మెయన్ ఫీచర్

విలువల పతనం.. మానవత్వం మటుమాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషుల ఆలోచనా విధానాలు, వ్యవహారశైలి, సంబంధ బాంధవ్యాలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అవి కొన్నిసార్లు మానవత్వానికి మాయనిమచ్చగా మిగులుతున్నాయి. ఆవేదనను కలిగిస్తున్నాయి. అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి. మనలో మంచిమార్పు రాకపోతే మునుముందు ఎలా ఉంటాం అన్నది ఆందోళన కలిగిస్తోంది. భారతీయ జీవన విధానంలో పెడధోరణులు ప్రబలడానికి అసలు కారణాలు ఏమిటి? ఆ విపరిణామాల నుంచి బయటపడటం ఎలా? ఇదీ ఇప్పటి ప్రశ్న. నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఘటనలు ఈ ప్రశ్నలకు కారణమవుతున్నాయ. ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు విఫలయత్నం చేయడం, ఆమెను గ్రామస్థులు చెట్టుకు కట్టి కొట్టిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. నిన్నటికి నిన్న ప్రేమించలేదనే సాకుతో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి గురై కన్నుమూసిన సంధ్యారాణి, మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలంలో సుధాకర్ రెడ్డి హత్య గుండె బరువెక్కించేవే. కావలిలో సైతం మరో స్వాతి ప్రియుడి కోసం భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసి నిలదీశాడనే కోపంతో మరోభార్య భర్తను చంపేసి సెప్టిక్ ట్యాంకులో పడేసి, భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే భార్యలను చంపిన భర్తలూ ఉన్నారు. తల్లిదండ్రులను, అన్నదమ్ములను కుటుంబ సభ్యులే చంపేసిన ఘటనలూ లేకపోలేదు. అంతవరకూ ఎందుకు నల్గొండ జిల్లాలో కన్నకూతుర్నే చంపేసిన ఘటన పెనుసంచలనం రేకెత్తించలేదా? పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. హద్దులు మీరిపోతున్న అక్రమ సంబంధాలు వావివరసలను మరిచిపోతున్నాయి.
పార్వతీపురంలో ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, జయపురంలో అన్నను చంపిన సోదరి, కూతుర్ని వ్యభిచారం చేయమంటున్న కసాయి తల్లి, నాలుగేళ్ల బాలికపై పాఠశాల ప్యూన్ వాష్‌రూమ్‌లో అత్యాచారం చేయడం వంటివి మనసుల్ని కలచివేసేవే. ఇవి చెప్పుకోవడానికి ఒకటి రెండు ఘటనలు కావచ్చు. ఒకపుడు నేరం అంటే ఆత్మహత్య చేసుకోవడమో, దొంగతనమో, గృహ హింసో, దోపిడీనో అయివుండేవి. ఇపుడు సామూహిక అత్యాచారాలు, వైవాహికేతర సంబంధాలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, హత్యలు, భారీ దోపిడీలు, నరమేథాలు, అల్లర్లు, దాడులు, సైబర్ నేరాలైతే లెక్కేలేదు. ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు మనసులను కలచివేస్తున్నాయి. మనమేనా ఇలా తయారవుతున్నది అన్న ప్రశ్నను సంధిస్తున్నాయి.
