మెయన్ ఫీచర్

వాతావరణ విధ్వంస పాత్రలో అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో వాతావరణ కాలుష్యం మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఈ కాలుష్యం నుండి బయటపడలేని పక్షంలో, శుభ్రమైన గాలి, నీరు అందుబాటులోకి రాని పక్షంలో దారుణమైన వినాశకర పరిస్థితులు ఎంతో దూరంలో ఉండకపోవచ్చని ఒక వంక శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే కాలుష్య మార్పు చూపించి వర్థమాన దేశాలపై ఆంక్షలు విధించి, తమ దేశాలలోని కాలుష్య వ్యతిరేక యంత్ర పరికరాలకు, ఇతర పద్ధతులకు మంచి గిరాకీ పొందే ప్రయత్నం చేస్తున్నాయి గాని, తమ దేశాలలో కాలుష్య నియంత్రణ పట్ల జవాబుదారీగా నిలబడటంలేదు.
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం సంపన్న దేశాలనుండి వ్యాపిస్తున్నదని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా తొలి నుండి విధ్వంసక పాత్రనే వహిస్తున్నది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తీసుకున్న మొదటి కీలక నిర్ణయాలలో వాతావరణ మార్పునకు సంబంధించి ప్యారిస్ ఒప్పందం నుండి తప్పుకోవడం ఒకటి. ఈ నిర్ణయం 2020 నుండి అమలులోకి రానున్నది. అయినా అంతర్జాతీయంగా వాతావరణ మార్పుల గురించి జరుగుతున్న చర్చలలో అమెరికా తన ప్రతికూల పాత్రను విడనాడటం లేదని స్పష్టమైంది.
గత నెల జర్మనీలోని బాన్‌లో రెండు వారాలపాటు పలు దేశాల దౌత్యవేత్తలు, మంత్రులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ సమస్యపై వార్షిక చర్చలకు హాజరుకావడంతో మరోసారి అంతర్జాతీయ వ్యవహారాలలో వాతావరణ మార్పు అంశం తెరపైకి వచ్చింది. 2015లో పారిస్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత జరిగిన భాగస్వామ్య పక్షాల రెండో సదస్సు కావడమేగాక, తాను నిష్క్రమిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి సదస్సు కావడంతో విశేష ప్రాధాన్యత సంతరింపజేసుకున్నది.
అయితే అమెరికా వెంట ఒక్క దేశం కూడా ఈ ఒప్పందం నుండి బయటపడటానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం ఒకవిధంగా అంతర్జాతీయ సమాజం సాధించిన గొప్ప విజయంగా పేర్కొనవచ్చు. అమెరికా ఉన్నా లేకపోయినా తామంతా వాతావరణ మార్పు దుష్ట ఫలితాలను అరికట్టడం కోసం కట్టుబడి ఉన్నామని నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. 2020 నుండి ఈ ఒప్పందం అమలుకు అవసరమైన భూమిక ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమైనట్లు స్పష్టమైన సందేశం ఇచ్చాయి. ఈ సదస్సుకు కొద్ది రోజుల ముందు పారిస్ ఒప్పందంతో సంబంధం లేకుండా వాతావరణ మార్పు విషయంలో ప్రతి దేశం తగు చర్య తీసుకోవలసిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడం ప్రాధాన్యం సంతరింపజేసుకుంది. ప్రకృతిని విధ్వంసం చేయడం ద్వారా కాకుండా సహజీవనం జరపాలని అనాదిగా ఆచరిస్తున్న భారతదేశానికి ఈ అంశం ఎంతో ప్రాధాన్యం గలదని కూడా చెప్పారు.
‘‘తాము స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించే విధంగా మన భవిష్యత్ తరాలకు వాతావరణాన్ని కల్పించాలి’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘‘మా వరకు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని, మానవ ఆరోగ్యంపై బొగ్గు వ్యర్థాలు చేయగల తీవ్ర ప్రతికూల ప్రభావాలను గుర్తించాలని భారత్ భావిస్తున్నది’’ అని చెప్పడం ద్వారా కాలుష్య నివారణ పట్ల భారత్‌కు గల నిబద్ధతను వెల్లడించారు.
అమెరికాతో సంబంధం లేకుండా ఈ విషయంలో ముందుకు వెళ్లాలని దాదాపు మిగిలిన అన్ని దేశాలు భావిస్తూ ఉండడంతో కొంతమేరకు ఆశాజనక వాతావరణం నెలకొంది. మొదటగా ఒ చిన్న ద్వీప దేశం అయిన ఫిజి ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సును బాన్‌లో నిర్వహించారు. పారిస్ ఒప్పందం నుండి తాము నిష్క్రమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించినా అమెరికా నుండి అధికారికంగా ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఒప్పందంపై అనుకూలంగా దౌత్య సమాలోచనలు జరిపిన అమెరికా ప్రతినిధులే ఇపుడు కూడా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అయితే ఇపుడు వారు ఒక విధంగా ప్రతికూల పాత్ర వహించారు.
