మెయిన్ ఫీచర్

యుగానికొక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘500మంది సన్యాసులు నావెంట వుంటే 50 సంవత్సరాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చేస్తాను. అదే 500 మంది సన్యాసినులు వుంటే అదే అద్భుతాన్ని 50 వారాల్లో చేయగలను’’ మహిళా శక్తిపై స్వామీజీ విశ్వాసం అదీ. మరి ఆ మహనీయుడు సూచించిన మార్గంలో మహిళాభ్యున్నతి సాగుతున్నదా?

వివేకానందుని ఉపదేశాలలో కొన్ని..
‘‘బలమే జీవనం-బలహీనతే మరణం.’’
‘మిమ్మల్ని శారీరకంగా గానీ, మానసికంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ బలహీనపరిచే దేనినైనా విషంలా తిరస్కరించండి’.
‘ఒక ఆదర్శాన్ని స్వీకరించి, దానే్న
మీ జీవితంగా చేసుకోండి. ఇతర విషయాలను విడిచిపెట్టండి.’

ఈ నవభారత పథ నిర్దేశకునికి యువతమీదే అపార విశ్వాసం. యువతలోని వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు మాత్రమే భారత భావి భాగ్యోదయానికి బాటలు పరుస్తాయని ఆయన దృఢవిశ్వాసం. యువతలో త్యాగం, సేవాభావం సులువుగా ఉద్దీపింపచేయగల్గినపుడు, వారు కర్మ శీలురుగా మారుతారు. అపుడే ‘‘నా దేశంలో కుక్క కూడా ఆకలితో చావడాన్ని నేను భరించలేను’ అన్న స్వామివారి కల సాకారం అవుతుంది. యువతలో శీలం, సంస్కారం ఎంత ముఖ్యమో, లక్ష్యసాధన మార్గం కూడా అంతే ముఖ్యమని, పవిత్రమని
తెలుసుకోవాలి.

మన భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికోన్నతికి మూల పురుషులు మన మహర్షులు. మనది ఋషివారసత్వం. ఈ వారసత్వ పరం
పరలో భాగంగా అవతరించిన ఆధునిక ఋషి స్వామి వివేకానందుడు. మానవ జాతి ప్రేమికుడు, మహాదేశభక్తుడు. మహాయోగి, జ్ఞానసిద్ధునిగా, యుగాచార్యునిగా మనం ఆయన్ని దర్శిస్తాం. కుల, మత విద్వేషాలతో విచలితమైయున్న మన మతాన్ని, భారతదేశాన్ని తన మహోన్నత, పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక బోధనలతో కాపాడిన మహనీయుడు. ‘‘ఆయన జన్మించి ఉండకపోతే, హిందూమతం అంతరించి ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి ఉండేది కాదు’’ అని అంటాడు మేధావి చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ మహాదార్శకుని బాట తప్ప నేటి యువతకు వేరే మార్గం లేదు. ఆయన ప్రచండ స్ఫూర్తి, భావ సంపదే నేటి యువతకు జీవన వేదంగా మారి, ఆచరణలోకి రావాలి.

