎఫ్‌లపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటారనే అనుమానంతో ఎల్‌టిటిఇవారే హత్యకు పాల్పడ్డారనే అభిప్రాయానికి ముందే సిబిఐ వచ్చి హత్య వెనుక ఉన్న ప్రధానమైన కుట్రను మరుగునపరచే ప్రయత్నం జరిగింది’’ అని ఆరోపించారు. నేర చరిత్రగల శివరాసన్‌ను చంద్రస్వామి వంటివారు ఎందుకు ఇటువంటి పనికి ఉపయోగించి ఉండరాదనే ప్రశ్న కూడా వేస్తున్నారు.
వాజపేయి ప్రభుత్వం చంద్రస్వామికి వ్యతిరేకంగా వెలుగులోకి వస్తున్న ఆధారాలపైననే కాకుండా రాజీవ్ హత్య వెనుక ఉన్న విస్తృతమైన కుట్ర గురించి కూడా దర్యాప్తు జరపడం కోసం పలు ఏజెన్సీలకు చెందిన ఒక మానిటరింగ్ ఏజెన్సీ (యండియంఏ)ని ఏర్పాటు చేసింది. 17 ఏళ్లుగా ఈ ఏజెన్సీ ఉన్నా ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ ఏజెన్సీ ఒక్క నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. కేవలం చంద్రస్వామిని దేశం వదలి వెళ్లిపోకుండా మాత్రం చేయగలిగింది. అంతకుముందు కుట్రకోణంపై దర్యాప్తు జరిపిన జైన్ కమిషన్ సహితం చంద్రస్వామితోపాటు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్న సుబ్రమణియన్ స్వామిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
చంద్రస్వామి విషయంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న మరి అనేకమంది వ్యవహరించిన తీరు కూడా ఈ సందర్భంగా అనుమానాస్పదంగానే ఉంటూ వస్తున్నది. మరింత లోతుగా దర్యాప్తు జరిపితే ఇబ్బందికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని ఎవ్వరూ అధికారంలో ఉన్నా నిజాలు నిగ్గు తేల్చడానికి దాటవేస్తున్నారనే అనుమానం కలుగుతోంది.
ఉదాహరణకు రాజీవ్ గాంధీకిగల భద్రతను కుదించడంవల్లనే తేలికగా హత్య చేయడం సాధ్యమైంది. మానవ బాంబు థను రాజీవ్‌కు కొద్ది అడుగుల దూరంలోకి రాగలిగింది. భద్రతను కుదించింది అప్పటి ఐబి అధిపతి యం.కె.నారాయణన్ కావడం గమనార్హం. అయితే 2004లో కాంగ్రెస్ నేతృత్వ యుపిఎ ప్రభుత్వం ఏర్పడగానే నారాయణ్‌ని జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించారు. చిదంబరం హోమ్ మంత్రి అయినపుడు ఇద్దరికీ పడకపోతే, అప్పుడు గవర్నర్‌గా నియమించారు. రాజీవ్ భద్రత కుదించిన అధికారికి ఇంతటి ప్రాధాన్యత యుపిఎ ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు? ఇప్పటికీ అంతుచిక్కడంలేదు.
హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల గుండా శ్రీపెరంబుదూరులో ఎన్నికల సభలో పాల్గొనడానికి చెన్నై వచ్చాడు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అజెండాలో లేని సభకు ఎందుకు వచ్చారు? ఎవ్వరు, ఎందుకు ఆయన పర్యటన కార్యక్రమాన్ని ఖరారు చేశారు? రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులైన వాజపాడి రామమూర్తి, జి.కె.మూపనార్ వంటి నాయకులకు ఆసక్తి లేకపోయినా మరగధం చంద్రశేఖర్ ఎందుకు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి రాజీవ్ గాంధీని అక్కడకు ఆహ్వానించారు? తనకు తెలియకుండానే ఒక పెద్ద కుట్రలో ఆమె భాగస్వామి అయ్యారా?
