మెయన్ ఫీచర్

పొంచి ఉన్న ‘గోమాయువు’.. రక్షణ లేని ఆవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంతతిని పరిరక్షించుకొనడానికై దేశ ప్రజలు ఎవరికి వారు పూనుకొనవలసిన సమయం ఇది.. ఎందుకంటే గో సంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది, మాట తప్పింది, గోసంతతి పరిరక్షణ వ్యవస్థను భగ్నం చేసింది, జనాన్ని వంచించింది! ఆవుల సంఖ్య గోసంతతి సంఖ్య పెరగడంవల్ల భూసారానికి రక్షణ ఏర్పడుతుంది, పర్యావరణం మళ్లీ సమతుల్యవంతవౌతుంది. అందువల్లనే అడవులను ఆవులను రక్షించుకొనడం ఈ దేశంలో అనాది సంప్రదాయమైంది. కలియుగం పద్దెనిమిదవ శతాబ్ది నుంచి విదేశీయ బర్బర బీభత్స మూకలు మన దేశంలో చొరబడడం ఆరంభమైంది. కలియుగం పంతొమ్మిదవ శతాబ్ది నాటి- అంటే క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్దినాటి - శుంగ వంశపు పుష్యమిత్రుడు ఈ విదేశీయ బీభత్స దురాక్రమణకు అడ్డుకట్ట వేశాడు. అప్పటినుంచి మూడు సహస్రాబ్దులకు పైగా విదేశీయ తస్కర ముష్కరులతో మన దేశం సంఘర్షణ సాగించడం చరిత్ర! ఈ సంఘర్షణ సమయంలోను, దాదాపు ఎనిమిది శతాబ్దులపాటు సాగిన విదేశీయ దుర్మార్గపు‘పాలన’ సమయంలోను కూడా ఈ సనాతన- శాశ్వత- జాతి స్వజాతీయ సంప్రదాయాలను నిలబెట్టుకోగలిగింది. గోసంరక్షణ భూసంరక్షణతో ముడిపడిన జాతీయ సంప్రదాయం.. బ్రిటన్ బీభత్సకారులు అడవులను తెగనరికి కలపను తరలించుకొనిపోవడాన్ని ప్రతిఘటించిన స్వజాతి గోవధను కూడా తీవ్రంగా నిరసించింది! మహాకవి గరిమెళ్ల ప్రచారం చేసినట్టుగా,
‘‘చూడి ఆవుల కడుపు/ వేడి వేడి మాంసం
వాడికి బహు ఇష్టమంట.. మా/ పాడి పశువుల కోస్తాడంట, మా
చూడి ఆవుల మంద/ సురిగి ఇంటికి రాదు..
మా కొద్దీ తెల్లదొరతనము!’’
అని దేశ ప్రజలు బ్రిటన్ పెత్తందారులను నిరసించారు. ‘స్వాతంత్య్రం’ వచ్చిన తరువాత ప్రజలలో ప్రధానంగా వ్యవసాయదారులలో గోపరిరక్షణ స్ఫూర్తి సన్నగిల్లడం మన ఆవుల మందలు హరించుకొనిపోవడానికి ప్రధాన కారణం! ‘‘యథాప్రజాః తథా రాజా..’’
అడిగిన జీతంబివ్వని
మిడిమేలపు దొరల కొలచి మిడుగుట కంటెన్
వడిగల ‘ఎద్దులు’ కట్టుక
మడి దున్నుక బతుకవచ్చు మహిలో సుమతీ’’
అన్నది భారతీయ జీవనరీతి. పట్టణాలకు ‘ఎగబాగక’ పల్లెలలో హాయిగా పొలం దున్ని బతకాలన్నది నీతి.. ఈ జీవన రీతిలో ఎద్దులు, ఆవులు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సహస్రాబ్దుల ఈ జీవన రీతిని గత కొన్ని దశాబ్దుల కృత్రిమ సిద్ధాంతాలు నష్టభ్రష్టం చేశాయి. ఆవులను ఎద్దులను కోడెలను దూడలను సంతలకు తోలి అమ్మేశారు. ఆవుల దొడ్లు పాడుపడిపోయాయి. అందువల్ల ‘మడి దున్నుక’ బతికినవారు ‘మడి దున్నని’ స్థితి ఏర్పడింది. పల్లెల నుంచి పట్టణాలకు ‘ఎగబాకడం’ మొదలైంది!
