మెయన్ ఫీచర్

హెచ్-1బి వీసాలపై ఎందుకింత ఆందోళన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి భారతీయులలో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా మనవాళ్లలో ఆ దేశంలో ఐటి రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాలు ఆశిస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు, భారతదేశంలో ఐటి రంగంపై ఆధారపడుతున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంస్కరణల సమయం నుండి ప్రపంచీకరణ అందిస్తున్న ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంలో, అందుకు తగిన విధంగా మన నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడంలో ఒక విధంగా భారతీయులు సరైన దృష్టి కేంద్రీకరించలేకపోయారు. ఐటి రంగం అందించిన నడమంత్రపు సిరితో పొంగిపోయ, అదే సౌభాగ్యం అనుకొంటూ, ఆ దిశలో పరిగెత్తడం ప్రారంభించాము. దానితో పలు వౌలిక రంగాలలో పురోగతిని విస్మరించాము. ముఖ్యంగా ఉత్పత్తి రంగం, మధ్యతరహా పరిశ్రమల రంగంపట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపించాము. దానితో ఇప్పుడు మనం నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తున్నది.
గత రెండున్నర దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రవాస భారతీయ సదస్సులు అంటూ జరిపి వారికి రెడ్‌కార్పెట్ స్వాగతాలు పలుకుతున్నాము. అనేకమంది ముఖ్యమంత్రులు తరచు అమెరికా పర్యటనలు జరుపుతూ ప్రవాస భారతీయులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టమని ప్రాధేయపడుతున్నాము. అందుకోసం అనేక రాయితీలు, సదుపాయాలు ఇవ్వజూపుతున్నాము.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుతున్న విదేశీ పర్యటనలలో సహితం ఆయా దేశాల అధినేతలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పొందే ప్రయత్నాలపట్ల కన్నా అక్కడగల ప్రవాస భారతీయులను ఆకట్టుకోవడం పైననే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇద్దరు ప్రవాస భారతీయులతో వారిని ఆకట్టుకోవడం కోసం రెండు కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రాధేయపడుతున్నా మనకు లభిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యంత స్వల్పంగానే ఉంటున్నాయి. మన ఆర్థిక వృద్ధిలో వాటి భాగస్వామ్యం నామమాత్రంగానే ఉంటున్నది. కానీ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న స్థానికులపట్ల నిర్లక్ష్యం చూపుతున్నాం. వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాము. మనకున్న వనరులను విస్మరించి మరెక్కడో వెదుక్కొంటున్నాము. ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలకు ఇంతకన్నా మరో తార్కాణం అవసరమా? ఇప్పుడు ఏకంగా ప్రవాస భారతీయులకు ఆన్‌లైన్‌లో ఇక్కడ ఓటు హక్కు ఉపయోగించుకొనే సదుపాయం కల్పించడం పట్ల దృష్టి సారిస్తున్నాం. వారికి అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందా?
అకస్మాత్తుగా ప్రవాస భారతీయులలో ‘జన్మభూమి’ పట్ల గత కొంతకాలంగా ఎందుకు ఆసక్తి వ్యక్తం అవుతున్నదో గమనించలేకపోతున్నాము. 1990 ప్రాంతంలో మన దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు అడుగంటిపోవడంతో మన బంగారాన్ని విదేశాలలో తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవలసి వచ్చింది. అటువంటి క్లిష్ట సమయంలో అమెరికాలో గాని, ఇతర చోట్ల ఉన్న ప్రవాస భారతీయులుగానీ ఎవరూ మాతృదేశాన్ని ఆర్థిక ఇబ్బందులలో ఆదుకోవడానికి ముందుకు రానే రాలేదు. కనీసం సానుభూతి చూపే ప్రయత్నం కూడా చేయలేదు. వారెవ్వరూ మన దేశంవైపు కనె్నత్తి చూడనే లేదు.
