మెయన్ ఫీచర్

రాటుదేలుతున్న రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్న అంశం పక్కనబెడితే ఆ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ రాజకీయ పాఠాలు నేర్చుకునే అవకాశం రాహుల్ గాంధీకి దక్కింది. ఈ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం, దూకుడు, విమర్శల్లో పదును, ఆత్మవిశ్వాసం, పరిణతి కన్పించడం విశేషం. ముఖ్యంగా ఆ పార్టీతోపాటు విపక్షాలలో కూడా రాహుల్‌లో వచ్చిన మార్పు కాస్తంత నమ్మకాన్ని పెంచాయనే భావించాలి. ఇప్పటివరకు మోదీ చుట్టూ జరిగిన వివిధ ఎన్నికలకు భిన్నంగా ఈసారి గుజరాత్ శాసనస ఎన్నికల్లో రాహుల్ గట్టిగా పోరాడి తనచుట్టూ రాజకీయాలు పరిభ్రమించేలా చేయగలిగారు. ఎన్నికల్లో విజయం దక్కినా దక్కకపోయినా బిజెపిని ఉరుకులు పరుగులు పెట్టించి, మోదీ, అమిత్ షా జంటను కలవరపరిచిన రాహుల్, రాజకీయ భవిష్యత్‌కు గుజరాత్ పాఠాలు నేర్పి పునాదులు వేసిందని చెప్పొచ్చు. ‘విఫల రాజకీయ నాయకుడు’గా రాజకీయ ప్రత్యర్థుల నుండే కాకుండా, సొంత పార్టీ వారి నుండి కూడా ఈసడింపులు, ఖండనలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఇలా పరిణతి సాధించడం విశేషం.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమై, ముగించడం, గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడే లోగానే ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చకచక జరిగిపోతున్నాయి. అందుకనే గుజరాత్ ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
వాస్తవానికి గుజరాత్‌లో బీజేపి ఓటమి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నంత ధీమాగా మరెవ్వరూ చెప్పడం లేదు. పోల్ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్, మీడియా సంస్థల అధ్యయనాలు, నిష్పాక్షిక పరిశీలకులు బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొంటున్నా తిరిగి అధికారంలోకి రావడం తథ్యమనే అంటున్నాయి. ఏ రాజకీయ పక్షానికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ప్రతి ఎన్నిక కీలకమైనది. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని ఎన్నికలు మాత్రమే జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక ప్రభావం చూపుతూ ఉంటాయి.
ప్రధాని మోదీ అమలు చేసిన సంచలనాత్మక పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి పథకాలకు దేశం మొత్తం మీద ఎక్కువగా నిరసనలు ఎదురైనది గుజరాత్‌లోనే. 22 ఏళ్లుగా అక్కడ బీజేపీ అధికారంలో ఉండటం వల్ల కాస్తంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఇవన్నీ బీజెపిపై ప్రభావం చూపే అంశాలు. స్థానికంగా చెప్పుకోదగిన నాయకత్వం కూడా లేకపోవడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన అంశం.మోదీ, అమిత్‌షాలకు సొంత రాష్ట్రం కావడంతో బలమైన నెట్‌వర్క్ ఉండటం, కాంగ్రెస్‌కు ఆ స్థాయి పట్టు లేకపోవడం మరో లోపం. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా రాహుల్‌గాంధీ ఒక కొత్త తరం నాయకుడిగా గుజరాత్ నుండి ఎదిగినట్లు ఎన్నికల ప్రచార తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు మోదీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు రాహుల్‌గాంధీ చుట్టూ తిరగడం మొదలైనట్లు స్పష్టమవుతున్నది. మొదటిసారిగా రాహుల్ పేరు లేకుండా మోదీగాని, అమిత్‌షా గానీ ప్రసంగాలు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం మోదీ, అమిత్‌షా ఎన్ని దేవాలయాలకు వెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ రాహుల్ దేవాలయాలకు వెళ్లడం గురించి బీజెపి నాయకులే ఎక్కువగా ప్రచారం చేశారు. బిజెపి విమర్శలను ఎంతో హుందాగా, తార్కికంగా ప్రజల భాషలో తిప్పికొట్టే ప్రయత్నం రాహుల్ చేశారు. కానీ నరేంద్రమోదీ ఒక విధంగా తన స్థాయి, హోదాను మరచిపోయి అసహనంతో అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం ఉందంటూ వ్యాఖ్యానించడం ప్రధాని పదవికి హుందాతనాన్ని ఇవ్వదన్న విమర్శ మోదీ ఎదుర్కోవలసి వచ్చింది. ఎప్పుడూ నోరువిప్పని నేతగా విమర్శలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ఎన్నడూ, ఎవ్వరిపై చూపని ఆగ్రహాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీపై చూపడం గమనార్హం.