ఒకప్పుడు ఎద్దుల మేళాలు ఎద్దుల ‘పరష’- జాతర-లు, ఆవుల సంతలు జరిగేవి! ‘ముంగారు’- తొలకరి- సమయానికంటె ముందే కృషీవలురు ఈ సంతలకు ‘పరష’లకు వెళ్లి, వ్యవసాయం కోసం ఎద్దులను కొనుగోలు చేసేవారు, ‘పాడి’ కోసం ఆవులను కొనుక్కుని వెళ్ళేవారు. ఎక్కువగా వున్న పశువులను అమ్మిన ‘గోపాలుర’ దృష్టి కూడా ఇదే! కానీ ‘స్వాతంత్య్రం’ వచ్చిన తరువాత ఈ జీవన ‘దృష్టి’ మారిపోయింది. దశాబ్దుల తరబడి సంతలలో ఆవులను, దూడలను, ఎద్దులు, కోడెలను కొనుగోలు చేస్తున్నవారు వాటిని చంపేస్తున్నారు! మాంసాన్ని డబ్బాలలో భద్రపరచి విదేశాలకు పంపిస్తున్నారు. కొండ గడ్డి మేసిన దేశవాలీ ఆవుల పాలు అమృతమన్న, ఆరోగ్య పరిపోషక ఔషధమన్న భారతీయ వాస్తవం గ్రహణ గ్రస్తమైంది. కొండగట్టు మేసిన దేశవాళీ ఆవుల దూడల మాంసం అమిత రుచికరమన్న విదేశీయ వికృత ప్రభావం విస్తరించిపోయింది..! బ్రిటన్ రాజకీయ బీభత్సకారులు మన దేశాన్ని ‘పాలించిన’ సమయంలో ఈ ‘రుచి’ని కనిపెట్టారు. ఐరోపాలో పశ్చిమాసియాలో ప్రచారం చేశారు! ఫలితంగా భారతీయ గోసంపద, ధవళ సువర్ణ సంపద హరించిపోతోంది! దాదాపు శతాబ్ది క్రితంవరకు మన దేశంలో రెండు వందల ‘జాతుల’ ఆవులు ఉండేవి. ప్రస్తుతం ఇరవై తొమ్మిది జాతుల ఆవులు మాత్రమే మిగిలి ఉన్నాయిట! మిగిలిన జాతుల ఆవులన్నీ ‘సంతల’లో చేతులు మారి యంత్ర వధ్యశాలల ‘కోరల’లో పడి మాంస ఖండాలుగా మారి విదేశాలకు వెళ్లిపోయాయి.
ఇలాంటి హంతక ‘సంత’లను నియంత్రించడానికి గోహననాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరునెలల క్రితం నడుం బిగించినప్పుడు దేశ ప్రజలు హర్షించారు. ఊపిరి మిగిలి వున్న గోసంతతి అయినా ‘మనుగడ’ సాగించగలదని ఆనందించారు. గత మే నెల 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘జిఎస్‌ఆర్ 493-ఇ’ ఉత్తర్వు ప్రకారం ‘వధించడం కోసం సంతలలో ఆవులను, గోసంతతిని, ఇతర పాడి పశువులను అమ్మడాన్ని కొనడాన్ని’ నిషేధించారు. అంటే వ్యవసాయ ప్రయోజనాలకోసం, ‘పాడి’ అవసరాల కోసం మాత్రమే సంతలలో ఆవులను, గోసంతతిని, పాడి పశువులను విక్రయించాలని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది! కానీ ఈ గోరక్షణ స్ఫూర్తి ఆరు నెలలలోనే నీరుకారిపోయింది! ఈ ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం నవంబర్ ముప్పయ్యవ తేదీన చడీ చప్పుడు కాకుండా ఉపసంహరించింది, చంపడం కోసం గోసంతతిని సంతలకు తోలరాదన్న నియమాన్ని రద్దుచేసింది! అంటే యథాపూర్వకంగా, వధించడం కోసం ఆవులను గోసంతతిని ‘సంత’లో అమ్మవచ్చునని కొనవచ్చునని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టయింది! ఈ నిర్ణయం ఆవులపై అశనిపాతం.. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల క్రితం ఎందుకు గోవధ నిషేధపు ఉత్తర్వును జారీ చేసినట్టు? ఇపుడు ఎందుకు ఉపసంహరించినట్టు?? ఇలా కేంద్ర ప్రభుత్వం గోవధను ప్రోత్సహించడానికి నడుం బిగించడం విస్మయకరమైన విపరిణామం! గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ పార్లమెంటులో సర్వసమగ్రమైన ‘బిల్లు’ను ఆమోదించాలన్న జనాభిప్రాయాన్ని దశాబ్దుల తరబడి భారతీయ జనతా పార్టీ సమర్థించింది! కానీ ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇపుడు ఇలా జనాదేశానికి విఘాతకరంగా ప్రవర్తిస్తోంది..
కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో ‘గోసంరక్షక’ ఆదేశాన్ని జారీచేసిన వెంటనే ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తంచేశారు! ప్రభుత్వ ఆదేశాన్ని కొన్ని ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేశాయి, మరికొన్ని ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేయలేదు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించి, గోవధను పూర్తిగా ఆపివేయాలని రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది! చివరికి సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వు అమలుజరుగరాదని గత జూలైలో తాత్కాలిక ఆదేశాన్ని జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికీ తుది తీర్పు చెప్పలేదు. తమ ఉత్తర్వును సమర్థించుకొంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వాదించి విజయం సాధించడానికి కేంద్రప్రభుత్వం కృషి చేయగలదన్న ప్రజావిశ్వాసం వమ్మయిపోయింది, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తానే రద్దు చేసుకుంది! ప్రభుత్వం గత మే నెలలో నిషేధపుటుత్తరువును జారీచేసినపుడు ‘గోమాంసం’ ఎగుమతి సంస్థలవారు వారి దళారీలు ఆకాశం బద్ధలయ్యేలాగా వ్యతిరేక ధ్వానాలు చేశారు. రాక్షసులకు వలె వారి నోళ్లు కూడా పెద్దవి, ‘మాథ్యమాల’లలో వారి మాటలకు ప్రచారం కూడా ఆర్భాటంగా జరిగింది. కానీ ఇపుడు ప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకొన్న తరువాత ‘గోభక్తులు’, ‘గోరక్షకులు’ గోవధ నిషేధ ఉద్యమకారులు సంస్థలు నోరెత్తకపోవడం మరింత విస్మయకరం...
ఆవులను గోసంతతికి రక్షణ ఏర్పడినట్టయితే గోమాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నవారి వ్యాపారం దెబ్బతింటుంది, గోసంతతి సంఖ్య పెరిగినట్టయితే ‘గవ్యాల’ ద్వారా సేంద్రియ వ్యవసాయం, ప్రజల ఆరోగ్యం, పరిసరాల పారిశుద్ధ్యం ప్రకృతిలో సమతౌల్యం పెంపొందుతాయి. ఆవు పేడ - గోమయం- ఆవు పంచితం- సురభిజలం- పాలు, పెరుగు, నెయ్యి- ఇవీ పంచగవ్యాలు! ఆవు పేడ వాసన తగులగానే కోట్లకొలది వానపాములు- ఎఱలు- భూమిలోతులనుంచి బిలబిలమంటూ పై పొరలలోకి వచ్చేస్తాయి. వానపాములు నిరంతరం దున్నడంవల్ల వ్యవసాయ భూమి సారవంతం అవుతోంది, సహజ పరిపుష్టవౌతోంది! ఈ పరిపుష్టి కారణంగానే అనాదిగా వ్యవసాయ క్షేత్రాలు విరగపండాయి, అన్నసమృద్ధిని కల్పించాయి. ఈ సహజ సేంద్రీయ ప్రక్రియలో రసాయన విషపూరితమైన ఎరువులకు, మందులకు తావులేదు. అందువల్ల మన దేశంలో దేశవాళీ ఆవు అన్నది మిగలరాదన్నది ‘బహుళ జాతీయ సంస్థల’, విదేశీయ సంస్థల లక్ష్యం! అలా జరిగినపుడు తమ విషపుటెరువులను, క్రిమి సంహార రసాయనాలను ఈ సంస్థలు విరివిగా అమ్ముకోవచ్చు! కృత్రిమమైన, రసాయన విషపూరితమైన ఎరువుల దిగుమతివల్ల మన ‘విదేశీయ వినిమయ’ ద్రవ్యం - ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- లక్షల కోట్ల రూపాయల స్థాయిలో తరలిపోతోంది! అందువల్ల గోవధ నిషేధం విదేశీయ దళారులకు నచ్చని వ్యవహారం! కానీ కృత్రిమ రసాయనాలు ‘వానపాముల’కు నచ్చడంలేదు, ఈ ‘విషాల’ వాసన సోకగానే ‘వానపాములు’ భూగర్భంలో ముప్ఫయి అడుగుల లోనకు పారిపోతున్నాయి. ఫలితంగా ‘వానపాములు’ లేని భూమిపై పొరలు నిస్సారమవుతున్నాయి. మరింతగా విష రసాయనాలను రైతులు కొనవలసి వస్తోంది!