ఒప్పందం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ సదస్సులో అమెరికా పాల్గొనడం పట్ల పలువురు నైతికతకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తారు. పాన్ ఆఫ్రికన్ క్లైమేట్ జస్టిస్ అలయన్స్ అనే పౌర సమాజం, ఒప్పందంనుండి వైదొలగుతున్న అమెరికా ప్రతినిధులను సంప్రదింపులలో పాల్గొనకుండా చేయాలని పిలుపునిచ్చింది. సమావేశాలలో రెండో రోజుననే పారిస్ ఒప్పందంపై సంతకం చేస్తామని సిరియా ప్రకటించడంతో ఇపుడు ప్రపంచం మొత్తంమీద ఈ చారిత్రాత్మక ఒప్పందానికి దూరంగా వున్న దేశం అమెరికా ఏకాకిగా మిగిలినట్లు అయింది.
ఒక దశలో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు పాటలు పాడుతూ, నినాదాలు ఇస్తూ ఏడు నిముషాలపాటు సమావేశాలకు అంతరాయం కలిగించారు. అంటే వాతావరణ మార్పుపట్ల ఆందోళన చెందుతున్న ప్రజల దృష్టిలో అమెరికా ఇపుడు ఒక కీలక అడ్డంకిగా ఉన్నదనే అభిప్రాయం నెలకొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. పలు సంవత్సరాలుగా ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన అమెరికా అధికారులే ఇపుడు కూడా పాల్గొనవలసి రావడంతో వారు సహితం పలు సందర్భాలలో ఇరకాట పరిస్థితులను ఎదుర్కోవలిసి వచ్చింది.
అమెరికా నుండి అధికారిక ప్రతినిధులు మాత్రమే కాకుండా పలు ఇతర బృందాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారంతా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తమకు సంబంధం లేనట్లు వ్యవహరించారు. ‘మేమింకా మీతోనే ఉన్నాం’ అంటూ ప్రధాన వేదికకు బయటకల అమెరికా వాతావరణ చర్య పెవిలియన్ వద్ద పారిస్ ఒప్పందానికి సంఘీభావం వ్యక్తం చేశాయి. వారిలో మేయర్ మైఖేల్ బ్లూమ్బెర్గ్, కాలిఫోర్నియా గవర్నర్ జెరీ బ్రౌన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
వాతావరణ నాయకత్వ పాత్ర నుండి అమెరికా ఎంతగా వెనుకడుగు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అంతగా చైనా నాయకత్వం అందుకొనే ప్రయత్నం చేయడం ఈ సదస్సులో స్పష్టంగా కనిపించింది. బరాక్ ఒబామా హయాంలో ఈ చర్చలలో చైనా చెప్పుకోదగిన క్రియాశీలక పాత్ర వహించకపోవడం గమనార్హం. మొదటిసారిగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందున్న దేశాలు ఉమ్మడిగా సమాలోచనలు జరిపి ఒక వ్యూహం రూపొందించుకొనే ప్రయత్నం చేయడం ప్రారంభించాయ.
అమెరికా నిష్క్రమణతో ఏదో ఒక దేశం ఈ సమాలోచనలు నాయకత్వం వహించే రోజులు పోయాయని, సుమారు 200 దేశాలు సమష్టి నాయకత్వంతో, పరస్పరం అవగాహనతో అడుగులు వేసే ప్రయత్నం చేయడం ప్రారంభమైన విషయం కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. అయితే వాతావరణ మార్పుపై అంతర్జాతీయ వేడుకలలో జరుగుతున్న సమాలోచనలు ప్రసంగాలకు పరిమితం అవుతున్నదని నిరాశాజనక వాతావరణం మరో వంక వ్యక్తమవుతున్నది.
కాలుష్యంలో కీలకపాత్ర వహిస్తున్న బొగ్గు వాడకాన్ని భూగోళంపై నుండి పూర్తిగా నిరోధించేందుకు పలు దేశాలు చెప్పుకోదగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. యుకె, కెనడాల నాయకత్వంలో ఏర్పడిన ‘పోవెరింగ్ పోస్ట్ కోల్ అలయెన్స్’లో 20కుపైగా దేశాలు చేరాయి. వాటిల్లో డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, మెక్సికో, ఇథోపియా వంటి దేశాలు ఉన్నాయి. పారిస్ ఒప్పందం లక్ష్యాలు చేరుకోవటానికి 2050 నాటికి బొగ్గు వాడకం అనవసరం అని ప్రకటించాయి.