మొన్నటి వరకు 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదిరించగల బలమైన ప్రత్యర్థి ప్రతిపక్షాలలో లేరనే అభిప్రాయం ఉండేది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అటువంటి సామర్థ్యం ఉందని అనుకున్నా వత్తిడులకు లొంగి తిరిగి బీజేపీతో చేరడంతో ఒక విధంగా రాజకీయంగా శూన్య స్థితి ప్రతిపక్ష శిబిరంలో ఏర్పడింది. అటువంటి సమయంలో గుజరాత్‌లో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరుతెన్నులు పరిశీలించిన వారికి మోదీని ఢీకొనగల నేత తయారయ్యాడన్న అభిప్రాయం కలుగుతున్నది.
తనను ప్రధానిగా చేస్తే మొత్తం దేశాన్ని ‘గుజరాత్ మోడల్’ రీతిలో అభివృద్ధి చేస్తానని హామీతో 2014లో ఎన్నికల బరిలోకి మోదీ దిగారు. అయితే మూడున్నరేళ్లు అవుతున్నా ఆ మోడల్ ఏమిటో దేశ ప్రజల ముందు ఉంచలేకపోయారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆ మోడల్‌ను చూపి ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోయారు. ‘‘మీరు కాంగ్రెస్‌నో, నన్నో విమర్శిస్తూ ప్రచారం చేయడం కాదు, గుజరాత్‌కు ఏమి చేశారో చెప్పండి మోదీజీ’’ అని రాహుల్ నిలదీసినా బీజేపీ నేతలు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు.
ఎన్నికల ముందు హడావుడిగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే 22 ఏళ్ల పాలనలో కాలువల నిర్మాణం చాలావరకు పూర్తి చేయలేకపోవడం గురించి ప్రజల ముందు నోరువిప్పలేకపోయారు. గ్రామీణ గుజరాత్‌లో, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభకర పరిస్థితులను గురించి మారు మాట్లాడలేకపోయారు. బీజెపిని ఆత్మరక్షణలో పడవేయడంలో రాహుల్ సఫలమయ్యారు. 2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత బీజేపి ఎప్పుడూ ఇంతగా ఆత్మరక్షణలో పడలేదు.
గుజరాత్ ఎన్నికలలో గెలుపు కాంగ్రెస్‌కన్నా బీజేపికి ఇప్పుడు కీలకంగా మారింది. తమ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించలేకపోతే మోదీ, అమిత్ షాలకు జాతీయ స్థాయిలో పార్టీ, ప్రభుత్వాలపై పట్టు కొనసాగడం ప్రశ్నార్థకం కాగలదు. ఇప్పటికే బీజేపీలో చాలామంది సీనియర్లు, సీనియర్ మంత్రులు అదను కోసం ఎదురు చూస్తున్నారు. అంతా తామే అయి, మరెవ్వరి ప్రమేయం లేకుండా వ్యవహారాలు నడుపుతున్న వీరిద్దరినీ అవకాశం చిక్కితే ఓ పట్టుపట్టడానికి ఎదురు చూస్తున్నారు. వారికి గుజరాత్ అస్త్రం లభించకుండా చేయడం కోసం వీరిద్దరూ చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహూల్‌గాంధీ స్థానిక ప్రజల మనోభావాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మారిన కాంగ్రెస్ వ్యూహాన్ని వెల్లడి చేస్తున్నది. ప్రజలలో నెలకొన్న అసంతృప్తికి ఒక ఆకారం కల్పించే ప్రయత్నం చేశారు. ‘‘నేను గుజరాత్ ప్రజల పక్షాన అడుగుతున్నాను’’ అంటూ అధికార పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపొందినంత మాత్రాన 2019 ఎన్నికలలో మోదీని ఓడించి, ప్రధానమంత్రి పదవి చేపట్టగల సత్తువ రాహుల్‌కు ఏర్పడుతుందని చెప్పలేము. అందుకు ఎన్నో అవరోధాలను అధిగమించవలసి ఉంటుంది. అయితే మోదీని జాతీయ స్థాయిలో సవాలు చేయగల నాయకుడిగా మాత్రం రాహుల్ గుర్తింపు పొందుతారు. అందువల్ల మోదీ ఓటమిని కోరే ప్రతిపక్షాలు రాహుల్ వెనుక చేరక తప్పదు. ఇప్పటివరకు సోనియా వెనుక చేరడానికి సిద్ధపడిన నాయకులు రాహుల్‌తో కలవడానికి వెనుకడుగు వేస్తూ వస్తున్నారు.