ఇలా భూమిని పరిపుష్టం చేసి పండిస్తున్న అన్నప్రదాత ఆవు.. భూమిని ‘‘పయోథరీ భూత చతుస్ససముద్ర’’ గోరూపంగా క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి మహాకవి కాళిదాసు వర్ణించడంవొని ఔచిత్యం ఇది! ‘‘హిమాలయం దూడ కాగా గోమాత రూపమైన భూమిని పృథు చక్రవర్తి పితికి పాల వంటి ఓషధులను రత్నాలను పంచిపెట్టాడ’’ని కూడా మహాకవి వివరించాడు. త్రేతాయుగంలో దిలీప చక్రవర్తి, ఆయన భార్య సుదక్షిణాదేవి వసిష్ఠుని ఆవును పాలించడం- మేపడం చరిత్ర... ఒక సముత్కర్ష సంస్కారాన్ని వివరించవలసినప్పుడల్లా ఆవును ఉపమానంగాను, ఉపమేయంగాను చెప్పడం భారత జాతీయ జీవన సంప్రదాయం. వేదాన్ని ‘శాస్త్రం’ అనుసరించడం ఈ దేశంలోని సనాతన - శాశ్వత - సంస్కార పరంపర.. ‘‘వేదాన్ని ‘శాస్త్రం’ అనుసరించినట్టుగా పవిత్రవంతమైన మహిళలలో అగ్రగణ్యురాలైన సుదక్షిణాదేవి ఆవును, అడుగులో అడుగు వేసుకుంటూ, అనుసరించిందట..’’ మహాకవి చెప్పాడు..
‘‘తస్యాః ఖురన్యాస పవిత్రపాంసుం/ అపాంసులానాంధురి కీర్తనీయా,
మార్గం మనుష్యేశ్వర ధర్మపత్నీ/ శ్రుతేరి వార్థం స్మృతిరన్వ గచ్ఛత్’’
‘సుదక్షిణ’ శాస్త్రం, ఆవు వేదం.. అందువల్లనే ‘‘ఉపనిషత్తులనే ఆవులను యదుకుల కృష్ణుడు పితికినాడు..’’ ‘‘సర్వోపనిషదో గావః దోగ్థా గోపాల నందనః’’ అని అన్నారు.. గోపాలకుడైన దిలీపుడు నడచిన బాటలోనే యదుకుల కృష్ణుడు ద్వాపర యుగంలో నడిచాడు, కలియుగంలో భోజుడు నడిచాడు, ఛత్రపతి శివాజీ నడిచాడు, కోట్లాది ‘కర్షకులు’ నడిచారు, నడుస్తున్నారు...
మహాభారత యుద్ధం జరిగిన తరువాత సమయంలో కృష్ణా గోదావరీ మధ్య ప్రాంతమైన సముద్ర తీరంలోని తొఱ్ఱుపట్టులను కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ‘్భగవంతుని మీద పగ’ అన్న చారిత్రక రచనలో వర్ణించాడు. ఆ ‘తొఱ్ఱు పట్టు’లో ‘‘ఎఱ్ఱావులు, తెల్లావులు, దోరావులు, దేహమంతయు నల్లగానుండి మొగము ఎల్లగానున్న యావులు, మొగాన మచ్చలుగల ఆవులు, పొట్టి ఆవులు, భారీ ఆవులు...’’ ఉండేవాట!
వీటికంటె మరింత ముచ్చటయినది అడివి బాపిరాజు తన ‘నారాయణరావు’ నవలలో దర్శించిన గుమ్మడి పండు ఆవు...!!
గుమ్మడి పండు ఆవు ఇపుడు ఎక్కడ ఉంది?? గోమాయువు- నక్క- మాత్రం విశృంఖల విహారం చేస్తోంది...

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352