మెయన్ ఫీచర్

వ్యక్తి స్వేచ్ఛకు పరిమితి లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు మేజర్ల వివాహం రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉందా? అలాగే తండ్రిని నియంత్రించే హక్కు న్యాయస్థానానికి ఉందా?? నేను, మా సహ న్యాయమూర్తులు వందకు పైగా హెబియస్ కార్పస్ పిటీషన్లను విచారించి ఉంటాం... కాని తమ ఉమ్మడి అనుభవంలో ఇదో విలక్షణమైనది’ అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా హదియా కేసును విచారిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డి వై చంద్రచూడ్, ఎఎం ఖన్‌విల్కార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేసు సున్నితత్వాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
మత స్వేచ్ఛకు, వ్యక్తి స్వాతంత్య్రానికి భారతదేశం మారుపేరు అని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది ఎంత వరకూ సరైన మాటో ఈ మధ్య జరుగుతున్న న్యాయవివాదాలు చూస్తే అర్ధమవుతుంది. అఖిల అశోకన్ హదియాగా మారి, షఫీ జహాన్‌తో చేసుకున్న వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా అన్న అంశం నిర్ణయించాల్సిన బాధ్యత సైతం దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై పడింది. ఇదేదో చిన్న వ్యవహారం అని మొదట్లో అనుకున్న వారందరికీ రానురాను జరిగిన పరిణామాలు నివ్వెరపోయేలా చేశాయి. దేశంలో మత స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలతో ఈ కేసు సుప్రీంకోర్టును సవాలు చేస్తోంది.
హదియా, షఫీ జహాన్ ఇద్దరు మైనారిటీ యువతీ యువకులు మతాంతర వివాహం చేసుకోవడం రాజకీయ వివాదంగా కూడా మారింది. దేశవ్యాప్తంగా దీనిపై న్యాయచర్చ పెద్దఎత్తున జరుగుతోంది. హిందు యువతులు, ముస్లిం యువకుల మధ్య జరిగే వివాహాలను హిందూ అతివాద వర్గం ‘లవ్ జిహాద్’ పేరుతో చర్చ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ముస్లిం యువకులు పథకం ప్రకారం హిందూ యువతులను తమ మతంలోకి ఆకర్షించేందుకు చేపట్టే రాజకీయ పన్నాగమే ‘లవ్‌జిహాద్’ అనడం అసలు వివాదం. ఈ వివాదమే భారతదేశంలో విషపూరిత ప్రచారంలా మారి యువ దంపతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది.
భారతదేశం ఒక లౌకిక దేశం. భారత రాజ్యాంగం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించవచ్చు. మత మార్పిడి లేకుండా మతాంతర వివాహం చేసుకునే అవకాశం కూడా రాజ్యాంగం కల్పిస్తోంది. ఇద్దరు వ్యక్తులు పరస్పరం అంగీకారంతో చేసుకున్న వివాహం వారిద్దరి అంగీకారంతో జరిగిందా లేదా వారిలో ఒక్కరి అంగీకారంతో జరిగిందా అనే మీమాంస ఏర్పడినపుడు మాత్రమే ఆ అంశంపై చర్చ జరుగుతుంది, ఒక్కరి అంగీకారంతోనే జరిగితే ఆ వివాహం రద్దవుతుంది.
ప్రస్తుత వివాదం కేరళ రాష్ట్రానికి సంబంధించింది. అఖిల అశోకన్ అనే 25 ఏళ్ల అమ్మాయి మతం మార్చుకుని హదియాగా మారడమే గాక, షఫీ జహాన్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాలు చేస్తూ షఫీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటీషన్‌ను దాఖలు చేశారు. ఆయన తరఫున కపిల్ సిబాల్, ఇందిరా జైసింగ్‌లు వాదనలు వినిపిస్తున్నారు. ఒక చిన్న రాష్ట్రంలో అతి మారుమూల ప్రాంతానికి చెందిన ఒక యువతి వివాహానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో చర్చకు రావడంతో అందరి దృష్టీ ఈ కేసుపై పడింది.
కేరళలో అసలు ఏం జరిగింది. భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి. అఖిల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందా? ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే అంశాలపై ఇప్పటికే న్యాయనిపుణులు, సామాజిక వేత్తలు పెద్దఎత్తునే చర్చ జరుపుతున్నారు. హిందూ అమ్మాయి ఇస్లాం మతం పుచ్చుకోవడం ఆమె ఇష్టానికి సంబంధించిందా కాదా అనే చర్చతో ఈ వివాదం మొదలైంది. అఖిల ఇస్లాం మతం స్వీకరించింది. ఈ మొత్తం వ్యవహారం నాటకీయంగా జరగడంతో పాటు తదనంతర పరిణామాలు కూడా న్యాయస్థానాన్ని నివ్వెరపోయేలా చేశాయి.
అసలు ఇంతకీ ఆ అఖిల ఎవరు?