కానీ ఈ లక్ష్యాల సాధనకు ఈ దేశాలు నిజాయితీని ప్రదర్శించడంలేదు. దశలవారీగా బొగ్గు వాడకం తగ్గించడానికి ఎటువంటి ప్రణాళికనుగాని, అంతులేకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చేస్తున్న ఆర్థిక సహకారంపై ఆంక్షలను గాని ఈ దేశాలు ఏవీ ప్రకటించకపోవడం గమనార్హం. ఇంతకుముందే 2025 నాటికి బొగ్గు వాడకం లేకుండా చేయాలని ఇంగ్లాండ్, 2030 నాటికి ఆ విధంగా చేయాలని కెనడా ప్రతిజ్ఞ చేసినా ఆ దిశలో నిర్దుష్టమైన అడుగులు వేస్తున్నట్లు లేదు.
ఈ ప్రకటనపై అమెరికా సంతకం చేయలేదు. పైగా బొగ్గును ఎక్కువగా వినియోగించే జర్మనీ, పోలాండ్, ఆస్ట్రేలియా, చైనా, భారత్ వంటి దేశాలు సహితం సంతకాలు చేయకపోవడంతో ఈ ప్రకటన ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. 2020 వరకు జరపవలసిన వాతావరణ కార్యాచరణ గురించి జరిగిన అధికారిక సమాలోచనలలో దేశాల మధ్య పలు విభేదాలు తెరపైకి వచ్చాయి.
ఈ ఒప్పందం అమలులోకి రావలసిన 2020లోగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో సంపన్న దేశాలు చెప్పుకోదగిన పురోగతి సాధించకపోవడంతో వాటి నిజాయితీ ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒప్పందంతో సంబంధం లేకుండా 2020 తర్వాత అమలులోకి వచ్చే విధంగా ఈ హామీలు చేశారు. ముఖ్యంగా 2009లో కోపెన్‌హాగన్‌లో హామీ ఇచ్చినట్లు 2020 నాటికి వాతావరణ ఆర్థిక సహాయం క్రింద 200 బిలియన్ డాలర్లు సమకూర్చుతాయన్న మాటకు సంపన్న దేశాలు కట్టుబడి ఉండటంలేదు.
ప్రస్తుత సదస్సులో 2020 ముందు చేయవలసిన చర్యల గురించి తగు ప్రస్తావన అవకాశాలు లేకపోవడంపట్ల చైనా, భారత్ వంటి అభివృద్ధి చెందున్న దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 1992 నాటి ఐక్యరాజ్యసమితి సదస్సులో కీలక పాత్రధారులైన ఈ సంపన్న దేశాలు ముందుగా తామే వ్యర్థ పదార్థాలను 2020లోగా తొలగించుకునే విధంగా చేయడంపట్ల నిజాయితీని ప్రదర్శించడం లేదు. ఏ మాత్రం నిజాయితీతో వున్నాయన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. అందుకనే ఈ సదస్సు జరిగిన తీరును విశే్లషిస్తూ పరిష్కారంగా ఉన్న అంశాలను పరిష్కరించుకోవడంలో నిజంగా ఎటువంటి ముందడుగు వేయలేకపోయామని ఢిల్లీకి చెందిన సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెంటర్ (సిఎస్‌ఇ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పైగా అమెరికా అనుసరించిన ప్రతికూల ధోరణుల కారణంగా సదస్సులో పలు కీలక అంశాలపై తగు నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అమెరికా అవరోధ ధోరణులను సమష్టిగా ప్రతిఘటించవలసిన తరుణంలో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలమధ్య చర్చగా సదస్సును మార్చడం దురదృష్టకరం.
ఆరు సంవత్సరాల సుదీర్ఘ సమాలోచనలు అనంతరం చివరకు వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా వాతావరణపరమైన చర్యలు తీసుకోవాలో అనే విషయమై ఒక నిర్ణయం తీసుకోగల్గడం హర్షణీయ పరిణామం. వాతావరణ అంశాలలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు సంపన్న దేశాల ఎత్తుగడలలో పావులుగా మిగలకుండా సమాన హోదాలో సమాలోచనలు జరిపి, అవసరమైన ఆర్థిక, సామాజిక వనరులను సమీకరించుకోవడం పట్ల దృష్టి కేంద్రీకరించాలి.
వాతావరణ మార్పుకోసం జరిపే సమాలోచనలు, చర్చలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండే విధంగా దృష్టి సారించవలసి ఉంది. ఏకపక్షంగా ఈ ఒప్పందం నుండి నిష్క్రమించిన అమెరికా తమదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి చేరేందుకు ముందుకు రాక తప్పని పరిస్థితులను నెలకొల్పవలసి వుంది.

-చలసాని నరేంద్ర 9849569050