మెయన్ ఫీచర్

దొమ్మరులు మారినా మనం మారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న నాగరికత, సినిమా, టీవీల రాకతో ప్రాచీన కాలం నుండి వస్తున్న మనవైన పలు జానపద కళలు, కళా నైపుణ్యాలు సమాధి అవుతున్నాయి. పైగా ఆయా కళలను నమ్ముకున్న వారిని నిరాదరణకు గురి చేయడమే కాకుండా, వారిని నేరస్థులుగా, సమాజ హితానికి ప్రమాదకారులుగా ముద్రవేసి, ఆధునిక నాగరికత వారి ఛాయలకు చేరకుండా ఒక విధంగా కట్టడి చేస్తున్నాము. ఆ విధంగా సమాజ వివక్షతకు గురవుతున్న వారిలో ‘దొమ్మరులు’ కూడా ఉన్నారు.
కాకతీయ రాజుల కాలంలో ఆస్థాన కళాకారులుగా గుర్తింపు పొంది, పలు విన్యాసాలు చేస్తూ శతాబ్దాల పాటు అందరినీ అలరిస్తూ వచ్చారు. ‘దొమ్మరాట’ కులవృత్తిగా గ్రామాల వెంట తిరుగుతూ, తమకంటూ స్థిర నివాసం అంటూ లేకుండా తమ కళానైపుణ్యాలనే పెట్టుబడిగా గుర్తింపు తెచ్చుకునేవారు. చాపలు అల్లడం, పందుల పెంపకం, దొమ్మరాటలో భాగంగా గెంతడం, దూకటం, పల్టీలు కొట్టడం, త్రాడుపై బ్యాలన్స్ చేసుకొని నడవడం, పొడుగాటి వెదురు బొంగులపై విన్యాసాలు చేయడం ద్వారా ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.
వీరు జంతువులను గావుపట్టి ఆ రక్తం, బియ్యం, వేపాకులతో కలిపి పంటపొలాల్లో చల్లితే సకాలంలో వర్షాలు వచ్చి, పంటలు సమృద్ధిగా పండేవని గ్రామస్థులు విశ్వసించేవారు. అందుకు కృతజ్ఞతగా గ్రామస్థులు ఇచ్చే ధన, ధాన్యాలతోనే జీవనం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరనివాసం అంటూ లేకపోవడంతో గ్రామపెద్దలు ఆదరాభిమానాలపై ఆధారపడుతూ ఉండేవారు. ఈ విధంగా ఆటపాటలు ఆడే యువతులు వివాహం చేసుకోకుండా, ఒక తల్వార్ (కత్తి)ని వివాహం చేసుకొని ఉంటూ ఉండేవారు. ఆదరించిన గ్రామపెద్దలు వారిని తమ లైంగిక అవసరాలకు వాడుకొంటూ, గౌరవ మర్యాదలతో చూసేవారు. అయితే తమది వ్యభిచార వృత్తి కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇటువంటి కళలకు ఆదరణ కోల్పోతూ ఉండడంతో, వారిని గ్రామాలలో తిరగనివ్వకుండా ఆంక్షలు విధించడం ప్రారంభించారు. గ్రామ పొలిమేరలకే పరిమితం చేసేవారు. క్రమంగా గ్రామాలు పట్టణాలుగా మారడం, జననివాస ప్రాంతాలకు విస్తరిస్తున్న కొలది వారిని మరింత దూరానికి నెడుతూ వస్తున్నారు. దానితో కులవృత్తులకు స్వస్తి పలికి, పిల్లలకు చదువు చెప్పించి, ఉద్యోగాలకు పంపాలని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఆకాంక్ష వారిలో పెరుగుతూ వస్తున్నది.
అయితే దొమ్మర్లు అనగానే ఒక విధమైన న్యూనతాభావంతో చూడడంతో వారు ఎక్కడకు వెళ్లినా తమ కులం పేరు చెప్పుకోవడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో తీగలెక్కి విన్యాసాలు ప్రదర్శించిన యువతులను దగ్గరకు తీసుకున్న భూస్వాములు వారిని తమ లైంగిక అవసరాలకు వాడుకుని వదిలివేయడంతో వారు ఎటువంటి జీవనాధారం లేక మిగిలిపోవలసి వచ్చింది. దానితో కొందరు విధిలేని పరిస్థితులలో పడుపువృత్తితో జీవనం సాగిస్తూ సమాజంలో అవమానాలను, ఈసడింపులను భరిస్తూ దుర్భర పరిస్థితులకు లోనుకావలసి వస్తున్నది.
