మెయిన్ ఫీచర్

రారండి.. గోపికల్లారా! చేతుము శ్రీకృష ణదర్శనమూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తిరుప్పావై’ అనేది గోదాదేవి విరచితమైన ద్రావిడ ప్రబంధం. ఇది ద్రావిడ వేదంగా ప్రసిద్ధికెక్కింది. తిరు అంటే శ్రీ, లక్ష్మి, సంపద, మోక్షం అనే అర్థాలున్నాయి. పావై అంటేవ్రతం, పాటలతో కూర్చిన మాల అనీ అర్థాలు ఉన్నాయి.
శ్రీని అంటే మోక్షాన్ని పొందటానికి పాటలను మాలగా కూర్చి వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి. రకరకాల పుష్పాలు ఒకే దారానికి గూర్చబడినట్లుగా పాటల లోని భావాలు వేరైనా పొందదలచినది ఒకరినే. ఒక పవిత్రమైన భావనతో సంకల్పంతో వ్రతాన్ని ప్రారంభించి భక్తి భావనా జలధిలో స్నానం చేసి, కృష్ణానుగ్రహప్రాప్తి అనే ‘శ్రీ’ ని గోదాదేవి పొందింది. ఇదే తిరుప్పావై మనలనందరినీ ఆనందంపొందించే అనుభవం. ఈ మధురానుభవాన్ని అలనాటి ద్వాపరయుగంలోని గోపికలు పొందినట్లు మనకు భాగవతం చెప్తున్నది. దాన్ని ఈనాటి కలియుగంలో తన తోటివారినే గోపికలుగా భావించి , గోపికా భావనతో స్వయంగా వ్రతమాచరించి తిరుప్పావై పాటలనే పాడి, ఆ శ్రీరంగనాథుని పాదపద్మాలలో లీనమైంది గోదాదేవి. తాను కోరిన వ్రత ఫలాన్ని పొందింది. భక్తితో భగవంతుని కోరుకుంటే తప్పక అతనిని పొందగలరనీ, దానికి దేశకాలములతో సంబంధం లేదనీ ఈ వ్రతంలో గోదాదేవి నిరూపించింది.
భక్తితో భగవంతుని గూర్చి అమ్మ పాడుకున్నపాశురాలు ఎలా వేదంగా చెప్పబడ్డాయి అంటే అనంతమైన వేదరాశిని కొలవటానికి ఈ విశ్వమే చాలదు. ఆ పర్వతప్రమాణమైన జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యటానికి భరద్వాజ మహర్షి అంతటివానికే మూడు వందల సంవత్సరాలు చాలలేదట. మరి సామాన్య మానవులకది ఎలా సాధ్యవౌతుంది? కనుకనే ఆ వేదతత్త్వాన్ని, ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరమాత్మ తత్త్వాన్నీ, జీవులు పొందవలసిన జ్ఞానాన్నీ ఒకచోట పొందుపరిచి ‘తిరుప్పావై’ గా సమకూర్చి స్వామికి సమర్పించింది గోదాదేవి. వేదోపనిషత్తుల సారమైన భగవద్గీతజ్ఞానమును కూడా ఇందులో సువాసనలుగా పొందుపరిచింది.
ద్రావిడ భాషయై తమిళంలో చెప్పబడిన ఈ తిరుప్పావైని మననం చేస్తే ఆత్మ వికసించి, దివ్య పరిమళాలను వెదజల్లుతుంది. వాడని, వీడని ఈ దివ్య ప్రబంధం సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించేదని మన పూర్వాచార్యులు ప్రశంసించారు.
‘వేదమనైత్కుక్కుం ..........శుమప్పదుంవన్చు’ - అంటూ గోదాదేవి ప్రతిపాదించిన ఈ దివ్య ప్రబంధం వేదాలన్నింటిలోనే బీజభూతమైనదని ప్రశంసించారు. ఈ ప్రబంధం తెలియని వారిని మోయటానికి భూమాత బాధపడుతుందట. సర్వ వేదసారమైన ఈ తిరుప్పావై ద్వయార్థ ప్రతిపాదికమైనదే గాక ధ్వని ప్రధానమైన గొప్ప కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ఉపనిషత్తులలోని రహస్యములెన్నో దీనిలో నిక్షేపించబడ్డాయి.
పరమ భాగవతోత్తములైన పరాశర భట్టరుల వారు (నీళాదేవి) గోదాదేవికి నమస్కార పురస్సరంగా సమర్పించుకున్న శ్లోకముతో ఆండాళు తల్లిగా వెలసిన శ్రీవిల్లిపుత్తూరును గూర్చి ఆ తల్లికి తండ్రియైన భాగ్యమును పొందిన శ్రీ విష్ణుచిత్తుల వారిని గూర్చి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నీళాదేవి యొక్క ఉన్నతమైన స్తనగిరి తటములలో నిద్రించేశ్రీకృష్ణ తత్త్వాన్ని మేల్కొల్పింది గోదాదేవి. ఉపనిషత్తులల్లో ప్రతిపాదించిన పరతంత్రతను ఆ స్వామికి పాఠంగా నివేదించింది. తాను ధరించి విడిచిన భక్తిమాలతో అతనిని బంధించి, అనుభవించి మోక్షమును పొందింది.
నందవ్రజంలో యశోదాదేవికి సోదరుడైన కుంభుని యొక్క కుమార్తె ఈ నీళాదేవి. అత్యంత సౌందర్యవతి ఈ నీళాదేవిని ద్రావిడ ప్రబంధాలల్లో ‘నప్పిన్న ప్పిరాట్టి’ అని సంభోధిస్తారు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతాదేవిని వివాహం చేసుకొన్నట్లుగానే శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను కలిపి కట్టి నీళాదేవిని వివాహం చేసుకొన్నాడు.