అయితే అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, అక్కడ ఒక్కొక్క బ్యాంక్ కుప్పకూలే పరిస్థితులు ఏర్పడటం, బ్యాంకులలో పెట్టుబడులకు హామీ లేదనే అభిప్రాయం కలగడం, స్టాక్ మార్కెట్‌లు కూడా ప్రమాదకరంగా మారడంతో తాము కూడబెట్టుకున్న సంపదలకు భద్రత లేదని భయం వారిని వెంటాడటం మొదలుపెట్టింది. బ్యాంకులలో డిపాజిట్‌లపై వడ్డీలు లేకపోగా అసలుకే మోసం వస్తుందనే ఆందోళన బయలుదేరింది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో తాము కూడబెట్టుకున్న సంపదను కాపాడుకోవడం కోసం స్వదేశం వైపు చూడడం ప్రారంభించారు. తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడం వరకు ఊరుకొంటే సరిపోయేది. పెట్టుబడులు పెడతాం అంటూ స్వదేశంలో తిరగడం, రాజకీయ నాయకత్వాన్ని మచ్చిక చేసుకొని అపరిమితమైన రాయితీలు పొందడం, ఈలోగా రాజకీయ నాయకులకు ముడుపులు చెల్లించి తమ కుటుంబ సభ్యులకు ఎన్నికలలో సీట్లు ఇప్పించుకోవడం, వారు చట్టసభలకు ఎన్నికయ్యే విధంగా చూడడం ప్రారంభించారు. ఆ విధంగా ఎన్నికలలో అభ్యర్థులు పెట్టే ఎన్నికల ప్రచారవ్యయం విపరీతంగా పెరగడానికి వారు కొంతవరకు కారణం అవుతున్నారు.
పైగా అవినీతి పద్ధతుల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను అమెరికాకు సదస్సుల పేరుతో తీసుకువెళ్లి, వారిని ప్రలోభాలకు గురిచేసి, అందుకు ప్రతిఫలంగా ఇక్కడ అనేక రాయితీలు పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరుపుతున్న విదేశీ పర్యటనలు, అందుకు ప్రతిఫలంగా ఆయా దేశాలలోని ప్రవాస భారతీయులకు సంబంధించి ఇక్కడ అందిస్తున్న రాయితీలని పరిశీలిస్తే ఈ అంశాలను స్పష్టం కాగలవు.
తమ దేశ యువకుల ఉపాధి అవకాశాలను కాపాడుకోవడం కోసం ట్రంప్ కొన్ని చర్యలను తీసుకొంటుంటే వాటిని చూసి ట్రంప్ ఏదో ఘోరం చేస్తున్నట్లు ప్రచారం చేయడంలో అర్థం లేదు. అసలు ఇతర రంగాలను నిర్లక్ష్యం చేసి ఐటి రంగాలపైననే దృష్టి సారించడం వల్లన మన సామాజిక జీవనంలో ఎన్నో అనర్థాలు చెలరేగుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాలలో పబ్‌ల సంస్కృతి ప్రారంభం కావడం, అర్ధరాత్రి దాటే వరకు మద్యం మత్తులో యువకుల నృత్యాలతో గడుపుతూ ఒక వినూత్న సంస్కృతి వ్యాప్తి చెందడానికి ఐటి కంపెనీలే కారణం కాదా?
గంజాయి సంస్కృతి, కుటుంబ జీవనంలో తీవ్రమైన వత్తిడులు, అపనమ్మకాలు, విడాకులు పెరిగిపోవడానికి సహితం ఐటి రంగం దోహదపడుతున్నది. ఎటువంటి ప్రభుత్వ పర్యక్షవేణ లేకుండా ఐటి కంపెనీలు వ్యాప్తి చెందుతున్నాయి. అవి కేవలం అమెరికాలోని కంపెనీలకు గుమస్తా పనులు చేసే కంపెనీలుగా మారడం, అత్యాధునిక సాంకేతికతను అలవరచుకొనే ప్రయత్నం చేయకపోవడంతో మరో నాలుగైదు సంవత్సరాలలో మన ఐటి పరిశ్రమ కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పైగా గతంలో కేవలం భారత్‌లోనే లభించే ఇటువంటి సేవలను అందించడానికి ఇప్పుడు చైనా, దక్షిణ కొరియాలతోసహా అనేక దేశాలు పోటీపడుతున్నాయి. దానితో ఈ రంగంలో భారత్ గుత్త్ధాపత్యానికి బీటలు పడటం ప్రారంభమైంది.
ఐటి ఉద్యోగాల మోజులో కుప్పలు తెప్పలుగా వేల సంఖ్యలో వెలసిన ఇంజనీరింగ్ కళాశాలలు కనీస నాణ్యత ప్రమాణాలను కూడా పాటించడం లేదు. దానితో యువతను ఎందుకూ పనికిరాని నిరుద్యోగులుగా మలచడంలో ఇవి పోటీపడుతున్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నా ఏదో కంప్యూటర్ కోర్స్ అంటూ ఐదారు నెలలు మరోచోట శిక్షణ పొందితేగానీ ఉద్యోగాలకు పనికి రావడం లేదు.
అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు అవసరమైన గ్రీన్ కార్డులు పొందడానికి ఎదురుచూస్తున్న వారికి హెచ్-1బి వీసాల పొడిగింపునకు అడ్డంకులు ఏర్పడుతుండగా, అందుకు కాలపరిమితి పెరగకుండా వెనుకకు పంపే విధంగా కొత్త నిబంధనలను రూపొందించడం కోసం ట్రంప్ సిద్ధపడినట్లు వచ్చిన కథనాలు తాజాగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి నిబంధనలు రూపొందిస్తే 5 నుండి 7.5 లక్షల మేరకు భారతీయ ఉద్యోగులు స్వదేశానికి తిరిగి రావలసి వస్తుందని భావిస్తున్నారు. వీరిలో అత్యధికులు ఐటి రంగానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఇటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా స్వదేశం వదిలి సంపాదన కోసం అమెరికాకు పరిగెత్తిన వారికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం ఒక గొప్ప అవకాశంగా భావించాలి. అత్యున్నత నైపుణ్యంగల మన యువకుల మేధో సంపదను అమెరికాకు ధారపోయడం కన్నా స్వదేశంలో ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడినట్లు భావించాలి. ఆ దిశలో అవసరమైన ప్రణాళికలను, విధానాలను ఇక్కడి ప్రభుత్వాలు రూపొందించాలి. అటువంటి వారికి ఘన స్వాగతం పలకాలని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సూచించారు. హెచ్-1బి వర్కింగ్ వీసా నిబంధనలు కఠినతరమైతే ఆదోళన అక్కర్లేదని, అక్కడి నుంచి వచ్చే వేలాది మంది నిపుణులతో భారత్ మరింతగా వెలిగిపోతుందని ఆనంద్ మహీంద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. అదే జరిగితే ‘‘స్వాగతం. స్వదేశానికి రండి. మీ రాక భారత్ వృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు.
ప్రస్తుతం హెచ్-1బి వీసాలను అమెరికాలో స్వల్పకాలిక ఉద్యోగ అనుమతికిగాను జారీ చేస్తున్నారు. ఇవి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి. వాటిని మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే ఆరేళ్లపాటు ఉండవచ్చు. ఈలోగా గ్రీన్‌కార్డు పొందటం సాధారణంగా సాధ్యం కాదు. ప్రస్తుతం 12 ఏళ్ల వరకు ఈ వీసాలను పొడిగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆరేళ్లకు మించి పొడిగించ రాదనే ప్రతిపాదనను హోంలాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తున్నది. అదే జరిగితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులు వెనుకకు రావలసి ఉంటుంది.
నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ప్రయోజనాలకోసం అమెరికా హెచ్-1బి వీసాలను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు తమ యువతకు ఉపాధి అవకాశాలను కాపాడుకోవడం కోసం ఇప్పుడు దీనిని కఠినతరం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అమెరికన్ల నిరుద్యోగాన్ని దూరం చేస్తామంటూ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
అమెరికాలోని భారతీయ ఉద్యోగులు, వ్యాపారులలో సంపన్న వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే వారు తమ సంపాదనలో స్వదేశానికి తీసుకువస్తున్న మొత్తాలు చాలా స్వల్పమని గ్రహించాలి. వారికన్నా గల్ఫ్ దేశాలలో నిర్మాణ రంగం, ఆటో రంగం, ఇతర రంగాలలో చిన్నచిన్న నైపుణ్యం గల ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు స్వదేశానికి తమ కుటుంబం పోషణకు కావచ్చు, ఇతరత్రా కావచ్చు పెద్ద మొత్తాలలో నిధులను స్వదేశానికి తీసుకు వస్తున్నారు. ప్రవాస భారతీయుల నుండి స్వదేశానికి సంక్రమిస్తున్న విదేశీ మారకద్రవ్యంలో 90 శాతం వరకు ఇటువంటి కార్మికుల నుండి మాత్రమే వస్తున్నాయి.
అయితే మనం అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని ప్రవాశ భారతీయుల పట్ల చూపుతున్న శ్రద్ధ, వారికిస్తున్న ప్రత్యేకతలను గల్ఫ్ తదితర దేశాలలో కార్మికులుగా పనిచేస్తున్న భారతీయులకు ఇవ్వడం లేదు. వారక్కడ అనేక భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, అకారణంగా ఏళ్ల తరబడి జైళ్లలో మ్రగ్గవలసి వస్తుంటే, పలు వేధింపులకు గురవుతూ ఉంటే వారి సంక్షేమం పట్ల తగు శ్రద్ధ చూపడం లేదు. మన జాతీయ అవసరాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి పరచుకొనే ప్రయత్నం చేయాలి. దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర వహించగల మధ్య తరహా, చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు ఇతోధికంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

-చలసాని నరేంద్ర 849569050