అది అమెరికాలోని చికాగో నగరం. 1893 సెప్టెంబర్ 11వ తేదీ. సాయంకాలం. విశ్వ మత మహాసభలు. ఒక అజ్ఞాత భారతీయుడు ‘‘అమెరికా సోదర సోదరీమణులారా!’’ అంటూ తన ప్రసంగం ప్రారంభించాడు. అక్కడ సమావేశమైన ఏడువేల మంది శ్రోతలు ఆనందం పట్టలేక లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ఆ మరుదినం అమెరికా వార్తాపత్రికలన్నీ పతాక శీర్షికలతో ఆ మహనీయుడ్ని ప్రశంసించాయి. అంతవరకూ స్వదేశంలోనూ అనామకుడైన వ్యక్తి, ఆ ఒక్కరోజులో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. ఆ మహనీయుడే స్వామి వివేకానంద. అమెరికా ఐరోపాలను నాలుగు సంవత్సరాలపాటు తన అద్భుత వాగ్ధాటితో, వ్యక్తిత్వంతో ముంచెత్తి భారతదేశానికి తిరిగివచ్చిన స్వామీజీకి కొలంబో నుంచి ఆల్మోరాదాకా భారతదేశం నీరాజనాలు పట్టింది. ఆయన కూర్చున్న రథాన్ని లాగడానికి రాజాధిరాజులు పోటీపడ్డారు.
‘‘యావత్ప్రపంచానికీ జ్ఞాన భిక్ష ప్రసాదించిన భారతదేశం ఆనాడు బానిసత్వంలో జాగృతిని కోల్పోయి జీవచ్ఛవంలా వుంది. కోట్లాది ప్రజలు కూడు, గుడ్డ, నిలువ నీడా లేక, ఆకలి అని అరిచే శక్తిని కూడా కోల్పోయి, పశుప్రాయులుగా జీవిస్తున్నారు. వీరి శ్రమ శక్తితో లభించిన సంపదలతో రాజప్రసాదాలు విలాసవంతంగా, వైభవోపేతంగా అలరారుతున్నాయి. సాధు సంతులు తమ ముక్తి మార్గంలో మోక్షపు వేటలో వెంపర్లాడుతున్నారు. మతాధిపతులు హిందూత్వాన్ని హృదయంలేని ఒక కుల వ్యవస్థగా మార్చివేసి, అంటరానితనాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉన్నత వర్గాలు పామరులను, మహిళలను తమ స్వార్ధానికి దోపిడీ చేస్తున్నాయి. నూతన విద్యావిధానంలో విద్యార్జన గావించిన యువకులకు హిందూ సంబంధమైన ప్రతిదీ ఏహ్యంగానే మారింది. పరివ్రాజకుడుగా ఆరు సంవత్సరాలు భారతదేశాన్ని పర్యటించిన స్వామి దర్శించిన దృశ్యమిది. ఆ స్థితిని చక్కదిద్దడానికి, ఆపన్నులను ఉద్ధరించడానికి స్వామీజీ తమ జీవితానే్న త్యాగం చేసారు.
స్వామీజీ బోధనలన్నింటికీ ఉపనిషత్తులే ప్రమాణాలు. ఉపనిషత్తులు సార్వకాలీనాలు, సార్వజనీనాలు. కాబట్టి స్వామి బోధనలు దేశ కాలాలతో నిమిత్తం లేకుండా నిత్య సత్యాలు. కానీ అదే ఆకలి, అదే అజ్ఞానం, అవే మూఢ విశ్వాసాలు. నేటికీ కోట్లాదిమంది జీవనస్థితి అదే. గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు తాము వివేకానందుని బోధనల నుంచి స్ఫూర్తిని పొందామని చెప్పుకున్నారు. అరవిందఘోష్, నేతాజీ వంటి నాయకులు తమకు స్ఫూర్తి ప్రదాత వివేకానందులే అన్నారు. విద్యావంతులై, సమాజంలో గుర్తింపును పొంది, ఉన్నత స్థితిలో వున్న అనేకమంది పాశ్చాత్య యువతీ యువకులు- మార్గరెట్ నోబెల్, జోసెఫైన్ మాక్లాయిడ్, గుడ్విన్, జేవియర్ దంపతులు ఇంకా అనేకమంది స్వామీజీ అనుచరులుగా మారడమేగాక భారతదేశమే తమ కార్యక్షేత్రంగా భావించి, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఆ మహనీయుడు ప్రవచించిన మార్గంలో జాతి నిర్మాణం జరగలేదన్నది కళ్లెదుట కనిపిస్తున్న సత్యం. ‘‘ఆడపిల్లలకు విద్య నేర్పకపోవడం, వారికి ముక్కుపచ్చలారని వయసులో వివాహం చేయడం అనే రెండు మహా పాప కార్యాల ఫలితంగా, భారతీయులు వందల సంవత్సరాలు బానిసత్వంలో, యాచకత్వంలో బతకవలసి వచ్చింది.’’ ఇది స్వామీజీ అభిప్రాయం.
‘‘మన నాయకులు ఆధ్యాత్మ జ్ఞాన సంపన్నులై వుండాలి. నువ్వు నాయకుడివి కావాలంటే ముందు వారికి సేవ చేయడం నేర్చుకోవాలి’’- ఇవీ నాయకత్వం విషయంలో స్వామీజీ నిశ్చితాభిప్రాయాలు. మరి నేటి నేతలను గమనిస్తే స్వామీజీ ఆశించిన లక్ష్యం సిద్ధించిందా? అత్యున్నత రాజ్యాంగ సంస్థ పార్లమెంటులో మూడొంతులు పైగా నేరచరితులే అని గణాంలు చెబుతున్నాయి కదా! మరి స్వామీజీ బోధనల ఆచరణ, నాటికంటే నేడే ఎంతో అవసరం. అనుసరణీయం.
‘‘మానవునిలో అంతర్గతంగా వున్న దివ్యత్వాన్ని సాక్షాత్కరింపచేసేదే నిజమైన విద్య. ధర్మచింతన, ధర్మవర్తన, బహుజనహితాయ, బహుజన సుఖాయ అన్నది విద్య పరమ లక్ష్యాలు. నిర్మల హృదయం మాత్రమే మేధకు ఆవల చూడగలదు. నిర్మల హృదయావిష్కరణ గావించే విద్యావ్యాప్తి ద్వారా మాత్రమే సమసమాజం స్థాపించబడుతుంది’’. ఇవీ విద్యకు సంబంధించి స్వామీజీ స్థూలాభిప్రాయాలు.
ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయిదాకా ఎక్కడా మన సంస్కృతిగానీ, పూర్వపు మన ఔన్నత్యానికి మూల భూతమైన ధార్మిక, ఆధ్యాత్మిక భావనలు పాదుకొలిపే ప్రణాళికగానీ మచ్చుకైనా కనపడవు. మన సంస్కృతికి వెనె్నముక ఆధ్యాత్మికత. దానిని పక్కనబెట్టి, భౌతిక వాంఛా సుఖమయమైన పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహం పెంచుకుంటే, ఖచ్చితంగా మూడు తరాల కాలంలో మన జాతి, మన సంస్కృతి పూర్తిగా అదృశ్యవౌతాయి అని స్వామి హెచ్చరించి మూడు తరాలు గడిచాయి. ఫలితం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. నాయకత్వ స్థానాల్లో వున్నవారు ఆ దిశగా ఆలోచించాలి. అలా జరగని పక్షంలో నష్టం వివేకానందునికి కాదు, ఈ జాతికీ, ఈ ధర్మానికే నష్టం.

-ఐ.వెంకటేశ్వర్లు