భువనేశ్వర్, విశాఖపట్నంలలో రాజీవ్ గాంధీ వెంట ఉన్న ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి ఓ.పి.సాగర్ చెన్నైకు ఎందుకు వెంట వెళ్లలేదు? విశాఖపట్నంలో తాను ప్రయాణించవలసిన విమానం సాంకేతిక లోపానికి గురయితే రాజీవ్ గాంధీ సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. తిరిగి విమానం బాగయిందని ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెప్పగానే సాగర్ లేకుండానే రాజీవ్ విమానం ఎక్కారు? అనుభవంగల సాగర్ వంటి అధికారి ఎందుకు వెంట వెళ్లలేదు?
చెన్నైలో రాజీవ్ భద్రతా అధికారిగా వున్న పి.సి.గుప్తాకు వెంటరాని కారణంగా సాగర్ పిస్టల్ అందజేయలేదు. దానితో ఎటువంటి ఆయుధం లేకుండానే గుప్త రాజీవ్ వెంట ఉన్నారు. ఇక శ్రీపెరుంబుదూరు సభలో మరగధం చంద్రశేఖర్, ఆమె కుమార్తె లతా ప్రియకుమార్, అల్లుడు మాగేదిరం, కుమారుడు లలిత్ చంద్రశేఖర్, కోడలు వినోతిని కూడా ఉన్నారు. వినోతిని శ్రీలంకకు చెందిన యువతి. శ్రీలంక ప్రజలలో ఐపికెఎఫ్ ఆపరేషన్స్ కారణంగా రాజీవ్ గాంధీపై ఆగ్రహం ఏర్పడటం తెలిసిందే. కానీ సిట్ ఆమెను విచారణ చేయనే లేదు? ఎందువల్ల?
అంతకుముందు రెండు చిన్న చిన్న సభలలో రాజీవ్ గాంధీతో పాటు పక్కనే వేదికపై ఉన్న రామమూర్తి ఇక్కడ మాత్రం రాజీవ్‌కు దూరంగా ఉన్నారు. ఈ బాంబు పేలుడులో అనేకమంది అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా మృతి చెందలేదు. కనీసం గాయాలకు గురికాలేదు. ఇటువంటి అనేక అనుమానాలు రాజీవ్ గాంధీ హత్య విషయమై తలెత్తినా లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐగాని, ఆ తరువాత నియమించిన మల్టీ గ్రూప్ ఏజెన్సీ గాని ప్రయత్నం చేయనేలేదు. అందుకే జస్టిస్ థామస్ వెలువరించిన అంశాలు పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఇటువంటి అనుమానాలపై దృష్టి సారించి, అసలు కుట్రదారులను వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.
రాజీవ్ గాంధీకి భద్రత ఏర్పర్చడంలో జరిగిన లోపాల గురించి దర్యాప్తు జరిపిన జస్టిస్ వర్మ కమిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా, నిఘా వ్యవస్థలను తీవ్రంగా తప్పుపట్టింది. కొందరు సీనియర్ నిఘా అధికారులకు హత్యకు కుట్ర జరుగుతున్నదనే సమాచారం ఉన్నా సకాలంలో తగు చర్య తీసుకొనే ప్రయత్నం చేయలేదని తెలుస్తున్నది. ఈ లోపాలకు బాధ్యతగా ఒక్క అధికారిపై కూడా ఎటువంటి చర్య తీసుకొనకపోవడం గమనార్హం.
ఉదాహరణకు అప్పుడు ఐబి అధిపతిగా ఉన్న యం.కె.నారాయణన్ 1991లో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరగగానే హోమ్ కార్యదర్శి భార్గవ్ జరిపిన సమావేశంలో తాను లేనని ఈ కమిషన్ ముందు చెప్పారు. ఆ సమావేశంలో రాజీవ్ భద్రత గురించి చర్చించినట్లు తెలుస్తున్నది. తనకు ఆ సమావేశంలో లేనని వ్రాతపూర్వకంగా ఇవ్వమని వర్మ కమిషన్ కోరితే తిరస్కరించారు. ఆ సమావేశంలో నారాయణన్ వున్నట్లు వర్మ కమిషన్ ముందు హాజరైన హోమ్ శాఖ సహాయ కార్యదర్శి ఎన్.కె.సింగ్ చెప్పారు.

-చలసాని నరేంద్ర 9849569050