అంతుచిక్కని నేరాలు
కోరికలు గుర్రాలవడం, ఆర్థిక అవసరాలు పెరిగిపోవడం, కుటుంబ సంబంధాలను లెక్కచేయకపోవడం, కుటుంబ సభ్యులంతా బిజీగా గడపడం, ఒంటరితనం, మీడియా, సమాజ వత్తిడి పెరగడంతో, మానవ సంబంధాలు సన్నగిల్లిపోవడం, మానవత్వం మంటకలిసిపోవడం, అతివేగాన్ని పుంజుకున్న జీవన విధానంలో సున్నితత్వం లోపించడం, తామేం చేస్తున్నామనే స్పృహ లేకపోవడం, క్షణికావేశం అనేక నేరాలకు కారణమవుతోంది. నాగరికత మొదలైనప్పటి నుండి మానవులు నేరాలు చేయడం, రాజు శిక్షించడం ప్రారంభమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణకు ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట చేయాల్సిన పని నేరస్థులను శిక్షించడం. ఇది ప్రభుత్వ బాధ్యత. శాంతిభద్రతల కోసం న్యాయశాస్త్రం కొన్ని పనులు చేయడాన్ని నిషేధిస్తుంది. అలాగే చేయాల్సిన పనులను సూచిస్తుంది. చేయాల్సిన పనులు చేయకపోయినా, చేయకూడని పనులు చేసినా చట్టం దృష్టిలో నేరమే. భారత శిక్షాస్మృతి 1860లోనే బ్రిటిష్‌వారు అమలులోకి తెచ్చారు. అప్పటినుండి ఎప్పటికపుడు చట్టంలో మార్పులు చేసుకుంటూ కాలంతోపాటు, అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నారు.
పటిష్టమైన వ్యవస్థలు..చట్టాలు
భారత రాజ్యాంగం, పటిష్టమైన పాలనావ్యవస్థ, పకడ్బందీ న్యాయవ్యవస్థ, కఠినమైన చట్టాలు ఉన్నా నేరాలు- ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్థుల్లో అంతా అయ్యాక తప్పుచేశామనే పశ్చాత్తాపం కనిపిస్తోంది. మరికొంతమంది కరడుగట్టిన వారైతే మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్నారు. అన్ని మతాలవారికీ వేర్వేరుగా, ఉమ్మడిగా కుటుంబ చట్టాలున్నాయి. ఆధునిక హిందూ న్యాయశాస్త్రం, క్రైస్తవుల న్యాయశాస్త్రం, భారత విడాకుల చట్టం- 1869, ముస్లిం న్యాయశాస్త్రం, ప్రత్యేక వివాహ చట్టం -1954, వరకట్న నిషేధ చట్టం -1961, బాల్య వివాహాల నిరోధక చట్టం -1929, గృహహింస నిరోధక చట్టం- 2005, ఆస్తులు హక్కులు ఒప్పందాల చట్టం, అపకృత్యాల న్యాయశాస్త్రం, మానవ హక్కులు, పర్యావరణ న్యాయశాస్త్రం, పౌరవిధాన నిర్ణయ న్యాయ శాస్త్రం, భారత శిక్షాస్మృతి, నేర నిర్ణయ విధాన న్యాయశాస్త్రం, తగాదాల పరిష్కారం వంటి చట్టాల్లో అన్ని వివాదాలకు, నేరాలకు చాలా స్పష్టమైన శిక్షలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని నేరాలకు ఉరిశిక్ష పడుతున్నా జనంలో మార్పు రావడం లేదు.
ఎందుకిలా జరుగుతోంది?
