మెయిన్ ఫీచర్

పుస్తకాన్ని మించిన నేస్తం ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరింతలు కొడుతూ, తుళ్ళింతలాడే పసిపాప ‘‘త్త, త్త, త్త’’, ‘‘మ్మ, మ్మ, మ్మ’’ అనగానే తన పాప ‘అత్తా’, ‘అమ్మా’ అంటోందని ప్రతి తల్లీ మురిసిపోతుంది. ‘శబ్దం’, ‘పలు కు’గా మారగానే ఆ పలుకు వింత సోయగాలతో మహాశక్తిమంతమవుతోంది. పలుకులు మాటల వెల్లువై సంగీత ధారగా, సాహిత్య ఝురిగా, విజ్ఞానాంబుధిగా ప్రవహిస్తోంది. బుడి బుడి అడుగులతో పాటు ఆ బిడ్డకు ఆడుకోవటానికి ఆటవస్తువుగా సెల్‌ఫోన్లు, టాబ్లెయడ్ వంటిఆధునిక వస్తువులను అలవాటు చేయకుండా పుస్తకాన్ని చూపిస్తే అదే భవిష్యత్తులో నేస్తంగా మారుతోంది.
భర్తృహరి చదువు ప్రాశస్త్యం చెబుతూ, ఈ చదువే మనందరికి వ్యక్తిత్వాన్నీ, భోగాన్ని, కీర్తినీ ఇస్తుందని, విదేశాలకెళ్ళినపుడు ఈ చదువే మనని బాంధవుడిలా ఆదుకుంటుందనీ, గురువులా ఉపదేశిస్తుందనీ, చదువునే రాజులు గౌరవిస్తారని, ‘విద్యావిహీనః పశుః’- విద్యలేనివాడు వింత పశువు అన్నాడు.
మా చిన్నప్పుడైతే ‘చందమామ’ పిల్లల బొమ్మల మాసపత్రికని తప్పక చదివే వాళ్ళం. అప్పుడీ ఇంగ్లీషు కామిక్స్ వుండేవి కాదు. నిజానికి ఫస్ట్ఫాం అంటే ఆరో క్లాసు వచ్చేవరకూ ఇంగ్లీషు నేర్పేవారు కాదు. ‘చందమామ’లోని కథలనన్నింటినీ చక్రపాణిగారి పర్యవేక్షణలో కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకటే శైలిలో రాసేవారు. దాసరి సుబ్రహ్మణ్యంగారి సీరియల్సూ, భేతాళకథలూ ఎంతో వినోదాత్మకంగా, విజ్ఞానదాయకంగా ఉండేవి. శంకర్, చిత్ర అనే చిత్రకారుల బొమ్మలతో ఆద్యంతమూ పిన్నలనీ, పెద్దలనీ అలరించేది. నా చిన్నతనంలోనయితే తిరుపతిలో మా చిన్నన్నయ్యతో కలిసి రాములవారి గుడి పక్కనే వున్న గ్రంథాలయానికి వెళ్లి అనేక పిల్లల పుస్తకాలు చదివాను. లియో టాల్‌స్టాయ్ రాసిన ‘కోడిగుడ్డంత గోధుమ గింజ’ కథల సంపుటి- ఆయన రష్యను భాషలో రాస్తే దానికి తెలుగు అనువాద విందు రచయిత గుర్తులేదు గానీ ‘కప్పపెళ్లికూతురు’ అనే కథల సంపుటి, అలెగ్జాండర్ డ్యుమా అనే ఫ్రెంచి రచయిత రాసిన కెంట్ ఆఫ్ వౌంట్ క్రిస్టో నవల తెలుగు (సూరంపూడి సీతారాం అద్భుతంగా తెనిగించారు) అనువాదం- ఇలా చాలా చదివాను. మెల్లిగా పెరుగుతున్నపుడు అనేక రచయిత(త్రు)ల రచనా వ్యాసంగం పరిచయం పెరుగుతూ వచ్చింది. సంప్రదాయ కవుల కావ్యాలూ, ప్రబంధాలూ కూడా చదివాను. పెద్దయ్యాక ఆంగ్ల, ఫ్రెంచి, రష్యను భాషల ప్రముఖ రచనలని చదివాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తకాల పరిచయం, ఈ రచయిత(త్రు)ల మేధా సంపత్తి నా చిన్ని బుర్రని విస్తృతపరిచింది. మన సంస్కృత నాటకాలూ, కావ్యాలూ కొన్ని చదివాక సంస్కృత భాషలోని నిరుపమాన, నిర్దుష్టమైన వైవిధ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ అన్ని సాహిత్యాల సాంగత్యం నా ఊహలకి రూపునిచ్చింది. ఆలోచ నలకి పటుత్వాన్నిచ్చింది. మేథకి పదునుపెట్టింది. నేను చదివిన ప్రతి అక్షరం మెరుపై, వెలుగై, తేజమై వ్యక్తిత్వ వికాసానికి దారిచూపింది. ప్రతి అక్షరమూ జవంతో, జీవంతో తొణికిసలాడి ఆత్మవికాసానికి ఊపిరిపోసింది.