‘నా తండ్రే నన్ను క్రూరంగా హింసిస్తున్నాడు, నన్ను చంపేసేలా ఉన్నాడు, దయచేసి ఇక్కడి నుండి నన్ను విడిపించండి...’ అని అఖిల వీడియోలో ప్రాధేయపడింది, దీంతో ఆమెను ఇంట్లో బలవంతగా దిగ్బంధం చేశారా అన్న చర్చతో దేశవ్యాప్తంగా అఖిల అందరి దృష్టినీ ఆకర్షించింది. హిందుత్వవాది, ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ ఆగస్టులో అఖిల కుటుంబ సభ్యులను కలిసిన సమయంలో ఈ వీడియోను చిత్రీకరించారు. గతంలో అఖిల కుటుంబ సభ్యులను కలిసి ఆమె తల్లి పొన్నమ్న వీడియోను విడుదల చేసిన ఆయన ఏకంగా ఈసారి అఖిల వీడియోనే విడుదల చేశారు.
అఖిల సొంత ఊరు కొట్టయం జిల్లా వైకం సమీపంలోని తిరుమణి వెంకటాపురం. బిఎస్‌ఎఫ్ సైనికుడు కె ఎం అశోకన్, పొన్నమ్మల కుమార్తె అఖిల. ఎంతోకాలంగా ఇస్లాంపై ఆకర్షితురాలైన అఖిల ఆ మతంలోకి 2015లోనే మారేందుకు పెద్ద కసరత్తే చేసింది. తాత మరణానంతరం జరిగిన హిందూ సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె నిరాకరించింది. అంతే కాదు, ఇస్లాం స్వీకరిస్తేనే తాను స్వర్గానికి వెళ్తానని, లేకుంటే నరకం తప్పదని తరచూ అనేది. ఆ క్రమంలో సేలంలోని శివరాజ్ హోమియో మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ కోర్సులో చేరింది. తొలుత కాలేజీ హాస్టల్‌లో ఉన్న ఆమె తర్వాత స్నేహితులు ఫసీనా, జసీనాలతో కలిసి వేరుగా రూము తీసుకుని ఉండటం మొదలుపెట్టింది, అదే సమయంలో ఆమె స్నేహితుల సహకారంతో ఇస్లాం మతంలోకి మారింది. కాలేజీకి ‘హిజాబ్’తో వెళ్తున్నట్టు తెలిసి తండ్రి వెళ్లగానే ఆమె అదృశ్యమైంది. వెంటనే ఆయన మిస్సింగ్ కేసు పెట్టారు. అఖిల స్నేహితురాలు ఫసీనా తండ్రి అబూబకర్‌ను 2016 జనవరి 19న పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుండి అసలు నాటకం మొదలైంది. పోలీసులు పిలిచి అడిగితే తాను జనవరి 2నే ఇల్లు విడిచి పెట్టివచ్చేశానని, ఇపుడు తన ఇష్టపూర్వకంగా స్నేహితులతో కలిసి ఉంటున్నానని చెప్పింది. పోలీసులు సరే అనగానే ఆమె జసీనా సొంత ఊరు మల్లాపురం జిల్లా పెరింతల్ మన్నా గ్రామానికి వెళ్లింది. అక్కడ అబూబకర్ ఆమెను మతాంతరానికి ‘కిమ్’కు తీసుకువెళ్లారు. పత్రాలు లేవని నిరాకరించడంతో కోజికోడ్‌లోని తెరిబియాతుల్ ఇస్లాం సభకు తీసుకువెళ్లారు. వాళ్లు అఫిడవిట్ ఇవ్వమనడంతో అక్కడ కాదని సత్యశరణి సంస్థను ఆశ్రయించారు. సంస్థ చైర్‌పర్సన్ ఎఎస్ సాయినాబా తన దగ్గరే ఆమెను ఉంచుకున్నారు.