పుట్టిన పిల్లలకు సరైన పోషణ, ఆధారం కరువై, మానవాభివృద్ధి సూచికలో అట్టడుగు స్థితిలో ఉండిపోవలసి వస్తున్నది. ప్రభుత్వం సైతం నిరాదరణకు గురిచేయడం, వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురాలేకపోవడంతో కొందరు తమ పిల్లలను కూడా పడుపు వృత్తిలోకి దింపి ఊరిబయట గుడిసెల్లో జీవనం సాగించవలసి వస్తున్నది. కొంతమంది తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తే అక్కడ అవమానాలు ఎదురై చదువు మానివేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు అటువంటి దుర్భర అవమానాలను భరించి, చదువు పూర్తిచేసి కంప్యూటర్ కోర్సులు, డిగ్రీవరకు చదివినా ఉపాధి అవకాశాలకు దూరంగానే ఉండవలసి వస్తున్నది. అతి కొద్దిమంది ఏదోవిధంగా ఉద్యోగాలు పొందినా తమ కులం గురించి తెలిస్తే ఎక్కడ ఆ ఉద్యోగం పోతుందో అనే భయంతో కాలం సాగిస్తున్నారు.
ఇక ప్లాస్టిక్ యుగంలో చాపలు అల్లే వృత్తి పనికిరాకుండా పోయింది. పారిశుద్ధ్య కారణాలతో ప్రభుత్వ అనుమతి కరువై పందులను పెంచలేకపోతున్నారు. గత్యంతరం లేక పడుపువృత్తికి పరిమితం కావలసి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు పదివేల మంది దొమ్మర కులస్థులు ఉన్నారు. వీరిలో కొద్దిమంది ఆటోడ్రైవర్లుగా, మరికొందరు దినసరి కూలీలుగా చాలీచాలని ఆదాయాలతో గడుపుతున్నారు. ‘‘మా వారెవ్వరూ ఈ వృత్తిలో కొనసాగాలని కోరుకోవడం లేదు. 75 శాతం మందికి పైగా ఇప్పటికే ఈ వృత్తికి స్వస్తిపలికి, గౌరవంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాకు ప్రభుత్వం నుండి సమాజం నుండి ఎటువంటి సహకారం లేకపోగా పూర్తి నిరాదరణ ఎదురవుతున్నది. మేము మారుతున్నాం. దయచేసి మీరు కూడా మీ వంతు సహాయం అందించండి’’ అని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం కార్యదర్శి ముస్కు సుధాకరం వాపోయారు.
నేరపూరిత నిరాదరణ
ఈ కులస్థుల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నేరపూరిత నిరాదరణ ఈ మధ్యనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ మండలం జప్తిశివపూర్ హైవే పక్కన సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏడు వేశ్యాగృహాలు ఉండేవి. వీటి నిర్వాహకురాలు సరోజిని పేరుతో ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ సరోజినినగర్‌గా పిలుస్తున్నారు. వారి పరిస్థితుల గురించి తెలుసుకున్న అప్పటి (1993లో) ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నేరుగా వారి ఇళ్లవద్దకు వెళ్లి వారికి పునరావాసం కల్పిస్తానని, పడుపువృత్తికి స్వస్తి పలకుతారా అని అడిగారు. వారు అందుకు సిద్ధం కావడంతో అపూర్వమైన పునరావాసం ఏర్పాటు చేశారు. ఆ ఏడు కుటుంబాలకు 13 ఎకరాల భూమి పట్టాలను అప్పటి మంత్రి జె.గీతారెడ్డి ద్వారా ఇప్పించారు. వారి పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలో చేర్పించి చదువుకునే ఏర్పాటు చేశారు. ఆ భూమి అంతా గుట్టలు, వాగులు, గోతులు, రాళ్లతో నిండి, వ్యవసాయానికి పనికిరాకుండా ఉంది. దానితో వారు సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, ఎంతో కష్టపడి అంతా చదును చేసుకొని, బోర్లు వేయించుకుని విద్యుత్ కనెక్షన్లు పెట్టించుకుని సాగుకు సిద్ధమయ్యారు.
అంతలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు బదలీ కావడంతో అప్పటి వరకు కళ్లప్పగించి చూస్తున్న అటవీశాఖ అధికారులు ఆ భూమి తమది అని, అక్రమంగా సాగు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వారిని అక్కడి నుంచి గెంటివేశారు. వారు వేసుకున్న బోర్లు, విద్యుత్ లైన్లను ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ భూములు ‘మీసేవ’లో వారి పేర్లతోనే ఉన్నాయి. కానీ వారిని ఆ భూములలోకి అడుగుపెట్టనీయడం లేదు. ప్రభుత్వం కనీసం వారికి ప్రత్యామ్నాయం చూపడం లేదు. ఎందరు అధికారులను, రాజకీయ నాయకులను కలిసినా వారి మొరను పట్టించుకునేవారు కనిపించడం లేదు. ‘‘ఆ భూమిని చదును చేసేందుకు మేము పెట్టిన ఖర్చులతో వేరే భూములను కొనుగోలు చేసుకొని ఉంటే ఇప్పుడు భూముల ధరలు పెరగడంతో మేమంతా కోటీశ్వరులమై ఉండేవాళ్లం’’ అని సరోజిని (67) ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పోలీసులు వారి ఇళ్లపై దాడులు జరపడం, దొంగతనాలు చేస్తున్నారని, పడుపువృత్తికి పాల్పడుతున్నారని అరెస్టులు జరపడం, కేసులు పెట్టడం సాధారణమైపోతున్నది. కానీ మారడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వినే నాథుడే కనబడటం లేదు.
పోలీసుల దాడులు
ఇలా ఉండగా బెంగళూరుకు చెందిన జస్టిస్ లాండ్‌కేర్ అనే ఒక కార్పొరేట్ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నుంచి నలభైమంది పోలీసులు గత మార్చిలో రాత్రిపూట వారి ఇళ్లపై దాడులు చేశారు. దొరికిన 40 మంది బాలికలను తీసుకువెళ్లి ఒక హోమ్‌లో నిర్బంధించారు. తాము తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లిపోతామని మొరపెట్టుకుంటే చాలాకాలం తరువాత వారిని పంపారు. ఈ సందర్భంగా మొత్తం 75 మందిని జైలుకు తరలించారు. కదలలేని వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులను తప్ప అందరినీ తీసుకువెళ్లారు. అక్కడి సామాజిక పరిస్థితుల గురించి కనీసం పరిశీలన కూడా చేయని జస్టిస్ అండ్ కేర్ అనే ఎన్జీఓ వారికి 84 రోజుల వరకు బెయిల్ కూడా రానీయకుండా కోర్టులలో సీనియర్ న్యాయవాదులను ఏర్పాటు చేసుకొని కక్షసాధింపు ధోరణిలో వేధించింది. బెయిల్ వచ్చిన తరువాత కూడా ప్రతి వారానికి ఒకసారి హైదరాబాద్‌కు వచ్చిన సిఐడి కార్యాలయంలో సంతకాలు చేయమని షరతు విధించారు. అందుకు ప్రయాణ ఖర్చులు కూడా లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.
తన అన్న, అమ్మమ్మలతో కలసి ఉంటున్నాను అని చెప్పినా నిర్దాక్షిణ్యంగా తనను జుట్టుపట్టుకుని తీసుకువెళ్లారని ఒక యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మానవహక్కుల సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎన్.రాజేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆ తరువాత సరోజినీ నగర్ వెళ్లి, అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం విస్మయం వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలతో జస్టిస్ అండ్ కేర్ సంస్థ అక్కడ ఉన్న వారందరినీ పడుపువృత్తిలో ఉన్నట్లు ఫిర్యాదు చేసిందని ఆయన ప్రశ్నించారు. పైగా అరెస్ట్ అయినా వారికి బెయిల్ రాకుండా భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టడంపై కూడా తగు విచారణ జరిపించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం యాదగిరిగుట్ట వద్ద కూడా ఇటువంటి దాడులు జరిపించిన ఆ సంస్థ ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో, కక్షపూరిత ధోరణిలో ఇక్కడ భారీ స్థాయిలో దాడులు జరిపించి, వేధిస్తున్నట్లు ఉన్నదని ఆరోపించారు.
ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని మొత్తం దొమ్మరులు దుర్భర సామాజిక, ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి వారికి తగు పునరావాస, ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల దృష్టి సారించాలని కోరారు. 1978కి ముందు దొమ్మరులను ఎస్టీలుగా పరిగణించేవారు. కానీ వారికి అకారణంగా బీసీలుగా మార్చినా అభ్యంతరం చెప్పలేకపోయారు. ఎంబిఎ, బిటెక్, ఫార్మసీ, ఎంటెక్ వంటి ఉన్నత విద్య అభ్యసించినా ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకొని ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
కనీసం వారికి నైపుణ్య శిక్షణ కల్పించి, చిన్నచిన్న ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రభుత్వం సదుపాయం కల్పించినా వారిని ఆదుకున్నట్లు ఉండేది. స్వయం ఉపాధి పథకాలలో భాగంగా పూర్తి సబ్సిడీపై ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు వంటివి ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వివిధ కులాల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేకుండా గురుకుల, మోడల్ పాఠశాలలో తమ బిడ్డలకు ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నారు.

-చలసాని నరేంద్ర 9849569050