పురుషులందు పుణ్యపురుషులు వేరైనట్లు పుస్తకాలలోనూ భేదాలుంటాయి. కొన్ని క్షణికానందాన్ని, మానసికోద్వేగాన్ని కల్గిస్తాయి. వాటి ప్రయోజనం ఏవీ వుండదు. శృంగార పుస్తకాలీకోవకు వస్తాయి. కానీ వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉండి దుష్ఫలితాలని ఇస్తుంది. కొన్ని సమకాలీన సమస్యలకి తరుణోపాయాలు చెబుతాయి. ఆ సమస్యలు తీరిపోగానే వాటి ప్రయోజన మూ హుష్‌కాకీ! కొన్ని మనుషులని రెచ్చగొట్టి ము ఖ్యంగా యువతకి వీరావేశం, గంగవెర్రులెత్తించి పెడత్రోవని పట్టిస్తాయ్. అనేక అసాంఘిక, వినాశకారక ధోరణులూ, ఉద్య
మాలను గూర్చిన సాహిత్యం ఈ ముళ్ళబాటలోనే వెడుతోంది. కానీ కొన్ని పుస్తకాలు సానపెట్టిన వజ్రంలా దేదీప్యమానంగా, అనర్ఘదీపంలా, నిత్యాగ్నిహోత్రంలా చిరంగా, స్థిరంగా, నిరంతరంగా, కట్టెదుట నిలిచిన దేవుడంత నిజంగా శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. ఇవి చిరసత్యాలు సుమా! మన ఇతిహాస, కావ్యాలు ఇలా జాజ్యల్యమానంగా వెలుగులీనుతున్నవే. అందుకే ఫ్రాన్సిస్ బెకన్ అనే ప్రముఖ ఆంగ్ల వ్యాసరచయిత అంటారు ‘‘కొన్ని పుస్తకాలు రుచి చూస్తే చాలు, కొన్నిటిని మింగేయాలి, కొన్నిటిని మాత్రం తీరిగ్గా నమిలి, జీర్ణం చేసుకోవాలి’’ అని. సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గానీ మంచి పుస్తకం కనుక్కో’’ అన్నారు. టీవీ ప్రోగ్రాములతో, వాట్సాప్ సంభాషణల తో, ఐపాడ్లతో చాలా విలువైన కాలాన్ని చాలా మూర్ఖంగా వృధా చేస్తున్న యువతీ యువకులు మనముందు నిక్షిప్తమైన సంపదను చేజేతులా చేజార్చుకుంటున్నారు. ఎందుకంటే ‘చిరుతప్రాయమందు చేరనేర్చిన విద్య, ఒంటబట్టి బ్రతుకునంటివచ్చు. ఏ పనికైనా శ్రద్ధ, కుతూహలం చాలా ముఖ్యం. శ్రద్ధలేనియెడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు’’. సారమెరిగి చదివిన చదువు ఒంటబట్టుతుంది. తెలియని విషయాలు తిరిగి, తిరిగి చదివితే అర్థంకానిదంటూ ఏమీ వుండదు. ప్రతి విషయంలో పోటీపడ్డట్టే పుస్తకాలు చదవడంలోనూ యువతీ యువకులు పోటీపడాలి. ఎందుకంటే ‘స్పర్థయా వర్థతే విద్యా’ అన్నది ఆర్యోక్తి కదా. ఫ్రాంజ్ కఫ్కా అనే ఫ్రెంచి రచయిత అంటాడు- ‘‘ఒక మంచి పుస్తకం నాలో గడ్డకట్టిన మంచు సముద్రానికి గొడ్డలిలాంటిది!’’.
మనుషులంతా విద్యార్థులే. విద్యను నిరంతరం అర్థిస్తున్నవారే. అందుకే సుమతీ శతకారుడు బద్దెన ‘‘ఇమ్ముగ జదవని నోరును / నమ్మయని పిలిచి అన్నమడగని నోరున్’’- వీటిని కుమ్మరి కుండలకై తవ్వే గుంటతో పోల్చారు. పరవస్తు చిన్నయసూరి ‘విద్య యొసగును వినయంబు, వినయమున భోగకరి’ అని అన్నాడు. విద్యతో పునీతులై వినయశీలురవ్వాలి. మరి మీరూ పుస్తకాల దుకాణాలకు వెళ్లి మాంచి పుస్తకం కొనండి. చదవండి. చదివాక మీకింతవరకూ గోచరించని ప్రపంచం నవనవోనే్వషంగా సాక్షాత్కరిస్తుంది.
‘‘పుస్తకముల నీవు పూవువోలెను చూడు
చింపబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకములు ఎరువు తెచ్చితివేని
తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ’’ (తెలుగుపూలు- నార్ల చిరంజీవి)

టీవీ ప్రోగ్రాములతో, వాట్సాప్ సంభాషణలతో, ఐపాడ్లతో చాలా విలువైన కాలాన్ని చాలా మూర్ఖంగా వృధా చేస్తున్న యువతీ యువకులు మనముందు నిక్షిప్తమైన సంపదను చేజేతులా చేజార్చుకుంటున్నారు. ఎందుకంటే ‘చిరుతప్రాయమందు చేరనేర్చిన విద్య, ఒంటబట్టి బ్రతుకునంటివచ్చు. ఏ పనికైనా శ్రద్ధ, కుతూహలం చాలా ముఖ్యం. శ్రద్ధలేనియెడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు’’. సారమెరిగి చదివిన చదువు ఒంటబట్టుతుంది.

-కె.అరుణావ్యాస్ 040-27852356