ప్రతి ఒకరిలో సున్నితత్వం లోపించడం, సహనం తగ్గడం, స్వార్ధం విపరీతంగా పెరిగిపోవడం, సమాజంలో అన్ని విషయాల్లో వ్యక్తుల మధ్య అగాధం నేరప్రవృతికి కారణం అవుతోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి బయటకు వచ్చి ఏకాకి కావడం మరో ప్రధాన కారణం. చదువుల్లో సత్తాలేకపోవడం, మార్కెట్ డిమాండ్ చదువులకే ప్రాధాన్యత పెరగడం, సామాజిక శాస్త్రాలపై శ్రద్ధ కొరవడడం, నీతి - నైతిక విలువల బోధన తగ్గిపోవడం ఇవన్నీ కారణం అవుతున్నాయి. విద్యా వంతులు కావడం, విశాల దృక్పథాన్ని పెంపొందించుకోవడం, పరిమితతత్వానికి అతీతంగా విస్తృతం కావడం అనే కోరికలు ఉన్నా ప్రస్తుత విద్యావిధానం మాత్రం కుచించుకుపోయేలా చేస్తుందనేదే ప్రధాన ఆరోపణ. కొన్ని తరాలక్రితం ప్రతిచోటా ప్రత్యేకించి భారతీయ సంస్కృతిలో ప్రజలు ఉమ్మడి కుటుంబాలుగా జీవించేవారు. ఇప్పటికి కూడా రెండు మూడు వందలమంది సభ్యులు కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తున్న వారున్నారు. అలా ఉమ్మడిగా జీవిస్తున్నపుడు ఒకరితో ఒకరికి ఎన్నో రకాల అవసరాలుంటాయి. అలా జీవించాల్సి వచ్చినపుడు ఖచ్చితంగా కలుపుకుపోయేతత్వం ఎంతో అవసరమవుతుంది. అదిలేకుంటే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండలేరు. కాని ఇపుడు అలా జీవించడం అనేది అసాధారణ విషయం.
విద్యపై పడమటి దేశాల ప్రభావం వల్ల అందరూ ఒంటరి జీవితానికి అలవాటై కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక అప్పటి నుండి పిన్ని, బాబాయిలను నాయనమ్మ, తాతయ్యలను వదిలేసి, కుటుంబం అంటే నేను, నా భార్య పిల్లలు, మా అమ్మ, నాన్న పర్లేదు కాని, అత్తమామలు మాత్రం వెళ్లిపోవల్సిందే అనే తత్త్వం అందరిలో ఏర్పడుతోంది. చివరికి తల్లిదండ్రులు కూడా వెళ్లిపోవల్సిందే, నేను నా భార్య, నా పిల్లలు దగ్గరకి వచ్చాం. కొన్నాళ్లు పోతే భార్య, పిల్లలు కూడా వెళ్లిపోవల్సిందే. నేనే లోకం అనే రోజు రాదని ఎలా అనుకోగలుగుతాం.
మన విలువలు ఏమయ్యాయి?
ప్రపంచంలోనే మన సంస్కృతి ఎంతో ఘనత వహించింది. భారతీయ సంస్కృతి భవ్యమైంది, దివ్యమైంది. ఇందులో నైతిక విలువలు, నాగరికతతో మానవతా విలువలు వెల్లివిరిశాయి. జాతి ఔన్నత్యానికి ప్రతీకగా ఉన్నాయి. మన సంస్కృతి ఆది నుండి మానవతా పరిమళాలు వెదజల్లుతూ మానవునిలో మార్పు తెచ్చేందుకు మంచిని పంచుతూ ఆదర్శంగా ఆవిష్కృతమైంది. అహింసా పరమోధర్మః అని మన వేదం చెబుతోంది.‘ఆత్మవత్ సర్వ భూతానీ’ అని గీత చెబుతుంది. పరోపరకామే పుణ్యమని, పరులను పీడించడం పాపమని అష్టాదశ పురాణాలు ఘోషిస్తున్నాయి. మానవుడిలో మానసిక మార్పు తేవడం చాలా ముఖ్యమని వేమన వాణి చెబుతోంది. నిష్కామ బుద్ధితో బాధితులకు సేవ చేయడమే ఉత్కృష్ట మానవ ధర్మమని స్వామి వివేకానంద చెప్పారు. ప్రార్థించే చేతులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా చేసి చూపించారు. సొంతలాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయి అని గురజాడ అప్పారావు లోకహితానికి చెప్పిన మాటలు ఎలా మరిచిపోగలం. సేవించు, ప్రేమించు, తరించు అని శివానందుల వారి సందేశం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దధీచి, శిబి, బలి వంటి మహాపురుషులు ఎంతోమంది మానవతావాద విలువలకు ప్రాణం పోశారు. కాని అదంతా గతం. నేడు మానవతా విలువలు దిగజారుతున్నాయి. దీనికి కారణం దేశంలో విద్య- బోథన విధానమే.