కృష్ అనగా అపరిమితము, ణ అనగా ఆనందం కృష్ణ అనగా అపరిమిత ఆనందమని అర్థం. అదే పరబ్రహ్మ స్వరూపం. లోకాన్నంతా కర్మపాశములతో బంధించి, కర్మఫలములను అనుభవింపచేసే పరమాత్మను తాను అనుభవించిన పుష్ప మాలాపాశాలతో బంధిం, తాను చేసిన కర్మకు ఫలితంగా ఆ భగవానునినే అనుభవించింది గోదాదేవి.
ఆ పరమాత్మను భక్తి, జ్ఞాన ప్రసూనములను మాలలుగా సమర్పించి అనుగ్రహించమన్నది తననే కాదు జీవులందరినీ కూడా అనుగ్రహించమని వేడింది. ఆ తల్లినే దక్షిణ భారతదేశంలోని మధుర మండలంలో మధురభక్తికి మారుపేరుగా నిలిచింది. ఆండాళు తల్లి అవతరించిన దివ్యదేశమే శ్రీవిల్లిపుత్తూరు. ఆ మధురమండలంలోనే శ్రీమహావిష్ణువు వటపత్రశాయిగా వెలిశాడు. పరమభాగవతోత్తముడైన భట్టనాథుడు ఆ స్వామికి నిత్యమాలాకైంకర్యాలు చేసేవాడు. నిరంతరం విష్ణు చింతనలో భట్టనాథుడు ఉన్నందున విష్ణుచిత్తుడన్న పేరు ఆయనకు ప్రఖ్యాతమైంది. గరుడుని అంశతో జన్మించిన వాడగుట వలన గరుడాళ్వారుగాను ప్రసిద్ధమయ్యాడు. వీరినీ పెరియాళ్వారుగా భక్తకోటి కొనియాడుతారు. జనకునికి యజ్ఞవాటికలో సీతాదేవి దొరికినట్లుగానే ఈ పెరియాళ్వారుకు తులసివనంలో ఆండాళు తల్లి లభ్యమైంది. పూర్వఫల్గుణీనక్షత్రంలో కర్కటక లగ్నంలో భూదేవి అంశతో శ్రీదేవి స్వరూపంగా తనకు లభ్యమైన ఈ శిశువుకు కోదై అని నామకరణంచేసి అల్లారుముద్దుగా విష్ణుచిత్తుడు పెంచుకున్నాడు.
ఆ కోదై నే నేడు గోదాదేవిగా కీర్తించబడుతోంది. గో శబ్దానికి జ్ఞానమనీ ద శబ్దానికి ఇచ్చునది అనే అర్థాలు. జ్ఞానప్రదాయిని యైన గోదాదేవి భగవద్గుణాలలతో అమితమైన ఆసక్తి తో బాలకృష్ణుని లీలా విభూతులను తండ్రి ద్వారా తెలుసుకొని ఆనందిస్తుండేది. ఆమె తులసీ మాలలను, పూమాలలను స్వామి కైంకర్యానికి పంపించేది. ఒకసారి ఆమె కేశములు ఆ మాలలో కనబడ్డాయి. దాంతో అపచారం జరిగిందని విష్ణుచిత్తుడు ఎంతోచింతించాడు. ఆయనకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చాడు. ‘నీకుమార్తె ధరించి ఇచ్చిన మాలలే నాకిష్టం వాటినే నీవు నాకు సమర్పించు’అని ఆదేశించాడు.దాంతోవిష్ణుచిత్తుడు తన్ను ఉద్ధరించడానికి, కారణజన్మురాలిగా వచ్చిందని తెలుసుకొని తనకూతురిగా ఉన్న ఆమెను ఆండాల్ అని సంబోధిస్తూ ఆనందించాడు.
ఆ తల్లినే ఆముక్తమాల్యదగా శూడిక్కొడుత్తనాచ్చియారుగా ప్రసిద్ధి గాంచింది. ఆ తల్లినే మార్గశిరంలో స్వామిని ముప్పైపాశురాలతో ముప్పైరోజులు సేవించి చివరకు స్వామిని పొంది తరించింది. ఆమె రచించిన పాశురాలను మనమూ అనుసంధానించి ఆ స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులమగుదాం. తిరుప్పావై దివ్య ప్రబంధం మొత్తం మూడు ముఖ్య దశలుగా కొనసాగుతుంది. మొదటి రెండు దశలు జ్ఞానమార్గంలో ఎలా కొనసాగాలో తెలుపుతాయి. మూడవదశలో జ్ఞానాన్ని పొంది ఎలా ఆచరించాలి. తర్వాతి వాళ్లకు ఎలా మార్గదర్శకులం కావాలి అనే వాటిని తెల్పుతుంది. జీవి పరమాత్మను పొందే లక్ష్యం వైపు ఎలా నడవాలి అన్న విషయాలను శ్రీ వ్రతం ద్వారా విపులంగా తెలిపింది గోదాదేవి. ప్రతి పాశురంలోనూ ఒక విశిష్టతను సంతరించుకున్న ఈ తిరుప్పావై ద్వారా భగవద్భక్తులైన భాగవతోత్తములను ఎందరినో మనకు దర్శింపజేసింది మన ఆండాల్ తల్లి. ఈ పాశురాలను అనుసంధానం చేసి మన జన్మలను కూడా సార్థకతనూ సాఫల్యాన్ని పొందించమని ఆండాళు తల్లి ని ఆశ్రయించి ప్రార్థిద్దాం.

- డాక్టర్. కొమాండూరి అరుంధతి