దీంతో అమ్మాయి కనిపించడం లేదని, ఆమెను బలవంతంగా బందీ చేశారని అఖిల తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. జనవరి 19న హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నపుడు తను ఇష్టపూర్వకంగానే సాయినాబాతో ఉంటున్నానని అఖిల పేర్కొంది. విచారణలో భాగంగా జనవరి 25న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సికె అబ్దుల్ రహీం, జస్టిస్ షాజి పిచలె హెబియస్ పిటీషన్‌ను కొట్టివేశారు. 2016 ఆగస్టు 17న అఖిల తండ్రి మరో పిటీషన్ దాఖలు చేశారు. అఖిలను సిరియా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో సాయినాబా చెంత ఉన్న అఖిలను వేరే ప్రాంతానికి తరలించడంతో అఖిల , సాయినాబాలు సైతం సెప్టెంబర్‌లో కోర్టును ఆశ్రయించి చేయని తప్పునకు తనను హాస్టల్‌లో ఉంచారని, తనకు చదువుకోవాలని ఉందని, కాలేజీకి వెళ్తానని పేర్కొంది. అఖిలను సిరియాకు తరలించే యోచనలేదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సాయినాబాతో ఉండదల్చుకుంటే ఆర్ధిక ఇబ్బంది లేదా అని న్యాయమూర్తులు ప్రశ్నించినపుడు తాను హోమియోపతి చదివానని, నెలకు రెండువేలు వస్తాయని అఖిల పేర్కోంది. ఆ సమయానికి ఆమె హౌస్ సర్జన్ చేయలేదు కనుక ప్రాక్టీస్‌కు అనుమతి లేదని పేర్కొంటూనే గత డిసెంబర్ 19న తుది ఆదేశాలు ఇస్తూ కాలేజీకి వెళ్లమని హైకోర్టు సూచించింది. అలాగే తండ్రి వద్ద ఉన్న సర్ట్ఫికెట్లు అందజేయాలని కూడా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా డిసెంబర్ 21న మరోమారు వారు కోర్టుకు వచ్చినపుడు హదియ షఫీ జహాన్‌తో హాజరైంది. ఆయన ఎవరు అని కోర్టు ప్రశ్నించినపుడు తను డిసెంబర్ 19న ఆయనను వివాహం చేసుకున్నానని, పుత్తూరు జామామసీదు ఖాజీ సమక్షంలో సాయినాబా ఇంట్లో తమ వివాహం జరిగిందని ఆమె చెప్పింది. ఆ విషయం డిసెంబర్ 19న విచారణకు వచ్చినపుడు ఎందుకు చెప్పలేదని కోర్టు ప్రశ్నించింది. అనేక అనుమానాలకు తావిచ్చిన ఆ వివాహంపై తదుపరి విచారణ వరకూ హదియాను ఎర్నాకులంలోని ఎస్ ఎన్ వి సదనంకు కోర్టు తరలించింది. ఆమె మొబైల్ ఫోన్ వినియోగించకుండా చూడాలని ఆదేశించింది. షఫీని ప్రశ్నిస్తే తన తల్లి గల్ఫ్‌లో ఉందని, హదియాను గల్ఫ్‌కు తీసుకువెళ్తానని చెప్పాడు. అసలు షఫీ ఎవరు అని కోర్టు ఆరాతీస్తే కేరళలో సోషల్ డెముక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు క్రియాశీల కార్యకర్త అని తేలింది, అంతే కాదు 2016 అక్టోబర్ 2న కనకమాలలో అరెస్టు చేసిన ఉగ్రవాది మన్సీ బురాకీతో సంబంధాలున్నాయని, షఫీ నిర్వహించే తనాల్ వాట్సప్ గ్రూప్‌లో మన్సీ సైతం సభ్యుడేనని పోలీసులు తేల్చారు.
ప్రతి చిన్న విషయం ఫేస్‌బుక్‌లో పెట్టే షఫీ తన వివాహం మాత్రం దాచిపెట్టాడని, ఆయనపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తేల్చారు. ఇదంతా జరిగిన తర్వాత ముస్లిం మెట్రిమోనియల్ వెబ్ పోర్టల్ ‘వే టు నిఖా’లో 2016 ఏప్రిల్‌లో తన ప్రొఫైల్ పెట్టానని, ఆ విధంగానే తాను షఫీని కలిశానని హదియా పేర్కొంది. ఈ పరిణామాలను చూసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేంద్రమోహన్, జస్టిస్ అబ్రహం మాథ్యుస్‌లు 2017 మే 17న తీర్పు ఇస్తూ, హదియా వివాహం చెల్లదని తీర్పు చెప్పారు. దీనిపై షఫీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై నవంబర్ 27న విచారణ మొదలైంది. హదియా సైతం సుప్రీంకోర్టుకు హాజరైంది. ముందు చదువు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు హదియాను ఆదేశించింది.
ఒకవైపు వయోజనులు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలను పరిరక్షించాల్సిన రాజ్యాంగ ఆదేశం, మరో వైపు కేరళలో ఒక పద్ధతి ప్రకారం ప్రేమ పేరుతో మతమార్పిళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై ఎన్‌ఐఎ దర్యాప్తు కేరళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేరళ పోలీసులు 89 కేసులను ఎన్‌ఐఎకు అప్పగించగా, 11 కేసుల దర్యాప్తు తుది దశలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇది మతబోధతో మనసు మార్చిన (రాడికలైజేషన్) కేసు అన్నది సోలిసిటర్ జనరల్ వాదన. మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఐఎస్‌తో సంబంధాలున్నాయని ఎన్‌ఐఎ అంటోంది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ అన్నట్టు ‘మన విశ్వాసం ప్రకారం మనం జీవించడం, విలువైన పౌరుడిగా తయారు కావడానికి మధ్య వైరుధ్యం లేదు...నీ విశ్వాసం నీవు కలిగి ఉండొచ్చు, మంచి డాక్టర్ కూడా కావచ్చు....’ అని హదియాను ఉద్దేశించి సలహా ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే కేసులో ఇదో విరామం మాత్రమే.

-బి.వి.ప్రసాద్