ఒక విధంగా రాహుల్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడానికి మోదీ, అమిత్‌షా కారకులు అవుతున్నారనవచ్చు. బీజేపీ నేతలు మోదీ తనపై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు చేశారని, అయితే తాను మాత్రం ప్రధానిపై వ్యక్తిగత ఆరోపణలు చేయబోనని రాహుల్ చెప్పారు. ‘‘వారు నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడారు. నన్ను నిందించారు. మా తాతయ్య నానమ్మపైనా ఆరోపణలు చేశారు. వారు ఇబ్బందులు పెట్టాలని చూసినప్పుడల్లా నేను మరింత శక్తిమంతుడని అయ్యాను. ఇలా మోదీ నాకెంతో సాయం చేశారు. వారిని నేనెందుకు ద్వేషిస్తాను’’ అని వినయంగా పేర్కొన్నారు. బీజేపి నాయకులలో ఇటువంటి వినయం మచ్చుకైనా కనబడటం లేదు.
అయితే రాహుల్ రాజకీయంగా పరిణతి సాధించినంత మాత్రాన మార్పు సాధ్యం కాదు. బీజేపీకి ఉన్నట్లు పోలింగ్ బూత్ స్థాయిలో కాంగ్రెస్‌కు యంత్రాంగం లేదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలలో బలమైన నాయకులు లేరు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా వృద్ధ నాయకత్వమే రాజ్యమేలుతున్నది. ప్రజలతో సంబంధం లేని నాయకులే కాంగ్రెస్‌లో పెత్తనం చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 40 మంది సభ్యులు ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే లోస్‌సభ సభ్యులు. ఆ ముగ్గురిలో ఇద్దరు సోనియా, రాహుల్.
2004లో అనేక చిన్న, చితక పార్టీలతో చేతులు కలపడం ద్వారా సోనియా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. కాంగ్రెస్ పార్టీలో చీలికల పార్టీల నాయకులైన శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (టిఎంసి), వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసిపి)లకు 8.1 శాతం ఓట్లు 2014లో రావడమే కాదు, లోక్‌సభలో 49 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ గెలిచినా సీట్లు 44 మాత్రమే. పార్టీ పరిధిని విస్తరించే ప్రయత్నం రాహుల్ చేయగలరా?
కాంగ్రెస్ సంప్రదాయక అగ్రవర్ణాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల మద్దతుతో బలమైన వోట్‌బ్యాంక్‌తో ఉంటూ ఉండెడిది. అయితే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడంతో 30ఏళ్లుగా వివిద వర్గాలు చెల్లాచెదురయ్యాయి. బలమైన సామాజిక వర్గాలను దరి చేర్చుకొననిదే ఎన్నికలలో గెలుపు అసాధ్యం కాగలదు.
గుజరాత్‌లో యువకులు, రైతులను అక్కున చేర్చుకునే ప్రయత్నం రాహుల్ చేశారు. వారే ఎక్కువగా బీజెపి పాలనపట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఓటర్లలో 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారు నాల్గవ వంతు వరకు ఉంటారు. ఇక బీజేపి పాలిత రాష్ట్రాలలో రైతులు ఆయా ప్రభుత్వాలపై తిరుగుబాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితులను రాహుల్ ఏమాత్రం ఉపయోగించుకోగలరో చూడవలసి ఉంది.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా జరిగిన మరో చెప్పుకోదగిన పరిణామం ముస్లింల రాజకీయ భవిష్యత్‌కు సంబంధించినది. బీజేపీ పంథాలో రాహుల్ సైతం ముస్లిం ఓట్ల కోసం అంతగా వెంపర్లాడినట్లు కన్పించ లేదు. దేవాలయాల దర్శనానికి వెళ్లడం ద్వారా హిందూ ఓటర్లు అందరూ బీజేపి వెనుక సమీకరణ కాకుండా ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా తమ ప్రాధాన్యం తగ్గుతున్నదనే అభిప్రాయం ముస్లిం ఓటర్లలో ఏర్పడుతున్నది. గుజరాత్‌లో వారు 8 శాతమే కావచ్చు. జాతీయ స్థాయిలో 14 శాతం ఉన్నారు. యుపి, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో గణనీయంగా ఉన్నారు బీజేపి వలే కాంగ్రెస్ కూడా ముస్లింలు లేకపోయినా తమకు ఫర్వాలేదు అన్న ధోరణిలో వ్యవహరించడం సరైన ఎత్తుగడ కాదు. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు రాహుల్‌ను రాటుదేలేలా చేశాయి.

-చలసాని నరేంద్ర 9849569050