మెయిన్ ఫీచర్

పైకప్పుపై ప్రకృతి సేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని పొలాలుగా బాల్కనీలు ఇంటికి సరిపడా కూరగాయలు దిగుబడి
పట్టణ వ్యవసాయం పట్ల యువత ఆసక్తి
పచ్చని పంట పొలాలు పల్లెల్లో కనిపిస్తాయి అని అనుకుంటే పొరపాటు. ఇపుడు పట్టణాల్లోని బాల్కనీలన్నీ పచ్చటి మొక్కలతో పంట పొలాలను తలపిస్తున్నాయి. ఆధునిక యువత పంటల సాగువైపు మొగ్గుచూపటమే ఇందుకు కారణం. చాలామంది యువజంటలు టెర్రస్‌పై సేంద్రియ సాగుకు అవసరమైన మెళకువలను ఒంటపట్టించుకుంటున్నారు. ఇంట్లో పనికిరాని పాలిస్టక్ డబ్బాలు, సిమెంట్ కుండీలు, సిల్పాలిన్ బ్యాగులను కుండీలుగా వాడుతున్నారు. రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవించటానికి ఇష్టపడుతున్నారు. మనిషికి డబ్బుంటే సరిపోతుందా..కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే రూపాయికి విలువలేదు. ఈరకమైన ధోరణితోనే యువతీయువకులు ఉద్యోగాల్లో తలమునకలుగా ఉన్నా తీరిక చేసుకుని ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. వేలల్లో వచ్చే వేతనాలను సైతం వదులుకునేందుకు వెనుకాడటం లేదు.
ఇష్టమైన పని ఏదైనా కష్టం కాదని చాటి చెబుతున్నారు. అలాంటి పట్టణ ప్రకృతి సేద్యకారులు గురించి తెలుసుకుందాం.

