మెయన్ ఫీచర్

అధికారమే అసలు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత. ఎన్నికలప్పుడే ఇంత వెనుకేసుకుని చక్కదిద్దుకోవాలనేది నేటి రాజకీయ సామెత! అరవై నెలలు పాలించడానికి ఎన్నికైన పాలకులు ఏడాది ముందునుంచే ఎన్నికలకు సిద్ధం కావడం, అవకాశాన్నిబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం పార్లమెంటరీ రాజకీయాలకు మామూలైపోయింది. ఇక కేంద్రంలో పాలన సాగించే పార్టీకైతే ఈ అయిదు సంత్సరాలు ఏదో ఒక రాష్ట్రం ఎన్నికల నినాదంగా ఉంటుంది. ఆ రాష్ట్రాలు అప్పటికే తమ చేతుల్లో వున్నవి కావచ్చు, లేదా కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం కావచ్చు! ముందు చేతిలో వున్న రాష్ట్రాన్ని చేజారకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, కొత్త రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీని చిత్తు చేయాలనే, ఎత్తుగడ రెండోది. జయాపజయాల్ని పక్కనబెడితే, చేతిలోని రాష్ట్రంలో ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య తగ్గినా అధికార పార్టీకి అవమానమే! మొన్నటి గుజరాత్ ఎన్నికలు దీనికి ఉదాహరణ. ఓట్ల సరళి పెరిగినా, సీట్ల సంఖ్య తగ్గడాన్ని మోదీ, షాలు అంతర్గతంగా పరాభవంగానే భావిస్తున్నారు. అధికారంలోకి రావడం అసాధ్యమైనా, యువరాజు నాయకత్వంలో కాంగ్రెసుకు సీట్లు పెరగడంతో తామే గెలిచినంత సంబరంగా ఉంది.
అయితే, 2014 నాటికి సాధారణ ఎన్నికల నాటి ఎజెండాకు, 2012నాటి గుజరాత్ ఎన్నికల ఎజెండాకు ఇరుపార్టీల్లో మార్పు ఏమైనా ఉందా? అనేది తేలదు. అది ఇరు పార్టీలకు పట్టని అంశంగానే ఉంటున్నది. ఈ ఎన్నికల సరళిని చూసినప్పుడు ఎవరికి వారే విజయం సాధించామనుకుంటున్నారు. గానీ, తమను 50 శాతం పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని భావించడం లేదు. భక్తితోనో, భయానికో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఎవరికి వోటు వేయక ‘నోటా’కు వేసినవారు, అసలు ఓటే వేయనివారు దాదాపు ఒకే ఆలోచన కలిగివున్నట్లే. గుజరాత్‌లో అయిదు లక్షలకు పైగా పడిన ‘నోటా’ వోట్లు ఏ పార్టీ అభ్యర్థికి పడినా పార్టీల సంఖ్యాబలంలో అనూహ్యమైన మార్పు కనపడేది. పాలకపక్షం ప్రతిపక్షంగా మారిపోయినా ఆశ్చర్యం ఉండేది కాదు. కానీ, ఈ అంశాన్ని ఇరు రాజకీయ పార్టీలుగాని, వీటికి తోకలుగా వ్యవహరిస్తున్న జాతీయ పార్టీలుగానీ పట్టించుకోకపోవడమే విచారకరం. పోతే, ‘నోటా’ ఓట్లు అభ్యర్థులు జాతకాల్నే మార్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలను ఇవి చూపిస్తున్నాయి. ఇదే గుబులు నేడు రాజకీయ పార్టీలకు పట్టుకున్నది. తమిళనాడులో ఆమె మరణం తరువాత జయలలిత ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నియోజికవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అందరి ఊహల్ని తలకిందులు చేసి, నిలువెత్తు ఆరోపణలను ఎదుర్కొంటున్న శశికళ వర్గానికి చెందిన వ్యక్తి గెలవడం పన్నీరు సెల్వం, పళనికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. అందుకే ఎన్నికల రొంపి అంతా తాయిలాలతోనే వేడెక్కడం చూస్తున్నాం. ఈ ఉపఎన్నికలో ఓటర్లకు వేలల్లో కాదు, లక్షల్లో డబ్బు పంపిణీ జరిగిందనేది బహిరంగమే. బహుశా ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించి వుంటారనేది మరో వాదన! దేవుడే తనకు ఆదేశం ఇచ్చాడని ప్రవచించిన రజనీ, డిఎంకె అధినేతను కలవడం మరో విచిత్రం!
దాదాపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే. అటు బాబుకు, ఇటు కేసీఆర్‌కు నిద్రపడుతున్న రాత్రులు తక్కువే! తమ నీడను తామే నమ్మలేని రాజకీయ వ్యవస్థలో ఓటర్లను నమ్మే ఆలోచన ఏనాడో ఆవిరైపోయింది. ఆకర్షణీయ పథకాలే అండ అని భావించినా, అంతరంగంలో ఏదో మూల నేటి పాలకులకు భయం కెలుకుతూనే ఉంది. ఈ దృక్కోణంతోనే కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు శత్రుశేషం లేకుండా ఎత్తుగడలు వేస్తున్నారు. సహజంగా, రాజకీయ పార్టీలు అంతర్గత శత్రు నిర్మూలనా ఎజెండాను కలిగి ఉంటాయి. కాని, ఇందిర హయాం తర్వాత, ఈ ఎజెండా మారిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటుల్లో బల నిరూపణే ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నారు. సొంత పార్టీలో అస్మదీయులను ఎదగకుండా చేసి, కోరలుపీకడం, ఒకవేళ పార్టీ వీడినా, బుసకొట్టడం తప్ప కాటువేయకుండా రాజకీయ వ్యవస్థల్ని తయారు చేస్తున్నారు. పార్టీల జంప్ జిలానీలకు, పార్టీలో ఉంటూనే ఊపిరి పీల్చలేనివారు ఇదో అనారోగ్య ప్రజాస్వామ్య చిహ్నమని గుర్తించలేకపోతున్నారు.
అధికార పార్టీల తీరు ఈ విధంగా ఉంటే, ప్రతిపక్షాలది మూలిగే నక్కలాంటి నినాదమే! అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా విద్య చెప్పిస్తానంటాడు వైఎస్‌ఆర్‌సిపీ నేత జగన్. ఓదార్పు పేర చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబుపై నిప్పులు చెరగుతాడు. కానీ, నిజంగా అధికారంలోకి వస్తే రైతు సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాడో, వ్యవసాయ రంగాన్ని ఎలా నడుపుతాడో విధివిధానాలేంటో స్పష్టత ఉండదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా కల్పిస్తాడో మాట్లాడడు. విద్యావైద్య రంగాల నిర్వహణపై, వీటిని అజమాయిషీ చేస్తున్న కార్పొరేట్ వ్యవస్థ గూర్చి స్పందించడు. ప్రభుత్వ సిబ్బంది ప్రజావ్యతిరేకతగూర్చి, జరుగుతున్న అవినీతి గూర్చి సదరు పార్టీ సిద్ధాంతమేంటో అంతుపట్టదు. ఇక రాజధాని నిర్మాణంపై దోబూచులాటలే! అయ్యో, తాము అధికారంలోకి వస్తే లక్షల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు దక్కేవనే అంతర్గత ఆవేదనేగాని, ఈ నిర్మాణాలతో బంగారం పండే భూములు సమిధగా మారాయనే బాధ, బాధ్యత ఎప్పుడూ వ్యక్తం కాదు. నిజంగా అధికారంలోకి వస్తే తమ ఎజెండా ఏమిటో ఎవరికీ బోధపడదు. ఏ పార్టీకీ దూరదృష్టితోగల శాశ్వత అభివృద్ధికర ఎజెండా వుండదు. అందరిదీ ఎన్నికల సందర్భంలో, అదీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత ఆదరాబాదరాగా ముందుకు తెస్తారు. నెహ్రూ హయాం నుంచి నేటి మోదీ వరకూ ఏ రాజకీయ పార్టీ ఎజెండా అయినా జనబాహుళ్య చర్చ జరగలేదు. అసలు ఇది జరగాలన్న సోయి పార్టీలకు లేకపోగా, ప్రజలకు తెలియదే తెలియదు. ఇక ఎన్నికల సంఘానిది కరివేపాకు (శేషన్ హయాం మినహా) పాత్రయే! ఎన్నికల ముందు వివిధ పార్టీలు హామీలు ఇవ్వడం, గెలిచినంక కర్రలతో కొట్టడం జరుగుతున్నది. జాతీయ పార్టీలది ఎప్పుడు ప్రాంతీయ పార్టీల స్థాయి ఆలోచనలే. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా భావించడం, స్థానిక పాలక పార్టీ ఇస్తున్న, చేస్తున్న అనారోగ్యకర హామీలనే మరికొంత మసాలా కలిపి ప్రకటించడం జరుగుతున్నది తప్ప, శాశ్వత నినాదం ఏనాడూ వినపడడం లేదు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతిని ఇస్తామని, రెండు లక్షల రూపాల వరకు రైతు రుణాల్ని మాఫీ చేస్తామని ఉత్తమకుమార్ రెడ్డి అప్పుడే ఎన్నికల శంఖారావం ఊదుతున్నాడు. అంటే నిరుద్యోగ సమస్యకు తెరాసనే కాదు, తాముకూడా పరిష్కారం చూపలేమనేది, రైతు సమస్యలు ఎల్లకాలాల్లో అప్పులతో, ఆత్మహత్యలతో విరాజిల్లుతాయనేది వీరి ఆత్మఘోష అన్నమాట! తెలంగాణ ఇస్తిమి - శ్మశానంగా మారినంక! అధికారంలోకి రాకపోతిమి అంటూ చేతులు కాలిన తరువాత ఆకుల ప్రత్యామ్నాంలా, అసలు పాలన ఎలా జరుగుతున్నది, ప్రభుత్వరంగ సంస్థల పరిస్థితి ఏంటి? నిజంగా తాము అధికారంలోకి వస్తే గతంలో సాగించినట్లే పాలన సాగిస్తారా? బుద్ధి తెచ్చుకొని చెంపలు వేసుకుంటారా అనేది ఏ కోశానా కనిపించదు. విద్యను ఏ విధంగా నిర్వహిస్తారో, కార్పొరేట్‌ను నిజంగానే నియంత్రిస్తారా? వైద్యరంగం రాష్ట్ర ప్రజలందరికీ ఒకే తీరుగా అందుబాటులోకి వస్తుందా అన్నది చెప్పరు. జవాబుదారీతనంతో, సిటిజన్ చార్టర్ అమలు చేస్తూ, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తామని, గిరిజన ఆవాసప్రాంత ప్రజలకు, వారి ఉనికికి భంగం కలగకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, ప్రాజెక్టుల పేరున బలవంతంగా భూమి లాక్కోమని హామీ ఇస్తున్నారా? ఇప్పటికే సేకరణ పేరుతో లాక్కున్న భూమి విషయంలో ఎలాంటి దృక్పథాన్ని కలిగివుంటారో ఎవరికీ తెలియదు. అయ్యో, మాకు దోచుకునే అవకాశం పోయిందనే బాధతప్ప, ప్రజలకు నిజంగా సేవలందించి, అప్పులేని రాష్ట్రంగా, దేశంగా... ఆకలిలేని రాజ్యంగా, నైతికతతో విరాజిల్లే సమాజంగా ఇంటాబయటా యువతులు, మహిళలు ఊపిరిపీల్చుకునే స్వేచ్ఛను అందిస్తామనే హామీ ఎక్కడా వినపడదు.
పాలకపక్షం కురిపిస్తున్న వరాలజల్లుల్లో శాస్ర్తియత ఎంత? అవసరమెంత? ఎవరికి అవసరం? నిజంగా ఈ హామీలు అసలైన లబ్ధిదారులకు చెందుతాయా? అనే పట్టింపు లేదు. మరో రూపంలో ఇలాంటి జనరంజక పథకాల్నే అందిస్తాననడంలోని ఆంతర్యం తమకు కొంతకాలం దోచుకునే అవకాశం ఇవ్వాలనే! ప్రధాన రాజకీయ పార్టీలు తమ తీరు ఈ విధంగా ఉంటే రాజకీయాలతో లబ్ధిపొందాలనుకునేవారు, పాలకపార్టీతో విబేధాలు పొడసూపినవారు, తమకు గుర్తింపేలేదని భావిస్తున్న కొంతమంది సృజనశీలురు ఎవరి కుంపటిని వారే అప్పుడే మొదలుపెట్టారు. అందరివి పెదవి దాటిరాని మాటలే! ఎజెండాలేని పార్టీలే! టీవీ చానళ్లను పెట్టడం చాలా సులభమని, అదే ఓ పత్రికను నడపడం సాహసమని, ఈ మధ్యన మీడియా మేధావులు అంటున్నట్లు, రాజకీయ పార్టీ పెట్టడం ఇంకా సులువైన పనిగా కనపడుతున్నది. సిద్ధాంతమంటూ లేకుండా, లక్ష్యాలేమిటో నిర్దేశించుకోకుండా, రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని తులనాత్మకంగా విశే్లషించుకోకుండా, సమాజాన్ని ఎటువైపుగా అభివృద్ధి చేయాలో తెలియకుండా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అంతర్గత, అమెరికా అనుకూల ఎజెండా గురించి తమ వైఖరి ఏమిటో ప్రస్తావించడం లేదు. ఏడుదశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి గూర్చి, వాటి తీరుతెన్నులగూర్చి, ఉపయోగం గూర్చి, సాధికారత గురించి నోరు విప్పకుండా తాము అధికారంలోకి వస్తేనే దేశం దిశ,దశ మారుతుందని కూడబలకడం, నమ్మబలకడం అంటేనే దివాలాకోరు రాజకీయాలు. అనుకున్నంత సులభంగా ప్రజలు మెడలు వంచరు అనేది జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. బళ్లు ఓడలైనా, ఓడలు బళ్లయినా ఇంకా వీటిని ప్రజలే లాగడం గమనార్హం!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162