విదేశీ విద్యావిధానం పశ్చిమ దేశాల్లో మొదలై నిదానంగా మన దేశపు పెద్ద నగరాల్లోకి విస్తరించి, ప్రజల జీవితాల్లో ప్రవేశించి, వారి జీవితాల్లో ప్రముఖపాత్ర పోషిస్తుండటం వల్ల అసలు ఇపుడు ఓ ఇద్దరు కలిసి జీవించడం కష్టతమవుతోంది. తల్లిదండ్రులు, భార్యాభర్త ఉద్యోగులై కొన్ని కుటుంబాలకు వారాంతంలో కలుసుకోవలసిన పరిస్థితులున్నాయి. దురదృష్టవశాత్తు జనాలు పెద్ద విద్యను ఆర్జించే కొద్దీ కోరికలు నమ్మలేనంతగా కలుగుతున్నాయి. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవాలి అమెరికానో, యుకెనో, కెనడానో వెళ్లిపోవాలి. జనం ఎంతగా కోరికల్ని సృష్టించుకుంటున్నారంటే అవి తీర్చుకోవడానికి కావల్సిన వనరులకు ప్రతి ఒక్కరికీ ఒక్కో గ్రహం కావాలి. అందరూ ఒక గ్రహం మీద జీవించలేమనే భావన. ఇదీ ప్రస్తుత మన విద్యావిధానం లక్ష్యం- ఫలితం. చదువులో లోపం లేదు. ఎక్కడో ఒక చోట మానవ సంబంధాలను, మమతలను పంచే మాటలు ఉన్నా, చదువు చెప్పే విధానంలోనే లోపం ఉంది. సమాజాన్ని నాశనం చేస్తోంది విద్య కాదు, విద్యను ఏ సందర్భంలో ఎలా అందిస్తున్నామనే అంశంలో లోపమే. విద్య నేడు మనుగడకు పరిమితమైంది. జనం వారి ఆర్థిక పరిస్థితి పట్ల పిచ్చిపట్టినట్టు ఈ విధానంవల్ల తయారవుతున్నారు. విద్యారంగాన్ని డబ్బు పిండడానికే ఉపయోగిస్తున్నారు. పిల్లల తెలివితేటలను తికమక పెట్టకుండా ఉంటే అతనిని ఎక్కడ ఉంచినా బతుకుతాడు. మనం అతడ్ని అద్భుతమైన ప్రేమమయమైన వ్యక్తిగా, ధైర్యవంతుడిగా తయారు చేయడానికి బదులు డబ్బు పిచ్చివాడిగా మారుస్తున్నాం.
బాల్యం నుంచే మార్పు రావాలి
ఇది మారాలంటే మనిషిలో మార్పు రావాలి, ఆ మార్పు విద్యతోనే సాధ్యం. బాల్యదశలోనే నీతి కథలు బోధించాలి. మహనీయుల జీవిత చరిత్రలను చెప్పాలి, భగవద్గీతను పఠింపచేయాలి. భగవంతుడి కథలను వినేట్టు చేయాలి. ఉన్నంతలో అందరితో కలిసి ఉండాలనే తపన పెంచాలి. మనసులో ప్రేమను, మమతను పంచావా లేక నీలో వైకల్యానికి కారణాలను వెతుక్కుంటున్నావా అనేది గుర్తుచేయాలి. తోటి వారి సుగుణాలను గమనించేలా చేయాలి. కాలం ఇసుకలా జారిపోతూనే ఉంటుందని, ప్రేమాభిమానాలతోనే తోటి వారి హృదయాల్లో పదిలమైపోతామని మరీ మరీ చెప్పాలి. ఎదుటి వారు సంతోషపడేలా జీవితంలో ఎదగాలి, మెరవాలి, ఆ తపనతోనే తొందరపడాలి.

-బి.వి. ప్రసాద్