పది అంగుళాల కుండీ చాలు
ముంబయికి చెందిన ప్రియాంకా అమర్ షా జర్దీళఆజ అనే సమష్టి వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. పట్టణ వ్యవసాయం అనే మాట వింటున్నాం కాని దీనిని ఆచరణలో ఇటీవల కాలంలోనే పెడుతున్నారు. ఇంటి పంటలు పండించుకోవాలనే ఆసక్తిఉన్నవారికి సలహాలు, సూచనలు ఇస్తూ పట్టణ వ్యవసాయాన్ని యువతీ యువకుల్లో ఒక అభిరుచిగా మార్చటానికి ప్రియాంక తన సంస్థ ద్వారా ప్రయత్నిస్తున్నారు. దీన్ని యువతీ యువకులు ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రియాంక అభిప్రాయం. బాల్కనీపై ఇంటి పంటలు పండించటానికి ఆసక్తితో వచ్చేవారికి ఆమె శిక్షణ ఇస్తోంది. ఒకేసారి తోటల పెంచమని ఒత్తిడి తీసుకురాకుండా.. కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు వంటికొన్ని రకాల కూరగాయలను పెంచమని చెబుతామని, ఇవి పెరగటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ లోగా నిమ్మలాంటి వాటిని పెంచేలా శిక్షణ ఇస్తామని, ఇవి మన ఆహారంలో నిత్యం ఉపయోగపడతాయి అని ప్రియాంక సూచిస్తున్నారు. వీటికి స్థలం కూడా ఎక్కువ అవసరం ఉండదు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా కూడా ఉన్నాయి. ఇటలీ వంటకాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఇటాలియన్ బాసిలియన్, ఓరేగానో, సెలేరీ అనే పంటలు పండించుకుంటే మంచిది అని చెబుతున్నారు ప్రియాంక. వీటికి పది అంగుళాల స్థలం ఉంటే సరిపోతుందని అంటారు.
కిచెన్ గార్డెన్‌తో ఆరోగ్యం..
నటీనటులకు మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉండదు. కాని సినీ నటుడు మాధవన్ కిచెన్ గార్డెన్ పట్ల మక్కువ చూపుతారు. తన ఇంటికి కావల్సిన కూరగాయలను, ఆకుకూరలను కిచెన్ గార్డెన్‌లో పెంచే అభిరుచి ఆయన సొంతం. వారంలో ఐదు రోజులు ఇంటికి సరిపడా కూరగాయలు కిచెన్ గార్డెన్‌లో పెరుగుతాయని ఆయన చెబుతున్నారు.
కుటుంబం కోసం..
కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రియా బాలాజీ తన ఇంటిపై ప్రకృతి సేద్యం చేస్తున్నారు. మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ భార్య అయిన ప్రియకు కూడా పట్టణ వ్యవసాయం అంటే మంచి అభిరుచి. ‘‘క్రీడాకారుడిగా తన కుమారుని శారీరక దారుఢ్యానికి అవసరమైన పోషక విలువలున్న ఆహారం అందించాలి. మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయలను రసాయనాలతో పండించటం వల్ల రుచి ఉండటం లేదు. బిడ్డ ఆరోగ్యం కోసం మా ఇంటి బాల్కనీపై కొన్ని రకాల కూరగాయల విత్తనాలు నాటాను. వాటికి పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడాను. ఇంటిల్లిపాది కమ్మగా తినటంతో పాటు ఇపుడు అనేక రకాల ఇంటి పంటలు పండిస్తున్నాం ’’ అని లక్ష్మీపతి బాలాజీ తల్లి చెప్పింది. అత్తగారి నాటిన మొక్కలను ఇపుడు కోడలు ప్రియా సంరక్షిస్తోంది. ప్రియా ఇంకా ఎక్కువ ఇంటి పంటలను పండిస్తోంది. ఇంటి పంటలు పండించటం కొంచెం కష్టమైనప్పటికీ ఓవైపు పిల్లను చూసుకుంటూనే మరోవైపు సాగు పనులు చేస్తుంటాను. ఏడాదిన్నర క్రితం ఇంటి పంటలను పెంచటం ఆరంభించాను. ప్రతిరోజూ ప్రతి కూరగాయ ఏదో ఒక కొత్త పాఠం చెబుతున్నట్లు ఉంటుందని ప్రియా మురిపెంగా చెబుతుంది. అత్తగారి కంటే ప్రియానే ఇపుడు ఎన్నోరకాల కాయగూరలు, ఆకుకూరలు పండిస్తోంది. ఆ ఇంటి పైకప్పుపై నేడు ఇంటికి సరిపడా పాలకూర, టమాటా, వంకాయ, అల్లం, మెంతి, గోంగోర, పొట్లకాయ, సొరకాయ, ములక్కాడ వంటి కూరగాయలు సమృద్ధిగా పండుతున్నాయి. తీగజాతి కూరగాయలు, పది రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. నిమ్మ, సపోటా,ద్రాక్ష వంటి తీగజాతి పండ్లను సైతం పండిస్తున్నారు.
కొంచెం కష్టం.. మరెంతో ఇష్టం
మీకు ఇష్టమైన వంటలను ఎలా తినాలని ఆరాటపడతారో వాటినే మరింత ఇష్టంగా పండించుకుంటే ఆరోగ్యం అని అంటారు అర్చనా స్టాలిన్. మై హార్వేస్ట్ అనే సంస్థను ఏర్పాటుచేసిన అర్చన తన చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లోని పిల్లలకు, తల్లిదండ్రులకు ఇంటి పంటలు ఏలా పండించుకోవాలో శిక్షణ ఇస్తున్నారు. ఇపుడు ప్రజల్లో ఆరోగ్యం పట్ల మంచి అవగాహన పెరిగింది. దీనికి అనుగుణంగా సేంద్రియ పంటల పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే ఈ సంస్థను ఏర్పాటుచేసి ఇంటి పంటలు పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు అని అందంగా ప్యాక్ చేసి అముతున్నారు. కాని వాటి నిండా రసాయనికి మందుల అవశేషాలే. అందుకే తమకున్న సమయంలోనే కాస్తంత వెసులుబాటు చూసుకుని ఇంటిపంటలు పండించుకోమని సలహా ఇస్తున్నారు అర్చనా స్టాలిన్.
ముడి మార్గంలో నడిచిన యువకుడు
కేరళలోని కొచికి చెందిన ఎల్దో పచిలక్డాన్ రెస్టారెంట్‌కు వెళితే ముడి సరుకులతో వండిని ఆహార పదార్థాలే లభ్యమవుతాయి. కేరళలో తొలి ముడిపదార్థాల రెస్టారెంట్‌గా పేరుంది. ఇక్కడ రుచి, శుచి, ఆరోగ్యకరమైన ముడిపదార్థాలు లభ్యమవుతాయి. తన రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్ల ఆరోగ్యమే ప్రధానం అనుకున్న ఎల్దో నలభై ఎకరాల్లో రెండు వందల రకాల కూరగాయలు, పండ్లు పండిస్తారు. వాటినే రెస్టారెంట్లలోకమ్మగా వండించి వడ్డిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నట్లు ప్రతిఒక్కరూ కనీసం నాలుగు ఆకుకూరలనైనా పండించమని సలహా ఇస్తున్నారు. పోషక విలువులు అధికంగా ఉండే పాలకూరను పెంచండి చాలు అని ఆయన అంటున్నారు. ఎక్కువ మంది టమాటాలు, బెండకాయలు, వంకాయలు పెంచుకుంటే చాలు ఇంటికి సరపడా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు.
సోషల్ మీడియా వెన్నుదన్ను..
సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది. సేంద్రియ సాగుపట్ల మమకారాన్ని పెంచేందుకు దోహదం చేస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రత్యేక ప్రయోజనం కోసం వాడితే ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే చక్కని అభిరుచులు ఏర్పడతాయి. ప్రజల్లో ఇంటిపంటలు పెంచే అభిరుచిని పెంచే ఉద్దేశ్యంతో బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ ‘ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్’ అనే ఫేస్‌బుక్ ఖాతాను తెరచి అందులో ప్రాధమిక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మన కెరీర్‌లో భాగంగా బాల్కనీ సాగు చెపడితే మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. తాను తన ఇంటిపైకప్పు పంటలు పండిస్తూ .. వాటిని ఎలా పెంచాలో వివరిస్తూ ఫేస్‌బుక్‌లో పెడుతుంటాడు. సామాజిక మాధ్యమాలలో ఇంటిపంట గ్రూప్‌లో టెర్రస్‌పై సేంద్రియ సాగుకు అవసరమైన మెలకువలను తెలుసుకుని ప్రజలు చైతన్యవంతులై ఇంటిపంటలు సాగుచేస్తారనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు శ్రీకాంత్. మరింకెందుకు ఆలస్యం ఇంటి పంటలను సాగుచేస్తున్న వీరందరీ గురించి తెలుసుకున్నారు కదా! మరి మీరు ప్రారంభించేయండి.

-టి.ఆశాలత